
రామాపురం గ్రామానికి ఒక మహాత్ముడు విచ్చేశారు. అక్కడి శివాలయం ప్రశాంతమైన వాతావరణంలో బస చేస్తూ, తన ప్రవచనాలతో ప్రజల మనసుల్లో శాంతిని నింపేవారు. ఆయన మాటల్లోని లోతైన జ్ఞానాన్ని, ఆయన చూపులోని కరుణను దర్శించేందుకు భక్తులు నిత్యం తండోపతండాలుగా వచ్చేవారు. తమ సందేహాలను నివృత్తి చేసుకుంటూ, ఆయన ఆశీర్వచనాలతో తమ జీవితాలకు ఒక మార్గాన్ని వెతుక్కునేవారు. ఆ మహాత్ముడి ఉనికితో ఆ గ్రామమే ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా మారిపోయింది.
అదే గ్రామంలో, రాజయ్య అనే ఒక గ్రామాధికారి ఉండేవాడు. ప్రజల పట్ల అతని మనసులో ఏ మాత్రం దయ లేదు. మానవ సంబంధాలకు విలువ ఇవ్వని అతను, ఎలాగైనా సంపద పోగేసుకోవాలనే దురాశతో ప్రజలను తరచుగా బాధించేవాడు. అతని అహంకారం, కఠినమైన స్వభావం కారణంగా గ్రామ ప్రజలు ఎప్పుడూ భయంతోనే ఉండేవారు. నిరంతరం ధనార్జన గురించే ఆలోచిస్తూ, రాజయ్య తన నిద్రను, మనశ్శాంతిని కోల్పోయాడు. లోలోపల ఒక తెలియని వేదన అతన్ని తొలిచేస్తుండేది. ఆ ప్రశాంతత కోసమే, చివరకు మహాత్ముడిని దర్శించుకోవాలని నిర్ణయించుకున్నాడు.
రాజయ్య తన చేతుల్లో నిండుగా, అత్యంత రుచికరమైనవిగా పేరున్న మామిడి పండ్లను తీసుకుని, వాటిని మహాత్ముడుకి సమర్పించాలని భావిస్తూ, వినయంగా నమస్కరించి నిలబడ్డారు. ఆ సమయంలో మహాత్ముడు ధ్యానంలో ఉన్నారు. కొంత సమయం తర్వాత ఆయన కళ్ళు తెరిచి, రాజయ్యను చూస్తూ, “అది కింద పడెయ్యి” అన్నారు.
రాజయ్యకు మొదట ఆ మాటల అర్థం కాలేదు. ఇది ఏమి ఉపదేశం అని ఆయన ఆశ్చర్యపోయారు. బహుశా తన చేతిలోని మామిడిపండ్లు అశుభమైనవేమో అని భావించి, అందులోంచి రెండు పండ్లను వదిలేశారు. అయినా మహాత్ముడు “అది కింద పడెయ్యి” అని మళ్ళీ అన్నారు. ఈసారి రాజయ్యకు మరింత గందరగోళంగా అనిపించింది. పవిత్రమైన ఫలాలను మహర్షికి సమర్పించడం ఆచారం కదా అని అనుకున్నారు. బహుశా తన పండ్లు పవిత్రమైనవి కావేమోనని, లేదా మహాత్ముడికి పండ్లు తీసుకోవడం ఇష్టం లేదేమోనని భావించి, మిగతా పండ్లను కూడా వదిలేశారు. అప్పుడు ఖాళీ చేతులతో మహాత్ముడికి నమస్కరించారు.
అయినా మహాత్ముడు తిరిగి “అది కింద పడెయ్యి” అని అన్నారు. ఇప్పుడు రాజయ్యకు ఏం చేయాలో తెలియలేదు. తన చేతుల్లో ఏమీ లేనప్పుడు, దేన్ని పడెయ్యాలి అనే సందేహం కలిగింది. ఆ విషయాన్నే మహాత్ముడితో వినయంగా చెప్పారు.
మహాత్ముడు చిరునవ్వుతో, “నాయనా, నేను పడెయ్యమన్నది నీ చేతిలోని పండ్లను కాదు. నీ అంతరంలో నిండిన దుర్గుణాలను. నీకున్న అహంకారం, ధనార్జన కాంక్ష, తోటివారిని చులకనగా చూసే స్వభావం, పన్నుల పేరుతో ప్రజలను పీడించి తినే మనస్తత్వం—ఇవన్నీ నీలోనే ఉన్నాయి. కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం అనే ఆరు శత్రువులు నిన్ను ఆవరించి ఉన్నాయి. అవి నిన్ను నిజమైన ఆనందానికి, ప్రశాంతతకు దూరం చేస్తున్నాయి. అందుకే నీ నిద్ర, మనశ్శాంతి కరువయ్యాయి. వాటిని త్యజించకుండా నిజమైన ఆనందాన్ని పొందలేవు. వాటితో కూడిన పాపాలు ఈ జన్మలోనో, మరో జన్మలోనో అనుభవించక తప్పదు. అందుకే ఆ దుర్గుణాలను వదిలి, సుగుణాలను పెంచుకో. తోటివారి పట్ల, తోటి జీవుల పట్ల ప్రేమ, కరుణ, దయ కలిగి ఆనందంగా జీవించు” అని ఉపదేశించారు.
మహాత్ముడి మాటలతో రాజయ్య అజ్ఞానం పటాపంచలైపోయింది. తనలో ఉన్న అహంకారం, గర్వం మట్టిలో కలిసిపోయినట్లుగా అనిపించింది. తన తప్పును తెలుసుకున్న రాజయ్య, ఆ రోజు నుండి తనలో ఉన్న దుర్గుణాలను వదిలి, సుగుణాలను పెంచుకుంటానని దృఢంగా నిశ్చయించుకుని ఇంటికి తిరిగి వెళ్ళారు. ఆయన ఉపదేశం రాజయ్య జీవితానికి ఒక కొత్త మార్గాన్ని చూపింది