అంజి...మారిందొచ్ - కాశీ విశ్వనాథం పట్రాయుడు

Anji marindoch

అంగ, వంగ అనే రెండు రాజ్యాలు ఉండేవి. రెండింటి సరి హద్దుల్లో దట్టమైన అడవి ఉంది. అంగ రాజ్యపు సరిహద్దులో కేసరి అనే కోతి నివసిస్తూ ఉంది. ఆ కోతి ఈ చెట్టు మీద నుంచి ఆ చెట్టు మీదకి దూకుతూ, పచ్చని పచ్చికలో గెంతుతూ, మిత్రులతో ఆడుతూ, నచ్చిన పళ్లను తింటూ ఆనందంగా గడిపేది. ఆ అడవి మధ్యలోంచి ఒక పిల్ల కాలువ నిర్మలంగా గలగలమని శబ్దం చేస్తూ ప్రవహించేది. కేసరి రోజూ ఆ కాలువలో స్నానం చేస్తూ నీటి అడుగున ఉన్న గులక రాళ్ళను తీసి నీటి మీద విసిరేది. ఆ రాళ్లు నీటిమీద ఎగురుతూ విచిత్రంగా అవతలి ఒడ్డుకు చేరేవి. అది చూసి కేసరి ఎంతో ముచ్చట పడేది. ఒకరోజు కేసరి నీటిలో ఆడుతూ ఉండగా వంగ రాజ్యపు సరిహద్దుల్లో ఉన్న అంజి అనే కోతి చూసింది. "ఏయ్ ఎవరు నువ్వు? ఈ పిల్ల కాలువలో ఎందుకు స్నానం చేస్తున్నావ్? అని అడిగింది. “ఏం చేయకూడదా” అని ఎదురు ప్రశ్నించింది కేసరి. “ఇది నాది ఎవ్వరూ చేయడానికి వీల్లేదు.” అంది అంజి. "నీది కాదు నాది కాదు. అందరిదీ" అని గడుసుగా సమాధానమిచ్చింది కేసరి. "నాకు ఎదురు చెప్తావా" అంటూ ఇవతలి ఒడ్డు చెట్టు నుంచి అవతలి ఒడ్డు చెట్టు మీదకి ఎగిరింది అంజి. పట్టు తప్పి నీటిలో పడింది. ఎలాగోలా ఈదుకుంటూ కేసరి దగ్గరికి వెళ్ళింది. చెంప చెళ్లు మనిపించింది. కేసరి తిరగబడింది. పిడిగుద్దులు గుద్ది అంజిని మట్టి కరిపించింది. ఇలా రెండూ నువ్వా నేనా అన్నట్టు యుద్ధాన్ని తలపించేలా కొట్టుకున్నాయి. కాసేపటికి బాగా అలసిపోయాయి. "ఈ రోజుకి ఆపేద్దాం. రేపు ఉదయాన్నే రా నువ్వో నేనో తేల్చుకుందాం." అంది అంజి. సరేనంది కేసరి. కేసరి కి ముఖం నిండా దెబ్బలు. కాళ్ళు చేతులు గీరుకు పోయాయి. అంజికి కవుకు దెబ్బలు తగిలాయి. ఒళ్లంతా ఒకటే నొప్పి. మర్నాడు రెండు కోతులు కాలువ ఒడ్డుకు చేరుకున్నాయి. ఒక ఒడ్డున కేసరి రెండో ఒడ్డున అంజి ఉన్నాయి. "నన్ను ఓడించే ధైర్యం ఉంటే ఇటు వైపుకి రా!" అని గట్టిగా పిలిచింది అంజి. "నేను రాను నువ్వే రా!" అని బదులిచ్చింది కేసరి. అంజి ఆలోచించింది. ముందురోజు సంఘటన గుర్తుకు వచ్చింది. దాంతో అవతలి ఒడ్డుకు వెళ్ళడానికి భయపడింది. "నన్ను ఎదిరించే ధైర్యం లేదని ఒప్పుకో, నీ చేతకానితనాన్ని అంగీకరించు. నిన్ను విడిచిపెడతాను." అని రెచ్చగొట్టింది అంజి. అంజి మాటలకు పౌరుషం పొడుచుకొచ్చింది కేసరికి. ఓడిపోవడం కంటే ఓటమిని అంగీకరించడం పెద్ద తప్పు అని భావించి పరుగు పరుగున అడవిలోకి వెళ్ళింది. కొన్ని ఆకులను తీసుకుని బాగా నలిపి ముద్దగా చేసి గాయాలపై అద్దింది. కాస్త మంటగా అనిపించినా ఓర్చుకుంది. కొన్ని దుంపలను, పళ్లను కడుపు నిండా తిని కాసిన్ని నీళ్లను తాగింది. పొడవాటి వెదురు కర్రను పట్టుకుని పరుగుతీసింది. కాలువ ఒడ్డుకు చేరగానే కర్రను నేలకు ఆనించి ఒక్కసారిగా పైకి ఎగిరి అవతలి ఒడ్డున ఉన్న అంజి ముందుకు దూకింది. ఊహించని ఈ పరిణామానికి విస్తుపోయింది అంజి. కాసేపు అలానే ఉండిపోయింది. "సిద్ధమా!" అని అంజిని అడిగింది కేసరి. "సిద్ధమే! కానీ కొట్టుకోవడానికి కాదు నేర్చుకోవడానికి." అంది అంజి. కేసరి కి అర్ధం కాలేదు. చూస్తూ అలా ఉండిపోయింది. "నువ్వు విన్నది నిజమే. ఇన్నాళ్లు నేనే గొప్ప అనుకున్నాను. ఇప్పుడు నువ్వే గొప్పని తెలిసింది. నీతో విరోధం కంటే స్నేహమే మంచిదనీ నాకు అనిపించింది. నీకు ఇష్టమేనా?.” అని అడిగింది అంజి. "సరే" నంది కేసరి. "వెదురు సాయంతో ఎలా ఎగిరి గెంతుతున్నావు?" అని అడిగింది అంజి. "సాధన" తోనే సాధ్యం అంది కేసరి. ఆరోజునుంచి వాటిమధ్య స్నేహం చిగురించింది. “నేను సిద్ధం” అంది కేసరి. “దేనికి” అని అడిగింది అంజి. “నీకు నేర్పడానికి” అంది.” నవ్వుతూ "వెదురు సాయంతో ఎగరడానికి అవసరమైన మెళకువలు అన్నీ కేసరి అంజి కి చెప్పింది. అంజి బాగా సాధన చేసింది. “గెలవడానికైనా, గెలిపించడానికైనా ఓడిపోవడానికైనా, ఒడించడానికైనా మనల్ని మనం రక్షించుకోవడానికైనా త్యాగానికైనా, మనం ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. అప్పుడే మనం మనుగడ సాగించగలం.”అంది కేసరి. “ఇప్పుడు నేను సిద్ధం” అంది అంజి. “దేనికి” అని అడిగింది కేసరి. “కాలువ ఇవతలి ఒడ్డునుంచి అవతలి ఒడ్డుకు వెదురు సాయం తో గెంతడానికి” అని జవాబిచ్చింది అంజి.” మిత్రుని పట్టుదలకు పొంగిపోయింది కేసరి.

మరిన్ని కథలు

Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి
Pramod Pesarattu
ప్రమోద్-పెసరట్టు
- వీరేశ్వర రావు మూల
Atanu aame madilo
అతను ఆమె మదిలో
- బొబ్బు హేమావతి
Atani kannu aame meeda padindi
అతని కన్ను ఆమె మీద పడింది
- బొబ్బు హేమావతి
Kottha ugadhi
కొత్త ఉగాది
- తాత మోహనకృష్ణ
Pallavi
పల్లవి
- తటవర్తి భద్రిరాజు
Suhasini
సుహాసిని
- బొబ్బు హేమావతి
Pelli
పెళ్లి
- Madhunapantula chitti venkata subba Rao