మామిడి కొమ్మమళ్ళీ పూచేనులే - ప్రభావతి పూసపాటి

mamidi komma malli poochenulae

"అబ్బబ్బబ్బా ఫోన్ ని సైలెంట్ లో పెట్టుకొని నీతో తీసుకొని వెళ్ళమంటె వినవు కదా ..ఎవరికైనా అర్జెంటు ఏమో ఇప్పటికి అరగంటలో 6 సార్లు మోగింది...ఎదోకొత్త నెంబర్ అనుకుంట"మేనేజర్ గది నుంచి వచ్చిన సాధన చేతిలో విసురుగా మొబైల్ పెట్టి ప్రాజెక్ట్ ఫైల్ తీసుకొని "ఎవరో ఏమిటో కాల్ చేయి" అంటూ కన్ను గీటి "లంచ్ కి కాంటీన్లో కలుద్దాము"అంటూ కేబిన్ నుంచి వడివడిగా వెళ్ళింది నేను US వచ్చి నప్పటి నుంచి కోలీగు, ఫ్రెండ్ అన్ని తానే అయిన సుమతి .

" నీ నెంబర్ ఇచ్చాను ఎప్పుడైనా కాల్ చేయవచ్చు.ఒక్కసారి మాట్లాడి చూడమ్మా!" పొద్దున్న ఆఫీస్ కి వచ్చే ముందు నాన్న ఫోన్ లో పదిసార్లు బ్రతిమాలుతున్నట్టు చెప్పిన విషయం గుర్తువచ్చికంప్యూటర్ మూసి "హలో మీ నుండి కాల్ వచ్చింది ,మీరు .... "సాధనగారేనా నేను కిరీటి" మాటకి అడ్డువస్తు ఫోన్ కాల్ కోసమే ఎదురు చూస్తున్నవాడిలా గొంతులో ఆత్రం స్పష్టం గాఁ వినపడింది.

కిరీటి, ఆ పేరు దాదాపు పుష్కర కాలం తర్వాత వినపడింది. .అప్పట్లో నన్ను ఇతని కి ఇచ్చి పెళ్లి చెయ్యాలని అనుకొన్నారు.ఇన్నాళ్ళకి ఇలా ఫోన్ లో.. ఎందుకు కాల్ చేస్తున్నాడు "హలో,హలో సాధనగారు లైన్ లో వున్నారా ..నా వాయిస్ రీచ్ అవుతోందా,అంకుల్ మీ నెంబర్ ఇచ్చారు .

నేను ఇక్కడి కి మార్నింగ్ ఫ్లైట్ లో వచ్చాను ,మీతో ఫోన్ లో కన్నా పర్సనల్ గాఁ మాట్లాడాలని మీ ఏరియా కి వచ్చాను మీకువీలు వుంటె ఈవెనింగ్ కలుద్దాము " ఒక్క క్షణం ఊపిరి తీయకుండ మాట్లాడేస్తున్నాడు.

"హలో మిస్.సాధన ఏమిటి మాట్లాడటం లేదు ..ఏమైనా.." కొంత గ్యాప్ ఇచ్చి అడిగాడు, "అలా ఏమి లేదు ఈవెనింగ్ అంటె ...ఎర్లీ గాఁ ఇంటికి వెళ్ళాలి మీరు మా ఆఫీస్ కి రాగలిగితె నేను పర్మిషన్ తీసుకొని వస్తాను "సాధన మాట పూర్తికాకుండానే "సరే సరే ఐ విష్ టు డూ యిట్" అర గంట లో తప్పక కలుస్తాను వెయిట్ నియర్ లాబీ "అంటూ

కంగారుగా ఫోన్ పెట్టేసాడు.

" ఎవరే ఈ ఫోన్ ఫ్రెండ్?" లంచ్ బాక్స్ తీస్తూ అడిగింది సుమతి."కిరీటి అని మా దూరపు బంధువు.నాన్న పొద్దున్న చెప్పారే ఫోన్ చేస్తాడు అని కానీ ఈ రోజే వస్తుంది అని అనుకోలేదు.కలవడానికి వస్తున్నాడు ,నాకు పూర్తి క్లారిటీ లేదు,అతనిని కలిసాక రాత్రి చెపుతానులే . మేనేజర్ కి మెసేజ్ పెట్టి వచ్చా... ఇంటికి వెళుతూ శుభని పికప్ చేసుకో, "డ్రెస్,హెయిర్ సరిచేసుకొంటూ లాబీ వైపు వెళ్ళింది.

కాఫీ ఆర్డర్ చేసి కూర్చుంది గానీ మనసు మాత్రం గతం లో కి పరుగులు తీసింది .డిగ్రీ పూర్తి చేసి ఎండా కాలం సెలవులకి అమ్మమ్మ వాళ్ళ వూరు వెళ్ళింది ,అమ్మమ్మ చుట్టాలలో కిరీటి తాతగారు నన్ను చూసి ముచ్చట పడి లండన్ లో చదువుకొంటున్న వాళ్ళ మనవడికి నన్ను చేసుకోంటె బాగుంటుంది అనుకోని సెలవులకి ఇంటికి వస్తున్నాడు అని ఉన్నపళంగా పెళ్లిచూపులు ఏర్పాటు చేసేసారు .కిరీటి చూడటమే తరువాయి పెళ్లి వెంటనే జరిగిపోతుందని అందరు అనుకొన్నారు.తీరా పెళ్లిచూపులు రోజున కిరీటి రాలేదు. వాళ్ళ పెద్దవాళ్ళు వచ్చి అతనికిరావటం వీలు పడలేదుట అని కబురు తో పాటు మన్నించమని అడిగారు. అది తప్పు పట్టేంత పెద్ద విషయం కాదు అని దాదాపు అందరం ఆ విషయం మరిచిపోయాము.

తర్వాత మోహన్ తో పెళ్లి,శుభ పుట్టడం ,అకస్మాత్తుగా మోహన్ మరణం ,వాతావరణం మారితే మనసు కుదుట పడుతుందని నేను US వచ్చేయడం అన్ని ఒక కలలా జరిగి పోయాయి.కొన్ని రోజులుగా అమ్మ నాన్న నన్ను మళ్ళీ పెళ్లి చేసుకోమని వత్తిడి చేస్తున్నారు. దాదాపు పెన్నెండు ఏళ్ళ క్రితంఎప్పుడో మొదటిసారి పెళ్ళిచూపులన్నప్పుడు విన్న పేరు మళ్ళీ ఇన్నాళ్ళకి ఇప్పుడు అతని పేరు వినడం.. "సారీ చాలాసేపు వెయిట్ చేయించాన?" అన్న మాటతో తేరుకున్న సాధన తన ఎదురుగ వున్న ఆరడుగుల అందగాడిని చూసి దాదాపు తూలినట్టు అయ్యింది.

తేరుకొని" అదేమీ లేదు మిమ్మలిని ఇక్కడ ఇలా సడన్ గాఁ కలుస్తానని ఎక్సపెక్ట్ చెయ్యలేదు" కూర్చోమని సోఫా చూపిస్తూ అంది.

"ఇక్కడికన్నా పక్కనే వున్న కాఫీ షాప్ కి వెళదాము" చాల పరిచయము వున్నవాడిలా చనువుగా టేబుల్ పైన వున్న బాగ్ ,కార్ కీస్ తీసుకొని "నేను డ్రైవ్ చేస్తాను పదండి" .అంటూ పార్కింగ్ వైపు వెళ్ళాడు.

"ముందుగా మీరు నన్ను క్షమించాను అంటెనే నేను ఫ్రీ గాఁ మీతో మాట్లాడ గలుగుతాను ,ప్లీజ్ అంటూ కుర్చీ జరిపి కూర్చోమని సౌజ్ఞ చేస్తూ...

" మీతో పరిచయమే లేదు క్షమాపణ ఎందుకా అని కదా చూస్తున్నారు" ఎదురుగ కూర్చుంటూ అడిగాడు."నేను మీకు తెలియదు కానీ మీరు నాకు దాదాపు గాఁ పన్నెండు ఏళ్ళ నుంచి తెలుసు .అప్పటి నుంచి మిమ్మలిని కలిసి నా మనసులోని మాట మీకు చెప్పాలని ఎదురు చూస్తున్నాను ఇదిగో ఇలా ఇన్నాళ్ళకి మిమ్మలిని కలిసే భాగ్యం కలిగింది.పెద్ద రిలీఫ్ ల అనిపించి కొంచెం వెనక్కి వాలి రిలాక్స్ గాఁ కూర్చున్నాడు.

సాధన గారు మా తాతగారు నన్ను అడగకుండా నేను సెలవులకి ఊరు వస్తాను అనుకోని మీ నాన్నగారికి మాట ఇచ్చారు కానీ నేను ఆ సెలవులకి ఫ్రెండ్స్ తో కలిసి పారిస్ వెళ్ళాను .తీరా విషయం తెలిసి మీ ఇంటికి వచ్చి మీకు చెపుదామనే లోపే మీ పెళ్లివార్త మా ఇంటికి వచ్చింది.దూరం నుంచి మిమ్మలిని ఆశీర్వదించి వెళ్ళిపోయాను.

"మరి నేను ఇక్కడ వున్న విషయం మీకు ఎలా తెలిసింది ?" కొంచెం తేరుకొని అడిగింది

" ఓ అదా!మన చుట్టరికాల వలన మీ విషయాలు మాకు తెలుస్తూనే వున్నాయి.లండన్ నుంచి ఆఫీస్ పని మీద ఇండియా కి వచ్చిన నాకు మోహన్ గారి మరణ వార్త తెలిసింది. ..నాకు తెలియకుండానే మీ పట్ల నేను ఎదో తప్పు చేశాను అన్న భావం నన్ను వెంటాడుతూనే వుంది .అమ్మ నాన్న నా పెళ్లి గురించి పోరు పెడుతున్న నాకు ఎవ్వరిని కలవాలని అనిపించ లేదు.మీరు పాపతో ఇక్కడికి వచ్చేశారని తెలిసి నేను కూడా ఇక్కడికి వచ్చేసాను.అప్పటి నుంచి మిమ్మలిని పాపని మనసులోనే ఆరాధిస్తూ ...కొంచెం ముందుకు జరిగి టేబుల్ పై వున్న సాధన చేతులు పట్టుకొని "మీరు అంగీకరిస్తే మీతో కలిసి జీవితం"మాటలు పూర్తి కాకుండానే చేతులు వదిలించుకొని లేచి "నన్ను మన్నించండి Mr కిరీటి ,మోహన్ గారితో నా జీవనయానం కొంత కాలమే ఐన మధురమైనది. ఇప్పుడు నేను, నా పాప శుభ తప్ప ఇంకెవ్వరికి మా జీవితంలో స్థానం లేదు."

" సాధన ప్లీజ్ రిలాక్స్" అంటూ లేచి భుజాలు పట్టుకొని కుర్చీలో కూర్చోపెట్టి “ఇది ఆవేశం లో తీసుకొన్న నిర్ణయం కాదు ,మీరంటె జాలితో చూపిస్తున్న భావం కూడా కాదు, ఇది మీ ఒక్కరి జీవితమే కాదు ,మీ పాప జీవితం కూడా ,మీరంటె కొద్దోగొప్పో మోహన్ గారి ప్రేమ, అభిమానం రుచి చూసారు ,కానీ అసలు తండ్రి మొహమే తెలియని పాప ఎందుకు జీవితాంతం తండ్రి ప్రేమ లేకుండా పెరగాలి?ఆలోచించండి."

మా సంగతి సరే ,ఎప్పుడో పన్నెండు ఏళ్ళ క్రితం తెలియక ఒక్క సారి పెళ్లిచూపులు మీవల్ల జరగలేదని మీరెందుకు మా భాద్యత తీసుకోవాలి అని అనుకొంటున్నారు?" సూటిగా కళ్ళల్లోకి చూస్తూ అడిగింది సాధన.

"మీరు నన్ను చూడనందుకు మీరు మనస్ఫూర్తిగామోహన్ గారిని పెళ్లి చేసుకొన్నారు,కానీ ఫోటో లో మిమ్మలిని చూసి , తాతగారి మాటల్లో మిమ్మలిని మనసులోనే ఊహించుకొని మీ మీద ఎంతో ప్రేమ తో మిమ్మలిని చేసుకోవాలని ఆశతో మీ ఇంటికి వచ్చాను .అప్పటికే మీ పెళ్లి మోహన్ గారితో అయిపోయింది.మనసు కుదుట పరచుకొని వెళ్ళిపోయాను,బహుశా మీ పాపకి తండ్రిగా నా ప్రేమ రాసివుండను కొంటాను ,మోహన్ గారు ఆ లోటు నన్ను తీర్చమని నాకు ఆ స్థానం వదిలేసి వెళ్లిపోయారు."మనసు భారమై మాటలు రానట్టు గొంతు తడబడింది.

" నాకు తెలిసినంత వరకు ప్రేమ అనేది ఒక స్వచ్ఛమైన భావం అది ఎదుటివారి తో వున్న బంధాన్ని బట్టి వ్యక్తపరిచే తీరు మారుతుంది అంతె.మిమ్మలిని మొదటిసారి ఫోటో లో చూసిన భావం ప్రేమ కి పర్యాయ పదం ఐతె నేను అప్పటి నుంచి ప్రేమిస్తూనే వున్నాను,మోహన్ గారి భార్యగా మిమ్మలిని స్నేహితురాలిగా అభిమానించాను ,ఇప్పుడు కూడా పదం మారుతుంది తప్ప భావం కాదు,అదేవిధం గాఁ పాప పట్ల నేను చూపేది ప్రేమ మీరు అంగీకరిస్తే తండ్రి ప్రేమగా పిలవబడుతుంది తప్ప నాకు వున్న భావం మారదు."ఎక్కడ మనసులోని భావాలు సరిగా అభివ్యక్తం అవుతాయో లేదో అన్న కంగారులో గబగబా చెప్పేసాడు.

ఒంటరితనం తో భాదపడుతున్ననన్ను ఓదార్చటానికి మోహనే కిరిటీగా వచ్చాడా అన్న ఎదో తెలియని భావం మనసు మొత్తం నిండి పొగా మాట్లాడలేని దానిలా బేలగా కిరీటిని చూస్తూ ఉండిపోయింది.

నాకు తెలుసు సాధన ..నేను చెప్పినంత తేలిక కాదు ,నీ అభిప్రాయం ఏదయినా నేను అంగీకరిస్తాను, మీ నాన్నగారికి నా మనసులోని మాట తెలిపి అయన అంగీకారం తీసుకొని వచ్చాను,నువ్వు కూడా మన ముగ్గురి గురించి అలోచించి నీ మనసుకి ఏది సరి ఐన నిర్ణయం అనిపిస్తేఅది తీసుకో, నీ నిర్ణయం ఏదైనా నీ మీద పాప మీద నాకు కలిగిన ప్రేమ లో మార్పు ఉండదు"గొంతు లో భావం దృఢం గ వినపడేలా చెప్తూ " పద నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను"అని కార్ పార్కింగ్ వైపు వెళ్ళాడు .

హలో హలో రింగ్ టోన్ తో వాస్తవం లోకి వచ్చి ఫోన్ తీయగానే "అమ్మ!కిరీటి కలిశాడా ,తన మనసులోని మాట నీకు అంగీకారమే కదా ..నువ్వు అంగీకరిస్తే మాతో పాటు పైన ఉన్న మోహన్ ఆత్మా కూడా సంతృప్తి పడుతుందని మా నమ్మకం .ఏమంటావు తల్లి?” అమ్మ ,నాన్న గొంతులో ఆత్రం వినపడుతోంది.

“శుభ కి తండ్రి లేని లోటు ఇప్పుడిప్పుడే తెలుస్తోంది , ముందు మానసికంగా తనని ప్రిపేర్ చెయ్యాలి... నాకు కొంచెం సమయం కావాలి నాన్న,” అమ్మ నా మాటలకు అడ్డువస్తు

"పసిమనసు కాబట్టి శుభ తేలికగానే కిరీటి ప్రేమ నిచూరగొంటుంది నాకు కిరీటి ని చూసాక ఆ నమ్మకం కలిగింది" గబగబా చెప్పేస్తోంది.

" నువ్వు చెప్పే కమ్మని కబురు కోసం ఎదురు చూస్తూ ఉంటాము తల్లి !భగవంతుడు తాను చేసిన పొరపాటు సరిదిద్దడానికి, నీ బంగారు భవిష్యతు ఆనంద మయం చేయడానికి కిరీటి రూపం లో మళ్ళీ నీ జీవితం లోఅడుగు పెడుతున్నాడేమో అమ్మ "గొంతు భారం అవుతుండగా ఫోన్ డిసకనెక్ట్ అయ్యింది.

"పాపపేరు శుభ అని తెలిసింది ,కొన్ని రోజులు తనతో కూడా గడపాలని వుంది "కార్ డోర్ తీసి సాధన తలకి తగలకుండా చెయ్యి అడ్డు పెడుతూ అడిగాడు" నాకు మీ ఇద్దరి ఆప్యాయత సమానంగా కావాలి సుమ "స్టీరింగ్ అలవోకగా తిప్పుతూ చెప్పాడు.FM లో మామిడి కొమ్మమళ్ళీ మళ్ళీ పూచేనులే పాట వింటూ సాధన తనకు తెలియకుండానే నాకు సమ్మతమే అన్నట్టు కిరీటి దగ్గరగా జరిగి తలని అతని భుజం పై వాల్చింది. కిరీటిమనసు తో పాటుగా నేను తక్కువ అన్నట్టు కారు కూడా వేగం గా పరుగులు తీసింది .

మరిన్ని కథలు

Avititanam evariki?
అవిటితనం ఎవరికి?
- రాము కోలా.దెందుకూరు
Kannappa
కన్నప్ప
- పుల్లేటికుర్తి కృష్ణ మోహన్
Maya pesarapappu vadalu
మాయా పెసరపప్పు వడలు
- హేమావతి బొబ్బు
The roadless travelled
ది రోడ్ లెస్ ట్రావెల్డ్
- రాపాక కామేశ్వర రావు
Veyyi roopayala jaree cheera
వెయ్యి రూపాయిల జరీ చీర
- పూర్ణిమ పెమ్మరాజు
Peddarikam
పెద్దరికం
- Prabhavathi pusapati