మూడు ఉపాయాలు - డా.దార్ల బుజ్జిబాబు

Moodu vupayalu

కిరాతారణ్యంలో ముగ్గురు వేటగాళ్లు వుండేవారు. వారు ముగ్గురు కలసి ప్రతిరోజు వేటకు వెళ్లేవారు. వేటాడిన పక్షులు, జంతువులు సమానంగా పంచుకునేవారు. ఒకరోజు వారు ఒక చిలుకను మాత్రమే వేటాడారు. "దీన్ని చంపి మాంసాన్ని అమ్మి వచ్చిన డబ్బులు పంచుకుందాం" అన్నాడు వారిలో ఒకడు. "దీన్ని మనం చంపటం ఎందుకు? కసాయివాడికి అమ్ముదాం. వచ్చిన డబ్బులు పంచుకుందాం" అన్నాడు రెండో వాడు. "వొద్దు వొద్దు దీన్ని పంజరంలో పెట్టి పెంచుకునే వారికి అమ్ముదాం" అన్నాడు మూడో వాడు. ఈ ముగ్గురి సంభాషణ చిలుక విని "ఓ వేటగాళ్లారా! నన్ను వదిలిపెడితే మీకు సులభంగా డబ్బు సంపాదించే మూడు ఉపాయాలు చెబుతాను. వాటితో మీరు హాయిగా జీవించండి" అన్నది. వారు సమ్మతించారు. "ఇక్కడికి దగ్గరలో జమ్మి వృక్షం మీద దొంగలు దోచుకుని దాచిన బంగారు ఆభరణాలు ఉన్నాయి. ఇప్పుడే వెళ్లి తీసుకో, లేకపోతే రేపు రాత్రికి వారు వచ్చి పంచుకుంటారు" అని మొదటి వాడికి చెప్పింది. వాడు సంబరపడ్డాడు. వెంటనే చిలుకను రెండో వాడికి ఇచ్చి వెళ్ళిపోయాడు. "ఇక్కడికి కొంచం దూరంలో ఒక ఇరుకు బాట ఉంది. ఈ బాటలో పొరుగురుకు వెళ్లే ధనవంతులైన వర్తకులు గాడిదలపై సరుకులు వేసుకుని ఒంటరిగా వెళుతుంటారు. అప్పుడప్పుడు వెళ్లి కత్తి చూపి వారిని దోచుకో. రోజు అదేపనిగా వెళ్లకు ప్రమాదంలో పడతావు" అని హెచ్చరించింది. వాడు ఆనందపడ్డాడు. వెంటనే ఆ చిలుకను మూడో వాడికిచ్చి వెళ్ళిపోయాడు. "అడవి అంచున చాలా భూమి ఉంది. నీ శక్తి మేరకు ఆక్రమించుకొని దున్ని సేద్యం చేసుకో. నిన్నెవరూ అడ్డగించరు. వెంటనే కాకపోయినా ఫలితం తప్పక ఉంటుంది. నీ మిత్రుల కన్నా ఎక్కువ సంపాధిస్తావు. వెళ్ళు" అని మూడో వాడికి చెప్పింది. వాడికి ఈ ఉపాయం ఏమి నచ్చలేదు. కష్టపడి వ్యవసాయం చేయాలంటే సోమరులకు ఇష్టం ఉంటుందా? అయినా వాడు చిలుకను వదిలి అయిష్టంగానే వెళ్లి పోయాడు. చిలుక రివ్వున ఎగిరి తన గూటికి చేరింది. చిలుక చెప్పినట్టుగానే మొదటి వాడు దొంగల సొమ్ము దోచుకుని వెళ్ళాడు. ఏడాది గడిచింది. వాడి వైభోగం, ప్రవర్తన చూసి రాజ భటులకు అనుమానం కలిగింది. వాడిని రాజు ముందు హాజరు పరచగా వాడు విషయం అంతా చెప్పాడు. రాజుకు వాడి మాటలపై నమ్మకం కుదరక, గజదొంగగా భావించి ఉరి శిక్ష వేసాడు. వెంటనే అమలు పరిచారు. రెండోవాడికి దోపిడీ బాగా నచ్చింది. చిలుక చెప్పినట్టు ఎప్పుడో ఒకప్పుడు కాకుండా అదేపనిగా దోపిడీ చేయటం మొదలుపెట్టాడు. ఒకరోజు దోపిడీ చేస్తుండగా రక్షక భటులకు చిక్కాడు. రాజు ముందు ఉంచారు. రాజు, వాడికి యావజ్జీవ కారాగార శిక్ష వేసాడు. వాడు శిక్ష అనుభవిస్తున్నాడు. అడవి అంచున కొంతభాగం బాగు చేసుకుని వ్యవసాయం చేస్తున్న మూడో వాడిని కూడా భటులు రాజు వద్దకు తీసుకు వెళ్లారు. "అనుమతిలేకుండా అడవి భూభాగంలో వ్యవసాయం చేయటం నేరం కాదా? ఎందుకు చేస్తున్నావు" అడిగాడు రాజు. "అయ్యా! నేను గతంలో జంతువులు, పక్షులను వేటాడి జీవించాను. జీవ హింస నాకు నచ్చలేదు. వ్యవసాయం చేసి పంట పండించి భార్య బిడ్డల పొట్ట నింపుకోవాలని ఈ పని చేస్తున్నాను" అన్నాడు. వాడి మాటలకు, కష్టపడే తత్వానికి రాజు ఎంతో సంతోషించాడు. వాడు సేద్యం చేసే భూమికి హక్కుపట్టా ఇచ్చి అనుభవించమని చెప్పాడు. దీనితో వాడు భూమికి ఏజమానై పెద్ద ఆస్తి పరుడు కావడమే కాకుండా, పండించిన పంటను అమ్ముకుంటు గొప్ప ధనవంతుడయ్యాడు.

మరిన్ని కథలు

Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి
Pramod Pesarattu
ప్రమోద్-పెసరట్టు
- వీరేశ్వర రావు మూల
Atanu aame madilo
అతను ఆమె మదిలో
- బొబ్బు హేమావతి
Atani kannu aame meeda padindi
అతని కన్ను ఆమె మీద పడింది
- బొబ్బు హేమావతి
Kottha ugadhi
కొత్త ఉగాది
- తాత మోహనకృష్ణ
Pallavi
పల్లవి
- తటవర్తి భద్రిరాజు
Suhasini
సుహాసిని
- బొబ్బు హేమావతి
Pelli
పెళ్లి
- Madhunapantula chitti venkata subba Rao