
అమ్మ కన్నీళ్లు, పూజలు, నోములు... ఆమె ఆశలన్నీ నేను జన్మించేందుకే! కానీ, నా కాళ్లు చలించవు. అమ్మ హృదయం మాత్రం ఆగిపోయేది కాదు. నా నిశ్చల కాళ్లను చూస్తూ కుమిలిపోయేది, "వీడి జీవితం ఏమవుతుందో?" అని తల్లడిల్లేది. కానీ, వెంటనే నా ముఖంలోని తేజస్సును చూసి, "నీవు నా రాజా!" అంటూ ముద్దాడేది. నేనే ఆమె ప్రపంచం. నా చిరునవ్వులోనే ఆమె ఆనందం దాగి ఉండేది.
సమాజం నన్ను "కుంటి రాజా" అని గేలి చేసేది. ఆ హేళనలు, వెక్కిరింతలు, అవమానాలు... అమ్మ గుండెను కోసినా, ఆమె నాకు ధైర్యం నేర్పింది. బయట చిరునవ్వుతో నన్ను గట్టిగా కౌగిలించుకుని, లోపల మాత్రం తన కన్నీటిని దాచుకునేది. "నీవు నడవలేవు, ఆడలేవు అని ఎవరూ అననీ!" అంటూ, నాకు మూడు చక్రాల బండిని తోడు చేసింది. ఆ బండి నా కాళ్లు అయ్యాయి. కానీ, సమాజం నవ్వింది. "ఐదు కాళ్లతో నడిచే వాడు!" అంటూ అవహేళన చేసేవారు. నా చుట్టూ గుమిగూడిన జనం, నా అడుగులను లెక్కపెట్టారు, నా ఆత్మవిశ్వాసాన్ని కాదు. అమ్మ మాత్రం నన్ను ఎప్పుడూ రాజులా చూసింది. రామాయణం, భారతం, భాగవతం చదివిస్తూ, "సర్వం సరిగా ఉన్నవాడు సాధించలేనిది, నీవు సాధించాలి!" అంటూ నాకు లక్ష్యాన్ని చూపింది.
అమ్మ అంటే ఆదిగురువు అని అందుకే అంటారేమో! వయసు మీదపడింది. కుటుంబ భారం నా భుజాలపై పడింది. నేనే ఇంటికి జీవనాధారం కావాల్సి వచ్చింది. చేతి కర్రలను విసిరేసాను. మూడు చక్రాల ఆటో రిక్షా నా కొత్త సహచరి అయింది. చదువును ఇంట్లోనే కొనసాగించాను. నా కుటుంబం పస్తులుండేది, కానీ నా కష్టంతో నాలుగు ముద్దలు తృప్తిగా తిన్నారు. ఒకప్పుడు నవ్విన నోళ్లు, ఇప్పుడు "సహబాస్!" అంటున్నాయి. జీవితం ఒక యుద్ధం. గెలుపు అంత సులువు కాదని నేర్చుకున్నాను. కానీ, ఎక్కడ మొదలైనా, ఎలా మొదలైనా, సరైన మార్గంలో నడిస్తే గెలుపు ముందు నిలుస్తుంది. నా స్వశక్తి, పట్టుదల, ఆత్మాభిమానం ముందు అవమానాలు తలవంచాయి.
ఒకప్పుడు నన్ను చూసి తప్పుకునేవారు, ఇప్పుడు నా మాట కోసం ఎదురుచూస్తున్నారు. నా సాయం కోసం ఆర్తిగా అడుగుతున్నారు. ఇప్పుడు నా అధరాలపై చిరునవ్వు. ఎందుకంటే, నేను ఒక కంపెనీకి CEO! అవిటితనం ఎవరిది? నా కాళ్లదా, లేక నన్ను గేలి చేసిన సమాజానిదా?.