
పేదరికం శాపం కాదు, అది ఒక గోడ వంటిది—దాన్ని దాటడం కష్టమే, కానీ అసాధ్యం కాదు. పేదరికాన్ని జయించేందుకు విద్య అజ్ఞానమనే చీకటిని చీల్చి ముందుకు దారి చూపిస్తుంది. నిన్ను ప్రపంచానికి పరిచయం చేసే అక్షరం, నీ జీవితాన్ని సమున్నతంగా నడిపించే సౌరభం లాంటిది. ఇది స్ఫూర్తిగా తీసుకున్న పృథ్వి కథను మీకు పరిచయం చేస్తాను. "ఈ కథ మీ మనసును స్ఫూర్తితో నింపుతుందని ఆశిస్తున్నాను!" కలలు మనిషిని ముందుకు నడిపిస్తాయి, కలలను సాకారం చేయకపోతే, జీవితంలో ఓటమి ఒప్పుకున్నట్లే!"కలలను కాంక్షించి, కష్టంతో కొనసాగితే, విజయం మొదటి మెట్టు మీదే!" కలలు కనడం సహజం, కానీ కలలను నిజం చేయడం మన కర్తవ్యం. పృథ్వి కథ ఈ సత్యాన్ని సాక్షాత్కరింపజేస్తుందని నమ్ముతున్నాను.మారుమూల గ్రామంలో ఒక కల మారుమూల గ్రామంలో పుట్టి పెరిగిన పృథ్వి, చిన్ననాటి నుండి ఇంజనీర్ కావాలనే కలను కన్నాడు. గ్రామీణ వాతావరణంలో పెరిగినా, పృథ్వి తెలివితో తళుక్కున మెరిసేవాడు. చదువంటే అతనికి అమితమైన ఇష్టం, ఆసక్తి అతని ఆలోచనలను ఆకర్షించేది.కానీ, పేదరికం అతని కుటుంబాన్ని కమ్మేసిన కారుమేఘం. తండ్రి సామాన్య రైతు, తల్లి దినసరి కూలీ. కుటుంబాన్ని పోషించడమే సవాలైన సమయంలో,పృథ్వి చదువుకోవాలనే సంకల్పం తల్లిదండ్రుల హృదయంలో బలంగా నాటుకుంది. చదువుకు డబ్బులు లేక, తల్లిదండ్రుల ఇబ్బందులు చూసి,పృథ్వి చదువును మధ్యలోనే ముగించాలని అనుకున్నాడు. కానీ, తల్లి ప్రోత్సాహంతో, విక్రమార్కుడిలా విజయం వైపు సాగాడు. పుస్తకాల పట్ల ప్రీతి, పృథ్వి మనసును మునిగెల్పింది.కానీ, ఆర్థిక ఇబ్బందులతో పుస్తకాలు కొనలేకపోయాడు.గ్రామంలో గ్రంథాలయం లేక, చదువు ఎలా సాగించాలో తికమకపడ్డాడు. ఒక రోజు, స్నేహితుడి సూచనతో పక్క గ్రామంలోని గ్రంథాలయం గురించి తెలిసింది. ఆనందంతో అతని మనసు ఉప్పొంగింది! ప్రతి రోజూ గ్రంథాలయానికి పయనమై, పుస్తకాలతో ప్రేమాయణం సాగించాడు. నిశ్శబ్ద మూలలో కూర్చుని, గంటల తరబడి చదివి, చిన్న చిన్న నోట్స్ తయారు చేసుకునేవాడు.విజయం వైపు పయనం రోజులు గడిచే కొద్దీ, పృథ్వి చదువుపై దృష్టి రెట్టింపు చేశాడు. స్కూల్‌లో టాపర్‌గా నిలిచి, ప్రభుత్వ స్కాలర్‌షిప్‌లతో చదువును కొనసాగించాడు. కాలేజీలో చేరిన తర్వాత, రాత్రివేళల్లో పార్ట్‌టైమ్ ఉద్యోగం చేసి,తన ఖర్చులను తానే భరించాడు, ఇంటికి కొంత సాయం కూడా పంపాడు. ఎన్నో సామాజిక సవాళ్లను ఎదుర్కొన్నాడు, కొత్త వాతావరణంలో తనను తాను నిరూపించుకోవడానికి కష్టపడ్డాడు. అతని కృషికి ఫలితం లభించింది—కాలేజీలో అన్ని రంగాల్లో రాణించి, అందరి ప్రశంసలు అందుకున్నాడు. చివరకు, పృథ్వి ఇంజనీరింగ్ డిగ్రీ సాధించాడు! తన కలను నెరవేర్చుకున్నాడు, కానీ అక్కడితో ఆగలేదు.తన గ్రామ విద్యార్థుల కలలను కూడా కాంచాలనే కాంక్ష కలిగింది. గ్రామంలోని పేద విద్యార్థులకు ఉచిత కోచింగ్ ఇవ్వడం ప్రారంభించాడు, పోటీ పరీక్షలకు ప్రోత్సాహం అందించాడు. ఈ ప్రయత్నం అతని స్వయం-మెరుగుదలకు కూడా తోడ్పడింది. పృథ్వి ఇంజనీరింగ్‌తో పాటు ఆధ్యాత్మిక ప్రవచనాలపై దృష్టి సారించాడు. పేరెన్నికగన్న సంస్థలలో ప్రసంగాలు ఇస్తూ, ప్రేక్షకుల మనసులను ఆకర్షించాడు. "జీవితం విలువైన వరం, ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకో!" ఈ సందేశంతో అనేక ప్రాంతాల్లో తన గళాన్ని వినిపించాడు.అతని సామాజిక కార్యక్రమాలు విస్తృత ప్రచారం పొందాయి. చివరకు, కేంద్ర ప్రభుత్వ పురస్కారాన్ని అందుకునే స్థాయికి ఎదిగాడు. కలలు కనడం సులభం, కానీ కష్టపడితేనే కలలు నిజమవుతాయి! ఆర్థిక సమస్యలు, సామాజిక అడ్డంకులు ఎన్ని ఉన్నా,పట్టుదలతో పనిచేస్తే, ప్రతి అడ్డంకిని అధిగమించవచ్చు. పృథ్వి కథ ఈ సత్యాన్ని స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది.