
సుధీర్ అనే పదవ తరగతి చదువుతున్న యువకుడు అపారమైన తెలివితేటలతో ప్రసిద్ధి చెందాడు. క్లాసులో ఎప్పుడూ మొదటి స్థానంలో నిలిచి, శిల్పకళ, అబ్‌స్ట్రాక్ట్ ఆర్ట్, వెస్ట్రన్ డాన్స్, సంగీతం వంటి అనేక రంగాల్లో అద్భుత ప్రతిభ చూపేవాడు. చదువులోనూ, ఇతర ప్రతిభల్లోనూ అతను అందరికి ఆదర్శం.
అయితే, ఈ మంచి గుణాల మధ్య అతనిలో రెండు పెద్ద లోపాలు ఉన్నాయి — బద్ధకం మరియు అస్తవ్యస్తత. ఏ వస్తువును వాడినా తిరిగి యధాస్థానంలో పెట్టేవాడు కాదు; తనకు నచ్చిన చోటే వదిలి, తర్వాత వాటికోసం వెతుక్కుంటూ ఇబ్బంది పడేవాడు. అంతేకాకుండా, ఏ పనినైనా సమయానికి చేయకుండా వాయిదా వేసేయడం అతనికి అలవాటు. తల్లిదండ్రులు ఎన్నిసార్లు హెచ్చరించినా, “చదువే ప్రధానమని, మిగతా పనులు రేపటికి వాయిదా వేస్తే తప్పేముంది?” అని వాదించేవాడు.
పదవ తరగతి పరీక్షలు రాత్రింబవళ్లు చదివి అద్భుతంగా రాశాడు. తనకే కాదు, తన తల్లిదండ్రులకు కూడా స్కూలు ఫస్ట్ రావడం ఖాయం అన్న నమ్మకం కలిగింది. మూడు నెలల తర్వాత ఫలితాలు వెలువడగా, సుధీర్ 97 శాతం మార్కులు సాధించాడు. స్కూలు ఫస్ట్ మాత్రమే కాకుండా పట్టణంలోనూ నాలుగో ర్యాంకు సంపాదించాడు. ఆ ఆనందంలో తల్లిదండ్రులు అతన్ని ప్రసిద్ధ కార్పొరేట్ కాలేజీలో చేర్పించారు.
ఒక రోజు పుస్తకాలు సర్దుకుంటూ ఉండగా, సుధీర్ బీరువాలో పడి ఉన్న పాత కవరు కనిపించింది. అది అతని పాత స్కూలు నుండి వచ్చిన ఆహ్వాన పత్రిక. ర్యాంకు సాధించిన విద్యార్థులను మంత్రి గారి చేతుల మీదుగా సన్మానిస్తూ, ఇంటర్మీడియట్ చదువుకు యాభై వేల రూపాయల స్కాలర్‌షిప్ ఇవ్వనున్నట్లు అందులో వ్రాయబడి ఉంది. రెండు నెలల క్రితమే వచ్చిన ఆ కవరు, తన నిర్లక్ష్యం వల్ల ఇలా మర్చిపోయాడని గ్రహించగానే, సుధీర్ మనసులో పశ్చాత్తాపం మంటలా వ్యాపించింది. ఒక లాప్‌టాప్ కొనుక్కోవచ్చని, జీవితంలో ఒక అరుదైన గౌరవం పొందవచ్చని అవకాశాన్ని కోల్పోయాడు. కారణం — తన బద్ధకం, నిర్లక్ష్యం.
ఆలస్యం అనేది ఒక వ్యక్తి సామర్థ్యాన్ని మెల్లగా కరిగించే నిశ్శబ్ద శత్రువు. పని కష్టం అనిపించి వాయిదా వేస్తే, ఆ తర్వాత కలిగే ఒత్తిడి, అపరాధ భావన మరింతగా పనిని దెబ్బతీస్తాయి. చివరికి అవకాశాలు చేజారిపోవడం, గడువులు తప్పిపోవడం జరుగుతుంది. ఈ అలవాటు చిన్న పనుల నుంచే మొదలై, విద్యా ప్రగతి, వృత్తి ఎదుగుదల, వ్యక్తిగత సంబంధాల వరకు ప్రభావం చూపుతుంది. తాత్కాలిక ఉపశమనం ఇచ్చినా, దీని మూల్యం జీవితాంతం పశ్చాత్తాపమే.
ఆ సంఘటన తర్వాత సుధీర్ మారిపోయాడు. ఆలస్యం చేయకుండా, ఎప్పుడు పని అప్పుడే పూర్తిచేయడం, వస్తువులను సరిగ్గా ఉంచడం అలవాటు చేసుకున్నాడు. “ఆలస్యం అమృతం విషం” అన్న సామెత తనకు నిజజీవితంలో అర్థమైందని అనుభవపూర్వకంగా గ్రహించాడు.