నాలో సగం - టి. వి. యెల్. గాయత్రి.

Naalo sagam

షాపు నుండి ఇంటికి వచ్చాడు జితేంద్ర. శృతి గొంతు తారస్థాయిలో మోగుతోంది.

" రేపు పొద్దున్నుంచి ఇలా ఇల్లంతా చిందర వందర చేయకూడదు!నేను సర్ది పెట్టలేను! బుద్ధిగా మీ పని మీరు చేసుకోవాలి.!అర్థమైందా!"

పిల్లలు ఇద్దరు బిక్క మొహాలతో పుస్తకాలు బ్యాగులో సర్దుకుంటున్నారు.

'ఈరోజు ఏమైంది శృతికి?'అనుకుంటూ లోపలికి వచ్చాడు జితేంద్ర.

జితేంద్రను చూడగానే ఒక్క గంతులో వచ్చి చుట్టుకున్నారు పిల్లలు.ఇద్దరికీ ముద్దులు పెట్టి, సోఫాలో కూర్చుని షూస్ విప్పుకుంటున్నాడు జితేంద్ర.

శృతి మొహం ఇంకా చిరచిరలాడుతూనే ఉంది.

"ఏమైంది?"అని అడిగాడు జితేంద్ర.

" పని వాళ్ళకి ఎంత పెట్టినా తృప్తి ఉండదు! పొద్దున పదింటికి ఫోన్ చేసి వారం రోజులు ఊరు వెళ్తున్నాను అని చెప్పింది కుంక!వాళ్ళ నాన్నకు బాగాలేదని సాకు... అదేమీ ఉండదు.. మొగుడితో ఏ జాతరకో వెళ్లాలని ప్లాను!..ఈ పిల్లలతో చేసుకోలేకపోతున్నా! ఆ పక్షి వారం రోజులంది!..పోయినసారి కూడా ఇలాగే వారం అని చెప్పి పదిహేను రోజుల తర్వాత వచ్చింది!... "చెప్పింది శృతి అసహనంగా.

"తక్షణ కర్తవ్యం ఏమిటా!" అని ఆలోచిస్తున్నాడు జితేంద్ర.

'పనిమనిషి రాకపోతే చేసుకోలేకపోవడం సమస్య కాదు.పనిమనిషి లేదు... అన్ని పనులు మనమే చేసుకోవాలి...అన్న సైకలాజికల్ ఫీలింగ్ ఎక్కువ అసహనాన్ని తెచ్చి పెడుతూ ఉంటుంది.... పైగా రేపు పొద్దుటికల్లా తల్లి తిరిగి వచ్చేస్తుంది.. ఆవిడ ఇంట్లో గనక ఉంటే శృతికి ఇంకా కష్టంగా ఉంటుంది. కోడలికి సహాయం చేయకపోగా తల్లి పార్వతి నస మాత్రం పెడుతూ ఉంటుంది. ముందు శృతిని ప్రసన్నం చేసుకోవాలి!'అనుకున్నాడు జితేంద్ర.

బట్టలు మార్చుకుందామని గదిలోకి వచ్చాడు జితేంద్ర. పెద్దవాడికి ఏడేళ్లు. రెండో వాడికి నాలుగేళ్లు.ఇంట్లో ఏదో ఉపద్రవం వచ్చిందని అర్థమవుతోంది పిల్లలకు.అయితే పిల్లలకు భరోసా ఏమిటంటే తండ్రి మంత్రం వేసి ఏ సమస్య నైనా ఇట్టే పరిష్కరిస్తాడని.

"ఇప్పుడు సమస్య రాధా ఆంటీ రాకపోవడం కదా!"అన్నాడు జితేంద్ర.

" అవును ఇప్పుడెలా? "క్వశ్చన్ మార్క్ మొహం పెట్టాడు పెద్దవాడు.

"మనం ముగ్గురం కలిసి చేస్తేసరి!"తేలిగ్గా చెప్పాడు జితేంద్ర.

"ఏం చెయ్యాలి నాన్నా?" రెండోవాడి ప్రశ్న.

"మారాం చేయకుండా అన్నం తినాలి!.. నేను కథ చెప్తాను మీరు బుద్ధిగా విని పడుకోవాలి! ఈ వారం రోజులు మనం పెద్ద పెద్ద పనులు చేద్దాం!.. ఊ..వాటర్ బాటిల్ ఇంకా టిఫిన్ బాక్స్ బ్యాగులో పెట్టుకోవాలి! స్నానం త్వరగా చేయాలి!సబ్బుతో ఆడుకుంటూ బాత్రూంలోని ఎక్కువ సేపు ఉండకూడదు!...సోఫాలో ఎక్కువసేపు గంతులెయ్యకూడదు!..టిఫిన్ త్వరగా తినాలి!.. ఇంకా.."

" ఇంకా ఏమిటి నాన్న? "

" అన్నిటికంటే ముఖ్యమైనది బ్రష్ నోట్లో పెట్టుకుని పేస్టు తింటూ ఉండకూడదు! చప్పున బ్రష్ చేసుకొని రావాలి!"

పిల్లలు కాసేపు ఆలోచించారు.చిన్నవాడు తండ్రి మెడచుట్టూ చేతులు వేశాడు.

"పెద్ద పనులంటే ఇవేనా?" అడిగాడు పెద్దవాడు.

" ఇంకా ఉన్నాయి!.. కానీ మీరు అన్నాలు తిన్నాక చెప్తాను!" అంటూ పిల్లలు తీసుకొని హాల్లోకి వచ్చాడు జితేంద్ర.

పిల్లలు బుద్ధిగా అన్నం తిన్నారు. పిల్లలకు కథ చెప్పి నిద్రపుచ్చాడు జితేంద్ర.

వంటింట్లో గిన్నెలు తోముకుంటోంది శృతి.

"రేపటికి ఏం కూర చేయాలి?" కూరలు చూస్తున్నాడు జితేంద్ర.

"నీకెందుకు జీతూ!నేను చూస్తాలే!"

"ఏం లేదు!తరిగి పెడదామని!"అంటూ కూరలు తీశాడు జితేంద్ర.

" వద్దులే జీతూ! పని చేసి చేసి వచ్చావు! వెళ్లు!నేను చేసుకుంటాలే!" అంది శృతి జితేంద్రని వారిస్తూ.

" కట్టెలు కొట్టి రావటం లేదు కదా!షాపుకు వచ్చిన కస్టమర్లతో మాట్లాడటమే కదా!" అంటూ కూరలు తీసుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చాడు జితేంద్ర.

నవ్వింది శృతి.

'వాతావరణం చల్లబడింది!' అనుకున్నాడు జితేంద్ర.

కూరలు తరిగి ఫ్రిజ్జులో పెట్టి, వాటర్ బాటిల్స్ లో నీళ్లు పోసి పెట్టాడు. అపార్ట్మెంట్ బయట చీపురుతో చిమ్మి గుడ్డతో తుడిచి,ముగ్గులాగా నాలుగు గీతలు గీసి వచ్చాడు. హాల్లో ఉన్న పిల్లలు ఆట బొమ్మలను బుట్టలో సర్దిపెట్టాడు.

శృతి దోశ పిండి మిక్సీలో వేసుకుంటోంది. జితేంద్ర ఇల్లంతా చిమ్మి, మాప్ స్టిక్ తో బాల్కనీ దగ్గర్నుంచి మొత్తం ఇల్లంతా తుడవటం మొదలుపెట్టాడు. సగం చేసేసరికి

"నీ కెందుకు జీతూ! నేను చేసుకుంటాలే!"అంటూ చేతిలో స్టిక్ లాక్కుంది శృతి.

"అబ్బా!వదులు!నువ్వు చేసేపని నువ్వు చెయ్యి!నేను చేసే పని నేను చేస్తాను!" అంటూ మళ్ళీ స్టిక్ లాక్కున్నాడు జితేంద్ర.పనంతా అయిపోయాక తల్లికి ఫోన్ చేశాడు.

"అమ్మా!ఎన్నింటికి వస్తున్నావు? బస్టాండుకు రానా? "

"వద్దులేరా!శాంత కూడా వస్తోంది!ఇద్దరమూ కలిసి వస్తాము!శాంతను వాళ్ళ ఇంటి దగ్గర దించి, అదే ఆటోలో వచ్చేస్తానులే!"చెప్పింది పార్వతి.

శాంత పార్వతికి పిన్ని కూతురు. వీళ్ళ కాలనీకి దగ్గరలోనే ఉంటుంది.

"సరే అమ్మా!ఏదన్నా ప్రాబ్లమ్ ఉంటే ఫోన్ చెయ్యి!వెంటనే వస్తాను!"అంటూ ఫోన్ పెట్టేశాడు జితేంద్ర.

**** ***** ***** ***** ***** ***** ****

తెల్లవారింది.తొమ్మిది గంటలు.

పిల్లలు బస్సులో స్కూలుకు వెళ్లిపోయారు.బట్టలు వాషింగ్ మిషన్లో వేసి టిఫిన్ చేయడానికి కూర్చున్నాడు జితేంద్ర.శృతి ఇంట్లోనే కేకులు తయారు చేసి కాలనీలో ఉండే వాళ్లకు అమ్ముతూ ఉంటుంది.శృతి రకరకాల డిజైన్లలో కేకులు చాలా రుచిగా చేస్తూ ఉంటుంది.ముందు రోజు వచ్చిన ఆర్డర్సును చూసుకొని రెండోరోజు చేసి పంపిస్తూ ఉంటుంది. అందరిళ్ళకూ కేకు డబ్బాలు ఇచ్చి రావటానికి గోవిందు అనే కుర్రవాడిని పెట్టుకుంది.

శృతికి సహాయంగా పనిమనిషి రాధ మూడు పూటలా వచ్చి పని చేసి వెళ్తూ ఉంటుంది. ఈ పది రోజులు రాధ రాదు కాబట్టి తనొక్కటే అన్ని పనులు చేసుకోవాలి. అదే కాక అత్తగారు ఇంకాసేపటికి వచ్చేస్తుంది.పార్వతికి సెల్ ఫోన్ ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. పొద్దస్తమానం వాళ్లతో చాటింగు చేస్తూ ఉంటుంది.

సాధారణంగా ఆ వయసు వాళ్ళు పనీపాట లేక కోడళ్ళని తిట్టుకుంటూ ఉంటారు.

''మా తరంలో అయితే మేము ఎంతో అణుకువగా పెద్ద వాళ్ళని చూసుకున్నాము...ఈ కాలంలో కోడళ్ళది రాజ్యం!వీళ్ళల్లో వినయము, విధేయత కాగడా పెట్టి వెదికినా కనిపించవు!అత్తమామల్ని వృద్ధాశ్రమాలకు నెడుతూ ఉంటారు...ఏమన్నా అంటే మొగుడిని కూడా వదిలేసిపోతారు!"అంటూ విపరీతమైన అక్కసును వెళ్ళగక్కుతూ ఉంటారు.నిత్యం

కోడళ్లని ఆడిపోసుకుంటూ ఒక రకమైన మానసిక ఆనందాన్ని ఈ పెద్దతరం వాళ్లు పొందుతూ ఉంటారు.వాళ్ల పాటికి వాళ్లు సెల్ఫోన్లతో కాలక్షేపం చేసే జాతి వాళ్ళు కొందరయితే, కోడళ్ళని హేళన చేస్తూ వాళ్ళు చేసే పనులను తమ స్నేహితురాండ్రకు చెప్తూ కాలం గడిపే వాళ్ళు కొందరు.మరికొందరు తమ కోడళ్ల మీద ధాష్టికం చెలాయించే వాళ్ళు.పార్వతి రెండో కోవకు చెందింది. కోడళ్లు చేసే పనుల్లో లోపాలు వెదికి వాటిని జోకులుగా చిత్రీకరించి తన వ్వాట్సాప్ గ్రూపుల్లో పెట్టి ఆనందిస్తూ ఉంటుంది.

పార్వతికి ఇద్దరు కొడుకులు. పెద్దవాడు జితేంద్ర.చిన్నవాడు ధర్మేంద్ర. పార్వతి ఇద్దరు కొడుకుల దగ్గరికి తిరుగుతూ ఉంటుంది.అప్పుడప్పుడు బంధువులతో ఫ్రెండ్స్ తో కలిసి తీర్థయాత్రలు చేసి వస్తూ ఉంటుంది.చిన్న కోడలు సృజన ఉద్యోగం చేస్తుంది. వాళ్లకు

ఒకటే పాప.అక్కడ కనుక పార్వతి ఉంటే చిన్న పిల్లను చూసుకోవాలి.అందుకని పెద్ద కొడుకు దగ్గరే ఎక్కువ కాలం ఉంటూ ఉంటుంది.ఇంట్లో ఉండి అన్ని చక్కదిద్దుకుంటూ కేకులు చేసి సంపాదించే శృతిని చూసి పార్వతి అప్పుడప్పుడు దెప్పుతూ ఉంటుంది. అత్తగారు చిన్నమాట సాధింపుగా అంటే మొహం పగిలేలా సమాధానం చెబుతుంది సృజన.. అందుకని పార్వతికి చిన్న కోడలంటే ఒకింత భయం.

శృతి వైఖరి దీనికి భిన్నంగా ఉంటుంది. అత్తగారు కొంచెం సాధింపుగా మాట్లాడితే చాలా వరకు మౌనంగా ఉంటుంది. మరీ అతి అయితే మాత్రం జితేంద్రతో చెప్పి బాధపడుతూ ఉంటుంది. అంతేగానీ పార్వతితో యుద్ధం చేయదు. అప్పుడప్పుడూ జితేంద్రకు తల్లి ప్రవర్తన బాధ కలిగించినా ఆమెను గట్టిగా ఏమీ అనడు. తల్లికి తనూ, తమ్ముడు తప్ప ఎవరున్నారు? చాదస్తంగా ఏదో అంటే పట్టించుకోకూడదు అని భార్యకు సర్ది చెబుతూ, భార్యను ప్రేమగా చూసుకుంటూ, బాధ్యతగా ఉంటాడు.

వర్తమానానికి వస్తే..

అప్పుడే ఆటో దిగి వచ్చింది పార్వతి. వాకిలి ముందు వేసిన ముగ్గు చూసి మూతి తిప్పి 'ఇంత లక్షణంగా వేసింది ముగ్గు!'అనుకొని సెల్ ఫోనుతో ముగ్గును ఫోటో తీసింది. ఎందుకంటే ఆ ఫోటో తన స్నేహితురాండ్ర వాట్సాప్ గ్రూపుల్లో పెడితే బ్రహ్మాండమైన రెస్పాన్స్ వస్తుంది.

తల్లి చేతిలోని బ్యాగు తీసుకున్నాడు జితేంద్ర.

"ఎలా ఉన్నావమ్మా!" అంటూ సోఫాలో తల్లి పక్కన కూర్చున్నాడు. అత్తగారికి మంచినీళ్లు తెచ్చి ఇచ్చింది శృతి.కాసేపు తల్లితో మాట్లాడి షాపుకు వెళ్లాడు.

కాసేపటికి రాధ పనిలోకి రావట్లేదని చెప్పింది శృతి. వెంటనే నీరసంగా మొహం పెట్టింది పార్వతి.

"ఏమిటో అమ్మాయి!ఒకటే కాళ్ళ నొప్పులు.. పైగా తలనొప్పి!.."అంది.

" మీరు టిఫిన్ తిని పడుకోండత్తయ్యా! కాస్త విశ్రాంతి తీసుకుంటే తగ్గుతుంది!"అని అత్తగారికి టిఫిన్ తెచ్చి పెట్టింది శృతి.

ఒకరకంగా చెప్పాలంటే పార్వతికి ఆనందంగా ఉంది. ఈ పది రోజులు పని మనిషి రాదు.ఇంట్లో పని,..కేకుల పని.. పిల్లల పని అన్నీ శృతి ఒక్కతే చేసుకోవాలి.దెబ్బకు తిక్క కుదురుతుంది!'అనుకుంది మనసులో.

మధ్యాహ్నం భోజనం చేసి పడుకుంది పార్వతి. జితేంద్ర గొంతు వినిపించేసరికి లేచి వచ్చింది. షాప్ నుండి వచ్చాడు జితేంద్ర. శృతితో కలిసి భోజనం చేస్తున్నాడు.కాసేపు పిల్లలతో కబుర్లు చెప్పి తన రూములోకి వెళ్ళింది పార్వతి. ఆ టైమ్ లో ఫ్రెండ్స్ తో ఛాట్ చేసుకుంటూ ఉండటం అలవాటు. తల్లి అటు రూములోకి వెళ్ళంగానే సైలెంట్ గా పనిమనిషి చేసే పనులన్నీ చేసి పెట్టాడు జితేంద్ర.ప్రశాంతంగా కేకులు చేసుకుంది శృతి. సాయంత్రం నాలుగింటికి హాల్లోకి వచ్చిన పార్వతికి ఆశ్చర్యం వేసింది. ఇల్లంతా నీట్ గా ఉంది. అంట్ల గిన్నెలు లేవు... వంటిల్లు శుభ్రంగా ఉంది. హాల్లో కూర్చుని పిల్లలకు హోమ్ వర్క్ చేయిస్తోంది శృతి. కోడలి మొహంలో అలసట లేదు.'ఏమైందబ్బా!'అనుకుంది పార్వతి.

"ఈ రోజు కేకులు చేసే పని లేదా శృతీ!"అంది ఉండబట్టలేక.

"మధ్యాహ్నమే చేసి పంపించేశానత్తయ్యా!"బదులిచ్చింది శృతి.

రాత్రి అన్నం తిని పడుకుంది పార్వతి. ఆవిడ అటు నిద్రపోంగానే మొత్తం పని చేసేసుకున్నాడు జితేంద్ర. రెండో రోజు పొద్దున్నే పార్వతి నిద్రలేచి చూస్తే పిల్లలు స్కూలుకు తయారవుతున్నారు.వంటింట్లోకి వెళ్లి చూసి అలాగే నిలబడిపోయింది పార్వతి. చాలా శుభ్రంగా ఉంది. ఇల్లంతా గుడ్డపెట్టి తుడిచినట్లుగా తళతళలాడుతోంది. శృతి చాలా ప్రశాంతంగా ఉంది.

పార్వతికి అయోమయంగా ఉంది.'

ఇదేదో తేల్చుకోవాలి!'అనుకుంది మనసులో. అయితే ఆమె కొడుకు జితేంద్రకు ఆవిడేమనుకుంటుందో తెలుసు. అందుకే మధ్యాహ్నం మెకానిక్ ని తీసుకొచ్చి హాల్లో ఉండే టీవీని పార్వతి గదిలోకి మార్చాడు.

"ఇప్పుడెందుకురా?"అర్థం కావటం లేదు పార్వతికి.

"హాల్లో శృతి కేకులు చేసుకుంటూ ఉంటుంది కదమ్మా!పైగా కంప్యూటర్ లో ఆర్డర్స్ చూసుకుంటూ కస్టమర్స్ తో మాట్లాడుతూ ఉంటుంది. అలాగే కంప్యూటర్ లో చూసి కేక్స్ డిజైన్లు వేసుకోవాలి.పిల్లలు,నువ్వు టీవీ చూస్తూ ఉంటే కొంచెం డిస్టబెన్స్ గా ఉంటుందనిపించింది.అందుకే టీవీని నీ గదిలోకి సర్దాను!" వివరించాడు జితేంద్ర.

జితేంద్ర " శృతి కోసం!" అంటూ ఉంటే కొంచెం అసంతృప్తిగా అనిపించినా" సరే!" అంది పార్వతి.

టీవీ ఆమె గదిలోనే ఉంటుంది కాబట్టి మధ్యాహ్నం గది దాటి బయటికి రావట్లేదు పార్వతి.ఆమెకు తెలియకుండా జితేంద్ర సైలెంట్ గా తన పని తాను చేసుకుంటున్నాడు. పది రోజులు ప్రశాంతంగా గడిచాయి.

పనిమనిషి రాధ మళ్ళీ పనిలోకి వచ్చింది.

ఆరోజు రాత్రి పిల్లలు పడుకున్నారు.అకౌంట్స్ చూసుకుంటున్నాడు జితేంద్ర. గదిలోకి వచ్చింది శృతి.అతని తలలోకి వేళ్ళు జొ నిపి జుట్టు సవరిస్తూ "నేను చేసి పెట్టనా!"అంది మృదువుగా.

"ఐదు నిమిషాల్లో అయిపోతుందబ్బా!"అన్నాడు జితేంద్ర.

" ఈ పది రోజులు మీరు చాలా కష్టపడ్డారు..అత్తయ్యకు తెలియకుండా మొత్తం పని చేసేశారు.. "భార్య కళ్ళల్లోకి చూశాడతడు.

విశ్వంలోని ప్రేమంతా రాశీభూతమై శృతి కళ్ళలో వెలిగిపోతోంది.

"నువ్వు నేను వేరే అయితే కదా!నాలో సగం నువ్వు!.. మనిద్దరం సమానంగా మన పనులు చేసుకున్నాం!"అన్నాడు జితేంద్ర.

అతని తలను హృదయానికి హత్తుకుంది శృతి.

భార్యాభర్తలు అంటే ఇద్దరూ ఒకరే!..ఒకరే ఇద్దరూను ఆ విషయం ఎన్నో యుగాలుగా తనకు తెలుసని వెన్నెల కిటికీలోంచి ధారగా పడుతోంది.

****** ****** ****** ***** ***** ***** ****

మరిన్ని కథలు

Pichhuka paga-Enugu chavu
పిచ్చుక పగ - ఏనుగు చావు
- హేమావతి బొబ్బు
Ati Garabam
అతి గారాబం (బాలల కథ)
- మద్దూరి నరసింహమూర్తి
Kotta kathalu kaavaali
కొత్త కథలు కావాలి
- తాత మోహనకృష్ణ
Sarigamalu
సరిగమలు
- కొడవంటి ఉషా కుమారి
Sandhyarani coffee kappu
సంధ్యారాణి కాఫీకప్పు
- అనంతపట్నాయకుని కిశోర్
Anaadigaa..
అనాదిగా....
- షామీరు జానకీ దేవి
దుష్టబుద్ధి!
దుష్టబుద్ధి!
- - బోగా పురుషోత్తం
Vendi kadiyalu
వెండి కడియాలు
- కొడవంటి ఉషా కుమారి