గురువు కోరిక - టి. వి. యెల్. గాయత్రి

Guruvu korika

సాయంత్రం ఆరు అవుతోంది.

ఫోన్ మోగింది. ప్రసన్నంగా ఫోన్ లిఫ్ట్ చేశాడు కిరణ్. భవాని టీచర్.

"హలో టీచర్!మీరు,మాస్టరుగారు ఎలా ఉన్నారు? "

"బాగానే ఉన్నాము కిరణ్!నీకు తీరిక ఉంటే రేపు ఒకసారి మా ఇంటికి వస్తావా!"అవతలి వైపు నుండి చెప్పింది భవాని టీచర్.

" అలాగే టీచర్ తప్పకుండా వస్తాను!"అన్నాడు కిరణ్.

కిరణ్ హైదరాబాదులో బిజినెస్ చేస్తున్నాడు.అతడి సొంత ఊరు రాజమండ్రి. చదువు అంతా రాజమండ్రిలోనే జరిగింది. స్కూలులో కిరణ్ క్లాస్ టీచర్ భవాని. ఆమె భర్త రమణమూర్తి. ఆర్ట్స్ కాలేజీలో లెక్చరర్.

చిన్నప్పటి నుండి భవాని టీచర్ అంటే చాలా ఇష్టం కిరణ్ కు.ఎప్పుడూ చదువులో ఫస్ట్ వచ్చే కిరణ్ అంటే ప్రత్యేకమైన అభిమానం భవానీకి.

హైదరాబాద్ లో ఒక బిజినెస్ ఫరమ్ లో ఉద్యోగం చేస్తున్న కిరణ్ సొంతంగా వ్యాపారం స్టార్ట్ చేశాడు. భవాని, రమణమూర్తి దంపతులకు ఇద్దరు మగపిల్లలు. పెద్దకొడుకు సతీష్ నోయిడాలో, రెండో కొడుకు మహేష్ అమెరికాలో స్థిరపడ్డారు.

భవానీ పుట్టింటివాళ్ళు హైదరాబాద్ లో ఉంటారు. పలుకుతోడుగా ఉంటారని రాజమండ్రి నుండి హైదరాబాద్ వచ్చారు భవానీవాళ్ళు. అప్పుడప్పుడు భవానీ వాళ్ళ ఇంటికెళ్ళి వాళ్ళ యోగక్షేమాలు కనుక్కుంటూ, వాళ్ళ కేమన్నా కావాలంటే చేసిపెడుతూ ఉంటాడు కిరణ్.

మొదట్లో భవానీ వాళ్ళ ఇంటి దగ్గరే కుటుంబంతో ఉండేవాడు కిరణ్. తర్వాత సొంత ఇల్లు కొనుక్కొని తన బిజినెస్ ఫరమ్ కు దగ్గరకి మారాడు కిరణ్. కిరణ్ భార్య ప్రమతి. వాళ్లకు ఇద్దరు పిల్లలు. పెద్దబాబు విశాల్ కు ఆరేళ్లు. చిన్నవాడు వినోద్ కు మూడేళ్లు.

'టీచర్ వాళ్ళను చూసి చాలా రోజులయింది. రేపు తప్పకుండా వెళ్ళాలి!'అనుకుంటూ పనిలో పడ్డాడు కిరణ్.

****** ***** ****** ****** ****** ****** *****

రెండోరోజు పదింటికి భవాని ఇంటికి వచ్చాడు కిరణ్.

రమణమూర్తి ఇంట్లోలేడు.

"కూర్చో కిరణ్!"అంటూ మంచినీళ్లు తీసికొని వచ్చింది భవాని.

మంచినీళ్ల గ్లాసు తీసికొని "ఎలా ఉన్నారు టీచర్!అందరూ బాగున్నారు కదా!మాస్టారు ఎక్కడికి వెళ్లారు?"అంటూ కుశలప్రశ్నలు వేశాడు కిరణ్.

భవాని ముఖం కొద్దిగా గంభీరంగా ఉంది. కాసేపు మాట్లాడకుండా కూర్చుంది భవాని.

'విషయం ఏమై ఉంటుంది?' సందేహంగా ఉంది కిరణ్ కు. 'మాస్టారి మెడికల్ రిపోర్ట్స్ ఏమన్నా తేడాగా వచ్చాయా?'ఏదేదో ఆలోచిస్తున్నాడు కిరణ్.

"ఏమిటి టీచర్!అంతా బాగానే ఉందికదా!.."సమస్య ఏమిటా అని ఆరాటంగా ఉంది కిరణ్ కు.

మెల్లగా గొంతువిప్పింది భవాని.

"విషయం తెలిసినప్పటి నుండి మా కిద్దరికీ దిగులుగా ఉంది!ఏం చెయ్యాలో అర్థం కావటంలేదు!"టీచర్ కంఠంలో ఎప్పుడూ వినని జీర.

"చెప్పండి టీచర్!"అంటూ లేచి వచ్చి ఆమె ప్రక్కన కూర్చున్నాడు కిరణ్.

"ఎలా చెప్పను?... నువ్వు ఎవ్వరితో చెప్పకు!నీ మీద నమ్మకంతో నీతో చెప్తున్నాను!.."

"చెప్పండి టీచర్!.."ఆరాటంగా ఉంది కిరణ్ కు.

"పెద్దవాడు సతీష్ గురించి దిగులుగా ఉందిరా!.. కోడలు ఫోన్ చేసింది. అప్పట్నించి మా ఇద్దరికీ వర్రీ పట్టుకొంది. వాడి ప్రవర్తనలో చాలా మార్పువచ్చిందట!.. రాత్రిపూట చాలా లేటుగా వస్తున్నాడట!.. ఫ్రెండ్స్ తో పార్టీ అంటూ అప్పుడప్పుడూ డ్రింక్ చేసేవాడట.. ఈ మధ్య ఎక్కువసార్లు తాగొస్తున్నాడట..పిల్లల్ని కూడా పట్టించుకోవటం లేదట.. రాత్రి ఒంటిగంటకు గానీ ఇల్లు ముఖం చూడటం లేదట!.. విన్న దగ్గర్నుంచి మా ప్రాణం పోయినట్లుగా ఉంది కిరణ్!.. మా ఇంటావంటా ఇలాటి ఛండాలంలేదు. వాడు ఎలా పెరిగాడో నీకు తెలుసుకదా!వాడి ఆరోగ్యం,సంసారం ఏమవుతుందో అని దిగులు.. నువ్వు, వాడు ఒకే ఈడు వాళ్ళుకదా!శ్రమ అనుకోకుండా నోయిడా దాకా వెళ్లి వాడికి నాలుగు మంచిమాటలు చెప్తావా!మీ మాస్టారికి డాక్టర్ చెక్ అప్ చేయించుకున్నాక మేము వెళ్లి అక్కడే ఉంటాము!ఎలాగైనా వాడిని దారికి తెచ్చుకోవాలి... పెద్దవాళ్ళం వాడి దగ్గరే ఉంటే కాస్త బాగుపడతాడేమో నని.. ఉన్నపళంగా ప్రయాణమంటే కష్టం!.. మేము మెల్లగా అన్నీ సర్దుకొని వెళ్తాము!ఈ లోపల నువ్వు వెళ్లి వస్తావా!"

దిగులుగా చెప్తున్న టీచర్ మాటలకు సోఫాలోనే నీలుక్కొని కూర్చున్నాడు కిరణ్. మనసు నెవరో మెలితిప్పినట్లు బాధగా ఉంది. కాసేపు మౌనం..

భవాని చెయ్యి పట్టుకున్నాడు కిరణ్.

"మీరు ధైర్యంగా వుండండి టీచర్!నేను వెళ్తాను!వాడు... వాడు బాగుపడతాడు.."భవానీకి ధైర్యం చెబుతున్నాడు కానీ కిరణ్ గొంతు వణుకుతోంది.. తలమీద సుత్తితో కొట్టినట్లుగా ఉంది.

"ఏమిటో!దిక్కుమాలిన ఫ్రెండ్స్ వాడి పక్కన చేరారు.. వాడితో మాట్లాడదామంటే కోడలిని తిడతాడేమోనని భయంగా ఉంది.. నాకు ఫోన్ చేసి భోరుమంది పిల్ల. వాళ్ళ అమ్మావాళ్లకు కూడా చెప్పలేదట!ఎంతో సంస్కారం ఉన్నపిల్ల!.. కిరణ్!నువ్వే ఏదో ఒకటి చేసి వాడిని ఆ బురదలోనుంచి బయటకు తేవాలిరా!.."

"అయ్యయ్యో!బాధపడకండి టీచర్!తప్పకుండా దారికి వస్తాడు!.. మీరు ధైర్యంగా వుండండి!"అంటూ భవానీకి సర్దిచెప్తున్నాడే కానీ కిరణ్ మనసులో తుఫాను రేగుతోంది.

కాసేపయ్యాక భవానీ దగ్గర సెలవు తీసికొని ఇంటికి బయలుదేరాడు కిరణ్. కారుదాకా వచ్చింది భవాని.

"ధైర్యంగా వుండండి టీచర్!"అంటూ భవాని చెయ్యి మృదువుగా పట్టుకొని వదిలాడు కిరణ్.

****** ***** ****** ****** ****** ****** *****

కారును ఇంటికి పోనిస్తున్నాడు కిరణ్. మనసులో అలజడి. మనసుని కుదిపేస్తున్న ఆలోచనలు. తలవిదిల్చాడు. ఆలోచిస్తూ ఇంటికి వచ్చాడు.

తండ్రిని చూడంగానే పరుగెత్తుకొని వచ్చారు పిల్లలు. పిల్లల్ని పొదివి పట్టుకొని ముద్దులు కురిపించాడు. బట్టలు మార్చుకొని వచ్చి పిల్లల్ని ఆడిస్తూ కూర్చున్నాడు.

కాసేపటికి ప్రమతి పిల్లలకు కంచంలో అన్నం కలిపి తీసికొని వచ్చింది.

"ఇలా ఇవ్వు!నేను తినిపిస్తాను!"అంటూ మురిపెంగా పిల్లలకు అన్నం కలిపి ముద్దలు పెట్టాడు కిరణ్.కాసేపయ్యాక పిల్లల్ని బెడ్రూంలోకి తీసికెళ్లి కథలు, కబుర్లూ చెబుతూ నిద్రబుచ్చాడు. పిల్లలు నిద్రపోయాక వాళ్ళు పడిపోకుండా దిళ్ళు పెట్టి, వాళ్ళ తలనిమిరి, ముద్దు పెట్టుకున్నాడు.

వంటింట్లో ఏదో సర్దుకుంటోంది ప్రమతి. వెనుక నుండి వచ్చాడు కిరణ్. మెల్లగా భార్య భుజాలు పట్టుకొని తన వైపుకు తిప్పుకొని హృదయానికి గట్టిగా హత్తుకొన్నాడు.

అలా ఎంతసేపు ఉన్నారో తెలియదు.

ఫోన్ మోగింది.

అతికష్టంమీద ప్రమతిని వదిలి హాల్లోకి వచ్చాడు కిరణ్. తన ఫ్రెండ్ కిషోర్. ఫోన్ వైపు అలాగే చూసి ఒక నిమిషం తర్వాత లిఫ్ట్ చేశాడు.

అవతల కిషోర్ మాటలకు సమాధానంగా "సారీరా!నాకు కుదరదు!"అంటూ ఫోన్ పెట్టేశాడు. అతడి కంఠంలో కొంత కాఠిన్యం తొంగి చూసింది.

మళ్ళీ మోగింది ఫోన్.

ఈ సారి లిఫ్ట్ చెయ్యకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు.

మళ్ళీ ప్రమతి దగ్గరికి వచ్చాడు కిరణ్.

భార్య ముఖాన్ని అపురూపంగా రెండు చేతుల్లోకి తీసికొని, ఆమె కనుల మీద చుంబించాడు.

"వంట చెయ్యకు!సాయంత్రం గుడికి వెళ్లి, అటునుంచి అటు ఏదన్నా రెస్టారెంటుకు వెళ్లొద్దాము!"అంటూ ప్రమతిని కౌగలించుకొన్నాడు. అతడి మెడచుట్టూ చేతులువేసి, అతడి గుండెలో ముడుచుకొంది ప్రమతి.

**** ****** ****** ***** ***** ***** ****

పదిరోజులు గడిచాయి. పనులన్నీ చక్కబెట్టుకున్నాడు కిరణ్. నోయిడా ప్రయాణానికి టికెట్స్ బుక్ చేసుకున్నాడు. భవానీకి ఫోన్ చేశాడు.

"ఒక్కడివే వెళ్తున్నావా? ప్రమతిని పిల్లల్ని తీసికెళ్ళరాదూ!"అంది భవాని.

"నేను కూడా అదే అనుకుంటున్నాను టీచర్!ప్రమతి రమ్యకు ధైర్యం చెబుతుంది.. మీరు దిగులుపడకండి!సతీషును మార్చుకునే బాధ్యత నాది! రాత్రికే ప్రయాణం.. చేరాక ఫోన్ చేస్తాను!"కిరణ్ కంఠంలో విశ్వాసం ధ్వనిస్తోంది.

"సరే!"అంటూ ఫోన్ పెట్టేసిన భవాని కొడుకు సతీషుకు ఫోన్ చేసింది.

"కిరణ్ ఫ్యామిలీతో వస్తున్నాడురా!వాడితో ఎలా మాట్లాడాలో మీరిద్దరూ ప్రిపేర్ అయ్యారుకదా!"

"గుడ్ గుడ్!నేను, రమ్య వాడితో ఎలా ప్రవర్తించాలో ప్రిపేర్ అయ్యాము!నువ్వు వర్రీ పడకమ్మా!కిరణ్ తప్పకుండా దారిలోకి వస్తాడు!"అటునుండి బదులిచ్చాడు సతీష్.

"ఈ పదిరోజుల నుండి వాడు ఫ్రెండ్స్ తో మందు పార్టీలకు వెళ్ళటం లేదట!ప్రమతి చెప్పింది.. తనతో, పిల్లలతో మునుపటిలాగా ఉంటున్నాడట!.."

"ఊ.. ఊ.. వాడు బాగుపడతాడు!అయినా నిన్నేమనాలి? మంచి టీచరువా? చెడ్డ అమ్మవా? చూడు!వాడికోసం నన్ను విలన్ని చేశావు!"

సతీష్ గొంతులో నవ్వుతోపాటు చిరు అలక ధ్వనించింది. నవ్వింది భవాని.

"ఏమైనా అనుకో!వాడు బాగుపడటమే నాక్కావాలి!ఈ కాలంలో తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచిచెడు చెప్తేనే విసుక్కుంటున్నారు పిల్లలు. 'మా ఇష్టం! మా ఇష్టం!'అంటూ వాళ్ళతో సంబంధాలు తెంచుకుంటున్నారు. విషయం సున్నితమైనది.నేను చిన్నప్పుడు వాడికి పాఠాలు చెప్పిన టీచరును. ఈ వయసులో వాళ్ళ పేరెంట్స్ కు విషయం చెప్పి వాళ్ళను బాధపెట్టదల్చుకోలేదు.నేను పెద్దరికం తీసికొని వాడికి ఏదో బోధ చేస్తున్నట్లుగా కూడా వుండకూడదు. వాడితో ఉన్న మంచి సంబంధాలు చెడిపోకూడదు. అన్నీ ఆలోచించి నేను ఈ నాటకం రచించాను. నిన్ను బాగుచేస్తున్నట్లు వాడు బాగుపడాలి!...ఆగింది భవాని.

" వర్రీ పడకమ్మా!ఊరికే సరదాగా అన్నాను. వాడు నాకు మహేష్ లాంటివాడు.. వాడిని జాగ్రత్తగా మేనేజ్ చేసుకుందాము! అంతగా కావాలంటే నాకు తెలిసిన సైక్రియాటిస్ట్ హైదరాబాదులోనే ఉన్నాడు. అతడి సహాయం కూడా తీసుకొందాము! అందరం వాడి మీద శ్రద్ధ పెడితే తప్పకుండా మారతాడు. అవసరం అయితేనే అంకుల్ వాళ్ళతో చెప్దాము! నువ్వు ఎక్కువ ఆలోచించి దిగులు పడకు!"

నెమ్మదిగా చెప్పాడు సతీష్.

"జాగ్రత్త!జాగ్రత్త!ఇదంతా నాటకమని వాడికి తెలియకూడదు. కిరణ్ బాగుపడాలి!అదే నా కోరిక!"

"నువ్వు బెంగపడకమ్మా!నీ కోరిక నెరవేరుతుంది!"తల్లికి భరోసా ఇచ్చాడు సతీష్.

ఫోన్ పెట్టేసి,వాట్సప్పులో మెసేజులు చూసింది భవాని.

ప్రమతి మెసేజ్ ఉంది.

"థాంక్స్ టీచర్!"అని.

"డోంట్ వర్రీ ప్రమతీ!భావి జీవితం అంతా మంచిగా ఉంటుంది!హ్యాపీ జర్నీ!"అని మెసేజ్ పెట్టింది భవాని.

ఆమె ఒకమంచి గురువు. శిష్యులకు మంచి భవిష్యత్తునందించాలనేదే ఆమె కోరిక.

**** ***** ***** ***** ***** ****** ***** *****

(సమాప్తం )

మరిన్ని కథలు

Itlu nee tammudu
ఇట్లు, నీ తమ్ముడు!
- అంతర్వాహిని
Naalo sagam
నాలో సగం
- టి. వి. యెల్. గాయత్రి.
Pichhuka paga-Enugu chavu
పిచ్చుక పగ - ఏనుగు చావు
- హేమావతి బొబ్బు
Ati Garabam
అతి గారాబం (బాలల కథ)
- మద్దూరి నరసింహమూర్తి
Kotta kathalu kaavaali
కొత్త కథలు కావాలి
- తాత మోహనకృష్ణ
Sarigamalu
సరిగమలు
- కొడవంటి ఉషా కుమారి
Sandhyarani coffee kappu
సంధ్యారాణి కాఫీకప్పు
- అనంతపట్నాయకుని కిశోర్
Anaadigaa..
అనాదిగా....
- షామీరు జానకీ దేవి