గాడిద గుడ్డు (జాతీయం కథ) - కాశీవిశ్వనాధం పట్రాయుడు

Gaadida guddu

ఆ రోజు ఆదివారం. పిల్లలందరూ ఆడుకుంటున్నారు. ఒక కాగితాన్ని పట్టుకొని పిల్లల దగ్గరికి వెళ్ళాడు రుద్ర. “అబ్బ! ఈ బొమ్మ జీఎంత బాగుందో ” అన్నారు కొందరు. “ఎవరు వేశారు?” అని అడిగారు ఇంకొందరు. “నేనే” అని జవాబిచ్చాడు రుద్ర. “గాడిద గుడ్డు” అంది కోమలి. ఇంతలో భవ్య ఒక సంచి పట్టుకుని అక్కడికి వెళ్లింది. “భవ్యా సంచిలో ఏముంది?”అని అడిగింది చాందిని. “గాడిద గుడ్డు” అని జవాబిచ్చింది భవ్య. సాయంత్రం అందరూ ఇళ్లకు వెళ్ళిపోయారు. రుద్ర ఇంటికి చేరుకున్నాడు కానీ గాడిద గుడ్డు అంటే ఏమిటో అర్థం కాలేదు. తెలుసుకోవాలని అనుకున్నాడు. తల్లి దగ్గరికి వెళ్ళాడు “అమ్మా నాకొకటి చెప్తావా?” అని అడిగాడు. “ఓ తప్పకుండా చెప్తాను అడుగు.” అంది తల్లి. “గాడిద గుడ్డు అంటే ఏంటమ్మా, ఎందుకలా అంటారో చెప్పవా?” అని అడిగాడు రుద్ర. జరిగినవిషయం అంతా కొడుకు ద్వారా తెలుసుకుని చెప్పడం మొదలెట్టింది. “పూర్వం ఒక పండితుడు కాశీకి బయలుదేరాడు. కాశీకి చేరుకునే లోగా సరుకులు మోస్తున్న గాడిద అనారోగ్యంతో చనిపోయింది. ఎలాగూ వెళ్ళేది కాశీకే కాబట్టి, కాశీలో ఉత్తరక్రియలు చేస్తే, గాడిదకు ఉత్తమ గతులు కలుగుతాయని పండితుడు ఆశించాడు. గాడిద కాళేబరాన్ని మోయించుకుని కాశీకి తీసుకువెళ్లాడనికి నిర్ణయించుకున్నాడు. కాశీ ప్రయాణం ఒక్కరు చేసేది కాదు కదా, సమూహంతో వెళ్ళాలి. సమూహంలో మిగతావాళ్ళు గాడిద కాళేబరాన్ని కాశీకి తీసుకువెళ్లడానికి ఒప్పుకోలేదు. శరీర భాగాలన్నింటిలో శిరస్సు ప్రధానమైనది కాబట్టి తలకి అంత్యక్రియలు చేసినా సరిపోతుందని సమాధాన పరచుకున్నాడు. గాడిద తల నరికించి, ఎవరికి చెప్పకుండా, రహస్యంగా మూటకట్టి, పట్టుకుని బయలుదేరాడు. రెండు రోజులు గడిచేసరికి గాడిద తల కంపు కొట్టడం మొదలెట్టింది. ఈ బాధ పడలేక అందరూ తిడతారని భయపడి 'సర్వేంద్రియానామ్ నయనం ప్రధానం' కాబట్టి కనీసం కనుగుడ్డుకైనా అంత్యక్రియలు చేయాలనుకున్నాడు. జాగ్రత్తగా గాడిద కనుగుడ్లు తీసి డబ్బాలో పెట్టి తలను అక్కడే వదిలేసి కాశీ చేరుకున్నాడు. అక్కడ గాడిద గుడ్డుకు దహనసంస్కారం చేశాడు. చుట్టుపక్కల ఉన్నవారికి అర్థం కాక "దేనిని దహనం చేస్తున్నారు?" అని అడిగారు. "గాడిద గుడ్డు" అన్నాడు పండితుడు. చెప్పడం ఇష్టం లేకనో, ఏమి లేదనే ఉద్దేశ్యంతోనో గాడిద గుడ్డు అన్నాడని అనుకున్నారు అందరూ. అప్పటి నుంచి "కాశీ వెళ్లి ఏం తెచ్చావు? అంటే ఆఁ... గాడిద గుడ్డు" అనడం ఆనవాయితీ అయ్యింది. అప్పటి నుంచి మనం చెప్పేది ఎదుటివారికి ఒక కట్టుకథలా అనిపించి ‘నేను నమ్మను' అని తేలికగా చెప్పే సందర్భంలోనూ “ఏమీ లేదు” అని చెప్పే సందర్భంలోనూ 'గాడిదగుడ్డు' అనే జాతీయాన్ని వాడుతున్నారు. గాడిద గుడ్డు పెట్టడం ఎంత నిజమో నువ్వు బొమ్మ వెయ్యడం కూడా అంతే నిజమని వాళ్ల ఉద్దేశ్యం. ఇంతకూ ఆ బొమ్మ నువ్వే వేశావా?” అని అడిగింది తల్లి. “ఆఁ గాడిద గుడ్డు” అంటూ తుర్రుమన్నాడు రుద్ర.

మరిన్ని కథలు

Adde talli
అద్దె తల్లి
- Madhunapantula chitti venkata subba Rao
Dongalu dorikaru
దొంగలు దొరికారు..!
- - బోగా పురుషోత్తం
Oddika
ఒద్దిక .
- Aduri.HYmavathi.
Maro konam
మరో కోణం
- గాయత్రి
Snanam
స్నానం
- మద్దూరి నరసింహమూర్తి
Swaadheenapatika
స్వాధీన పతిక
- వీరేశ్వర రావు మూల
Ekkadainaa baava
ఎక్కడైనా బావ..
- ఎం బిందు maadhavi