ఇట్లు ఓ ఓడిపోయిన సుబ్బారావు - రాజు యెదుగిరి

Itlu O Odipoyina Subbarao

సుబ్బారావు రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి. ఈ మధ్యనే పదవీరమణ తీసుకొని ప్రభుత్వం ద్వారా వచ్చిన డబ్బులతో ఇళ్ళు కట్టుకున్నాడు. ఇక హాయిగా వృద్ధాప్య జీవితం గడుపుదాం అని నిర్ణయించుకున్నాడు. సుబ్బారావు భార్య విమల. వాళ్ళిద్దరికీ ఇద్దరు పిల్లలు, కొడుకు రాజేష్. కూతురు రవళి. సుబ్బారావు కి జీవితం మొత్తం కష్టపడడం కంటే, ముందు కష్టపడి తర్వాత సుఖపడ్డం ఇష్టం. ఎక్కడో విన్న ఫిలాసఫీ అది. అతను యువకుడిగా ఉన్నప్పటి నుండి అదే ఆచరిస్తూ వచ్చాడు. అందుకే పిల్లలిద్దర్నీమంచి హై స్టాండర్డ్స్ స్కూళ్ళలో చదివించాడు. వారి ఉద్యోగాల కోసం వాళ్లకంటే ఎక్కువగా కష్టపడ్డాడు. దానికి ఫలితంగా కొడుకు మంచి ఐటీ ఉద్యోగం లో స్థిరపడ్డాడు. డిగ్రీ పూర్తి కాగానే రవళికి పెళ్లి చేసి పంపాడు. రవళి పెళ్లయిన కొద్దిరోజులకే, ఓరోజు రాజేష్, పక్కనే ఎవరో అమ్మాయి. ఇద్దరూ మెడలో పూల దండలతో గుమ్మంలో ప్రత్యక్షం అయ్యారు. మొదట విమల, సుబ్బారావు ఇద్దరూ ఆశ్చర్యపడినా, కాసేపటికే విషయం అర్థం చేసుకున్న సుబ్బారావు ఇద్దర్ని ఇంట్లోకి ఆహ్వానించాడు. సుబ్బారావు యాంటీ కాస్టిస్ట్, అతనికి కులం, మతం అనే బేధాలు లేవు. ఇంట్లో వాళ్ళు ఎవ్వరూ ఒప్పుకోకపోయినా అందర్నీ కాదని రాజేష్ రమల పెళ్ళి జరిపించాడు. కొడుకు కోడలితో పాటే అందరు ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నారు.

సుబ్బారావు కి తన భార్య విమల అన్నా, పిల్లలన్నా ఎంతో ఇష్టం. కానీ వాళ్లకి సుబ్బారావు అంటే ఇష్టం ఉండేది కాదు. కాలక్రమేణా ఇష్టం కాస్త పోయి ఇప్పుడు సుబ్బారావు మీదకే విరుచుకు పడుతున్నారు అందరూ. సుబ్బారావు బయటికి వెళ్తే నలుగురూ మర్యాద తో పలకరించే వ్యక్తి. కానీ ఇంట్లో ఆ మర్యాద, గౌరవాలకు నోచుకోలేదు. ‘ఎంతైనా నా పిల్లలు, నా భార్యే కదా పోనీలే..’ అనుకుంటూ ఈజీ గా తీసుకునేవాడు తప్ప వాళ్ళు ఎంత దూషించిన, కారణం లేకుండా ఎన్ని చివాట్లు పెడుతున్నా కూడా ఏనాడు తిరిగి ఒక్క మాట అనలేదు. పెళ్లయిన కొత్తలో విమల అతనితో బాగానే ఉండేది. పిల్లలు పుట్టాక పూర్తిగా మారిపోయింది. పిల్లలు కూడా ఒక సమయం వరకు సుబ్బారావు చెప్పిందే వేదంగా వినేవారు. అతన్నే అనుసరించేవారు. కానీ ఇప్పుడు అవేం లేవు. రోజూ తన మానానేదో తను ఉండేవాడు. ఒక రోజు వాళ్ళ వీధిలో ఉండే రామ్మూర్తి తన కూతురు ఆపరేషన్ కోసం కొంత డబ్బు కావాలని ఇంటికి వచ్చాడు. “సుబ్బారావు గారు కొంచెం మీరే ఎలాగైనా పెద్దమనసు చేసుకొని సహాయం చేయాలండి.” అడిగేడు రామ్మూర్తి. “ఏమైంది రామ్మూర్తి. ఏమిటా సహాయం?” పేపరు చదవడం ఆపేసి రామ్మూర్తి వైపు చూసాడు సుబ్బారావు. “కూతురు కి హార్ట్ లో హోల్ పడింది అంటున్నారు. ఆపరేషన్ చేయిస్తే గాని బ్రతకదంటున్నారు. నా దగ్గర ఉన్న డబ్బంతా హాస్పిటల్ బిల్లుకే కర్చయిపోయింది. ఉన్న కాస్త డబ్బులు సరిపోవట్లేదు. అప్పు కూడా ఎక్కడా పుట్టక వీధిలో అందరి కాళ్ళా వేళ్ళా పడుతూ ఒక్కో రూపాయి అడుక్కుంటున్నాను.” రోదిస్తూ చెప్పసాగాడు రామ్మూర్తి. “అయ్యో! అలాగా... ఒక్క నిమిషం రామ్మూర్తి.” అంటూ లేచి గదిలోకి వెళ్ళాడు సుబ్బారావు. లోపల బీరువా తెరిచిన చప్పుడు వినబడడంతోనే విమల కోపంతో ఊగిపోయింది. సుబ్బారావు చేస్తున్న పనికి పీకలదాక కోపం ముంచుకొస్తుంది. సుబ్బారావు, లక్ష రూపాయలు. యాభై వేల డబ్బు కట్టలు రెండు తీసుకొని వచ్చి రామ్మూర్తి చేతికి అందజేశాడు. “మీ మేలు ఈ జన్మలో మరచిపోలేనండి. మూడు నెలల్లో వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తాను” అన్నాడు కృతజ్ఞత భావంతో. “రామ్మూర్తి... ఇద్దరం కలిసి ఒకే వీధిలో ఉంటున్నాం. ఇరుగు పొరుగు అన్నట్టు ఉండాలి. అయినా ఈ మాత్రం సాయం చేయకపోతే ఎలా? నీకు వీలైనప్పుడు ఇద్దువు గానీ ముందు ఆపరేషన్ అయ్యేలా చూడు. వెళ్ళు త్వరగా” అన్నాడు సుబ్బారావు.

“రమ... కాస్త మంచి నీళ్ళు ఇచ్చి టీ పెట్టమ్మ!” హాలు లో ఉన్న సోఫాలో కూర్చొని ఆర్డరు వేశాడు సుబ్బారావు. మంచినీళ్ళ బాటిల్ విసుగ్గా టేబుల్ పైన పెట్టి వెళ్ళిపోయింది రమ. కానీ ఇరవై నిమిషాలయిన టీ రాలేదు. “విమల కాస్త టీ ఇస్తావా...” వినయంగా అడిగాడు సుబ్బారావు. “ఆ... సరే..!” అంది విమల కూడా. పది నిమిషాలు అయిపోయింది, అయినా టీ ఇంకా రాలేదు. “విమల టీ తెస్తున్నావా?” మళ్ళీ గుర్తుచేశాడు సుబ్బారావు. “అవుతుంది... ఎందుకలా కాకిలా అరుస్తున్నారు?” విసుక్కుంది విమల. “టీ అడగడం కూడా తప్పేనా..!” తనలో తానే బాధ పడ్డాడు సుబ్బారావు. కాసేపటికి టీ తెచ్చి ఇస్తూ.. “ఒక చీర కొనుక్కుంటాను కాస్త డబ్బులివ్వండి అంటే రూపాయి ఇవ్వరు. కానీ ఇలా అయినవాడికి, కానివాడికి మాత్రం వేలకు వేలు ఇవ్వండి.” అంది. “అయినా ఇంట్లోవాళ్ళ మీద ప్రేముంటేగా ఇవ్వడానికి.” కోపంతో చిందులు తొక్కింది విమల. కాసేపటి తరువాత అలిసిపోయి ఆఫీసు నుండి ఇంటికి వచ్చిన రాజేష్ సోఫాలో కూలబడ్డాడు. “రమ... ఒక కప్పు కాఫీ ఇవ్వు.” అంటూ తల పట్టుక్కూర్చున్నాడు రాజేష్. సుబ్బారావు కి పది నిమిషాలైనా రాని టీ, రాజేశ్ కి క్షణాల్లోనే వచ్చింది. కోడలికి తన మీద ఉన్న గౌరవం చూసి తనలో తానే నవ్వుకున్నాడు. కాఫీ తాగేసి స్నానానికి వెళ్ళాడు రాజేష్. తల తుడుచుకుంటూ మంచంపై కూర్చున్నాడు. “ఇదిగోండి.. ఇదేం బాలేదు.” మొహం మాడ్చింది రమ. “ఏమైంది రమ?” రాజేశ్ ఆరా తీయబోయాడు. “మావయ్య గారి పద్ధతేం బాగోలేదండి” “ఏం? ఏమైంది? ఎందుకలా అంటున్నావ్?” “ఇంట్లోకి నేను మొన్న మంచం పైకి మ్యాట్రెస్ కొందామని ఒక పాతిక వేలు ఉంటే ఇవ్వండి మావయ్య గారు అని అడిగాను.” “ఆరోజు నాకు ఇవ్వలేదు గాని ఈరోజు ఎవరో మన వీధి చివరన ఉండే రామ్మూర్తి అడిగితే క్షణం ఆలోచించకుండా డబ్బులు ఇచ్చేసారు” అంది రమ. “మ్యాట్రెస్ కు పాతిక వేలా…?” నోరు బార్లా తెరిచాడు రాజేష్. “అంటే…? కొంచెం మంచి క్వాలిటీ ఉన్నది కొందాం అనుకున్నాను.” పెడమొఖం పెట్టింది రమ. “అయినా మన దగ్గర ఇప్పుడు మ్యాట్రెస్ ఉంది కదా. మళ్లీ ఎందుకు?” “అంటే ఏంటి మీరనేది? రెండు ఉంటే ఏమైనా పాడయితాయా? అయినా ఇప్పుడు ఉన్న మ్యాట్రెస్ పాడయిపోయింది.” “మీరు కూడా నన్నే అవమానించండి!” అంటూ కోపంగా కిచెన్లోకి వెళ్ళిపోయింది రమ. “ఏంటి నాన్న ఇది? మీకు ఇంట్లో వాళ్లకంటే పరాయివాల్లే ఎక్కువైయ్యారా?” హాల్లో తీరిగ్గా కూర్చుని ఉన్న సుబ్బారావు దగ్గరకు వెళ్ళి అడిగాడు రాజేష్. “ఏమైంది? అలా ఎందుకు అనుకుంటున్నావు?” తిరిగి అడిగాడు సుబ్బారావు. “రమ మిమ్మల్ని డబ్బులు అడిగితే ఇవ్వలేదట? కానీ ఎవరో డబ్బు అవసరం ఉండి ఈరోజు ఇంటికి వచ్చి అడిగితే వెంటనే ఇచ్చేశారంట?” నిలదీస్తూ అడిగేడు రాజేష్. “రమ వృధాగా కర్చుబెట్టడానికి అడిగింది. ఇంట్లో ఇప్పటికే మ్యాట్రెస్ ఉంది కదా, పైగా అది బాగానే ఉంది. అది పాడయ్యాక కొందాంలేమ్మ! అన్నాను. అంతే! తప్పా?” “అయినా నేనేమైన వూరికే ఇచ్చానా? అత్యవసరం కాబట్టి ఇచ్చాను. అయిన ఇలా అయిందానికి కానిదానికి నన్ను అనడం ఏం బాగోలేదు రా!” “రమ అంటే ఏదో తెలియక అంది. నువ్వు కూడా ఏంట్రా..? ఇరవై ఏళ్ళ నుండి నన్ను ఇంతేనా నువ్వు అర్థం చేసుకుంది?” కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. రాజేష్ కి తెలుసు నాన్న అంటే ఏంటో. భార్య విమల వల్లే ఇదంతా. “ఏదేమైనా నాన్న మీరు ఇలా చెయ్యడమేమి బాగోలేదు.” అన్నాడు. “

నేనేం మీ డబ్బులు ఇవ్వట్లేదు. అది నా సొంత డబ్బు.” సుబ్బారావు మొహంలో ఏ మాత్రం గర్వం కనిపించలేదు. “మీకు ఇంక చెప్పడం వేస్ట్ నాన్న... మీకు ఇష్టం వచ్చినట్టు చేసుకోండి!” అంటూ సుబ్బారావు ను చీదరించుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు రాజేష్. సుబ్బారావు కి చాలా బాధేసింది. ‘అయినవాళ్లే పరాయివాళ్ళలా చూస్తున్నారు. నేనేం తప్పు చేశాను?’ లోలోపల కృంగిపోయాడు. చాలా సేపు బాధ పడి.. ‘ఇది ఒక్కరోజు తతంగం కాదు దాదాపు ఆరు నెలల నుంచి ఇదే తంతు. ఇన్నిరోజులు నా కుటుంబమే, నా వాళ్ళే కదా అని సహిస్తూ, భరిస్తూ వచ్చాను గాని ఇక ముందు కూడా సహించడం నా వల్ల కాదు. ఈ రెండు నెలల నుంచి ఈ బాధ ఇంకా ఎక్కువైంది.’ అంటూ చాలా సేపటి దీర్గాలోచన తర్వాత ఒక తుది నిర్ణయానికి వచ్చాడు. గదిలోకి వెళ్ళి ఒంటరిగా కూర్చున్నాడు, పెన్ను పేపరు తీసుకున్నాడు. ప్రియమైన నా అర్దాంగి విమలకి, ఇన్నేళ్లు నువ్వు ఎప్పుడు బావుండాలనే కోరుకున్నాను. అందుకే ఏనాడు నిన్ను పల్లెత్తు మాట అనలేదు. ఏ రోజు నిన్ను కష్టపెట్టలేదు. కానీ ఎందుకు నువ్వు నాపై కొంచెం కూడా ప్రేమ చూపించలేదు ఇన్నేళ్లు? పిల్లలు పుట్టాక నన్ను పూర్తిగా దూరం పెట్టేశావు. సరే నా భార్యే కదా అని సర్దుకు పోయాను ఇన్ని రోజులు. నిన్నూ, పిల్లల్ని ఎంతో బాగా చూసుకున్నాను. పిల్లలిద్దర్నీ మంచి స్కూలు, కాలేజీల్లో వేసి చదివించాను. రాజేష్ కి నా రికమండేషన్ తో మంచి ఉద్యోగంలో చేర్పించాను. కూతుర్ని మంచి అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశాను. నీకు, కూతురికి, మన కొడుక్కి అందరికీ భారమైపోయాను. ఇరవై ఐదేళ్లు పెంచిన నన్ను లెక్కచేయకుండా. వాడి భార్య చెప్పిందని నాపై విరుచుకుపడే కొడుకు ఉండి ఎందుకు? కన్న కొడుకే నన్ను అన్నన్ని మాటలు అంటుంటే నేను బ్రతికి ఉండడం ఎందుకు అని చాలా సార్లు అనిపించింది. నా కళ్ళ ముందే పెరిగిన వాడు, నేను నా భుజాల పై ఎత్తుకుని ప్రపంచాన్ని చూపిస్తే చూసినవాడు... ఈరోజు నాకు చెప్పేంత వాడయిపోయాడు. ఒకట్రెండు సార్లు నా మీదకి చేయి కూడా ఎత్తాడు. నువ్వూ చూశావు. సరే కనీసం కోడలయినా కాస్త గౌరవం ఇస్తుంది, ప్రేమగా చూసుకుంటుంది అనుకున్నాను. కానీ తనకి కూడా నేను చేతకాని వాడినయిపోయాను. నాకు ఇప్పుడు డెబ్బై రెండేళ్లు. మహా అయితే ఇంకో నాలుగేళ్లు. అంతే! కానీ మీ దగ్గర ఉండి, మీ సూటి పోటి మాటలతో ముందుగానే చంపేసేలా ఉన్నారు. నాకు బ్రతకాలని ఉంది. ఇంకొన్ని రోజులు నాలా బ్రతకాలి అని ఉంది. రవళి ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాను కానీ తనని కష్టపెట్టదలుచుకోలేదు. హృదయం లేని మీలాంటి మరమనుషుల మధ్య బిక్కు బిక్కుమంటూ చస్తూ బ్రతకడం కంటే నిజంగా చచ్చిపోవడం మేలు! కానీ నేను చావదలచుకోలేదు. బ్రతకాలనుకుంటున్నాను. అందుకే ఇంట్లోంచి శాశ్వతంగా వెళ్ళిపోతున్నాను. నన్ను క్షమించండి. నాకోసం వేతక్కండి. ఈరోజుతో మీకు తెలిసిన సుబ్బారావు చనిపోయాడు. మీకు ఇక జీవితం లో కనిపించడు. సెలవు! ఇట్లు, ఓ ఓడిపోయిన సుబ్బారావు. లెటర్ మంచంపై పెట్టి రెండు జతల బట్టలు, అతని పుస్తకాలు, ఇంకేవో చిన్నప్పటి ఫొటోలు బ్యాగు లో సర్దుకొని వెళ్లేందుకు సర్వం సిద్ధం చేసుకున్నాడు. కానీ ఎందుకో మనసు వద్దు అంటోంది. ఆఖరిసారిగా తన భార్య విమలతో కాసేపు మాట్లాడి వెళదాం అనుకున్నాడు. హాలులోకి వెళ్ళి చూసాడు. విమల కిచెన్ లో పని చేసుకుంటుంది. కిచెన్ డోర్ దగ్గర నుంచొని “విమలా.. విమలా...” అంటూ రెండు సార్లు పిలిచాడు. కానీ విమల సమాధానం ఇవ్వలేదు. ఈసారి ఇంకాస్త గట్టిగా పిలిచాడు. “ఎంటీ..? ఎందుకలా అరుస్తున్నారు?” కోపంగా అంది విమల. ఇక మాట్లాడడం అనవసరం అనుకున్నాడు. ఆఖరిసారిగా రాజేష్ ను కళ్ళారా చూసి బ్యాగు భుజానికి వేసుకొని తన ఇంట్లోంచి తానే అనాథలా వెళ్ళిపోయాడు. దొరికిన ఆటో పట్టుకొని రైల్వే స్టేషన్లో అడుగు పెట్టాడు. టికెట్ తీసుకొని బెంచిపై కూర్చున్నాడు. బండరాయి లాంటి మనుషులతో ఉండడం కంటే ప్రకృతి ఒడిలో ఒదిగిపోవడం మంచిది అనుకున్నాడు. వీళ్ళందరికీ దూరంగా వృద్ధాశ్రమం లో వృద్ధాప్యం అంతా గడపాలని నిర్ణయించుకున్నాడు. విశాఖ ఎక్స్ప్రెస్ ఒకటో నంబర్ ప్లాట్ ఫారం మీద ఆగింది. ఎక్కి జనరల్ బోగీలో కూర్చున్నాడు. ఎక్కడో మారుమూల పల్లెటూరు నుంచి సిటీ కి వచ్చి, ఇంతలా అభివృద్ది చెంది, చివరికి ఏమి లేని అనాధగా ముందుకు కదిలిపోయాడు. అరకులో ఆటో దిగి ‘సునంద వృద్ధాశ్రమం’ వైపు నడవసాగాడు. ***

మరిన్ని కథలు

Arishadvargalu
అరిషడ్వర్గాలు
- సి.హెచ్.ప్రతాప్
Anumounam
అను"మౌ"నం
- దేవరకొండ ఫణి శ్యామ్
Thantu
తంతు
- Prabhavathi pusapati
Tandri nerpina patham
తండ్రి నేర్పిన పాఠం
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Tappina muppu
తప్పిన ముప్పు
- కాశీ విశ్వనాథం పట్రాయుడు
Daya
దయ
- సి.హెచ్.ప్రతాప్