తప్పిన ముప్పు - కాశీ విశ్వనాథం పట్రాయుడు

Tappina muppu

చలికాలం కావడంతో మంచు దట్టంగా కురుస్తోంది. కలుగులోంచి చిట్టెలుక, చిన్నెలుక బయటకి వచ్చాయి. “బారెడు పొద్దెక్కినా ఎవరి అలికిడి లేదు” అనుకుంటూ అటు ఇటూ తిరిగి చూసాయి. పెరటి గుమ్మంలో ఓ మూల పనికిరాని సామాన్లు, కాగితాలు ఉన్నాయి. వాటి మధ్యలో చిరిగిన ఊలు బనీను చుట్టుకుని గుర్రుపెట్టి నిద్రపోతోంది తెల్లపిల్లి. చిన్నెలుక, చిట్టెలుక తెల్లపిల్లి దగ్గరికి వెళ్ళాయి. “మిత్రమా మిత్రమా” అని గట్టిగా పిలిచింది చిట్టెలుక, అయినా తెల్లపిల్లి ఉలుకులేదు, పలుకులేదు. “దీని సంగతి నేను చూస్తా” అంటూ ఊలు దారాన్ని నోటితో కొరికి ఆ దారప్పోగును పిల్లి ముక్కులో పెట్టింది చిట్టెలుక. ఇంకేముంది “హ్యాచ్చి” అని గట్టిగా తుమ్మి, ముక్కు తుడుచుకుని మళ్ళీ ముడుచుకుని పడుక్కుంది. మళ్ళీ చిన్నెలుక పిల్లి ముక్కులో దారప్పోగును పెట్టింది. పిల్లి మళ్లీ తుమ్మింది. ఇలా నాలుగైదు సార్లు తుమ్మాక కళ్ళు విప్పి చూసింది తెల్లపిల్లి. “అబ్బా బంగారం లాంటి నిద్ర పాడుచేశారు. వాతావరణం ఇలా ఉన్నప్పుడు బాగా నిద్రపడుతుంది” అంది తెల్ల పిల్లి. “అది సరే కానీ నల్లపిల్లి ఎక్కడా కనిపించలేదు. వరహాలు శెట్టి కూడా కనపడలేదు” అని చిట్టెలుక అడిగింది. “వరహాలుశెట్టి ఊరెళ్ళాడు. నల్ల పిల్లి ఎటో వెళ్ళిపోయింది” అని జవాబిచ్చింది తెల్లపిల్లి ఆవలిస్తూ. “ఏమీ తినకుండా పడుక్కుంటే ఆకలితో చచ్చిపోతావ్ పక్కింటికి వెళ్దాం పద” అంది చిట్టెలుక. అదే సమయంలో చడీచప్పుడూ లేకుండా ఎలుకల్ని తినడానికి వచ్చింది ఒక పాము. అది గమనించిన పిల్లి ఒక్క ఉదుటన లేచి పరిగెత్తి పాము తోక పట్టుకుని లాగింది. “అయ్యబాబోయ్ ప్రమాదం తృటిలో తప్పింది. మిత్రుడు కాపాడకపోతే మనం పాముకు ఆహారం అయ్యేవాళ్ళం” అనుకుంటూ ఓ మూలన చేరి పిల్లి, పాముల పోరాటాన్ని చూస్తున్నాయి చిన్నెలుక, చిట్టెలుక. పాము బుసకొడుతూ పిల్లిని కాటెయ్యాలని ఎంతగానో ప్రయత్నిస్తోంది. పిల్లి లిప్తపాటులో తప్పించుకుంటోంది. పాము కాటునుంచి తప్పించుకుంటూ, దాని తోకపట్టుకు లాగుతూ, కరుస్తూ మూడు చెరువుల నీళ్లు తాగించింది. పిల్లి బాధ పడలేక దగ్గరలో ఉన్న కన్నంలోకి దూరబోయింది పాము. అది గమనించిన పిల్లి చటుక్కున తోకపట్టుకుని బయటకు లాగింది, గట్టిగా పంజాతో తలపై కొట్టింది. ఆ దెబ్బకు విలవిల్లాడుతూ ప్రాణాలు విడిచింది పాము. “మిత్రమా ప్రాణాలకు తెగించి పోరాడావు. నిన్ను ఎంతగానో ఏడిపించాను అయినా అవేవీ మనసులో పెట్టుకోకుండా మమ్మల్ని కాపాడావు. నీ వంటి మిత్రుడు ఉండడం మాకు అదృష్టం” అంది చిట్టెలుక. “ఆపదలో కాపాడేవాడే అసలైన స్నేహితుడు. కబుర్లతో కన్నీళ్లు తుడిస్తే కష్టం తీరదుగదా! అనుకుంటాం, ఆడుకుంటాం అన్నీ పట్టించుకుంటే ఎలా” అని చెప్పి ఊలు బనీను చుట్టుకుని మళ్ళీ నిద్రకుపక్రమించింది తెల్లపిల్లి. “ఇది మారదు…పద మనం శెట్టి ఇంట్లోకి వెళ్ళి కడుపునిండా శెనక్కాయలు తిని వద్దాం” అని వరహాలు శెట్టి ఇంట్లోకి వెళ్ళిపోయాయి చిట్టెలుక, చిన్నెలుక.

మరిన్ని కథలు

Daya
దయ
- సి.హెచ్.ప్రతాప్
kanuvippu
కనువిప్పు!
- బోగా పురుషోత్తం
Korukunna mogudu
కోరుకున్న మొగుడు
- కొడాలి సీతారామా రావు
Inquiry
ఇంక్వైరీ
- DR BOKKA SRINIVASA RAO
Telisivachhina tappu
తెలిసివచ్చిన తప్పు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు