అది బాలానగర్ పోలీస్ స్టేషన్.. ఉదయం 7.05 నిముషాలు కావస్తోంది. ల్యాండ్ ఫోన్ రింగ్ అయ్యింది. డ్యూటిలో ఉన్న ఇన్స్పెక్టర్ భరత్ ఫోన్ ఎత్తి “హలో..”అన్నాడు.
“హలో..పోలీస్ స్టేషనా సర్!” అవతల నుండి ఫోన్ “అవును ఇది బాలానగర్ పోలీస్ స్టేషన్”. “సర్! నా పేరు రంగయ్య. ఎవరో రాత్రి కిటికీ అద్దాలను పగులగొట్టి మా భూషణం అయ్యగారింట్లోకి చొరబడినట్లుగా ఉంది. అయ్యగారిని పిలుస్తుంటే పలకడం లేదు..మనిషిలో చలనం లేదు..నాకెందుకో భయంగా ఉంది” అని చిరునామా చెప్పాడు రంగయ్య.
“నువ్వేమీ కంగారూ పడకు నేను ఒక పావు గంట కల్లా అక్కడ ఉంటాను” అని ఫోన్ పెట్టేశాడు భరత్.
భరత్, పోలీస్ కారులో బయలు దేరి దారిలో డాక్టర్‌ను, క్లూస్ టీమ్‌ను రమ్మని ఫోన్ చేసి అడ్రసు చెప్పాడు. భరత్ చేరుకున్న కాసేపటికి డాక్టర్ వచ్చాడు. డాక్టర్ భూషణాన్ని పరీక్షించి “అర్దరాత్రి ఊపిరి ఆడని పరిస్థితిలో చనిపోయినట్టుగా ఉంది” అని చెప్పాడు..బెడ్ మీద ‘డుయోవా’ ఇంకా ‘ఫ్లట్రోల్’ ఆస్తమా ఇన్హేలర్లు ఉన్నాయి.
“నీవు అయ్యగారిని ఎప్పుడు చూసావు?” అని అడిగాడు భరత్.
“ఉదయం ఆరు గంటల నలభై నిముషాలకు పైకి వచ్చి బెల్ కొట్టాను, ఎంతకూ తలుపు తీయలేదు..సెల్లో నుండి ఫోన్ చేశాను, అయిన సార్ తలుపు తీయలేదు.. నేను మా ఆవిడ తలుపు పగులగొట్టి ఈ బెడ్ రూముకు వచ్చి చూశాము. అయ్యగారు కళ్లు తేలేసి ఉన్నారు, నాడీ పట్టుకుని చూశాను. కొట్టుకోవడం లేదు. అనుమానమేసి అయ్యగారి ఫ్యామిలీ డాక్టర్ గారికి ఫోన్ చేశాను వారు ఎత్త లేదు. వెంటనే మీకు ఫోన్ చేశాను” అని సెల్లో వివరాలు చూపించాడు.
కిటికీ వద్ద పడ్డ అద్దం ముక్కలు చెల్లాచెదురుగా పడిఉన్నాయి. గది అంతా కలియజూస్తుంటే క్లూస్ టీమ్ కూడా వచ్చింది.
“మీ అయ్యగారికి ఆస్తమా ఉందా?” అడిగాడు భారత్.
“అవును సర్..దాదాపు పది సంవత్సరాలుగా ఆ జబ్బు ఉంది” అన్నాడు రంగయ్య. “ఇంట్లో ఎవరెవరు ఉంటారు” “శారద అమ్మ గారు, అబ్బాయి కృష్ణ.. బంధువుల పెళ్లి ఉందని విశాఖపట్నం వెళ్లారు సార్” అన్నాడు రంగయ్య. “నువ్వేంచేస్తుంటావు?’ నేను, మా ఆవిడ సీత ఈ అయ్యగారి వద్ద గత ఇరవై సంవత్సరాలుగా పనిచేస్తున్నాము మా ఆవిడ వంట పనులు చేస్తుంది నేను ఇంటికి కావలసిన సామాన్లు తేవడం ఇంటికి కాపాలగా ఉండడం నా పని సార్” చెప్పాడు రంగయ్య.
“అమ్మగారికి ఫోన్ చేశావా? లేకుంటే నెంబర్ ఇవ్వు ఫోన్ చేసి చెబుతాను” అడిగాడు భరత్. రంగయ్య ఫోన్ నెంబరు ఇవ్వగానే ఫోన్ చేసి విషయం చెప్పాడు. వెంటనే బయలుదేరి వస్తున్నట్టు అవతలి నుండి సమాధానమొచ్చింది.
క్లూస్ టీం వారు వచ్చి గదిలో అణువణువూ జల్లెడ పట్టసాగారు..దిండుతో ఊపిరి ఆడకుండా చేసినట్టు నిర్దారణ అయ్యింది. ఆ దిండును, పగిలిన కిటికీ అద్దాలను క్లూస్ టీమ్ వారు భద్రం చేసారు. “నీకు ఎంతమంది పిల్లలు ఏం చేస్తుంటారు..ఎక్కడ ఉన్నారు” అంటూ..పోలీసు ధోరణిలో ఆరా తీశాడు భరత్. “నాకు ఇద్దరు పిల్లలు సార్.. అబ్బాయి శరత్ వరంగల్లో ఒక ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. అమ్మాయి సుశీల బి.టెక్ మొదటి సంవత్సరం గుంటూరులో చదువుతోంది సార్” వినయంగా వివరాలు చెప్పాడు రంగయ్య. “మీ అయ్యగారి సెల్ ఫోన్ తీసుకెళుతున్నాను”
“అలాగే సర్” అన్నాడు రంగయ్య.
భరత్ హాస్పిటల్ వారిని పిలిపించి బాడీని పోస్ట్ మార్టం కోసం పంపాడు. రంగయ్యతో మళ్లీ కలుస్తాము.. అమ్మగారు వాళ్ళు వస్తే మా పోలీస్ స్టేషన్‌కు రమ్మను అని చెప్పి అందరూ బయలుదేరారు. సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో శారద,కృష్ణ వచ్చి భరత్‌ను కలిసారు. భరత్ వారిని హాస్పిటల్‌కు తీసుకెళ్ళాడు. భూషణం బాడీని చూడాగానే వారి హృదయాలు బద్దలయ్యాయి. ఏడుపు తారాస్థాయికి చేరింది. హాస్పిటల్ సిబ్బంది వచ్చి శాంత పరచడానికి ప్రయత్నించారు. కానీ వారి వల్ల కాలేదు.
పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. భరత్ రిపోర్టు అందుకుని చదివాడు. వారి అనుమానం నిజమయ్యింది. భూషణం ఊపిరి ఆడక పోవడం వల్లనే చనిపోయాడని ఉంది.
డిటెక్టివ్ విశ్వంకు ఫోన్ చేసి పిలిపించాడు. భూషణం బాడీని చూశాడు విశ్వం. తరువాత బాడీని శారద వాళ్ళు తీసుకెళ్లడానికి అనుమతినిచ్చాడు భరత్. అన్ని విషయాలు చెప్పి “విశ్వం ఈ కేసును నీకు అప్పగిస్తున్నాను ” అన్నాడు భరత్. “అలాగే సార్” అన్నాడు విశ్వం. “భూషణం అంత్యక్రియలు ఈరోజే చేస్తామన్నారు..రేపు ఒకసారి వారి ఇంటికి వెళదాము..నేను ఫోన్ చేస్తాను అన్నాడు భరత్. “అలాగే సార్” అని సెలవు తీసుకున్నాడు విశ్వం.
మరుసటి రోజు సాయంత్రం విశ్వం,భరత్ భూషణం ఇంటికి చేరుకున్నారు. రంగయ్య కుటుంబమంతా ఉన్నారు. రంగయ్య ఎలాంటి వాడు అని శారదను అడిగాడు విశ్వం. రంగయ్య,అతని భార్య సీతమ్మ ఎంతో నమ్మకంగా పని చేస్తున్నారు..ఏ రోజు ఎలాంటి వస్తువూ పోలేదని చెప్పింది శారద.
“శరత్,సుశీలతో పాటు అందరూ కొన్ని రోజులు ఇక్కడే అందుబాటులో ఉండాలి” అని చెప్పి వెళ్ళిపోయారు విశ్వం,భరత్‌లు.
మరుసటి రోజు విశ్వం తన అసిస్టెంట్ రవితో కారులో వరంగల్లో శరత్ పని చేస్తున్న ఆఫీస్‌కు వెళ్ళి, భూషణం చనిపోయిన రోజు ఎక్కడున్నాడో అని తెలుసుకున్నాడు. ఆ రోజు పని ఉంది సెలవు కావాలని అడిగాడు అని మేనేజర్ చెప్పాడు. అక్కడ నుండి శరత్ ఉంటున్న రూమ్‌కు వెళ్లి మారుతాళంతో గదిని తెరిచాడు.
గది అంతా గాలించారు. టేబుల్ రాక్ తీశాడు. అందులో ఒక చిన్న ఆట్ట పెట్టె కనిపించింది. అది తీసి చూశాడు వెండి రాఖీ ఉంది. దాన్ని బయటకు తీస్తుండగా చిన్న రంగు కాగితం కనిపించింది. అందులో “నిన్ను ముట్టుకున్న వాడి అంతు చూస్తాను” అని వ్రాసి ఉంది. అంటే శరత్ తన చెల్లెలు సుశీల గురించి వ్రాసి ఉంటాడని అనుకున్నాడు విశ్వం.
ఆ కాగితాన్ని తన పర్సులో పెట్టుకుని తిరుగు ప్రయాణం అయ్యాడు విశ్వం. మరుసటి రోజు ముందుగా సుశీలను పిలిచి భూషణం ఎలాంటి వాడని విశ్వం అడిగాడు. సుశీల కాస్త కంగారుపడింది. “సార్!..అయ్యగారు మంచివారే” అని అంది. శరత్‌తో “ఈ మధ్య ఏం జరిగిందో చెప్పగలవా?” అన్నాడు విశ్వం. శరత్ మాటల్లో కూడా తత్తరపాటు కనిపించింది.
చివరి అస్త్రంగా ఆ చిన్న కాగితం చూపించాడు విశ్వం. అంతే శరత్ బిత్తరపోయాడు. ఇక నిజం దాచి లాభం లేదని “జరిగింది చెబుతాను సర్! సరిగ్గా పోయిన నెల రాఖీ పండుగ రోజున నా చెల్లి రాఖీ కడుతూ కన్నీరు కార్చింది..అవి ఆనందభాష్పాలు కావు.. బాధతో కార్చిన కన్నీళ్లు అవి.. తల నిమురుతూ విషయం అడిగాను. “అన్నయ్యా!..మనం ఇక్కడ నుండి వెళ్లిపోదాము” అని అంది.
“ఏమయ్యిందో చెప్పమ్మా?” అన్నాను. “ఈ మధ్యన అయ్యగారి ప్రవర్తన బాగుండడం లేదు అమ్మకు బాగు లేదని ఉదయం టిఫిన్ చేయడానికి వెళ్ళాను. అప్పటికి అమ్మగారూ, బాబు గారూ ఇంకా నిదుర లేవ లేదు. అయ్యగారు సరాసరి వంట గది లోకి వచ్చి నా చెయ్యి పట్టుకున్నారు. నేను పరుగున వచ్చేశాను” అని ఏడుస్తూ చెప్పింది.
నాకు పట్టరాని కోపం వచ్చింది..మా మాటలు విన్న అమ్మ వచ్చి “శాంతం వహించండి.. నాన్నగారితో అంతా చెప్పి మనం ఇక్కడ నుండీ మంచితనంతో వెళ్లిపోదాము” అని చెప్పింది. కానీ నాకు మాత్రం అయ్యగారిని చంపాలనిపించింది.
మరుసటి రోజు వరంగల్ వెళ్లిపోయాను, సమయం కోసం ఎదురు చూడసాగాను.. అమ్మగారు వాళ్ళు ఊర్లో లేరని తెలిసి, ఒక రోజు సెలవు తీసుకుని హైదరాబాద్ వచ్చి రాత్రి వరకూ స్నేహితుడి వద్ద ఉండి, రాత్రి పన్నెండు గంటల ప్రాంతంలో ఇంటి గేట్ ముందుకు చేరుకుంటుండగా ఎవరో ఇంట్లో నుంచి వస్తూ గోడ దూకి పారిపోయాడు. దొంగతనం లాంటిది జరిగి ఉంటుందని, ఆ నేరం నా మెడకు చుట్టుకుంటుందని, నేను తిరిగి నా మిత్రుడి గదికి వెళ్లాను...అయ్యగారు చనిపోయారన్న విషయం తెలిసి వరంగల్ నుండి వచ్చినట్టు ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు ఇక్కడకు వచ్చాను.
మా చెల్లి సాయంత్రానికల్లా వచ్చింది” అని చెప్పాడు శరత్. తరువాత రంగయ్యను పిలిచి మాట్లాడాడు.
“మీ అయ్యగారి గురించి దాచకుండా చెప్పాలి” అన్నాడు విశ్వం. “అలాగే సార్..నేను నా భార్య గుంటూరు నుండి పొట్ట చేత పట్టుకుని హైదరాబాద్ వచ్చాము. బంగారు అంగడి ముందు పని వారు కావాలెను అన్న బోర్డ్ చూసి అయ్యగారిని కలిశాను..ఉండడానికి ఉచితంగా ఇల్లు ఇస్తానని మా ఇద్ధరినీ వారి ఇంట్లోనే పని చేయాలని చెప్పారు. నాకు, నా భార్యకు కలిపి నెలకు ఇరవై వేలు జీతం ఇస్తునన్నారు.
మా అమ్మాయి చెయ్యి పట్టుకోవడం, నా భార్యతో నలభై ఏళ్లు వచ్చినా నువ్వు బాగుంటావు అనడం, దేవుడిగా భావించిన ఆయన దెయ్యంలా కనిపించేవాడు.. అయ్యగారు అంటే నాకు కూడా ద్వేషం ఏర్పడింది” అన్నాడు రంగయ్య.
మరుసటి రోజు విశ్వం, భూషణం గోల్డ్ షాప్‌కు వెళ్లి అక్కడి పనివారిని అడిగి వివరాలు తెలుసుకున్నాడు. రాజు అనే అతను బంగారు అంగడిలో పనిచేస్తూ నెల క్రితం చెవి కమ్మలు దొంగిలిస్తూ పట్టుబడి, ఉద్యోగం పోగొట్టుకున్నాడన్న విషయం తెలిసిన విశ్వం వెంటనే రాజును పట్టుకుని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లాడు. భరత్ తనదైన శైలిలో లాఠీ ఊపుతూ అడిగేసరికి..రాజు నిజం కక్కక తప్పలేదు..గజగజ వణుకుతూ..”నన్ను పనిలో నుండి తీసేసిన ..అయ్యగారి అంతు చూడాలని ..ఇంట్లో ఒక్కడే ఉన్నాడని తెలుసుకుని ఇంటి మురికి గొట్టం గుండా పైకి పాకుతూ పక్కనే ఉన్న కిటికీ అద్దాలు పగులగొట్టి లోపలకు వెళ్ళి అయ్యగారిని తలగడతో ఊపిరి ఆడకుండా చంపేశాను” అని నేరాన్ని ఒప్పుకున్నాడు రాజు.
భరత్, రాజును కోర్టుకు అప్పగించాడు. రాజుకు యావజ్జీవ కారాగార శిక్ష పడింది.
హత్యా ప్రయత్నం కూడా నేరమే..ఏదైనా పోలీసుల ద్వారా నేరం రుజువు పర్చి, శిక్ష పెడేలా యత్నించాలి తప్ప భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని శరత్‌కు బుద్ది చెబుతూ, కేసును సునాయాసంగా ఛేదించిన విశ్వాన్ని అభినందించాడు భరత్.***

