సాక్షి అతడే! - రాము కోలా. దెందుకూరు

Sakshi Athade

అపార్ట్‌మెంట్‌లలో పనిచేసే స్త్రీల పరిస్థితి వర్ణించనలవి కాని దారుణంగా ఉంటుంది. ఎంత కష్టపడి పనిచేసినా, యజమానుల నుండి మెచ్చుకోలు మాట మాత్రం రానే రాదు. ఇసుమంత తప్పు దొరికినా ఈసడింపులు, ఛీత్కారాలు, చేసిన పనులకు వంకలు పెట్టడం జరుగుతుంటాయి. తమకు సేవ చేయడానికే దేవుడు పని మనుషులను సృష్టించాడనే భ్రమలో కొందరు యజమానులుంటారు. అటువంటి వారిలో బాలామణి ఒకరు.

ఆర్థిక ఇబ్బందులతో కుటుంబాన్ని పోషిస్తూ, అవమానాలను భరిస్తూ, ఇంటి భారాన్ని లాక్కొచ్చే రత్తాలు వంటి వారు వారి దగ్గర పని చేస్తుంటారు. విభిన్నమైన మనస్తత్వాలు. వంటగదిలో ఒకరు, వరండాలో వాలు కుర్చీలో మరొకరు. మధ్యలో అంతస్తుల తేడా. ఈ దూరాలు తొలిగేది ఎన్నడో! టీవీలో చూపిస్తున్న పట్టుచీరల ప్రకటనల వైపు ఆసక్తిగా చూస్తూ, వేయించిన పల్లీలను వేడివేడిగా ఆరగిస్తున్న బాలామణి, వంటగదిలో నుండి బయటకు వస్తున్న రత్తాలు వైపు, గోడకున్న గడియారం వైపు మార్చి మార్చి చూసింది.

‘ఇంకా ఐదు కాలేదు. అప్పుడే రత్తాలు వంటగదిలో నుండి బయటకు రావడం ఏంటి?’ అనే సందేహం బాలామణి ముఖంలో స్పష్టంగా కనిపించింది. తలవంచుకుని, నేలచూపులు చూస్తూ... “అమ్మగారు! పెరట్లో వడియాలు ఆరబెట్టి, వంటగది శుభ్రంగా కడిగి తుడిచి, బట్టలన్నీ సర్దేశాను. స్కూల్ నుండి బాబు రాగానే తాగేందుకు క్యారెట్ జ్యూస్ తీసి ఫ్రిజ్‌లో పెట్టాను. అయ్యగారి కోసం కాకరకాయ జ్యూస్ తీసి టేబుల్‌పై ఉంచాను.

సాయంత్రం వంట చేయడానికి కూరగాయలు కూడా తరిగి పెట్టాను,” అంది. తడి చేతులు చీర చెంగుతో తూడ్చుకుంటూ, “కాస్త బయటకు వెళ్లాల్సిన పని ఉంది. నన్ను వెళ్ళమంటారా!” అని వినయంగా అడగలేక అడిగింది రత్తాలు. అమ్మగారు ఏమంటారో అన్న భయంతో. రత్తాలు అనుకున్నట్లుగానే, బాలామణి నోటి నుండి మాటలు తూటాల్లా దూసుకొచ్చాయి.

“బయట పనులు చూసుకోవడానికి నీ భర్త ఉన్నాడు కదా! తాగి తందనాలు తప్ప, మరో పని చేయలేడా! వారం వారం ఇలా ఏదో ఒకటి చెప్పి, సాయంత్రం వంట చేయడం తప్పించుకుని వెళ్లిపోతున్నావు. ఇలా అయితే ఎలా! అందుబాటులో ఉంటావనే కదా, నిన్ను పనిలో పెట్టుకుంది. నువ్వు చేసే పనులు నేను చేసుకోలేక కాదు!” “చుట్టుపక్కల అందరి ఇళ్లల్లో పని మనుషులను పెట్టుకున్నారు. మా ఇంట్లోనే పనిమనిషి లేదంటే మా మహిళా మండలి సభ్యుల ముందు చులకనైపోతానని నిన్ను పెట్టుకున్నాను. అంతే కానీ, నీ అవసరం అంతగా ఏముంటుంది నాకు? ఏదో చిన్న చిన్న పనులు నాలుగు చేసి, నెల కాగానే జీతం కోసం చేతులు కట్టుకుని నిలబడతావు,” “గట్టిగా నిన్నేమైనా అందామంటే, అయ్యగారు వెంటనే కలుగజేసుకుని ‘పోనీలే మణి, తనకంటూ ఏవో పనులు ఉంటాయి కదా!’ అనేస్తారు.

మాలాంటి వారి దగ్గర పని దొరకడం నీ అదృష్టం. చేజేతులారా దాన్ని దూరం చేసుకోకు,” అంది. “మాకు డబ్బులు పుణ్యానికి ఏమీ రావడం లేదు,” ఇస్తున్న ప్రతి పైసా దయాదాక్షిణ్యాలతో ఇస్తున్నట్లు మాట్లాడుతున్న బాలామణి మాటలు రత్తాలు మనసును సూటిగా తాకాయి. తాగుడికి బానిసై, ఒక్క పైసా కూడా ఇంట్లో ఇవ్వని భర్త వేధింపులు తట్టుకుంటూ, ఇంటిని చక్కదిద్దేందుకు ఎన్ని అవమానాలైనా సహనంతో ఓర్చుకునే మనస్తత్వం మధ్యతరగతి మహిళలకు దేవుడిచ్చిన వరమే. “సరేలే! రమణి వాళ్లింట్లో ఏదో చిన్న పని ఉందంట. ఇంతకుముందే ఫోన్ చేసింది. రత్తాల్ని కాస్త పంపించు, ఒక్కదాన్నే ఇంట్లో సామాను సర్దుకోలేక పోతున్నా అంది. వెళ్తూ వెళ్తూ ఆ పనేదో చూసుకుని వెళ్ళు. నాకు మాట రానివ్వకు,” అనేసి, టీవీలో ఛానల్ మార్చి సీరియల్స్ చూస్తూ ఉండిపోయింది బాలామణి. మారుమాట్లాడే అవకాశం లేక, తలవంచుకుని “అలాగే అమ్మగారు,” అనేసి గుమ్మం దాటింది రత్తాలు. నిండు నెలలతో ఒంటరిగా ఇంట్లోనే ఉన్న తన కూతురిని తల్చుకుంటూ, కన్నీరు తూడ్చుకుంటూ... ఏ క్షణం పురిటి నెప్పులు మొదలవుతాయో! బిడ్డను ఆసుపత్రికి ఎలా తీసుకువెళ్లాలో అనే ఆలోచనల్లో, ఇంట్లో బయట పనులతో సతమతమవుతోంది రత్తాలు. కష్టం విలువ తెలియని మనుషుల మధ్య ఇలా నలిగిపోతున్న రత్తాలు వంటి అభాగ్యులు ఎందరో నేటి సమాజంలో. రమణి ఇంట్లో సామాన్లు సర్దేసి, ఇల్లు చేరుకున్న రత్తాలు కోసం గుమ్మంలోనే నారాయణమ్మ ఎదురుచూస్తుంది. రత్తాలు కాళ్ళూ చేతులూ కడుక్కుని రాగానే, తను చెప్పాలనుకున్న శుభవార్త చల్లగా చెప్పింది నారాయణమ్మ. "సుఖప్రసవంతో పండంటి మగబిడ్డకు నీ కూతురు జన్మనిచ్చింది.

తల్లీబిడ్డా క్షేమమే. ఆ దేవుడు చల్లగా చూసాడు. ఇక దగ్గర ఉండి జాగ్రత్తగా చూసుకో," చెప్పేసి వెళ్ళింది నారాయణమ్మ. రత్తాలు మనసులో సంతోషం పురుడు పోసుకుంది. పదిహేను రోజుల తర్వాత, రత్తాలు పురిటి గుడిసె ముందాగిన కారులో నుండి బాలామణి భర్త నరేంద్ర దిగాడు. రత్తాలు పనికి ఎందుకు రావడం లేదని అడిగేందుకు కాదు. నిన్న రాత్రి రత్తాలు గురించి, ఆమె కష్టాల గురించి, తన కూతురు ప్రసవం గురించి బాలామణితో మాట్లాడాడు నరేంద్ర. బాలామణి మాట్లాడిన కఠినమైన మాటలకు నొచ్చుకుని, నరేంద్ర మానవత్వంతో రత్తాలు బిడ్డను దీవించడానికి, వారికి ఆర్థిక సహాయం అందించడానికి వచ్చాడు. రత్తాలు పడిన కష్టం, అనుభవించిన అవమానం, ఆమె నిజాయితీ నరేంద్రకు తెలుసు. కష్టం విలువ తెలిసిన నరేంద్ర రూపంలో, మానవత్వం కొందరిలో ఇంకా బ్రతికే ఉంది అనడానికి సాక్షి అతడే.

మరిన్ని కథలు

Daivadootha
దైవదూత
- డా:సి.హెచ్.ప్రతాప్
Rakhee
రాఖీ(క్రైమ్ స్టోరీ)
- యు.విజయశేఖర రెడ్డి
Sarpam dustabuddhi
సర్పం దుష్టబుద్ధి!
- - బోగా పురుషోత్తం
Allari bhamatho pelli
అల్లరి భామతో పెళ్ళి
- డా. సి.యస్.జి. కృష్ణమాచార్యులు
Saraina empika
సరైన ఎంపిక
- కందర్ప మూర్తి
Gharana mosam
ఘరానా మోసం
- డా:సి.హెచ్.ప్రతాప్
Tappu telisindi
తప్పు తెలిసింది
- కందర్ప మూర్తి
Aaru chintachetlu
ఆరు చింతచెట్లు
- డా. భీమ మోహన రావు