మాతృమమత - కందర్ప మూర్తి

Matru mamatha

గూడెంలో తెలతెలవారుతోంది. పక్షులు కిలకిలారావాలతో
అడవంతా సందడిగా ఉంది. రాత్రి సంచారం చేసిన పక్షులు,
జంతువులు స్థావరాలకు చేరుకుంటున్నాయి. మంచు తెరలు
వీడి సూర్యకిరణాలు వెలుగును ప్రసాదిస్తున్నాయి.
కోయ చిన్నోడు వీపుకి బాణం కర్ర ఊసల పొది, నడుంకి
కట్టిన తోలు పట్టాకి కత్తి తగిల్చి, చంకన పెద్ద తాళ్ల సంచి,
చేతిలో హంటర్ బార్ ( పిట్టల్ని కొట్టే సాధనం) పట్టుకుని వేటకు
బయలుదేరాడు. తెల్లారే సమయంలోనే చిన్న అడవి
జంతువులు, పిట్టలు దొరుకుతాయని వెతుకుతున్నాడు.
వేటాడిన కుందేళ్లను , నీటి బాతులు, అడవి పిల్లులు, కౌజు
పిట్టలు, అడవి పందుల్ని పట్నం తీసుకుపోయి అమ్ముకుంటాడు
నీటి బాతులు, నక్కల్ని వేటాడుతు ముందుకు వెళుతుంటె
ఒకచోట తెల్లని చెవులపిల్లి గడ్డిబరకలు తింటూ పొదల చాటున
కనబడింది.
గురి చూసి హంటర్ బార్ తో చెవులపిల్లిని కొడితె గుండు
తగిలి చెవులపిల్లి కింద పడిపోయింది. గబగబా దాన్ని
సంచిలో వేసుకుందామని పరుగెడితె దగ్గరలో రెండు చిన్న
కూనలు తల్లి వెనుక కనిపించాయి.
కోయ చిన్నోడి మనసు కరిగిపోయింది. తల్లి చనిపోయింది.
తనవల్ల పెద్ద తప్పు జరిగిందని ఈ పసికూనలకు దిక్కెవరని
బాధ పడసాగేడు.
ఆ రెండు కూనల్ని సంచిలో వేసుకుని గూడేనికి తీసుకు
వచ్చాడు. ఇప్పుడు వీటిని సాకడం ఎలాగని ఆలోచిస్తుంటె
గుడిసె బయట ఆడకుక్క రెండు కూనలకి పాలు కుడుపుతు
కనబడింది.
అది కోయచిన్నోడి పెంపుడు కుక్క. మెల్లగా దగ్గరకు వెళ్లగా
తోక ఆడిస్తు విశ్వాసం కనబరిచింది. దాని నెత్తిమీద చేత్తో
నిమురుతు తన దగ్గరున్న సంచిలోంచి చెవులపిల్లి రెండు
పసికూనల్ని పైకి తీసి ఆడకుక్క రెండు పిల్లలతో కలిపి పాల
పొదుగులు అందించాడు. ఆడకుక్క ఏమి చెయ్యకుండా తోక
ఆడించసాగింది. చెవులపిల్లి కూనలు పొదుగుల పాలు తాగసాగేయి.
అలా శునకం పిల్లలతో పాటు చెవులపిల్లి పిల్లలు కూడా
పాలు తాగుతు పెరగసాగేయి. తన పొరపాటుకు సరైన దారి
దొరికిందని ఆనందపడ్డాడు కోయచిన్నోడు.
తన కూనలతో సమానంగా పాలు కుడుపుతు చెవులపిల్లి
పిల్లల్ని పెంచసాగింది శునకం. వాటిపట్ల మాతృమమత పెరిగింది.
ఒకసారి పెద్ద కొండచిలువ దగ్గరి కొండల నుంచి గూడెం వైపు
వచ్చింది. అది గడ్డి పరకలు మేస్తున్న చెవులపిల్లి కూనను
మింగపోయింది. అదిచూసి వెంటనే తల్లి శునకం చెవులపిల్లి
కూనను నోటితో పట్టుకుని దూరంగా పారిపోయి గట్టిగా మొరగసాగింది.
శునకం ఎందుకు మొరుగుతోందోనని గుడెసె నుంచి బయటకు
వచ్చిన చిన్నోడికి ఆపద తెల్సి బాణం ఊసతో కొండచిలువను
చంపేసాడు..
ఇంకొకసారి నీటి కోసం తొట్టె ఎక్కిన చెవులపిల్లి కూన జారి
తొట్టెలో పడిపోయింది. అది చూసిన తల్లి శునకం వెంటనే
తొట్టెలోకి దుమికి నోటితో పట్టుకుని బయటకు తెచ్చింది.
అనేకసార్లు తన పిల్లల కన్న చెవులపిల్లి కూనలనే ప్రేమగా
చూసుకునేది.
శునకం పిల్లలతో పాటు చెవులపిల్లి కూనలు కూడా పెరిగి
పెద్దగా అయాయి.
సమీప కోయగూడెంలో వారు పెంచుకోడానికి శునకం
పిల్లల్ని పట్టుకుపోయారు. ఇప్పుడు చెవులపిల్లి కూనలే
పెద్దగా పెరిగి తల్లి శునకానికి తోడుగా ఉంటున్నాయి.
సమీప గూడెంలోని తాగుబోతు కుళ్లోడి కళ్లు చెవులపిల్లి
కూనల మీద పడ్డాయి. వాటిని చంపి మాంసం వండుకు
తినాలని ఎదురుచూస్తున్నాడు.
కోయచిన్నోడు ఉన్నంతవరకు ఆ పరిసరాల్లోకి వెళ్లే
సాహసం చెయ్యలేకపోతున్నాడు.
కొద్ది రోజుల తర్వాత చిన్నోడికి జ్వరం వచ్చి లేవలేకపోతే
పట్నం పెద్ద హాస్పత్రికి తోలుకుపోయారు. అప్పుడు గుడిసెకి
కాపుగా శునకం ఉన్నది.
ఇదే అదును సమయమని తలిచి కుళ్లోడు పెద్ద కర్ర ,
కత్తి తీసుకుని కోయచిన్నోడు ఉంటున్న గుడిసె వద్దకు
వచ్చాడు. బాగా కల్లు తాగి నిషామీదున్నాడు.
గుడెసె దగ్గరకు వచ్చి చూడగా రెండు చెవులపిల్లులు
ఆడుకుంటు కనిపించేయి. అప్పుడు తల్లి శునకం బయట
ఎక్కడో ఉంది.
ఇదే మంచి అదును అనుకుని వాటిని పట్టుకోబోయాడు.
అప్పుడే వచ్చిన తల్లి శునకం ఆపదను పసిగట్టి గట్టిగా
అరుచుకుంటు తాగుబోతు మీదకు దూకింది.
తాగుబోతు కుళ్లోడు మత్తులో ఊగుతు చేతిలో కత్తితో
తల్లి శునకాన్ని పొట్టలో పొడిచాడు. అయినా శునకం
ముందుకు కదలనీయకుండ వాడి చేతిని, పొట్టని, మెడ
దొరికిన చోటల్లా కరవసాగింది.
రక్త స్రావం అవుతున్నా తాగుబోతోడు కత్తితో తల్లి
శునకాన్ని మెడమీద , నడుం మీద పొడిచాడు. కొద్ది
సేపటికి శునకం కిందపడి కొట్టుకుంటు చనిపోయింది.
తాగుబోతు కుళ్లోడు కూడా రక్తం చిమ్మి ప్రాణం వదిలాడు.
మర్నాడు గూడేనికి వచ్చిన కోయచిన్నోడికి తల్లి శునకం
త్యాగం , జాతి భేదం మరిచి చూపిన మాతృమమత
తెలుసుకుని తల్లడిల్లిపోయాడు. చెవులపిల్లులుకి గూడు
ఏర్పాటు చేసి జాగ్రత్తగా పెంచసాగేడు.
అప్పటి నుంచి అడవిలో జంతువులను, పక్షులను వేటాడటం
జీవహింసని భావించి పోడుభూమిలో వ్యవసాయం చేసుకుంటు
ఫలాలు, కూరగాయలు సాగుచేస్తు జీవనం సాగిస్తున్నాడు కోయచిన్నోడు.
సమాప్తం

మరిన్ని కథలు

podupu - jadupu
పొడుపు కధ తెచ్చిన జడుపు
- నిర్మలాదేవి గవ్వల
Sahasaveerudu merine bharat
సాహసవీరుడు మెరైన్ భారత్
- హేమావతి బొబ్బు
Nalupu
నలుపు
- Anisa Tabassum Sk
Dayyala Porugu
దెయ్యాల పొరుగు
- నిర్మలాదేవి గవ్వల
Oppandama/sampradayama
ఒప్పందమా / సాంప్రదాయమా
- మద్దూరి నరసింహ్మూర్తి
Kalam tho.. srivari seva
కాలం తో ...శ్రీవారి సేవ
- హేమావతి బొబ్బు
Naanna nannu kshaminchu
నాన్నా..నన్ను క్షమించు..!
- యు.విజయశేఖర రెడ్డి