
రామనాధానికి నగరంలో చాలా వ్యాపారాలున్నాయి. వాటివలన మంచి లాభాలు గడిస్తున్నాడు. దూరప్రాంతాలలో ఉన్న వ్యాపారాలకు నమ్మకస్తులైన వారిని నియమించి, వారి పర్యవేక్షణలో వ్యాపారాలను నిర్వహించేవాడు.
రామనాధంకి ఒక కొడుకు ఉన్నాడు. అతడి పేరు విశ్వనాధం. అతడు ఈ మధ్యనే విద్య పూర్తి చేసుకుని వచ్చాడు. కొడుకుని ‘ఇంకేమైనా చదవాల్సింది ఉందా?’ అని అడిగాడు రామనాధం. ‘చదువు పూర్తయ్యిందని, అక్కడే ఉంటూ వ్యాపారంలో మెళకువలు నేర్చుకుని వ్యాపారంలోనే స్థిరపడతానని’ చెప్పాడు విశ్వనాధం.
కొడుకు మాటలకు సంతోషించిన రామనాధం “సరే. నీకు నచ్చినట్టే చెయ్యు’ అని బదులిచ్చి “మన వ్యాపారం ఎలా జరుగుతుందో తెలుసుకోవాల్సిన బాధ్యత, అవసరం ఇప్పుడు నీ మీద ఉన్నాయి. చాలా వ్యాపారులు అధికారుల పర్యవేక్షణలో నడుస్తున్నాయి. అలాంటి చోట్లకి వెళ్లి విషయాలను గమనించు. నువ్వు ఈ రోజు నూనె మిల్లుకు వెళ్ళు” అని చెప్పాడు.
విశ్వనాధం అలాగే చేసాడు. రెండోరోజు ధాన్యం మిల్లుకు, మూడోరోజున బెల్లం తయారీ కేంద్రానికి, నాలుగవరోజున నూలు మిల్లుకు వెళ్ళమన్నాడు కొడుకుని. నాలుగు రోజుల తరువాత కొడుకుని పిలిచి “గత నాలుగు రోజుల్లో నువ్వేమి గమనించావో చెప్పు” అన్నాడు రామనాధం.
“పనివాళ్ళకి స్వేచ్ఛ ఎక్కువైంది. అక్కడక్కడా కొన్ని లోపాలు కనిపించాయి. అలాంటివి మనం ఏ మాత్రం సహించకూడదు. నేనైతే వారి విషయంలో కఠినంగా వ్యవహరిస్తాను” అన్నాడు విశ్వనాధం. అవేమిటో చెప్పమన్నాడు రామనాధం.
‘కొందరు పనివాళ్ళు పని సమయంలోనే విశ్రాంతి తీసుకుంటూ కనబడ్డారు. అక్కడి అధికారులు వారిని భరిస్తున్నారు. ఆడవాళ్లయితే పిల్లలను మిల్లుకే తెచ్చి ఉయ్యాల కట్టి ఆడిస్తున్నారు. మరికొందరైతే సరుకులు కొనాలనో, సొంత పని చూసుకుని వస్తామనో మధ్యలో బయటకు వెళ్ళిపోతున్నారు. గరిసెల కొద్దీ ధాన్యం బయట ఆరబోసినా వర్షం వస్తుందని బెరుకు లేకుండా నిర్లక్ష్యంగా ఇంకొందరు గడిపారు. చెరకు మిల్లులో కూడా చాలా సరకులు వృధాగా పారబోశారు. ఇలా చాలానే కనిపించాయి” అన్నాడు విశ్వనాధం.
“ అంతేనా?” అన్నాడు రామనాధం తేలిగ్గా.
“అదేంటి నాన్నా.. అలాగయితే మనకు నష్టం రాదా?” అనడిగాడు విశ్వనాధం చిరాకుగా ముఖం పెట్టి.
రామనాధం నవ్వి “కొన్ని చూసీ చూడనట్లు వదిలెయ్యాలి. పనివాళ్ళకీ కుటుంబం, ఒత్తిడి, బాధలు, అవసరాలు ఉంటాయి. కూలికి రాకపోతే తిండి గడవదని, ఇక్కడకు వచ్చాక కొన్ని పనులు చూసుకుంటారు. విశ్రాంతి తీసుకుంటూ కనిపించిన వాళ్ళంతా శ్రామిక సంఘ నాయకులు. ఉద్యోగుల శ్రేయస్సు కోసం శ్రమించే వారికి ఆమాత్రం వెసులుబాటు ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాళ్లతో తగువు తెచ్చుకోవడం మంచిది కాదు. కొన్ని సరకులు వృధా జరగడమన్నది అన్ని పని ప్రదేశాల్లో జరుగుతుంది. ఇన్నేళ్లూ మన వ్యాపారాలు లాభాలను గడించాయంటే ఆ ఉద్యోగుల వల్లనేనని మనం గుర్తుంచుకోవాలి. ఇంకో ముఖ్య విషయం.. నువ్వు యజమానివైతే కొన్ని సందర్భాలలో చూడనట్లు నటించాలి. సేవకుడైతే చెవిటివానిలా నటించి సందర్భానుసారం ప్రవర్తించాలి. అన్ని వేళలా కరకుదనం పనికిరాదు. లౌక్యం పాటించడం అవసరం” అన్నాడు.
విశ్వనాధానికి విషయం బోధపడింది. తండ్రి తరువాత అతని లాగానే వ్యాపారాలను లాభాల బాటలో నడిపించాడు.
---***---