బతికించిన బచ్చలాకు. - Aduri.HYmavathi.

Batikinchina bachhalaaku


పూర్వం బత్తినపల్లి అనే గ్రామంలో వేదవేద్యుడు ,వేదవతి అనే పేద

బ్రాహ్మణ దంపతులు ఉండేవారు. ఇరువురూ వేద వేదాంగాలను ఔపోసన

పట్టినవారే.

ఆరోజుల్లో బ్రాహ్మణులకు ఆస్తిపాస్తులు ఏమీ ఉండేవి కాదు.ఉదయాన్నే లేచి

ఊరి పక్కనే ఉన్న కావేరీనదిలో స్నానం ఆచరించి, సూర్యునికి అర్ఘ్యం ఇచ్చి

, ఇంటికి వచ్చి, అగ్నికార్యం చేసుకుని ,వేదవేద్యుడు ఊర్లోకెళ్ళి ఐదు ఇళ్ళలో

ఆయవారము తెస్తే వేదవతి వండి పెట్టేది. అప్పటివరకూ గాయత్రి జపిస్తూ

ఇంటి ముందూ పూల మొక్కలూ,వెనక కూరపాదులూ పెట్టుకుని

పోషి స్తుం డేది.ఆ ఐదు ఇళ్ళలో దొరికే గింజలను ,పెరట్లోని కూరగాయలు

కలిపి వండుకుని భుజిస్తే మరలా మరునాడే భోజనం.


రోజంతా వేదాలు వల్లిస్తూ ఇంటికి వచ్చినవారికి మంచి మాటలు పురాణాలూ

చెప్తూ గడిపేవారు.ఆమెకు వైద్యం కూడ తెలుసు , ఏవోమూలికలూ ,ఆకులూ

వచ్చిన రోగులకు ఇచ్చి, ఆరోగ్యం సరిచేస్తుండేది. ఆమెది మంచిహస్త వాచి,

ఆమె చేతి మందుతో చక్కగా రోగాలు తగ్గిపోయేది. ఐతే ప్రతి ఫలంగా వారు

ఏనాడూ ఏమీ తీసుకునేవారు కాదు.

ఒక్కోమారు బిక్ష ఏమీ లభించేదికాదు. అపుడు ఇంట్లో పండిన కూరలు

ఆకులూ వండుకుని భుజించేవారు. ఒకమారు చాలా కరువు వచ్చి, పంటలే

పండక రైతులు చాలా ఇబ్బందిపడసాగారు. వేదవేద్యునికి బిక్షవేసేవారే లేక

పోయారు. వేదవతి పెరట్లో మొక్కలు కూడా నీరులేక బతికి ప్రతిఫలం

ఇవ్వలేకపోయాయి. ఒక రోజున ఒక పేద ముసలి బ్రాహ్మణ వగ్గు ఆమె

ఇంటిముందుకు వచ్చి "తల్లీ! అన్నపూర్ణమ్మా ! అన్నం తిని మూడు

రోజులైంది , కాస్తంత కడుపుకు తిండి పెడతావామ్మా! " అని అడి గాడు.పాపం

వేదవతి చాలా బాధ పడింది. ఇంట్లో ఏమీలేవు, ఆమాటే చెప్పి " అయ్యా!

మావారు ఊర్లోకి ఆయవారానికి వెళ్ళారు. ఈ కరువు రోజుల్లో పిరికెడు ధాన్యం

లభించడమే కష్టంగా ఉంది ,ఆయన వస్తే ఏమైనా తెస్తే నేను వండి

పెట్టగలను." అని చెప్పింది. "ఆయన ఏమీ తేకపోతే మీరేమి తింటారూ?"

అన్నాడా ముసలి వగ్గు. "అయ్యా! వెనుక ఇంట్లో కూరలు పమేవి. ఈకరువుకు

నీరు లేక భూమి ఎండిపోయి అవీ కాయట్లేదు ఏమీ తేకపోతే మా ఇంట్ళో ఈ

బచ్చలి తీగకున్న ఆకులు వండుకు తింటాము " అని చెప్పగా " నేను ఆకలి

భరించ లేకున్నాను. ఆబచ్చలి ఆకులే నాలుగు వండి పెట్టి పుణ్యం కట్టుకో

తల్లీ ! ప్రాణం పోయేట్టుంది" అంటూ అరుగు మీద చతికిలపడ్డాడు. అతని

బాధ చూసి ఆమె " వెంటనే చేతికి వచ్చినన్ని పెద్ద ముదురు బచ్చలి ఆకులు

కోసి , ఉప్పూకారం కాస్తం వేసి వండి,ఆకులో పెట్టి అతడికి ఇచ్చింది. అతడు

ఆబచ్చలాకు కూర తిని త్రేన్చి , పోతూ పోతూ ఆ బచ్చలి తీగను తెంపేసి

పోయాడు.అతడి వింత ప్రవర్తనకు ఆమె ఆశ్చర్య పడింది. ఇంతలో

వేదవేద్యుడు ఉత్తి జోలెతో వచ్చాడు. ఆమె అది చూసి, జరిగినవిషయం

అతనికి చెప్తుంది.వేదవేద్యుడు" చింతించకు వేదవతీ! ఈ రోజుతో ఆబచ్చలి

తీగకూ మనకూ బంధం తెగింది. ఆ తీగను మొదలంటా త్రవ్వి తీసేయి,

వర్షం పడ్డాక వేరే విత్తనం వేసు కుందాం" అని చెప్పి వెళ్ళి ధ్యానంలో

కూర్చున్నాడు.
భర్త మాట ప్రకారం వేదవతి పలుగు పుచ్చుకుని బచ్చలి మొదట్లో త్రవ్వగా

గట్టిగా ఏదో పలుక్కు తగులుతుంది. ఆమె లోడిచూడగా పెద్ద ఇత్తడిబిందె.

అదిబయటకు తీసి భర్తను పిలుస్తుంది.వేదవేద్యుడు వచ్చి బిందె మీద

బిగించి ఉన్న రేకును ఊడపీకగా బిందేనిందా రత్నాలూ వరహాలూ

మెరుస్తుంటాయి.వారెంతో అశ్చర్యపడి తమ ఇంట బచ్చలాకు తిన్నది

సామాన్యుడు కాడనీ, ఊరికంతా ఉపకారం చేయను వచ్చిన భగవంతుడనీ

భావించి, వారిరువురూ ఆసొమ్ముతో ఊరి వారందరికీ నిత్యాన్నదానం చేస్తూ

సంతోషంగా ఉంటారు. ఆకలిగొన్న వానికి బచ్చలితీగ ఆకులు ఒండి

పెట్టినందుకు ప్రతిఫలం ఇది. అందుకే ఆకలిగొన్నవారిని ఉత్తి చేతులతో

పంపక ఏదో ఒకటి ఇవ్వలనేమాట వచ్చింది.

బతకను బచ్చలాకు తినవచ్చు.

***

మరిన్ని కథలు

Ichhanamma vayanam-Puchhukunnanamma vayanam
ఇచ్చానమ్మా వాయనం పుచ్చుకున్నానమ్మ వాయనం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Vyapara marmam
వ్యాపార మర్మం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Annalu mechharu
అన్నలు మెచ్చారు
- కొడాలి సీతారామా రావు
Aapada bandhuvu
ఆపదభంధువు
- కొడాలి సీతారామారావు
Antaa manchike
అంతా మంచికే
- కొడాలి సీతారామా రావు
Podupu baata
పొదుపు బాట.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Nyayam jarigindi
న్యాయం జరిగింది
- సి.హెచ్.ప్రతాప్