ప్రమోద్-పెసరట్టు - వీరేశ్వర రావు మూల

Pramod Pesarattu

ప్రమోద్ కి చిన్నప్పటినుండి పెసరట్టు అంటే చాలా ఇష్టం. అందులో నేతి పెసరట్లంటే అవలీల గా పది లాగిస్తాడు. విత్ ఉప్మా ఐతే ఒ ఐదు లాగిస్తాడు. పచ్చి మిర్చి, అల్లం, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, వీటితో నేతి తో దోరగా వేయిస్తే ఆరోజు వేరే భోజనం అక్కర్లేదు. పెసరట్ల తో ఉండిపోతాడు. సరే మన ప్రమోద్ కి బ్యాంక్ లో ఉద్యోగం వచ్చి, అమలాపురం ట్రాన్సఫరవడం తో అగ్రహారం లోని మేడ మీద గది అద్దెకు తీసుకున్నాడు. ఇంటి యజమానురాలికి సర్వమంగళ కి ఇలియానా లాంటి మనవరాలు ఉంది. ఇల్లు అద్దెకిచ్చేటప్పుడే ఇంటి యజమానురాలు అన్ని వివరాలు రాబట్టింది. ప్రమోద్ ఒక్కడే కొడుకు. పైగా ఆర్ధిక ఇబ్బందులు లేవు. తణుకు లో ఇంటి స్థలం ఉంది. మాటల సందర్భం లో తెలుసుకుంది ప్రమోద్ కి పెసరట్టు అంటే ఇష్టమని. పెసరట్టు చెయ్యడం లో సర్వమంగళ ది అందే వేసిన చెయ్యి. ********** ఆ రోజు ఉదయం సర్వ మంగళ మనవరాలు, సరోజ, వయ్యారం గా నడుచుకుంటూ ప్రమోద్ దగ్గరికి పెసరట్టు ప్లేట్ తో వచ్చింది. అది చూసి ప్రమోద్ " నువ్వే చేసావా?" అని అడిగాడు. సరోజ కి తన బామ్మ సర్వ మంగళ మాటలు గుర్తుకొచ్చాయి. "అబ్బాయి అడిగితే నేను చేసాను అని చెప్పు. మా బామ్మ చేసిందని చెప్పకు. తెలిసిందా?" "నేనే చేసాను బాగుందా" అడిగింది సరోజ బొటన వేలితో నేలను రాస్తూ. "అదుర్స్" అలా లవ్ ఎట్ ఫస్ట్ పెసరట్టు అని సరోజ ప్రేమ లో పడిపోయాడు. రోజూ సర్వ మంగళ పెసరట్టు చెయ్యడం, సరోజ ఇవ్వడం, ప్రమోద్ లొట్టలు వేసుకుంటూ తినడం నిరాటంకం గా మూడు నెలల పాటు కొనసాగింది. *********** "సాఫ్టువేర్ సంబంధం ఉంది. పెళ్ళి చూపులకు రా" ఫోన్ లో చెప్పాడు ప్రమోద్ తండ్రి పరమేశం. "ఎందుకు? ఇక్కడ నాకు నచ్చిన అమ్మాయి దొరికింది" " ఏమిటో ఆ అమ్మాయి స్పెషల్ ?" "పెసరట్టు వేయడం వచ్చు" " ఎక్కడ వేస్తుంది? రోడ్డు పక్కనా?" " కాదు ఇంట్లోనే! ఆ అమ్మాయినే చేసుకుంటా పెళ్ళి " " పెసరట్టు తో ప్రేమ పొలిమేర దాటుతోందా?" " అలాగే అనుకో" " వెధవ పెసరట్టు కోసం తండ్రి నే ఎదురిస్తున్నావు? " ప్రమోద్ మరీ మాట్లాడలేదు. ******* ప్రమోద్, సరోజల పెళ్ళి వైభవం గా జరిగింది. పెసరట్టు తిని తన తొలి రాత్రి జరుపుకున్నాడు. ఆరు నెలలు గడిచాక సర్వమంగళ ఈ లోకాన్నీ వదిలి వెళ్ళి పోయింది. దాంతో సరోజ కీ పిడుగు పడ్డట్టయ్యింది. తన కు పెసరట్టు చెయ్యడం రాదు. ఈ మహానుభావుడికీ పెసరట్టు లేనిదే రోజు గడవదు. తన కొచ్చిన విధం గా పెసరట్టు చేసి మొగుడికి పెట్టింది. "ఏమిటి పెసరట్టు తేడా గా ఉంది?" అడిగాడు ప్రమోద్. " పెసలు తేడా" ఆఫీసు నండి ఫోన్ రావడం తో అర్జంటు గా వెళ్ళి పోయాడు. ప్రమోద్. హమ్మయ గండం గడిచింది అనుకుంది సరోజ. ********** గతం లో లా పెసరట్టు లేక పోవడం, పెసరట్టు రుచి ఎందుకీలా మారిందో అర్ధం కాలేదు ప్రమోద్ కి. ఓక రోజు మాడిపోయిన పెసరట్టు తెచ్చింది సరోజ. అగ్గిరాముడై పోయాడు ప్రమోద్. "పెళ్ళి కి ముందు బాగుండే పెసరట్లు ఇప్పడెందుకూ ఇలా తగలడ్డాయి?" "పెళ్ళికి ముందు నేను వెయ్యలేదు" "మరి ఎవరు వేసారు?" " మా బామ్మ సర్వ మంగళ" " అలాగ కధ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం మీ బామ్మన్న మాట. తమరు ప్లేట్ తో యాక్టీంగ్ అన్న మాట" సరోజ ఏం మాట్లాడ లేదు. ********** " నాకు విడాకులు కావాలి " అన్నాడు ప్రమోద్. " బాబూ పెళ్ళయి ఆరు నెలలు కాలేదు. ఎందుకో తెలుసు కోవచ్చునా? " అడిగాడు లాయర్ వామనరావు. " నాకు పెసరట్టు అంటే ఇష్టం. నా భార్య కీ చెయ్యడం రాదు. " "పెళ్ళి కి ముందు ఈ విషయం తెలియదా. " జరిగిన విషయం లాయర్ తో చెప్పింది సరోజ. " సర్వ మంగళ గారు గ్రేట్. పెసరట్ తో మంచి కుర్రాడి కీ గాలం వేసింది" "ఆనక ఆవిడని తాపీ గా పొగుడుదురు గాని. నా విడాకుల సంగతి తేల్చండి." " ఉండవయ్యా, నా భార్య కి పెసరట్ చెయ్యడం రాదు. నేను విడాకులు ఇచ్చానా? " అన్నాడు వామనరావు. " మీ కారణాలు మీకుండ వచ్చు విడాకులు ఇవ్వక పోవడానికి" " ఆ ముఖానికి విడాకులు అన్న పదం నా దగ్గర గట్టిగా అనడానికి దమ్ము లేదు. అలాంటిది విడాకులు అవుటాఫ్ కవరేజ్ ఏరియా ", అలా వామన రావు భార్య ఐరావతం సంభాషణ మధ్య లో దూరింది. " పెసరట్ చెయ్యడం రాలేదని కోర్టు విడాకులు ఇవ్వదయ్యా " " నీకు పెసరట్ చెయ్యడం రాదు అంటే మీ బామ్మ నే పెళ్ళి చేసుకునే వాడిని " అన్నాడు ప్రమోద్ సరోజ ని చూస్తూ! సరోజ ఇదో తిక్క మేళం అనుకుంది. " బాబూ నువ్వు ఆఫ్రికా లో లేవు. అమలాపురం లో ఉన్నావు.వయస్సు ఎక్కువ ఉన్న వనితలని వివాహం చేసుకోవడానికి" ప్రమోద్ నాలుక కరుచుకున్నాడు. " ఆరు నెలలు సమయం తీసుకో. ఈ లోగా పెసరట్ వెయ్యడం సరోజ నేర్చుకుంటుంది. ఆ తరువాత చూద్దాం" అన్నాడు వామనరావు. ఆరు నెలలు గడిచాయి. ఆరు నెలలయినా సరోజ కి పెసరట్ వెయ్యడం రాలేదు. ప్రమోద్ వామనరావు దగ్గరికి వెళ్ళ లేదు. ప్రమోదే పెసరట్లు వెయ్యడం నేర్చుకున్నాడు. భార్య కి పెసరట్టు రాక పోయినా ఓర్చుకున్నాడు. సాఫ్ట్ వేర్ అమ్మాయిలు వండుతున్నారా అంతా జొమాటో బ్యాచ్ అని సర్ధుకున్నాడు. ముఖ్యం గా సర్వమంగళ తను చనిపోతూ తన ఆస్తిని సమానంగా సరోజకి, ప్రమోద్ కి చెందేటట్టు విల్లు రాసింది. అందుకే సరోజ మైనస్ పెసరెట్ ని ప్రేమిస్తున్నాడు. ********* "బాబూ పెసరట్టూ, విడాకులు కావాలా నాయనా" పలకరించాడు వామనరావు ప్రమోద్ ని. " అదేమిటీ? సహధర్మ చారిణి ని వదిలి పెట్టడం మన సంప్రదాయమా? నాతి చరామి అని శాస్త్రములు ఘోషించ లేదా?" "ఇప్పుడలాగే అంటావు! సర్వమంగళ సొమ్ము అందింది ఆ విల్లు డ్రాఫ్టీంగ్ నాదే నని నీకు తెలియదు కదా " అని మనస్సు లో నవ్వుకున్నాడు వామనరావు. END

మరిన్ని కథలు

Rendu mukhalu
రెండు ముఖాలు
- భానుశ్రీ తిరుమల
Anandame anandam
అందమె ఆనందం
- వెంకటరమణ శర్మ పోడూరి
Maa aayana great
మా ఆయన గ్రేట్
- తాత మోహనకృష్ణ
Iddaroo iddare
ఇద్దరూ ఇద్దరే
- M chitti venkata subba Rao
Teerpu lekundane mugisina vyajyam
తీర్పు లేకుండానే ముగిసిన వ్యాజ్యం
- మద్దూరి నరసింహమూర్తి
Anubhavam nerpina patham
అనుభవం నేర్పిన పాఠం!
- - బోగా పురుషోత్తం
Tappevaridi
తప్పెవరిది
- మద్దూరి నరసింహమూర్తి
Pandaga maamoolu
పండగ మామూలు
- M chitti venkata subba Rao