
ప్రియమైన అన్నయ్యకు, మీ ప్రియాతి ప్రియమైన తమ్ముడు, అనగా నేనే నమస్కరిస్తూ వ్రాయునది ...మేము చాలా బాగా వున్నాము, మీరంతా చాలా బాగా వున్నారని తలుస్తున్నాను.
పిల్లలు పెదనాన్న ఇంటికి ఎప్పుడు వెళతాము, అని కళ్ళూ కాయలు కాచేలాగ ఎదురు చూస్తున్నారు. మా చిన్నిరాముడికైతే కిందటిసారి మీ ఇంటికి వచ్చినప్పుడు వెట్ గ్రైండర్ లో ఇటుకురాళ్ళు & తుమ్మ జిగురు వేసి రుబ్బి చేసికున్న మజా అస్సలు మర్చిపోలెకపోతున్నాడు. ఈసారి అక్కడికి వచ్చి నప్పుడు, దాంట్లో ఫెవిక్విక్ కూడా వేసి ఏమవుతుందో చూడాలని ఉవ్విళ్ళూరూతున్నాడు. అయ్యో అన్నయ్యా, కిందటి సారి వెట్ గ్రైండర్ పాడైపోయిందని వదిన కేకలేసిందని మేమేమి అనుకోవటంలేదు. అలాగని, పిల్లల ఉత్సాహాన్ని కాదనలేము కద. మీ పెద్దల తిట్లు కూడా మాకు దీవనలే. ఏది ఏమైనా గాని, రుబ్బు రోలులో వదిన రుబ్బి వేసిన గారెలూ దూది పింజల్లా అద్భుతంగా వున్నాయి. కేవలం మేము ఇద్దరు పెద్దలు, ఇద్దరు పిల్లలు కలిసి నాలుగు దజన్లు ఎలా ఊదేశామో ఇంక అర్థం కావడంలేదు. పోతే పోయిందిలే వెధవ వెట్ గ్రైండర్, వదిన చేతుల్లో అద్భుతం వుంది. ఇంతమందికి పిండి రుబ్బాలంటే, జబ్బలు పడిపోతాయి, కష్టమే. అందుకనే, నెను పిల్లలకి ముందే చెప్పి వుంచాను, గారెలు తిన్న తరువాత పెద్దమ్మ చేతులకి జండుబాం రాస్తామని, పిల్లలు ప్రామిస్ చేసారు.
మా పిల్లది, ఈసారి బోల్డు పుస్తకాలు చదివి, చాలా పేపర్ కటింగ్స్ తయారు చేసి పెట్టుకుంది. పాపం కిందటి సారి, అది పక్కింటి పమేలా గారి బొచ్చుకుక్క పిల్లకి చేసిన హెయిర్ కటింగ్ సరిగ్గా రాలేదని, ఆ అస్తవ్యస్త కత్తెర విన్యాసానికి, పామెలా గారు చాల చిరాకు పడ్డారని, వారి అర్థ(భాగం?) పద్మారావు గారు పావు సీసా మందుతాగి విషయం వెళ్ళగక్కారు. హూ! ఏమి మనుషులు అన్నయ్యా వీళ్ళు, పిల్లలో పర్ఫెక్షన్ ఆశిస్తారు. అదీకాక, అదే కత్తెరతో పమేలా గారి చెల్లి కొడుక్కి కూడా హెయిర్ కటింగ్ చేసారని శ్రీమతి బోడెస్ గారు విరుచుకు పడ్డారు. ఆ బొచ్చు కుక్క కంచంలో నే కద, ఆ పిల్లాడు కూడా బువ్వ తింటాడు. ఆ ఎంగిలి వాళ్ళకి బావుంది కాని, హెయిర్ కటింగ్ కి ఒకే కత్తెర వాడితే, అంత గత్తర ఎందుకో?. వదిలెయ్ అన్నయ్య, ఈ సారి పిల్లది రెండు వేరే వేరే కత్తెర్లు వాడతానని మాట ఇచ్చింది. ఇంకా చెప్పాలంటే, గత నెలలో కొత్త రకం పద్దతి నేర్చుకుంది, 'హెయిర్ బర్నింగ్' ట, కొవ్వొత్తి తో జుత్తు కాలుస్తారుట. అలా అయితే, కత్తెర్ల గొడవేలేదు. పిల్లకూడా, రెండు కొవ్వొత్తులు రెడీగా పెట్టుకుంది, ఒకటి బొచ్చుకుక్కకి, రెండొవది ఆ పిల్లాడికి.
పెద్దన్నయ్య & పెద్దొదిన వాళ్ళూ బావున్నారు. మొన్నా వాళ్ళింటికి క్తి వెళ్ళీనప్పుడు, పెద్దొదిన అద్భుతమైన అల్లంపచ్చడితో అరటికాయ బజ్జీలు పెట్టింది, కానీ, బజ్జీలు వేడిగా వుంటే బావుండేది.
అన్నయ్యా! మరే నువ్వు పంపించిన అరటి పువ్వు, మన పెద్దన్నయ్య వాళ్ళింటినుంచి తెచ్చుకున్నాను. అరటిప్ పువ్వు చూసి పిల్లలు ఆశ్చర్యపోయారు. “అబ్బ్బా భలే వుంది, భలే వుంది!”, అని వాళ్ళ స్నేహితులని పిలిచిచూపించారు. మీ మరదలు కూడా, "ఎంతైనా బావగారి మనసు పువ్వులాగ మెత్తనిది అని తెలుసుగాని, అరటిపువ్వంత పెద్దదని ఈరోజే తెలిసింది" అని మురిసిపోయింది.
పిల్లలు ఈ పువ్వుని ఫ్లవర్ వాజ్ లో పెట్టాలా లేక గిన్నెలో పెట్టి నీళు పొయ్యాలా అని ఏకాభిప్రాయానికి రాలేక, పువ్వు మా మొహాన పడేసిపోయారు. అరటి పువ్వుని ఏలా వొండాలో తెలియక కొంచెం తికమక పడ్డాము. ఈసారి, అరటి పువ్వు వడలు వేయించి పంపించు. వదిన చేతి వంట అమృతం. ఈ సారి వచ్చినపుడు, బొబ్బట్లు కావాలని అడిగానని, వదినకు చెప్పు. అన్నయ్య, ఈ విషయం మర్చిపోకు, నాకు నూనే & డాల్డా పడవు, మంచి నెయ్యి తెప్పించి వుంచు.
కాలి ఫ్లవర్ కి అరటి పువ్వుకి వున్న తేడ-అతేడాలమీద ఇంక చర్చ జరుగుతూనే వుంది. మన రామి గాడు, యు ట్యుబ్ తెరిచి భారత దేశ అరటి పువ్వులు పెద్దవా లేక ఆఫ్రికావి పెద్దవా అని పరిశొధన మొదలుపెట్టాడు. ఆఫ్రికా అంటే గుర్తుకువచ్చింది, ఈ నెల చివరికి మా పెద్ద బావమరిది ఆఫ్రికా వెళుతున్నాడు. వాళ్ళు సిటికి వచ్చి ఒక పది రోజులు వుండి సామాను అవి పాకింగ్ చేసుకోవాలట. హోటల్ లో వుంటాము అంటే, "మీకు ఊరూ అదీ పెద్దగా తెలియదు, ఎందుకు మా అన్నయ్య ఇంట్లోనే వుండాలి”, అని చెప్పా. ఈ నెల ఇరవయ్యో తారీఖున మా పెద్దబావమరిది, వాళ్ళ ఆవిడా, మా అత్తగారు, మా బావమరిది అత్తగారు & మావగారు వస్తున్నారు. వాళ్ళకు ముందే చెప్పా, మా అన్నయ్య అంటే, అతిధి సత్కారంలో అభ్యుదయవాది, ఏమి మొహమాట పడొద్దు అని. ఈ మందనంతా నీ మీదకు తోలుతున్నా. కానీ, నువ్వు కాకపొతే మాకు మాత్రం ఎవరు వున్నారు,
అన్నయ్యా! ఒక్క విషయం, మా బావమరిదికి వడియాలు, అప్పడాలు, ఊరుమిరపకాయలు లేకపోతె ముద్ద దిగదు, వాళ్ళ ఆవిడకి ఇంగువ పడదు. ఇంఖొకటి వాళ్ళ అత్తగారికి & మావగారికి కొద్దిగా మడి - ఆచారం పట్టింపు ఎక్కువ, బాత్రూం కూడా పసుపునీళ్ళతో శుద్ధి పెట్టెంత సదాచార సంపన్నులు. పనిమనిషి ఇంట్లోకి రానివ్వరు. ఎదో ఒకలాగ, అడ్జస్ట్ చేసుకోండి, అయినా ఇలాంటివన్ని వదిన చూసుకుంటుందిలే. మా అత్తగారికి, పాపం ఇలాంటి పట్టింపులు ఏమిలేవుగాని, ఒకళ్ళు వాడిన పరుపులు, దుప్పట్లు ఆవిడకి నిషిద్ధం, కొంచెం కొత్త పరుపులు దిళ్ళూ అవి .....అయినా ఇన్వన్ని నేను చెప్పాలా, మనిషిని చూడగానే మనస్తత్వం తెలుసుకునే గొప్ప అనుభవం కలవాడివి. అందరూ పెద్దవాళ్ళు కదా, వాళ్ళూ సిటిలో తిరగడానికి కారు అయితే ఇబ్బంది పడకుండా వుంటారు.
ఈ మధ్య ఊరేళ్ళినఫ్ఫుడు, మన పదమూడో ఎక్కం లెక్కల మాస్టారు కనిపించారు. వీధి అరుగు మీద కూర్చుని, చుట్ట కాల్చుకుంటూ హాయిగా వున్నారు. చుట్ట అంటే, గుర్తుకువచ్చింది, అంబర్పేటలో కొత్తలంక నాటు పుగాకు చుట్టలు దొరుకుతాయిత, ఒక పది పాకెట్లు మా మావగారికి పంపించె ఏర్పాటు చెయ్యి. మా అత్తగారు తిరిగి వెళ్ళేటప్పుడు, ఇంకొ పాతిక తెప్పిస్టే చాలు, ఆవిడె తీసుకు వెళ్తుంది.
అన్నయ్యో!! అసలు విషయం మర్చేపోయాను, తాతారావు దగ్గిర కౌలు డబ్బులు వసూలుచేసికొని వచ్చా! బాంకిలో వెయ్యొచ్చులే అనుకుంటూ, మా పెళ్ళి రోజున మీ మరదలికి వడ్డాణం కొనిపెట్టి సర్ప్రైజ్ చేశా, చాల థ్రిల్లైపోయింది. అయ్యో పంట డబ్బులన్నీ మనమే వాడేస్తున్నాము, మూడెళ్ళుగా ఇలాగె చేస్తున్నము, ఇదేమి పద్దతి కాదు అని బాగ చీవట్లేసింది. అక్కయ్యకి & బావగారికి ఎమైనా తీసుకోవాలని పట్టుబట్టింది. అంతే, నాకు కొద్దిగా సిగ్గనిపించి వదినకి ఒక మాంచ్ఛి కాటన్ చీర, నీకు ఒక రాం రాజ్ పంచె కొన్న, అదికూడా పాలతెలుపుది. నాకు తెలుసుగా అన్నయ్య నీ నిరాడంబరత్వం , వదిన అభిరుచి. ఆ తెల్లటి కొత్త బట్టల్లో మీరిద్దరు బ్రహ్మ & సరస్వతి లాగ బావుంటారని, పిల్లలు కూడా వూహించుకుని మురిసిపోయారు. నిజమే అన్నయ్య, నువ్వు ఆ తెల్లని పంచె కట్టుకుని, తలకి హెల్మెట్ పెట్టుకుని బండి మీద కూర్చుంటే, బ్రహ్మదేవుడు బజాజ్ స్కూటర్ తోలుతున్నట్లుంది. (ఏమిటో, నేనుకూడా ఊహల్లోకి వెళ్ళిపోయాను)
నా స్నేహితుడు, స్కూటర్ సుబ్బారావు నీకు గుర్తున్నాడా? అదే అడ్డరోడ్డు దగ్గిర సోడా కొట్టు శంకరం గారి అబ్బాయి, కిందటి వారం ఏడ్చుకుంటూ వచ్చాడు. వాడి వ్యాపారం దెబ్బతిని ఇంట్లో నానా గొడవలు అయ్యి, పాపం కుంగిపోయాడు. కష్టాల్లో వున్న స్నేహితుడిని ఆదుకోవడం ధర్మం కదా! నువ్వు మామిడితోటకి కంచె వెఏయించమని నువ్వు పంపించిన మూడు లక్షలు వాడికి ఇచ్చి పంపించాను. వడ్డి ఇస్తానంటే, "వద్దు, మా అన్నయ్య కి అలా అన్యాయంగా సంపాదించడం ఇష్టం వుండదు" అని చెప్పి వాడికి వీలైయినప్పుడే అసలు ఇమ్మని ధైర్యం చెప్పి పంపించాను. వాడు కూడా నీకు కోటి, కోటి దణ్ణాలు చెప్పమన్నాడు. నీ ఋణం ఈజన్మలో తీర్చలేనన్నాడు, వచ్చే జన్మలో నీకూ కాలి చెప్పునై పుడతానన్నాడు. ఇంతకి వాడి వ్యాపారం ఏంటి అంటావా? స్వయం ఊపాధి పధకం కింద బాంకిలో అప్పు తీసుకుని, చిన్న పేకాట క్లబ్బు పెట్టుకున్నాడు. ఇంటికి భోజనానినికి పిలిచి, మనం తినకపోతే బావుండదు కదా! అలాగే వాడు కూడా కొద్దిగా చెయ్యి కలిపి, వెర్రి వెధవ మోసపోయాడు. పులి మీద పుట్రలాగ, పోలీసుల రైడింగ్ ఒకటి. పూర్తిగా నలిగిపోయాడు. నువ్వే వాడిని ఎలాగైనా ఆదు కొవాలి. నీ స్నేహితుడు పోలీసు ఎస్పీ రెడ్డిగారితో కొద్దిగా చెప్పించు. నీ తరఫున, లాయర్ శర్మ గారితో నేను మాట్లాడేసాను.
అన్నయ్యా! నన్ను క్షమించు! నీకు ఏమైనా కోర్టు సమన్లు వచ్చివుంటే. క్రిందటి నెల డ్రంక్ & డ్రైవ్ లో పోలిసులు పట్టుకుంటే, నేనే నీ పేరు చెప్పి, నీ పాత డ్రైవింగ్ లైసెన్స్ సబ్మిట్ చేసా. నీ చిన్నప్పటి ఫోటో కదా, వాళ్ళు కూడా నమ్మేసారు. కొర్టు ఫైన్లు అవి ఇప్పుడు మాములే, పెద్దగా పట్టించుకోకు. నువ్వు అసలే సున్నిత మనస్కుడువి. డబ్బు కట్టి వదిలించేసుకో.
వారం వారం నీకు ఉత్తరాలు రాయాలని, ఇంకా నీతో ఎన్నో ఎన్నో పంచుకోవాలని తహ తహలాడుతున్నాను.
ఇట్లు,
నీ తమ్ముడు!
PS: వదినమ్మకు వేల వేల వందనాలు. ఈ ఉత్తరం అందగానే, నీ క్షేమ సమాచారాలు తెలియచేయడం మర్చిపోకు.