చీమ విన్నపం - కాకి సహాయం (బాలల కథ) - kottapalli udayabaabu

Cheema vinnapam-Kaaki sahayam



రంగాపురంలో రంగయ్య అనే రైతు తన తాతలనుంచి సంక్రమించిన రెండు ఎకరాల పొలం వ్యవసాయం చేసుకుంటూ ఒక పాత ఇంట్లో నివసిస్తున్నాడు.
ఆ ఇంట్లో తరతరాలుగా ఒక చీమకుటుంబం పుట్టలో నివసిస్తూ ఉండేది.
తాము కష్టపడడమే కాకుండా, పుట్టిన పిల్లలకు కూడా అనుక్షణం ఏ విధంగా కష్టపడే ఆహారం సంపాదించుకోవాలో తల్లిచీమ పిల్ల చీమలకి నేర్పింది.. దాంతో రోజూ చీమకుటుంబం దొరికిన పదార్థాలను సంపాదించుకొని తమ ఇంటిలో దాచుకునేవి.

ఒకరోజు వరి పొలాల నుంచి దారితప్పి బయటకు వచ్చిన ఎలుక పిల్ల రోడ్డుమీద వాహనాల హడావిడి చూసి భయపడి చటుక్కున రంగారావు ఇంట్లో చొరబడింది.

ఆ ఇల్లంతా కలయతిరిగి అటకమీద దాచిన సామానుల మధ్య స్థావరం ఏర్పరచుకుంది. రంగారావు కుటుంబం పొలానికి వెళ్ళిన తర్వాత వారు వండుకుని జాగ్రత్త పెట్టుకున్న వంట పాత్రల మీద దాడి చేసి కడుపు నింపుకునేది.

ఇంట్లో ఎలుక చేరింది అన్న విషయం గమనించిన రంగారావు భార్య ఒక్క పదార్థమేనా బయట ఉంచకుండా అలమారులో పెట్టి తాళం వేసుకుని పొలానికి వెళ్లే అలవాటు చేసుకుంది.
దాంతో ఎలుకకు ఆహారంగా కూడా కష్టమైపోయింది.

అటువంటి సమయంలో దాని దృష్టి అనునిత్యం ఆహారం సంపాదించుకుంటున్న చీమకుటుంబం మీద పడింది.

ఒకరోజు చీమలు తమ పని మీద బయటకు వెళ్లేంతవరకు వేచి ఉండి, వాటి బొరియల్లో దూరి అవి దాచుకున్న ఆహారం తిన్నంత తినేసి, ఇల్లంతా చిందరవందర చేసేసి అటక మీదకి వెళ్లిపోయింది.

" అమ్మయ్య ఇకనుంచి నేను కష్టపడాల్సిన పనిలేదు. అవి ఇంట్లో లేని సమయంలో వెళ్లి ఆహారం తినేసి నా కడుపు నింపుకోవచ్చు. ఇక నేను పని చేయాల్సిన అవసరం లేదు." అనుకుంది ఎలుక.

చీమలు తాము సంపాదించిన ఆహారాన్ని తీసుకుని తమ బొరియల్లోకి వచ్చి చూస్తే ఏముంది?

"అయ్యో ఇంతకాలం పడిన కష్టమంతా నాశనం అయిపోయింది. ఎవరో కావాలని ఈ పని చేస్తున్నారు. ముందు వాళ్ళు ఎవరో మనం కనుక్కోవాలి." అది చెప్పింది తల్లిచీమ.

"ఈరోజు నేను ఇంట్లో ఉండి ఆ వచ్చే వాళ్ళు ఎవరో జాగ్రత్తగా గమనిస్తానమ్మా "అంది అన్నిటికన్నా చిన్నదైన చిట్టిచీమ.
ఎప్పటిలాగే ఎలక వచ్చి చీమల ఇల్లు గుల్ల చేసి వెళ్ళిపోయింది.
ఇదంతా ఎలక పని అని చాటుగా దాక్కుని గమనించిన చిట్టిచీమ ఇంటి ముందు ఉన్న చెట్టు దగ్గరకు వెళ్లి, దానిమీద నివసిస్తున్న కాకిమావను పిలిచి జరిగిందంతా చెప్పి...

"కాకి మామ! మేము ఎవ్వరికీ అపకారం చేసేవాళ్లం కాదు. మా కష్టమేదో మేం పడతాం. మా బ్రతుకు మేము బతుకుతాం.
నువ్వు ఎలాగైనాఎలుక పని పట్టాలి. ఈ సాయం చేసిపెట్టు" అని దీనంగా అడిగింది.

" సరే అలాగే" అంది కాకి.

సాయంత్రం పొలానికి పురుగుల మందు కొడదామని తెచ్చిన సీసాలను గోడ దగ్గరగా పెట్టి అన్నం తిని నడుము వాల్చాడు రంగారావు.

వెంటనే చిట్టిచీమను పిలిచి " వెంటనే వెళ్లి మీ అమ్మకు చెప్పు. మీరు సంపాదించిన తేనె అంతా కూడా తీసుకువచ్చిముందు సీసాలకు బయట పూతగా పూయండి. వీలైతే దానిమీద కాస్త పంచదార కూడా అద్దండి. మన యజమాని లేచిపోయే లోపుగా ఈ పని జరిగిపోవాలి!" అని చెప్పింది.

మరో పావుగంటలోనే కాకి చెప్పినట్లు చేసింది చీమకుటుంబం.
తిండి తిందామని కిందకు వచ్చిన ఎలుకకు తేనె, పంచదార వాసన తగిలిమందు సీసాదగ్గర చేరి ఒక్కసారిగా తిందామని ఆత్రుతతోసీసాను బలంగా కొరికింది. దాంతో అనుకోకుండా పురుగుల మందు దాని నోట్లోకి వచ్చి అదక్కడే గిలగిలా తనుకు చచ్చిపోయింది. తమకు చేసిన సాయానికి కాకికి చీమకుటుంబం కృతజ్ఞత చెప్పింది.

సమాప్తం

మరిన్ని కథలు

Korukunna mogudu
కోరుకున్న మొగుడు
- కొడాలి సీతారామా రావు
Inquiry
ఇంక్వైరీ
- DR BOKKA SRINIVASA RAO
Telisivachhina tappu
తెలిసివచ్చిన తప్పు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Vruddhapyam varama? sapama?
వృద్ధాప్యం వరమా ? శాపమా?
- మద్దూరి నరసింహమూర్తి
Adigite cheptaa
అడిగితే చెప్తా
- కొడవంటి ఉషా కుమారి
Evaru takkuva kaadu
ఎవరూ తక్కువ కాదు!
- రాము కోలా దెందుకూరు
Sahajeevanam
సహజీవనం
- ప్రభావతి పూసపాటి