పరివర్తన - డా.సి.యస్.జి.కృష్ణమాచార్యులు

Parivartana

సాయం సంధ్యా సమయం. గ్రీన్ లైట్ అపార్టుమెంటు సముదాయం చుట్టూ వున్న నడక దారిలో, మణిమేఖల ఒంటరిగా నడుస్తోంది. అలా నడుస్తున్న ఆమెను, అన్విత వచ్చి కలిసింది.

"ఆంటీ గుడీవెనింగ్. మీతో మనోజ్ గురించి ఒక విషయం చెప్పాలి"

మనోజ్ మణిమేఖల కొడుకు. మణిమేఖల నడక ఆపి, అన్విత ముఖంలోకి చూసింది. అన్విత కొద్దిగా సందేహపడుతూ, యిలా చెప్పింది.

"ఆంటీ, మనోజ్ చెడిపోయాడు. స్నేహితులతో కలిసి పోర్న్ చూస్తున్నాడు. ఈ రోజు మధ్యాహ్నం క్లాసురూములో, నేను ఒంటరిగా వున్నప్పుడు వచ్చి, ఐ లవ్ యూ చెప్పమని బలవంతం చేసాడు. నేను వెళ్ళిపోబోతూంటే, కౌగలించుకుని ముద్దు పెట్టాడు “

అనుకోని విధంగా, మనోజ్ గురించిన చేదు నిజాలు మొదటి సారిగా వింటున్న మణిమేఖల షాక్ కు గురైంది. ఆమె బుర్రలో ఎన్నో ఆలోచనలు.

“ఇది నిజమా! అన్విత ఎంతో మంచి పిల్ల. చదువులో టాపర్. మెడిసిన్ చేయాలన్న పట్టుదలతో రాత్రింబగళ్ళు కష్టపడే అమ్మాయి. ఇంతకీ ఆ అమ్మాయి వచ్చి నేరుగా నాకే చెప్పిందా? తన తల్లి తండ్రులకు, ప్రిన్సిపాల్ కు చెప్పలేదుగదా! చెప్పి వుంటే, ఎంత పరువు నష్టం”

ఒక్క క్షణం ఆమె భయంతో వణికి పోయింది. అన్విత చెప్పడం కొనసాగించింది.

“లక్కీగా ఆంటీ, అది ఎవ్వరూ చూడలేదు. చూసి వుంటే గొడవయ్యేది. ప్రిన్సిపాల్ దాకా విషయం వెళ్ళేది. నా పేరెంట్సుకి తెలిసేది. అప్పుడు, మనోజ్ తో పాటు నేను చిక్కుల్లో పడేదాన్ని”

ఎవ్వరికీ ఈ విషయం తెలియదన్న వాస్తవం మణి మేఖల మనసుకు వూరట కలిగించింది. ఆమె మనసు చిక్క బట్టుకుని, "సారీరా! మనోజ్ ఇలా చేస్తాడనుకోలేదు. వాడు కూడా నీలాగే మెడిసిన్ చేస్తానని చెప్పాడు. బాగా చదువుకుంటున్నాడని నమ్మాను."

"బాగానే చదివే వాడు. ఈ మధ్యనే ఇలా చెడు త్రోవలో పోవడం మొదలు పెట్టాడు. మీరు కాస్త మందలించండి. నాకు ప్రేమలు, షికార్లు అక్కరలేదు. నాకు చదువే ముఖ్యం. దయచేసి నా జోలికి రావద్దని చెప్పండి"

మణిమేఖల అన్విత భుజం చుట్టూ చేయి వేసి దగ్గరకు తీసుకుని," చాలా థాంక్స్ రా. ఈ రోజు నుంచి నేను వాడిని కనిపెట్టుకుని వుంటాను. మెల్లగా వాడి మనసు మార్చి నీకు క్షమాపణ చెప్పిస్తాను. నువ్వు బాగా చదువుకో" అని చెప్పింది.

"ఓకే ఆంటీ" అని అన్విత ఆమె దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయింది

@@@

రాత్రి పదకొండు గంటల సమయం. మణిమేఖల రాక కోసం యెదురుచూస్తున్న సుధాకర్. ఆమెను చూస్తూనే, యేమైంది, ముభావంగా వున్నావని అనునయంగా అడిగాడు.

మణిమేఖల అతని ప్రక్కన కూర్చుని లోగొంతుకలో, " మనబ్బాయి గురించి మీకు చెప్పాలి" అంది. గంభీరంగా. కాంతి హీనమైన ఆమె కళ్ళని చూడగానే, ఇదేదే సీరియస్ వ్యవహారమని, సుధాకర్ కి అర్ధమైంది.

" ఏం జరిగిందో చెప్పు" అన్నాడు మంద్రస్వరంలో.

మణిమేఖల మెల్లగా జరిగినదంతా చెప్పింది. ఆమె చెప్పిందంతా శ్రద్ధగా విన్న సుధాకర్ ఆప్యాయంగా ఆమె తల నిమురుతూ యిలా అన్నాడు.

"భయపడకు. ఈ వయసులో సహజంగా కలిగే వుద్రేకాల్లో కామం ఒకటి. అయితే దీనిని అదుపులో వుంచే సభ్యతని మనవాడు కోల్పోయాడు. అన్విత దీనిని రచ్చ చేయలేదు కాబట్టి, వాడిని మనం వెంటనే శిక్షించాల్సిన అవసరం లేదు. వాడిని పిలిచి మాట్లాడుదాం. విలువైన జీవితాన్నిలా నాశనం చేసుకోవద్దని నచ్చచెబ్దాము.."

“మీరెలా చెప్తే నేనలా చేస్తాను. చెప్పండి" అంది మణిమేఖల లేని వుత్సాహాన్ని ప్రదర్సిస్తూ.

"వాడితో మాట్లాడాల్సిన అంశాలు మూడు. ఒకటి వాడి జీవిత ధ్యేయం యేమిటి? పోర్న్ ఎందుకు చూస్తున్నాడు? అన్వితను ఎందుకు ముద్దు పెట్టుకున్నాడు?ఇవన్నీ చర్చించడానికి మంచి చోటు కావాలి. అందుకే ఈ ఆదివారం మనం బొటానికల్ గార్డెన్స్ కి పిక్నిక్ వెడదాము."

"మీ ఆలోచన బాగుంది. తప్పక వెడదాము. కానీ నాకో సందేహం."

కాంతివంతమైన మణిమేఖల కన్నుల్లోకి చూస్తూ,” ఏమిటది? చెప్పు “ అన్నాడు.

" పిల్లలు సాధారణంగా తమ విషయాలను తల్లిదండ్రులకు, టీచర్లకు కొంత మేరకే చెబుతారు. అందువల్ల వాడితో మనం చర్చిస్తే, అంత ప్రయోజనకరంగా వుండక పోవచ్చు. అదే ఒక సైకాలజిస్టుకి ఆ బాధ్యత నప్పగిస్తే ,మంచి ఫలితం వుంటుందేమో?

"అదీ నిజమే. కానీ, పేరేంట్స్ గా మన బాధ్యత మన పిల్లల గురించి తెలుసుకోవడం. ప్రయత్నించి చూద్దాం. మన వల్ల కాకపోతే అప్పుడు సైకాలజిస్టు వుండనే వున్నాడు".

"సరే! మీ అభిప్రాయమే నా అభిప్రాయం " అంది మణిమేఖల.

@@@

అన్విత, తన తల్లిని కలిసిన విషయం, ఒక స్నేహితుడిద్వారా తెలుసుకున్నమనోజ్ లో భయం మొదలైంది. ఇంతవరకు తన నెంతో ప్రేమగా చూసుకునే తల్లిదండ్రుల ముందు తలదించుకోవల్సి వస్తోందని స్నేహితుల వద్ద వాపోయాడు.

"నువ్వెందుకు భయపడుతున్నావు? ఆమె నచ్చింది, ముద్దు పెట్టాను అని చెప్పు. ఇందులో తప్పేముంది? అమెరికాలో టీచర్ల ఎదురుగానే ముద్దులు పెట్టుకుంటున్నారు. మనకే ఈ ఆంక్షలు" అని ఒక స్నేహితుడు ధైర్యం చెప్పాడు.

ఇంకో స్నేహితుడు" నువ్వు ముద్దు పెట్టావనడానికి సాక్ష్యం యేది? సిసిటీవిలు లేవు, విద్యార్ధులెవ్వరూ చూడలేదు. అందుకని, అన్విత చెబుతోంది అబద్ధమని బుకాయించు" అని తెలివిగా తప్పించుకునే మార్గం చెప్పాడు.

నిజమే! సాక్ష్యమేది? కానీ అన్విత మాటలను తన తల్లిదండ్రులు నమ్ముతారు. ఆ అమ్మాయికున్న పేరు అలాంటిది. ఈ పరిస్థితిలో అబద్ధం వల్ల మేలు కన్నా కీడు జరిగే అవకాశముంది. అలా భావించిన అతను తల్లి దండ్రులకు అబద్ధం చెప్పే సాహసం చేయదల్చుకోలేదు. నిన్నటి వరకు ఘనకార్యంలా కనిపించినది, ఈ నాడు సంస్కార హీనమైన చర్యగా అనిపించడంతో మనోజ్ లో దిగులు మొదలైంది.

అలాంటి తరుణంలో అతనికి పిడుగు లాంటి వార్త వినవచ్చింది. కొందరు విద్యార్ధులు స్కూల్లోనే పోర్న్ చూస్తున్నారని అటెండర్ ద్వారా తెలుసుకున్న పిన్సిపల్, వారిని పిలిచి మందలించారు. అలా పిలిచిన వారిలో తన పేరు వుండక పోవడంతో మనోజ్ “థాంక్ గాడ్” అని ఊపిరి పీల్చుకున్నాడు.

@@@

అన్విత ఫిర్యాదు చేసి నాలుగు రోజూలైనా, తన తల్లిదండ్రులు ఆ ప్రస్తావన తేవకపోవడం, మనోజ్ ని విస్మయానికి గురిచేసింది. వారి వుదాసీనత అతడిలో ఆలోచనలను రేకెత్తించింది.

"నా ముద్దు విషయం తెలిసిందా, లేదా? తెలిసినా, తల్లిదండ్రుల వైఖరిలో కించిత్తు మార్పు లేదా? ఎందుకని? నన్ను క్షమించేసారా? లేక నన్నుదూరంగా పంపించివేయడానికి పధకం సిద్ధం చేసుకుంటున్నారా?"

ఎందుకైనా మంచిదని చదువు మీద పూర్వం కన్నా యెక్కువ శ్రద్ధ చూపడం మొదలుపెట్టాడు. మనోజ్ చర్యలు గమనిస్తున్న సుధాకర్, మణిమేఖల, ముసిముసిగా నవ్వుకున్నారు. సుధాకర్ భార్యతో ఇలా అన్నాడు

“చూడు, వాడిలో ఇంకా సున్నితమైన ఆలోచనలు వున్నాయి. ఇది మన అదృష్టం. చెబితే వినే దశలోనే వున్నాడు.”

@@@

పుదుచ్చేరీ బొటానికల్ గార్డెన్స్, ఫ్రెంచ్ వారి పాలనలో యేర్పాటైంది. అది ఇప్పుడు విభిన్న వృక్ష, పుష్ప జాతులకు నిలయమై, నగరం నడి బొడ్డులో వుండి, పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా వుంది..

సుధాకర్, మణిమేఖల, మనోజ్, ముగ్గురూ కలిసి వుద్యానవనాన్నిచూసి, ఒక చెట్టు క్రింద నీడలో విశ్రాంతిగా కూర్చున్నారు. అంతవరకు, అక్కడి చెట్ల ఆకృతులు, పుష్ప జాతులు, ఆక్వేరియంలోని చేపల గురించి మాట్లాడుతున్న మనోజ్, తండ్రి ముఖాన్ని చూసి, ఒక్క సారిగా నిశ్శబ్దాన్ని ఆశ్రయించాడు. అతని ఆరో యింద్రియం ప్రమాద ఘంటికను మ్రోగించింది. మనోజ్ ని చూస్తూ, సుధాకర్, ప్రశాంతవదనంతో యిలా ప్రశ్నించాడు.

"మనోజ్ నీ స్కూలు యెలా వుంటోంది?"

"బాగానే వుంది. వచ్చే నెలలో అదనంగా తరగతులను నడుపుతారట. పరీక్షలో మొదటి రాంకు లేదంటే రెండోది తప్పక తెచ్చుకుంటాను."

"నువ్వు మెడిసిన్ చేస్తాన్నావు. అదేనా, లేక మనసేమైనా మార్చుకున్నావా?" అని మణిమేఖల అడిగింది.

"మెడిసినే చేస్తానమ్మా. ఇంటరులో బాగా కష్ట పడి చదువుతాను. నీట్ పరీక్షలో మంచి రాంక్ తెచ్చుకుంటాను. నీకు ఓకే కదా అమ్మా? "

"మాకు మొదటినుంచీ, నమ్మకమే. కానీ ఇప్పుడిప్పుడే తగ్గుతోంది." అని మెల్లగా అన్నా డు సుధాకర్.

"ఎందుకు నాన్నా! అన్ని పరీక్షల్లో మంచి మార్కులే వస్తున్నాయి కదా."

"మార్కులు బాగుంటే చాలా? నీ ఏకాగ్రత, నీ ప్రవర్తన ల సంగతేమిటి?"

మనోజ్ నోట మాట రాలేదు.

"రెండేళ్ళు అహర్నిశలు కష్ట పడితే సీటు వస్తుంది. ఎంబీబియస్ నాలుగున్నర సంవత్సరాలు, పీజీ మూడు సంవత్సరాలు, మొత్తం పదేళ్ళు, చదివే శ్రద్ధ, ఏకాగ్రత నీకున్నాయా? లేక వేరే అలోచనలేమన్నా వున్నాయా?”

తండ్రి మాటలకు మనోజ్ వెంటనే జవాబివ్వలేదు. తల్లి కేసి చూసాడు.ఆమె ముఖంలోని అప్రసన్నత అతడిని బాధించింది. ఇదంతా ఆ రోజు చేసిన తప్పుకి ఫలితమని తనని తాను నిందించుకున్నాడు. ఒక్క క్షణం తర్వాత, మనోజ్ యిలా బదులిచ్చాడు.

" ఎంత కష్టమైనా నేను మెడిసినే చదువుతాను. మరింత ఏకాగ్రత, శ్రద్ధ పెంచుకుంటాను."

మణిమేఖల కలగ చేసుకుని ఇలా అడిగింది.

"నేను నమ్మాలంటే ఈ ప్రశ్నకు జవాబివ్వు. ఈ మధ్య ఫోర్న్ చూస్తున్నావు. ఎందుకు? బుర్ర పాడు చేసుకుని యేం సాధిద్దామని?"

"ఛీ! లేదమ్మా, నా స్నేహితులు పిలిస్తే వెళ్ళి చూసాను. అదీ ఒక్క సారే. నేనిప్పుడు వాళ్ళకి దూరంగా వుంటున్నాను. మొన్ననే మ టీచర్లు మాకు కౌన్సెలింగ్ యిచ్చారు, అందులో దృశ్యాలు అసహజమని, అలాంటి ప్రయోగాలు అనారోగ్యకరమని చెప్పారు. నేను ఇంకముందు వాటిని చూడనే చూడను." మనోజ్ ధృఢమైన స్వరంలో చెప్పాడు.

"మంచి నిర్ణయమే. మరి అన్వితను ఎందుకు ముద్దు పెట్టుకున్నావు? దానికి కారణమేమైనా వుందా?"

"తప్పేనమ్మా! ఆ రోజు, స్నేహితులతో ట్రూత్ అండ్ డేర్ ఆడాను. నాకు వాళ్ళిచ్చిన సవాలది. ఓడిపోకూడదనే పట్టుదలతో అలా చేసాను."

"నీ గెలుపు సరే! ఆ అమ్మాయి ఎంత బాధ పడి వుంటుందో ఆలోచించావా? ఆ అమ్మాయి ప్రిన్సిపాల్ కి చెప్పివుంటే, మాకెంత అవమానం కలిగేది? ఒక ఆడపిల్ల అనుమతి లేకుండా ముద్దు పెట్టుకుంటే అది పోలీసు కేసవుతుందని,పోక్సో చట్టం క్రింద నీకు జైలు శిక్ష పడే ప్రమాదముందని తెలుసా?"

" ఏదో ఆటలో అలా చేసాను. నన్ను క్షమించండి" అని బదులిస్తూ మనోజ్ అమితోద్వేగానికి గురయ్యాడు.

మణిమేఖల మనోజ్ దగ్గరకు జరిగి అతని శిరసును ముద్దాడుతూ, "నా కొడుకు ఎప్పుడు, ఎక్కడ తప్పు చేస్తాడో, ఏ ప్రమాదంలో చిక్కుకుంటాడో అని నాకు భయం కలిగేలా ప్రవర్తించ వద్దు. ఏ ఆడపిల్లా నీ వల్ల బాధపడకూడదు. జాగ్రత్త నాన్నా!" అని కన్నీరు పెట్టింది.

తల్లి కన్నీరుకు మనోజ్ కృంగిపోయాడు. తల్లి చేతిలో చెయ్యి వేసి" జాగ్రత్తగా వుంటానమ్మా! ఇక ముందు పొరబాటున గూడా తప్పు చేయను.నన్ను నమ్ము" అని బ్రతిమిలాడాడు.

మణిమేఖల కన్నీరు తుడుచుకుని, "చూడు నాన్నా! మంచి స్నేహితుల్లాగా, మనమొక జట్టుగా, నీ బంగారు భవిష్యత్తుకోసం కష్టపడదాం. సరేనా!"

"అలాగేనమ్మా! మీ దగ్గర యేదీ దాచను. "

కొడుకులో వున్న మంచి, అతనిలో ప్రవేశించిన చెడుని జయించిందని సుధాకర్ సంతోషించాడు అతడు కొడుకు భుజం మీద చేయి వేసి, అనునయంగా యిలా అన్నాడు.

"నీ చుట్టూ వున్న ప్రపంచం కలుషితమైనది. మద్యం, మాదక పదార్ధాలు, అశ్లీల సెక్స్ చిత్రాలు, బూతు పాటలు, ఇలా ఎన్నెన్నో... నిన్ను చెడు వైపు లాగేస్తాయి, నిన్ను నువ్వే నియంత్రించుకోవాలి. నువ్వు అర్జనుడిలా మారాలి. నిరంతర కృషి, యేకాగ్రత తో అతడు సవ్యసాచి అయ్యాడు. అంతిమంగా విజయుడయ్యాడు. శరీర ఆరోగ్యానికి వ్యాయామం చెయ్యి . మానసిక శక్తికి యోగా చెయ్యి. శ్రద్ధగా చదువుకొని, నీవు కూడా విజయుడివికా. మా అండ దండలు దేవుని ఆశీస్సులు

నీకు సదా వుంటాయి. "

@@@

ఇంటికి తిరిగి వచ్చాక సుధాకర్, భార్యతో ఇలా అన్నాడు.

" ఒకప్పుడు, బిడ్డలని, బాల్యంలో మాత్రమే చేయి పట్టి నడిపించాల్సిన అవసరం వుండేది. ఈ నాడు పరిస్థితులు మారిపోయాయి. కౌమార, యవ్వనదశలలో కూడా తల్లిదండ్రులు వారి ఆలోచనా సరళిని, నడవడికను గమనించుకోవల్సిన అవసరం వుంది. ఈ విషయం గుర్తుపెట్టుకుని, వాడికి మనిద్దరం తోడూనీడగా నిలవాలి. "

భర్త మాటలతో ఏకీభవించిన, మణిమేఖల,"మీ మాట నూటికి నూరు శాతం కరక్ట్. నేను వాడిని గమనించుకుంటాను" అని బదులిచ్చింది.

“వ్యక్తిత్వ నిర్మాణానికి నియంత్రణ ఒక్కటే చాలదు. వికాసం కూడా వుండాలి. అందుకోసం వాడిని ఒక వ్యక్తిత్వ వికాస ప్రోగ్రాం లో చేర్పిస్తాను.”

భర్త మాట విని మణిమేఖల సంతోషపడింది, బహుముఖ యత్నాల ద్వారా ద్వారా కొడుకుని కాపాడుకోగలుగుతామని ఆమె విశ్వసించింది.

@@@

సుధాకర్ ఒక స్థానిక సంస్థ నిర్వహిస్తున్న వారాంతపు వ్యక్తిత్వ వికాస ప్రోగ్రాములో మనోజ్ ని చేర్పించాడు. పజిల్స్, ఆటలు, డాన్సులు, చర్చలు, యిలా చైతన్య వంతమైన అంశాలున్న ఆ ప్రోగ్రాం మనోజ్ మనసుని ఆకట్టుకుంది. అతని దృష్టి, చీకటి కోణాలను వెదకడం మాని, వెలుగు పధంలోకి చొచ్చుకు పోవడం ప్రారంభించింది.

నేటి పోటీ ప్రపంచంలో ఎదురయ్యే సవాళ్ళు, వాటిని సమర్ధవంతంగా ఎదుర్కొని గెలిచి, నిలిచిన వారి జీవితాలు, ఆకళింపు అవుతున్న కొద్దీ, అతడికి లక్ష్యం పట్ల అభిమానం, పట్టుదల పెరిగాయి. ఈ వయసులో ప్రేమించాల్సింది జీవితలక్ష్యాన్నే గాని, యువతులను కాదని, అర్ధమైంది. కొడుకులో వస్తున్న మార్పుని మణిమేఖల గమనించింది

“జ్ఞాన దీపం వెలిగింది. లక్ష్యం ధృవ తారయై నిలిచింది. చెడునుంచి మంచికి పరివర్తన మొదలైంది. ఈ దేశానికి ఒకమంచి పౌరుని అందిస్తే చాలు, నా ఈ జన్మ ధన్యం” అని అనుకుంది మణిమేఖల.

@@@@@

మరిన్ని కథలు

Aashrayam
ఆశ్రయం
- సి.హెచ్.ప్రతాప్
Repati bhrama
రేపటి భ్రమ
- సి.హెచ్.ప్రతాప్
Arishadvargalu
అరిషడ్వర్గాలు
- సి.హెచ్.ప్రతాప్
Anumounam
అను"మౌ"నం
- దేవరకొండ ఫణి శ్యామ్
Thantu
తంతు
- Prabhavathi pusapati
Tandri nerpina patham
తండ్రి నేర్పిన పాఠం
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు