
సునీల్ 8 వ తరగత్ చదువుతున్నాడు. ఒక రోజు స్కూలుకు వెళుతున్న దారిలో, రోడ్డు పక్కన గాయాలతో, దీనంగా ఏడుస్తున్న ఒక చిన్న పిల్లిపిల్ల కనిపించింది. దాని వయస్సు సుమారు ఒకటి, రెండు నెలలు మాత్రమే ఉంటుంది. తల్లి నుంచి విడిపోయి ఉంటుంది. దాని కాలుపై తీవ్రమైన గాయం తగిలి, రక్తం ఆగకుండా కారుతోంది. ఆ నొప్పిని, ఆకలి బాధను తట్టుకోలేక, ఆ పిల్లిపిల్ల 'మ్యావ్ మ్యావ్' అంటూ ఆర్తనాదం చేస్తోంది. ఆ దృశ్యం చూడగానే సునీల్‌కు జాలి కలిగింది. వెంటనే దాన్ని అతి జాగ్రత్తగా ఎత్తుకుని, ప్రేమగా నిమిరి, ఇంటికి తీసుకువచ్చాడు.
బడి మానేసి, దుమ్ము ధూళితో మట్టి కొట్టుకుపోయి ఉన్న ఆ పిల్లిపిల్లతో ఇంటికి తిరిగి వచ్చిన సునీల్‌ను చూసి అతని తల్లి శారదమ్మ ఆగ్రహంతో మండిపడింది. "ఈ దారిన పోయే దరిద్రాన్ని నువ్వు ఎందుకు ఇంటికి తీసుకువచ్చావు?" అని కోపంగా అడిగింది.
"అమ్మా, ఈ చిన్నదానికి అమ్మ కూడా లేదు. ఆకలితో అల్లాడుతోంది, పైగా దెబ్బ కూడా తగిలింది. దయచేసి దీనికి వైద్యం చేయిద్దాం," అని సునీల్ బ్రతిమిలాడాడు.
మొదట్లో శారదమ్మ అస్సలు ఒప్పుకోలేదు. ఆమెకు పట్టింపులు, శుచి, శుభ్రత విషయంలో కఠిన నిబంధనలు ఎక్కువ. జంతువులు ,పశుపక్ష్యాదులు ఇంట్లో ఉంటే తన ఆచారాలు భ్రష్టమైపోతాయని ఆమె గట్టి నమ్మకం. అయితే సునీల్ మాత్రం తన పట్టు వదల్లేదు. "ఎలాగైనా దీనికి వైద్యం చేయించి, కాస్త కోలుకున్నాక బయట వదిలేద్దాం. లేకపోతే ఏ పెద్ద జంతువో వచ్చి దీని ప్రాణం తీస్తుంది. అలా జరిగితే మనకే పాపం చుట్టుకుంటుంది. పైగా, ఒక జీవికి ప్రాణం పోస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది," అని నచ్చజెప్పాడు.
పుణ్యం, పాపాల ప్రస్తావన వచ్చేసరికి శారదమ్మ కాస్త మెత్తబడింది. ఆమె కొన్ని కఠిన షరతులు విధించింది: "సరే, కానీ దీన్ని ఇంట్లోకి తీసుకురాకూడదు. నువ్వు దీనితో ఆడుకున్న ప్రతిసారీ తప్పకుండా స్నానం చేయాలి. దీని ధ్యాసలో పడి చదువును నిర్లక్ష్యం చేయకూడదు. ఈ పిల్లిపిల్ల తనంతట తాను స్వతంత్రంగా బ్రతకగలిగే వయస్సు వచ్చాక, దాన్ని మన ఇంటికి దూరంగా వదిలేయాలి."
ఆ క్షణం నుండి సునీల్ ఆ పిల్లిపిల్లను కంటికి రెప్పలా చూసుకోసాగాడు. దాన్ని శుభ్రం చేస్తూ, వేళకు పాలు, మెత్తని ఆహారం పెడుతూ సంరక్షించాడు. ఇంటి వెనుక పెరటిలో కార్టన్ పెట్టెలను ఉపయోగించి ఒక చిన్న గూడు ఏర్పాటు చేసి అందులో ఉంచాడు.
నెల రోజులు గడిచేసరికి, ఆ పిల్లిపిల్ల ఎంతో ఆరోగ్యంగా, బొద్దుగా తయారయ్యింది. ఇంటి చుట్టూ చలాకీగా తిరుగుతూ, మనుషులు కనిపిస్తే చాలు చుట్టూ తిరిగి, కాళ్లకు తన ముఖాన్ని రాసుకుంటూ ప్రేమను వ్యక్తం చేసేది.
ఒక రోజు, తల్లికి ఇచ్చిన మాట ప్రకారం సునీల్ ఆ పిల్లిపిల్లను తీసుకువచ్చి శారదమ్మకు చూపిస్తూ, "అమ్మా, ఇది ఇప్పుడు బాగా పెద్దదయ్యింది, ఆరోగ్యంగా కూడా ఉంది. ఈ రోజు దీనిని నేను దూరంగా వదిలేస్తాను," అన్నాడు.
అంతలో ఆ పిల్లిపిల్ల సునీల్ చేతుల్లోంచి దూకి, నేరుగా శారదమ్మ చుట్టూ తిరుగుతూ, ఆమె కాళ్లను ఎంతో ప్రేమతో రాసింది. "మీరంటే నాకెంతో ఇష్టం. దయచేసి నన్ను వదలవద్దు. మీకు ఎంతో విధేయతతో ఉంటాను," అన్నట్టుగా ఆ కళ్ళు శారదమ్మను చూసాయి.
ఆ పిల్లి చూపుల్లోని స్వచ్ఛమైన భావాన్ని అర్థం చేసుకున్న శారదమ్మ మనస్సు కరిగిపోయింది. ఆమె హృదయం ఆర్ద్రమై, వెంటనే దాన్ని చేతుల్లోకి తీసుకుని, దాని శరీరంపై ప్రేమగా రాయడం మొదలుపెట్టింది.
తల్లి చర్యల్లోని అంతరార్థాన్ని గ్రహించిన సునీల్ మనస్సు ఆనందంతో నిండిపోయింది. నిస్సహాయ జీవికి ఆశ్రయం దొరికినందుకు అతడు ఎంతో సంతృప్తి చెందాడు.