
కంగ్రాట్స్ చంద్ర! మొత్తానికి ఒక ఇంటివాడివి అయ్యావు," ఆఫీస్ కొలీగ్ భుజం తట్టాడు. "థాంక్స్ రా, ముందు భోజనం చెయ్," నవ్వాడు చంద్ర." ఏరా చందూ, అనుకున్నది సాధించావ్. ఘటికుడివే!" అన్నాడు స్నేహితుడు రాకేష్. "ఏదో అలా కుదిరిందిలేరా. ఇందులో నా గొప్పేముంది," అన్నాడు చంద్ర వినయంగా. "సరే సరే, నీ వినయం తర్వాత. ముందు ఆకలి తీర్చుకుని వస్తా," అంటూ రాకేష్ భోజనాల వైపు కదిలాడు. పెళ్లి హడావిడి ముగిసింది. బంధువులు, స్నేహితులు అందరూ వెళ్లిపోయారు. విశాలమైన ఆ ఇంట్లో మిగిలింది ఇద్దరే—చంద్ర, రాధ. ఇద్దరూ ఒకరికొకరు ఎదురుగా కూర్చున్నారు. గదిలో నిశ్శబ్దం. "రాధా, నిన్ను మొదటిసారి ఎప్పుడు చూశానో తెలుసా?" అన్నాడు చంద్ర మెల్లగా. రాధ 'లేదు' అన్నట్టుగా సిగ్గుతో తల అడ్డంగా ఊపింది. ఆమె కళ్ళు నేలవైపు చూస్తున్నాయి.
"ఒకరోజు ఆఫీస్‌కి వెళ్తుంటే నా బైక్ పంక్చర్ అయింది. ఆఫీస్‌కి లేట్ అవుతోందని టెన్షన్‌లో ఉన్నా. అప్పుడే రోడ్డుకు అవతలి వైపు బస్టాప్‌లో నువ్వు కనిపించావు. అంతే! నా టెన్షన్ అంతా మాయమైంది. ఆ క్షణం నిర్ణయించుకున్నా, పెళ్లి చేసుకుంటే నిన్నే చేసుకోవాలని." "ఆ రోజు నుంచి నిన్ను ఫాలో అవ్వడం మొదలుపెట్టాను. ఆకలేస్తే తింటే కడుపు నిండేది, దాహం వేస్తే నీళ్లు తాగితే తీరేది. కానీ నిన్ను ఎంతసేపు చూసినా నా మనసు నిండేది కాదు. ఓరోజు ధైర్యం చేసి మాట్లాడదామని ప్రయత్నిస్తే, నా చెంప చెళ్లుమనిపించావు గుర్తుందా?అనగానే. రాధ సిగ్గుతో ముఖాన్ని చేతులతో దాచుకుంది. చంద్ర ఆ జ్ఞాపకాన్ని తలుచుకుని నవ్వాడు.కొత్త కాపురం హాయిగా సాగుతోంది. వాళ్ళ అన్యోన్యత చూసి చుట్టుపక్కల వాళ్ళు ఈర్ష్యపడేలా ఉన్నారు. "మనకు దిష్టి తగిలేలా ఉందే," అని చంద్ర ఫోన్‌లో రాధతో నవ్వుతూ చెబుతుండగా, బాస్ నుంచి పిలుపు వచ్చింది. "మళ్ళీ చేస్తా," అని ఫోన్ పెట్టేశాడు.ఆఫీస్ పని మీద వారం రోజుల పాటు ఊరు వెళ్లాల్సి వచ్చింది. కొత్త పెళ్ళాన్ని ఒంటరిగా వదిలి వెళ్లాలంటే చంద్రకి మనసు ఒప్పలేదు.
రాధ వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా అందుబాటులో లేరు. చేసేది లేక, రెండు ఇళ్ల అవతల ఉండే తన స్నేహితుడికి విషయం చెప్పి, "ఒక కంట కనిపెడుతూ ఉండురా," అని బయలుదేరాడు.ప్రతిరోజూ ఫోన్లో గంటల తరబడి కబుర్లు చెప్పుకునేవారు. చంద్ర తన రోజువారీ విశేషాలు పూసగుచ్చినట్టు చెప్పేవాడు. రాధ మౌనంగా వినేది. నాలుగో రోజు, చంద్రకి ఒక అనూహ్యమైన ఫోన్ కాల్ వచ్చింది. అవతలి నుంచి మాట్లాడుతున్నది తన స్నేహితుడి భార్య. ఆమె చెప్పిన మాటలు వినగానే చంద్ర చేస్తున్న పనిని మధ్యలోనే ఆపేశాడు. గుండెలో అలజడి మొదలైంది.
ఆ రాత్రంతా నిద్రపట్టలేదు.ఇంకా మూడు రోజుల పని మిగిలి ఉన్నా, బాస్‌కి ఫోన్ చేసి అత్యవసర పని ఉందని చెప్పి వెంటనే హైదరాబాద్ బయలుదేరాడు. నేరుగా తన స్నేహితుడి ఇంటికి వెళ్ళాడు."అన్నయ్యా, మీరొచ్చారా? రండి, విశ్రాంతి తీసుకోండి," అంది స్నేహితుడి భార్య. "మీరు లేనప్పుడు నేను తరచూ మీ ఇంటి వైపు వెళ్తుండేదాన్ని. రోజూ లోపలి నుంచి ఒక మగ గొంతు వినిపించేది. ప్రేమ గురించి మాట్లాడుతున్నట్టు స్పష్టంగా విన్నాను. మీకు అన్యాయం జరుగుతోందేమోనని భయమేసి ఫోన్ చేశాను. ఈ విషయం మా ఆయనకు కూడా చెప్పలేదు," అని చెప్పింది.చంద్రకి ఆ మాటలు నమ్మబుద్ధి కాలేదు. "నేను కళ్ళతో చూస్తేనే నమ్ముతాను," అని దగ్గర్లోని హోటల్‌లో రూమ్ తీసుకున్నాడు. మరుసటి రోజు, ఎవరూ ఊహించని సమయంలో దొంగలా తన ఇంటి వెనుక వైపు నుంచి వెళ్ళాడు. కిటికీ దగ్గర నక్కి లోపలికి చూశాడు. నిజంగానే, ఇంట్లోంచి ఒక మగ గొంతు ప్రేమ పాఠాలు చెబుతోంది. అది విని చంద్ర షాక్ అయ్యాడు. వెంటనే స్నేహితుడికి ఫోన్ చేసి, "తను మూగదని తెలిసి కూడా, అందరినీ ఎదిరించి పెళ్లి చేసుకున్నానురా. నెల కూడా గడవకముందే నన్ను మోసం చేస్తుందని ఊహించలేదు," అని వెక్కి వెక్కి ఏడ్చాడు. "ఈ రోజు దాని సంగతి తేలుస్తా," అని ఆవేశంగా ఇంటి ముందుకు వెళ్ళాడు. లోపల నుంచి ఆ స్వరం ఇంకా వినిపిస్తూనే ఉంది. కోపంగా తలుపును ఒక్క తోపు తోశాడు.
ఉన్నట్టుండి ఆ స్వరం ఆగిపోయింది. వంటింట్లో ఉన్న రాధ, చంద్రని చూసి ఆనందంతో ఉప్పొంగిపోయి వచ్చి గట్టిగా వాటేసుకుంది. ఒకవైపు ఆమె అమాయకమైన ప్రేమ, మరోవైపు చంద్ర మనసులో అనుమానం. అంతలోనే కరెంట్ రావడంతో ఆగిపోయిన రేడియో మళ్ళీ మొదలైంది. "ప్రేమించండి బాస్" అనే కార్యక్రమంలో భాగంగా 143.00 స్టేషన్‌లో ప్రేమ పాఠాలు ప్రసారం అవుతున్నాయి. రాధకు ఆ కార్యక్రమం అంటే ఎంతో ఇష్టం. తాను మూగది కావడంతో, ఆ గొంతును వింటూ మైమరచిపోయేది. అది రేడియో నుంచి వస్తున్న శబ్దం అని గ్రహించిన చంద్ర ఊపిరి పీల్చుకున్నాడు. అనవసరంగా తన భార్యను అనుమానించానని తనను తానే తిట్టుకున్నాడు. వెంటనే స్నేహితుడికి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పాడు. విషయం తెలుసుకున్న ఆ స్నేహితుడు, లేనిపోనివి కల్పించి చెప్పిన తన భార్యను చితకబాది, "ఇంకోసారి ఇలాంటివి చేస్తే విడాకులే," అని హెచ్చరించాడు. ఆ రోజు నుంచి చంద్రలో మార్పు వచ్చింది.
రాధపై అనుమానం పోయి ప్రేమ రెట్టింపైంది.ఆరు నెలలు గడిచాయి. ఒకరోజు చంద్రకి కొత్త నంబర్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది. "మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. తెలుసుకోవాలంటే ఈ లింక్ క్లిక్ చేయండి." చంద్ర దాన్ని చూడగానే డిలీట్ చేశాడు. కొన్ని రోజుల తర్వాత, ఆఫీస్‌కి వెళ్తూ, "రాధా, పక్కింట్లో ఫంక్షన్ జరుగుతోంది. పాటలు పెద్ద సౌండ్‌తో పెడతారు, నీకు డిస్టర్బెన్స్‌గా ఉంటుంది. తలుపులు, కిటికీలు వేసుకో," అని చెప్పి వెళ్ళాడు. అదే రోజు ఒంట్లో నలతగా ఉండటంతో ఆఫీస్ నుంచి త్వరగా ఇంటికి బయలుదేరాడు. "పక్కింట్లో ఫంక్షన్ కదా, ఇంట్లో రెస్ట్ దొరకదు. రాధను తీసుకుని సినిమాకి వెళ్తే కాస్త ప్రశాంతంగా ఉంటుంది," అనుకుంటూ ఇంటికి చేరుకున్నాడు. సరిగ్గా అదే సమయానికి ట్రాన్స్‌ఫార్మర్‌లో సమస్య వచ్చి ఆ ఏరియాలో కరెంట్ పోయింది. "హమ్మయ్య, సర్‌ప్రైజ్ చేద్దాం," అనుకుని మెల్లగా ఇంట్లోకి అడుగుపెట్టాడు.మళ్ళీ అదే మగ స్వరం! కరెంట్ లేకపోయినా రేడియో ఎలా పనిచేస్తుంది? చంద్ర మనసులో అనుమానం మళ్ళీ పురుడుపోసుకుంది. ఆ స్వరంలో ప్రేమ పాఠాలు వినిపిస్తున్నాయి.ఆవేశంగా లోపలికి వెళ్ళగానే ఆ స్వరం ఆగిపోయింది. రాధను ఏమీ అనలేక, తనలో తానే నలిగిపోతున్నాడు. ఇన్ని రోజుల ప్రేమ ఒక్క క్షణంలో అనుమానంతో ఆవిరైపోయింది.ఆ రోజు నుంచి చంద్ర పిచ్చివాడిలా తయారయ్యాడు. ఆఫీస్‌కి సరిగ్గా వెళ్లడం లేదు, పనిలో ఏకాగ్రత లేదు. బాస్‌తో రోజూ తిట్లు, రావాల్సిన ప్రమోషన్ చేజారింది. మాసిన గడ్డంతో, జీవితంలో సర్వస్వం కోల్పోయిన వాడిలా తిరుగుతున్నాడు.ఒకరోజు పార్కులో కూర్చుని, "తాడోపేడో తేల్చుకోవాలి," అని నిర్ణయించుకుని, ఒక కత్తి తీసుకుని ఇంటికి బయలుదేరాడు.
గేటు లోపలికి అడుగుపెట్టగానే మళ్ళీ అదే స్వరం. ఆవేశంతో తలుపును గట్టిగా తన్ని లోపలికి వెళ్ళాడు. స్వరం ఆగిపోయింది."లోపలే ఉన్నావని నాకు తెలుసు. మర్యాదగా బయటకు రా, లేదంటే ఏం చేస్తానో నాకే తెలీదు," అని గట్టిగా అరిచాడు. రాధ భయంతో 'ఏమైంది?' అని సైగ చేసింది. చంద్ర ఆమెను కోపంగా పక్కకు తోసి ఇల్లంతా వెతకడం మొదలుపెట్టాడు."బయటకు వస్తావా రావా? లేదంటే ఈ కత్తితో పొడుచుకుని చస్తా," అని అరవగానే, కొద్దిసేపటి తర్వాత, "అది నేనే," అని ఆ స్వరం వినిపించింది. చంద్ర వెనక్కి తిరిగి చూడగానే షాక్‌తో కళ్ళు తిరిగి పడిపోయాడు.ఆసుపత్రిలో కళ్ళు తెరిచేసరికి చుట్టూ తనవాళ్ళు ఉన్నారు. రాధ వాళ్ళ నాన్న ముందుకు వచ్చి, "అవును బాబూ, నువ్వు విన్నది నిజమే. ఆ గొంతు రాధదే. తనది మగ గొంతు కావడంతో చిన్నప్పటి నుంచి అందరూ ఏడిపించేవారు. అందుకే తను మూగదానిలా నటిస్తోంది. పెళ్ళికి ముందే నీకు ఈ సంబంధం వద్దని చెప్పాం, కానీ నువ్వే వినలేదు," అన్నారు.ఆ నిజాన్ని జీర్ణించుకోవడానికి చంద్రకి చాలా రోజులు పట్టింది. స్నేహితుడు రాకేష్ పరామర్శించడానికి వచ్చి, "తన గొంతులో లోపం ఉండొచ్చు, కానీ తన ప్రేమలో ఎప్పుడైనా లోపం కనిపించిందా?" అని అడిగాడు."లేదు," అన్నాడు చంద్ర నీరసంగా. "మరి ఎందుకింత ఆలోచిస్తున్నావ్? తప్పు చేసింది తను కాదు, అనుమానించిన నువ్వు. ఇంకో విషయం తెలుసా? రేడియోలో 143.00 ఛానల్‌లో వచ్చే 'ప్రేమించండి బాస్' కార్యక్రమం చెప్పేది రాధనే. ఇంట్లో రికార్డ్ చేసి పంపితే వాళ్ళు ప్రసారం చేస్తారు. ఆ తర్వాత తనే దాన్ని మళ్ళీ వింటుంది. అదే తన ఆనందం," అని చెప్పాడు.చంద్ర మళ్ళీ షాక్ అయ్యాడు. ఆ రోజు చంద్ర పూర్తిగా మారిపోయాడు. తనను పట్టిన అనుమానం అనే పెనుభూతాన్ని వదిలించుకున్నాడు. అనురాధ, అదేనండి మన రాధ, తన మౌనాన్ని వీడింది.ఇప్పుడు ఇద్దరూ ఆనందంగా జీవిస్తున్నారు. వారి ప్రేమకు గొంతు అడ్డుకాలేదు. ఇదే మన అను"మౌ"నం.