కంప్లైంట్ - Kodali sitarama rao

Complaint

సునీత ఆరోజు పెందరాళే ఇంటికి వెళ్ళిపోవాలనుకుంది ఆఫీసునించి.ముందుగా తన సెక్షన్ సూపరింటెండెంట్ ని అనుమతి కూడా అడిగింది.ఐతే తను బయల్దేరడానికి ముందు తన ఆఫీసర్ తనకి కొన్ని కాయితాలు పంపించి అవన్నీ అర్జెంటుగా టైపు చేసి చూపించమన్నాడు. ఎంత టైమైనా కొన్ని కొరియర్లొ పంపాలని చెప్పాడు.కొన్ని మెయిల్ లొ పంపాలని చెప్పాడు. ఎప్పుడూ తనకి ఆ సమయం లొ పని చెప్పని ఆయన మాట కాదనలేక తను వెళ్ళటం మానేసి ఆ పని చేయటానికి సిద్ధపడింది సునీత.ఆ పనిలో పడి సమయం ఎంతైందో గమనించలేదామె. పని పూర్తయ్యాక చూస్తే ఆఫీసంతా ఖాళీ. ఆఫీసర్ గారి గది దగ్గిర కూచున్న రాజు ఒక్కడే వున్నాడు ఆ హాలు మొత్తం లో.సెల్లో టైం చూస్తే ఏడున్నర అయింది.చాలా ఆలస్యమైంది అనుకుంటూ అతన్ని పిలిచి కాయితాలు లోపలికి పంపింది.ఆయన నుంచీ పిలుపు కోసం ఎదురుచూస్తూ తన సీట్లోనే కూచుంది. అరగంట తర్వాత రాజు ఆ కాయితాలు ఆమెకిచ్చి చెప్పాడు “ఇవి కవర్లో పెట్టి అడ్రెస్ రాసి ఇస్తే ఇప్పుడే కొరియర్ లో ఇచ్చొస్తానమ్మా.” ఆమె వెంటనే ఆ పని చేసి అతని చేతికిచ్ఛి తన సీటు సర్దుకుంటొంది బయలుదేరటానికని.ఇంతలో ఆఫీసర్ గారు బయటికి వచ్చి”థాంక్యూ సునీత,నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను.కానీ తప్పలేదు.మన హెడ్డాఫీసువాళ్ళు సాయంత్రమే ఫోన్ చేసి అర్జెంటుగా కావాలన్నారా సమాచారం. మోహన్ వుంటే నీకీ ఇబ్బంది లేకపోను.కాసేపు కూర్చో. రాజు రాంగానే నీకు తోడుగా వస్తాడు మీ ఇంటి దాకా.కాబ్ కోసం ఫోన్ చేసాను.నువ్వు ఎల్బీనగర్ వెళ్ళాలి కదా.అతనూ హయత్ నగర్ వెళ్ళిపొతాడు అదే కాబ్ లో” మొహమాటంగా “అక్కర్లేదండీ,ఒక్కదాన్ని వెళ్ళిపోగలను.డైరెక్టు బస్సే దొరుకుంతుంది ఇక్కడే.” అంది.అయితే ఆయన వొప్పుకొలేదు.”కాబ్ వచ్చేస్తుంటుంది.” అంటూ ఆమె సీటు ఎదురుగా కూచున్నాడు. సునీతకి బెదురుగా వుంది.ఆ ఆఫీసుమొత్తం లో తనూ,ఆయనే.అయన గురించి చాలా చెడుగా చెప్పుకుంటుంటారంతా ఆఫీసులొ. అందువల్ల భయపడుతూ నుంచునే వుంది. ఆయన అన్నాడు “ నిన్ను చాలా రొజులనించీ గమనిస్తున్నాను.నీపని తీరు చాలా బాగుంటుంది నీ రూపంలాగే.నువ్వంటే నాకిష్టం. నీకిష్టమైతే మనిద్దరం ఎంజాయ్ చేద్దాం.” “నేను అలాంటి దాన్ని కాదు. నాకు పెళ్ళైంది.ఇద్దరు పిల్లలు.మీరు అలా అంటం బాగాలేదు.” అందామె నెమ్మదిగా వనుకుతున్న గొంతుతో. “పెల్లైంది కానీ, నీ భర్తకి దూరంగా వుంటున్నావు కదా. ఆ ‘అవసరం’ కూడా తీరాలి కదా. నాతో నీకు ఎటువంటి ఇబ్బంది కలగనీయను.ఈ రహస్యం మన ఇద్దరి మధ్యే వుంటుంది.మూడోకంటికి తెలియదు. ఆలోచించి సమాధానం చెప్పు.” “సారీ అండీ ఆ వుద్దేశం నాకు లేదు.”ఆమె ధ్రుఢంగా చెప్పింది. “సరే,ఇంకో విషయం కూడా చెప్తున్నాను.వచ్చేనెలలో జరిగే ఇంటర్వ్యూలలో నీకు ప్రమోషన్ రావాలి.వస్తుంది. నీ సీనియారిటీని బట్టీ,నీ పని తీరుని బట్టీ. కానీ,ఆ విషయం నేను రాసే రెపోర్టుని బట్టి వుంటుంది. అది చక్కగా రాయలంటే నా కోరిక తీర్చాలి. నేనడిగింది ఇవ్వు. నీకు రావల్సింది తీసుకో. రాజు వస్తున్నట్టున్నాడు. గొడవ చెయ్యకుండా అతనితో కాబ్ లో వెళ్ళిపో. రేపు పాజిటివ్ గా చెప్తావని భావిస్తాను. నీ భవిసష్యత్తు గురించి కూడా ఆలోచించుకోవాలిగా.ఓ కె.” అని అతను తన గదిలోకి వెళ్ళిపోయాడు. ### ఆ ఆఫీసరు పేరు హరినాధ్. అతని గురించి ఆఫీసులో అందరూ చెడుగానే చెప్పుకుంటుంటారు.ఆడవాళ్ళని ఎవరినీ వదలడని ప్రతీతి.కానీ ఎవరూ ధైర్యం చేసి అతనిమీద ఫిర్యాదు చెయ్యలెదు ఇంతవరకు నలుగురిలో అల్లరి అవుతామనే భావనతో. అందువల్ల అతని ఆగడాలకి అంతు లెకుండా వుంది. అతని పై అధికారులకి తెలిసినా ఎవరూ ఫిర్యాదు చెయ్యకపోవటంవల్ల,అతని వల్ల కంపెనీకి లాభం కలుగుతుండటంవల్ల ఆ విషయాన్ని తీవ్రంగా తీసుకోలేదు. సునీత ఆ ఆఫీసులొ స్టెనొగా చేరింది ఐదేళ్ళ క్రితం.కంప్యూటర్ పరిజ్నానం వుండటంవల్ల వేగంగా పనిచేయటంవల్ల, ఆమెకి ఆఫీసులోమంచి పేరే వుంది. ఆమె భర్త బేంకులో అధికారిగా పనిచేసేవాడు.ఇద్దరిదీ ప్రేమ వివాహమే.అయితే అతను కొద్దికాలంలోనే దురలవాట్లకి లోనయ్యాడు-పేకాట,తాగుడు,వ్యభిచారం .అతను వదలలేనంతగా వాటికి బానిస అయ్యాడు.సునీత చాలా సార్లు చెప్పిచూసింది.అతను వినలేదు. అప్పటికే ఇద్దరు పిల్లలు. తల్లీతండ్రీ చెప్తున్నా వినకుండా భర్తని విడిచి వచ్చేసింది.కొన్ని రోజులు తల్లిదండ్రుల దగ్గిర వుంది.త్వరగానే ఆమెకి ఈ ఉద్యొగం వచ్చింది.తల్లిదండ్రులనించి బయటికి వచ్చి విడిగా వుంటోంది ఒక అపార్టుమెంట్లో. అప్పుడప్పుడూ తల్లిదండ్రులూ,అత్తమామలూ వచ్చి పోతుంటారు.తను వయసులోనే వున్నా ఎప్పుడూ తప్పు చేయాలనుకోలేదు. తన పిల్లల భవిష్యత్తు తనకి ముఖ్యం అనుకుంది. హరినాధ్ తనతో అలా మాట్లాడంగానే చాలా మధనపడింది. ఏం చెయ్యాలో అని అనేక విధాలుగా ఆలోచించింది.ఉద్యోగం మానేద్దామనుకుంది. అయితే ఇలా ఉద్యోగం మానేస్తే అలా ఉద్యొగం దొరుకుతుందని గేరంటీ లేదు. అయినా అక్కడా ఇలాంటి మ్రుగాళ్ళు వుండరని ఊహించలేం. ఇలా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది స్నెహితురాలు ఉషతో మాట్లాడాక. ### “చాలా వివరంగా రాసేవమ్మా కంప్లైంట్. నువ్వు తయారు చేసే డ్రాఫ్టులా విపులంగా వుంది . అతని మీద ఇలాంటి ఫిర్యాదులు మా ద్రుష్టికి వచ్చినా ఎవరూ రాతపూర్వకంగా తెలియచేయకపోవటంవల్ల అతని మీద ఎటువంటి చర్య తీసుకోలేక పోయాము.అదీ కాక కంపెనీకి ప్రత్యక్షం గా నష్టం జరగకపోవటం,పైపెచ్చు అతని సమర్ధతవల్ల కంపెనీకి ఆదాయం పెరుగుతుండటం ఒక కారణం.” చెప్పాడు హరనాధ్ పై అధికారి.ఆయన ముంబైలో వుంటాడు. సునీత కంప్లైంట్ అందగానే ఆమెతో ఫోన్ లో మాట్లాడాడు. నెలరోజుల్లో హరనాధ్ ని ఉద్యోగం లోంచి తొలగించింది కంపెనీ యాజమాన్యం విచారణ జరిగేక. ఆ విచారణలో చాలా మంది అతని దుశ్చర్యలని వివరించారు విచారణాధికారి ముందు. అది ప్రైవేటు కంపెనీ కనుక అంత సత్వర నిర్ణయం జరిగింది.చాలా మంది సంతోషించారు. ### వారం రోజుల తర్వాత కొత్త మేనేజర్ గారు ఆఫీసులో అందరికీ చెప్పారు. మరునాడు ఎం.డీ గారు ఇక్కడికి వస్తున్నట్టు.ఉదయం ఇన్స్పెక్షన్ వుంటుందని సాయంత్రం అందరినీ కలుస్తారనీ. మరునాడు ఎం డీ గారు వచ్చారు.మేనేజర్ గారి రూములో ఒక గంట కూర్చున్నారు. బయటికి వచ్చి అందరినీ పరిచయం చేసుకున్నారు. సునీత ఊహించినట్టుగా తనని ప్రత్యేకంగా ఏమీ గమనించలేదు. సాయంత్రం పార్టీ అయిపోయి అందరూ బయలుదేరుతుంటే సునీతని ఆయన పిలిచారని చెప్పారు.భయపడుతూ భయపడుతూ లోపలికి వెళ్ళింది. ఆయన ఎదురొచ్చి ఆహ్వానించారు లోపలికి. మేనేజర్ గారికి అందరినీ వెళ్ళిపొమ్మని చెప్పారు. ఆమెని లోపలి గదిలోకి తీసుకువెళ్ళారు. ఈయనా హరినాధ్ లాంటివాడేనేమో అనుకుంటూ భయం భయం గా వెళ్ళింది. లోపల ఆయన భార్య వుంది. ఆయన ఆవిడకి తనని పరిచయం చేస్తూ “ఈవిడ సునీత.ఇక్కడి బ్రాంచిలో పనిచేస్తున్నారు.హరినాధ్ మీద కంప్లైంట్ చేసిన అమ్మాయిని చూస్తానన్నవుగా. అందుకే పిలిపించాను.” అని సునీత వేపు తిరిగి “కంగ్రాట్స్ అమ్మాయి. నీకు అసిస్టెంట్ మేనేజర్ గా ప్రమోషన్ కూడా వచ్చింది. నేనే స్వయంగా చెప్పాలనుకున్నాను. అదే సమయంలో ఒక అధికారి తప్పు దారిలో వెళుతుంటే ధైర్యంగా ఫిర్యాదు చేసినందుకు ప్రత్యేక అభినందనలు.. మీ రిద్దరూ మాట్లాడుతూండండి.నువ్వేం కంగారు పడకు,నిన్ను కార్లో పంపిస్తాను.” అని ఆయన బయటికి వెల్లిపోయారు.సునీత మనసు కుదుట పడింది. ఎం.డీ గారి భార్య చెప్పింది “నేనూ ఇలాగే కంప్లైంట్ చేసాను నా పై అధికారి మీద మా ఎం.డీ గారికి.అయితే ఆయన నన్ను కోడలిగా చేసుకున్నారు తన కొడుకుతో మాట్లాడాక. అలా నేను కంప్లైంట్ చేసినాయనకే భార్యనయ్యాను..అందుకే నిన్ను చూడాలనుకున్నాను.మావారు నీగురించి చెప్పంగానే.” అలా అంటూనే ఆవిడ సునీత భుజం మీద చెయ్యి వేసి ఆప్యాయంగా నొక్కింది. సునీత ఆశ్చర్యంగా ఆమెవంక చూసింది.#

మరిన్ని కథలు

Pillalu-Yajamani
పిల్లలు - యజమాని
- బివిడి ప్రసాద రావు
Spandana
స్పందన
- Doctor Bokka Srinivasa Rao
Amma sakshigaa
అమ్మ సాక్షిగా..
- బంటుపల్లి శ్రీదేవి
Nee nagumomu naa kanulara
నీ నగు మోము నా కనులారా....
- సిహెచ్. వెంకట సత్యసాయి పుల్లంరాజు
Bharya anukoolavathi shatru
భార్యా అనుకూలవతీ శత్రుః
- జి.ఆర్.భాస్కర బాబు
Mosam
మోసం
- వెంపరాల దుర్గా ప్రసాద్