తంతు - Prabhavathi pusapati

Thantu

"పూజా కార్యక్రమాల మొదలు అవుతున్నాయి, భక్తులు అందరూ పందిరి వద్దకి రావలసింది" మైక్ లో అనౌన్సమెంట్ బిగ్గరగా వినబడుతోంది. గణపతి నవరాత్రుల సందర్భంగా కాలనీలో సంబరాలు చేస్తున్నారు. ఊరికి కొంచం దూరంగా కొత్తగా వెలసిన కాలనీ . రోడ్డుకి ఇరుపక్కలా అందంగా తీర్చిదిద్దిన చెట్లతో శోభాయమానంగా ఉంది.ఇక్కడ దాదాపు ఓ వేయి కుటుంబాలు ఉంటాయి కాబోలు.మేము కొత్తగా ఇల్లు కొనుక్కుని ఇక్కడకి వచ్చాము. అబ్బాయి,కోడలు, తమతో మనమలతో మేము కూడా వాళ్ళతోనే ఉండాలని పట్టుబట్టి తీసుకు వచ్చారు. మా శేష జీవితం వాళ్ళతో ప్రశాంతంగా గడపాలని వచ్చాము. పిల్లలూ,పెద్దలూ,ఆడవాళ్ళు ఒక్కొక్కరుగా నెమ్మదిగా పందిరి చేరుతున్నారు. మా వారు దూరంగా ఆడుకుంటున్న మనవళ్ళని చూస్తూ కాలనీ ప్రేసిడెంట్ తో మాట్లాడుతున్నారు. నేను కొంచెం అందరితో పరిచయం చేసుకుందామని ఆడవాళ్ళ కుర్చీల వైపు వచ్చి కూర్చున్నాను.

ఒకే గూటి పక్షులు అన్నీ ఒక దగ్గరికే చేరినట్లు వచ్చిన ఆడవారు జట్లుగా కూర్చుంటున్నారు. నెమ్మదిగా కుర్చీలు నిండుతున్నాయి. ఇదివరకు ఒకరి ఇంటికి ఒకరు వెళ్ళి కబుర్లు చెప్పుకునేవారు. ఇప్పుడు ఇలాంటి సందర్భాలలో తప్ప ఒకరిని ఒకరు కలుసుకునే వీలు లేదు. పందిరిలోనే పలకరింపులు, కబుర్లు చెప్పు కుంటున్నారు. " మా వాడు మొబైల్ చేతిలో ఉంటే గానీ అన్నం తినడు " ఓ చిన్నాడి తల్లి బాధ." మా చిన్నది కార్టూన్ వాళ్ళలాగే మాట్లాడుతోంది" ఇంకో తల్లి చెబుతోంది. " మా వాడు పాటలు వింటానని మారాం చేస్తూ ఉంటాడు"...ఇవి పిల్లల తల్లుల ఆవేదన. మరో పక్క " అలా వీడియో చాట్స చెయ్యొద్దని ఎన్ని సార్లు చెప్పినా వినడు". మగపిల్లల బైక్స ఎక్కి తిరగకు అంటే, ఇంకా ఆడమగ ఏమిటమ్మా....మా అమ్మాయి జవాబు. బొట్టు పెట్టుకోవే అంటే ఫాషన్ అంటుంది. జుట్టు విరబోసుకోకే అంటే నీకు ఛాదస్తం అంటోంది" మధ్య వయస్సుల అమ్మలలా ఉన్నారు, వీళ్ళదో వేదన. కాలనీ ప్రేసిడెంట్ వాళ్ళ అమ్మలా ఉంది,కొంచెం పెద్ద అంచున్న జరీ చీర కట్టుకొని వచ్చింది. ఆవిడవైపు చూస్తూ " మొన్ననే అమెరికా నుంచి వచ్చింది.కిందటి సారి ఎన్ని గొప్పలు పోయింది. ఇప్పుడు ఆవిడ చిన్న కోడలు మళ్ళీ రావద్దని చెప్పిందిట. ఆవిడ పెద్ద కోడలికి చెబుతుంటే మా పని అమ్మాయి విందిట" రెండు వరసల వెనుక ఉన్న గళ్ళ చీర ఆవిడ గొంతు తగ్గించి చెబుతోంది. " మరే ఏమి అమెరికానో ఏమిటో.కొన్నేళ్ల వరకూ అక్కడకి వెళ్ళటమే గొప్ప అన్నవారు ఇప్పుడు అమ్మో అమెరికానా మా కొద్దు ఆ జైలు జీవితం అంటున్నారు. అంతేనా వదినా అక్కడ ఉన్నవాళ్ళకి ఒకటే చాకిరి అనుకో. 24 గంటలు ప్రయాణం చెయ్యలేక కూడా మానుకుంటున్నారులే" పక్కన ఉన్న ఆవిడ వంత పాడింది. " మొన్న పెళ్ళి చూపులకి వెళ్ళారు,సంబంధం కుదిరిందా? కమిటీ ప్రెసిడెంట్ లా ఉంది, మెళ్ళో వేసుకున్న కాసులపేరు సరిచేసు కొంటూ అడిగింది నా పక్కన కూర్చున్న పెద్దావిడిని. " కలికాలం వచ్చింది కదా! ఎక్కడైనా ఆడపిల్లలు ఆడపిల్లల్లా ఉన్నారా? వాళ్ళు వాళ్ళ గొంతెమ్మ కోరికలు....వాళ్ళ అమ్మలు కూడా అలాగే ఉన్నారు " అక్కసుతో అంది.నిజమే మా వాడికి 34 ఏళ్లు దాటుతున్నాయి, ఎప్పటికి పెళ్ళి అవుతుందో, అసలు అవుతుందో లేదో " అంటూ మరో ఆవిడ వాపోయింది. ఈ మాటలు వింటున్న నాకు నిజంగానే బాధ వేసింది.

చిన్న పిల్లల దగ్గర నుంచీ పెళ్ళి అవ్వాల్సిన వయసు వారి వరకూ, ప్రతి కుటుంబం ఏదో ఒక కష్టంలో ఉందేమిటి? కొన్ని టెక్నాలజీ పేరుతో మనం తెచ్చుకొన్నవి. కొన్ని సమాజంలో వస్తున్న మార్పు వల్ల కలుగుతున్నవి. " నిజం పలికావు తల్లీ! కైలాసం నుంచి కిందకి వచ్చినప్పటి నుంచీ, ఇదిగో ఈ పందిరిలో నన్ను కూర్చో పెట్టి నప్పటి నుంచీ, ఇలాంటి కష్టాలే చెప్పుకుంటున్నారు. అసలు ఒకరైనా సంతోషంగా ఉన్నారా లేదా అందరూ ఇలాగే బాధల్లో ఉన్నారా? ఎవరైనా ఒకరైనా భక్తి భావంతో ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్నాను " మండపంలో ఉన్న స్వామి గొంతు దీనంగా వినిపించి నట్లు అయ్యింది. "అందుకే కదా స్వామీ గణపతి ఉత్సవాలు ఇంత శ్రద్దగా చేసేది.మా కష్టాలు తీర్చ వలసినది మీరే కదా. ప్రతీ పండగ రోజున ఇంత పెద్ద ఎత్తున మిమ్మల్ని పూజించి ప్రార్ధిస్తున్నది."."ఆగు ఆగు, ఏది ఏది మళ్ళీ చెప్పు,పూజిస్తున్నారు అని. ఎక్కడైనా భక్తి,శ్రద్ద కనిపిస్తోందా? పూజట,పూజ! ఆ సినిమా పాటలు ఏమిటి? ఆ DJ తో డాన్సు లేమికి? ఆ ఫాషన్ షోలా ఆ మేకప్పులు, ఆ బట్టలు ఏమిటి? నా మాటకి అడ్డు వస్తూ అడిగారు స్వామి. " కాలంతో బాటు కొన్ని మారుతాయి కదా స్వామి.మీకు తెలియదా,చూస్తున్నారుగా ఇన్ని ఇబ్బందుల్లో ఉన్నా కూడా,ప్రతి ఏడాది మీ పండగ ఎంత ఉత్సాహంతో చేస్తున్నారో. చిన్న పిల్లల నుంచీ పెద్ద వారి వరకూ నువ్వు వస్తున్నావని ఆనందంతో చందాల వసూళ్ల నుంచీ నిమజ్జనం వరకూ,ప్రసాద వితరణ నుండీ నిత్యాన్న దానాల వరకూ,ఎంత శ్రమ అనిపించినా, మీ అనుగ్రహం పొందటానికే కదా స్వామీ. కొంచెం మీరు కూడా కనికరించి మా ఈ కష్టాలు గట్టు ఎక్కేలా చెయ్యండి స్వామీ" దీనంగా అడిగాను. " నేను చెప్పేది కూడా అదేనమ్మా! సాంప్రదాయం అనుసరించి చేస్తున్న అన్నదాన కార్యక్రమాలు, అలాగే లడ్డూ వేలంలో పలికిన పెద్ద మొత్తం సమాజ సేవకి ఉపయోగ పడితేనే కదా సంతోషించేది. అంతెందుకు ఒంటరి కాపురాలు విరివిగా ఉన్న ఈ రోజుల్లో కూడా కొన్ని పందిళ్ళలో నాతో బాటు ఆదిదంపతులై మాకు అమ్మనాన్నలైన శివపార్వతులనీ,తమ్ముడైన సుబ్రహ్మణ్యంతో సహా మొత్తం మా పరివారాన్ని కొలవడం ఆనంద దాయకమే కదా తల్లీ! పెద్దాయన చాగంటి వారు చెప్పనట్టు మనసు పెట్టి భక్తితో శ్రద్ధతో చేసేదే పూజ.అలా చెయ్యకపోతే అది కేవలం తంతు అని నొక్కి వక్కాణించారు కదా. అలా నన్ను మీరు పూజిస్తే మీరు అనుభవిస్తున్న కష్టాలు తొలగి పోతాయిగానీ, ఇక్కడ కేవలం తమ కాలనీ గొప్ప అన్న దర్పం ప్రదర్శించే " తంతు" మాత్రమే జరుగుతోంది. మిమ్మల్ని తప్పు పట్టాలని కాదు. ఈ పందిళ్ళు కేవలం ఆట పాటలకీ, లేదా నలుగురూ కలిసేందుకు, కష్టాలు కబుర్లు చెప్పుకొనేటందుకు ఒక వేదికలా తప్ప, భక్తి ప్రపత్తులతో జరిగే పూజా మండపంలా కనిపించటం లేదు. ఈ ఆర్భాటాలు కొంత మందికి జీవన భృతి కలిగిస్తాయి తప్ప మరెందుకూ ఉపయోగ పడవు. "ఎప్పుడు పూజ పూజలా జరుగుతుందో మీ కష్టాలు కూడా అలాగే తీరుతాయి.ప్రతి సంవత్సరం ఆ ఆశాభావంతో కిందకి వస్తాను, తొమ్మిది రోజులు పూజ అందుకుంటాను.ఎప్పుడు నేను ఆశించిన భక్తి శ్రద్ధలతో పూజ జరుగుతుందో ఆ ఏడాది తొమ్మిది రోజులూ తప్పక మండపంలోనే ఉంటాను తల్లీ. ఈ తంతు నేను చూడలేను, వస్తాను అని విగ్రహం లోంచి స్వామి వెళ్లిపోయారు. " అయ్యో స్వామీ మీరు అలా ఎలా....." " మమతా! మన అందరినీ వేదిక మీదకి పిలుస్తున్నారు.కాలనీలో ఉన్న ఏకైక ఉమ్మడి కుటుంబం మనదేనట.అందుకు మనకి చిరు సత్కారం ఉందిట పద"..మా వారి మాటలతో ఇదంతా నా భ్రమన్న మాట. బిత్తరపోయి ఉన్న నన్ను " పదండి అత్తయ్య, మీ అబ్బాయి,మనవళ్ళు ఇప్పటికే వేదిక ఎక్కేసారు " అంటూ నా చెయ్యి పట్టుకొని తీసుకుని వెళుతోంది కోడలు.అవును మరి ఒకప్పుడు న్యూక్లియర్ ఫామిలీ అంటే మోజు. ఇప్పుడో వెయ్యి గడప ఉన్న కాలనీలో ఉమ్మడి కుటుంబం అంటే వింత కదా. సత్కారం చెయ్యాల్సిందే. జరుగుతున్న " తంతు" లో మేము కూడా పావులమే అనుకొని,క్షమించమని గణపయ్యకి మొక్కి, యాంత్రకంగా వేదిక మీదకి అడుగులు వేసాను.

మరిన్ని కథలు

Arishadvargalu
అరిషడ్వర్గాలు
- సి.హెచ్.ప్రతాప్
Anumounam
అను"మౌ"నం
- దేవరకొండ ఫణి శ్యామ్
Tandri nerpina patham
తండ్రి నేర్పిన పాఠం
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Tappina muppu
తప్పిన ముప్పు
- కాశీ విశ్వనాథం పట్రాయుడు
Daya
దయ
- సి.హెచ్.ప్రతాప్
kanuvippu
కనువిప్పు!
- బోగా పురుషోత్తం