"అక్క! నువ్వు రామం కూతురు పెళ్ళికి వెళ్ళడానికే నిశ్చయించు కొన్నావా ?"సుధ గొంతు ఫోన్లో కొంచెం అసహనంగానే వినపడుతోంది
"అవును సుధా, వెళదామని అనుకొంటున్నాను ,వాడిని వాడి కుటుంబాన్ని చూసి దాదాపు రెండు దశాబ్దాల పైనే అయ్యింది.ఈ పెళ్లి వంక ఐన మళ్ళీ వాడిని కలిసే అవకాశం దొరకడం నాకు చాల సంతోషం కలిగిస్తోంది ,"చాలా ఉత్సాహం గా,ధృడంగా చెప్పింది శిరీష.
మనకి ఎందుకే అక్క ఈ అక్కరలేని చుట్టరికం,బంధు ప్రీతి ..చెపితే వినవు కదా , వాడి సొంత అక్కలే మనకి ఎందుకులే అని అనుకొంటుంటే ,నువ్వెంటే తగుదునమ్మా అని వెళ్తానంటావు? దాదాపుగా అరుస్తున్నట్టు అడిగింది.
నేను చెప్పేది నెమ్మదిగా విను సుధ,మనం వాళ్ళని కలిసి దాదాపు ఇరవై ఏళ్ళు అయ్యింది .వాళ్ళు వీళ్ళు చెప్పిన గాలి కబుర్లు తప్పించి మనకి వాళ్ళగురించి ఏ విషయాలు తెలియవు,ఇన్నాళ్ళకి అభిమానంగా పెళ్ళికి పిలిచాడు ,వెళుతున్నాము అంతే. ఆదివారం రాత్రికి పెళ్లి. రేపు ఉదయం మన కారులోనేను బావ బయలుదేరి వెళుతున్నాము.పెళ్ళికి నాతొ పాటు నువ్వు కూడా వస్తున్నావు ,మారుమాట్లడా కుండా బయలుదేరు "
అది కాదు అక్క అక్క ...సుధా ఇంకా ఎదో చెప్ప బోయింది కానీ ఇంక వినేది ఏమి లేదు అన్నట్టు ఫోన్ డిస్కోనెక్ట చేసింది శిరీష.
సుధ కి ఇష్టం లేదేమో శిరీష ,ఎందుకు బలవంతం చేస్తావు?పక్కనే ఉండి మాటలు వింటున్న చదువుకొంటున్నపేపర్ మడత పెడుతూ అడిగారు శేషగిరి.
ఇష్టం ఉండటం లేకపోడం ఏమిటండి ?మనవాళ్ళు పెళ్ళికి పిలిచారు వెళ్ళాలి అంతే,ఎప్పుడో జరిగిన విషయాలు మనసులో పెట్టుకొని బంధుత్వాలని వదులు కొంటామా ఏమిటి?రామం మనకు పరాయి వాడ ఏమిటి ?స్వయానా మేనమామ కొడుకు. సుధ చిన్న పిల్ల అనుబంధం,ఆప్యాతల గురించి దానికి ఏమి తెలుసు, ముందు బెట్టు చేస్తుంది గానీ అదే బయలు దేరుతుంది చూస్తూ వుండండి .అన్నట్టు డ్రైవర్ కి పొద్దున్నే రమ్మని కబురు చెప్పారా ? ప్రయాణానికి బట్టలు సర్దుకోవటం మొదలు పెట్టాలి అనుకొంటూలేచి బీరువా దగ్గరి కి వెళ్ళింది శిరీష .
సుధని ఐతే పెళ్ళికి రావలిసింది అని గదమాయించి అనేసింది కానీ,శిరీష మనసులో అనేక అనుమానాలు సుడులు తిరుగుతున్నాయి .
శిరీష అమ్మపార్వతి ,సుధ వాళ్ళ అమ్మశివాని ,మధ్యన రామం వాళ్ళ నాన్నప్రభాకర్ . ఒకే తల్లి పిల్లలు. సుధ అవ్వడానికి పిన్ని కూతురు ఐన సొంత చెల్లెలి కన్నా చనువుగా ఉంటుంది,రామంకి సొంత అక్కల కన్నా నాతోనే చనువుగా ఉండేవాడు. చిన్నతనం లో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వేసవి సెలవులకి వెళ్ళినప్పుడు అందరం అరమరికలు లేకుండా సంతోషంగా గడిపే వాళ్ళము.
ఇంచుమించు అమ్మమ్మ తాతగారు బతికి ఉన్నన్నాళ్ళు బంధాలు బంధుత్వాలు , రాక పోకలు పలకరింపులు అన్ని సవ్యం గానే ఉండేవి,రాను రాను మనుష్యుల మధ్య దూరం పెరిగి మనసులు ఇరుకు అయ్యి దూరాలు పెరిగిపోయాయి .
తన పిల్లకంటే ఉన్నత స్థాయి లో మా పెళ్లిళ్లు అయ్యాయని ,పైగా వయసులో తమ కంటే పెద్దవాళ్ళు ఐన తన పిల్లలికి పెళ్లిళ్లు ఇంక కుదర లేదని రామం వాళ్ళ నాన్నప్రభాకరం మావయ్య నా పెళ్ళికి గాని ,సుధ పెళ్ళికి గాని రాలేదు.ఉన్న ఒక్కగాని ఒక్క మేనమామ అయివుండి మావయ్య పెళ్ళికి రాకపోవటం అమ్మ, పిన్నిఆ బాధ ని జీర్ణించు కోలేకపోయారు. మనలో ఎన్ని చిన్న చిన్న మాట పట్టింపులు వున్నా పెళ్ళిలో తన మేన మామ ధర్మం నిర్వహించడాన్ని కి ఐన మావయ్య రాక పోవటం చాల బాధ కలిగించే విషయం, ఎందరు వున్నా తోడబుట్టినవాళ్లు దూరం పెడితే కలిగే బాధ భరించలేనిది అని అమ్మ పిన్ని ఇప్పటికి కన్నీరు పెడుతుంటారు, తమ్ముడి ప్రభాకర్ యోగక్షేమాల సమాచారం తెలియక ఎక్కడ వున్నాడో, ఎలా ఉన్నాడో అని తలచుకొని అందరు బాధ పడుతూనే వుంటారు.. ఇన్నాళ్ళకి మేనమామ తరఫు నుంచి మొదటి సారి ఒక కబురు ,ఒక పెళ్లి పిలుపు వచ్చాయి .
కాలం ఎవరి కోసం ఆగదు అన్నట్టు మా అందరి జీవితాల లో మార్పులు వచ్చేసాయి. చాలాకాలం వరకు ప్రభాకర్ మావయ్య విషయాలు తెలియలేదు. కొన్ని ఏళ్ళక్రితం రామం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని ,వర్ణాంతర వివాహం వద్దు అన్నందుకు తల్లిని,తండ్రిని వదిలి విదేశాలు వెళ్లిపోయాడని కొన్నాళ్ళు కూతుళ్ళ వద్ద ఉండి అత్తయ్య మావయ్య సొంత వూరు చేరారని ,ఈ మధ్యే రామం విదేశాల నుండి తిరిగి వచ్చాడు అని తెలిసింది. వెళ్లి కలుద్దాము అని అనుకొనే లోపల తన కూతురి పెళ్లి అంటూ వాళ్ళ నుంచి నుంచి పిలుపు వచ్చింది. అమ్మ నాన్న ,పిన్ని బాబాయ్ కూడా వస్తామన్నారు .కానీ పెద్ద వయసులో కారులో అంత దూరం ప్రయాణం చేయలేరని ,పైగా ఇన్నేళ్ల తర్వాత తమ్ముడిని ఇలా కలవటం సరి కాదు అని అనిపించి ,పెళ్లి అయ్యాక మేన మామని స్వయంగా వెంట పెట్టుకొని తీసుకొని వస్తానని హామీ ఇచ్చాక మేము వెళ్ళడానికి అనుమతించారు.
సుధని కూడా ఒప్పించాను కానీ అసలు ఇన్నేళ్ల తర్వాత ఇలా కలవటం ఏమో ఎలా ఉండపోతోందో .......
************
పెళ్లి మండపం కళకళలాడుతూ వైభవంగా ఉంది. కార్ దిగుతున్న నన్ను గుర్తుపట్టి రామం సంతోషంతో ఎదురు వచ్చి " రా రా వదిన ,రండి అన్నయ్య ,పద సుధ అంటూ కన్నుల నీరు మాకు కనపడకుండా ఉత్తరీయం తో వత్తు కొంటూ లోని కి రమ్మని పిలిచాడు."రాధా నేను చెపుతూ ఉంటా నే శిరీష ,సుధ అని భార్యని పరిచయం చేసాడు. అమ్మ నాన్న కూడా మీ కోసం ఎదురు చూస్తున్నారు, పద వదిన ముహూర్తం దగ్గర పడుతోంది అంటూ మా చేతులు పట్టుకొని మండపం దగ్గరికి తీసుకొని వెళ్ళాడు.
పీటల మీద పెళ్లి కొడుకు ,పెళ్లి కూతురు చక్కని ముస్తాబు తో సాక్షాత్తు సీతారాముల్లా వున్నారు. పెళ్ళితంతు అంతా కన్నుల పండగల జరిగింది.
శిరీష ,సుధ పెళ్లి హడావుడి సర్దుమణిగి భోజనాలు అయ్యాక ప్రభాకర్ మావయ్య శాంత అత్తయ్య ని కలవడానికి వెళ్లారు.రామం అక్కలు నీరజ విరజ ఎదురు వచ్చి మీరు రావడం చాల ఆనందం కలిగించింది ,మళ్ళీ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో కలుసు కొన్నంత సంబరంగా ఉంది అంటూ దగ్గరకు తీసుకొని అత్తయ్య మావయ్యల మంచం మీద కూర్చో పెట్టారు.
చాల రోజుల తర్వాత ఇంత దగ్గరగామేనమామని అత్తయ్యని చూశారేమో ఎదో తెలియని అనుభూతి తో మనసు మూల్గి నట్టు అనిపించింది. చిన్నప్పుడు చూసినప్పుడు సినిమా హీరో ల ఉండేవాడు ,ఇప్పుడు ఇద్దరు బాగా వడలిపోయారు , ముసలితనం ఛాయలు బాగా కనపడుతున్నాయి.నన్ను ,సుధని చూసి తన అక్క,చెల్లెలి లనే చూస్తున్నంత సంబరపడిపోయారు మావయ్య.. వయసు పైన పడటం వల్ల బింకం తగ్గి "అక్కవాళ్ళు ఎలా వున్నారు ?నన్ను గుర్తు చేస్తున్నారా? నా తప్పును మన్నించారా" అంటూ చిన్నపిల్లాడిలా కళ్ళ నీళ్ల పర్యంతంగా అడిగాడు.
" బాగున్నారు మావయ్య ,ఎప్పుడు మీ గురించి చెపుతూ వుంటారు,ఎలా వున్నారు మీరు?మీ ఆరోగ్యం ఎలా ఉంది "శిరీష చేతిలో చెయ్యి వేస్తూ అడిగింది.
"మీరు ఇద్దరు నన్ను క్షమించాలి ,అప్పట్లో ఎదో తెలియని పొగరు ,ఉక్రోషం ,ఆవేశం,వయసు బిగువు వల్ల వచ్చే అహంకారం నన్ను మీ పెళ్ళిళ్ళకి రానీయకుండా చేసింది.తప్పు తెలుసుకొని అక్కబావ ల దగ్గరికి వచ్చి క్షమాపణ అడగటానికి మొహం చెల్లలేదు .దాంతో దూరాలు పెరిగిపోయాయి.మేనమామ గా దగ్గరవుండి నేను చెయ్యాల్సిన ధర్మం చెయ్య లేకపోయాను, దానికి తగ్గ ఫలితం కూడా అనుభవించాను,నా పిల్లలో ఒకరిపట్ల ఒకరికి అనురాగం ఆప్యాయత లేకుండా పోయాయి.తల్లి తండ్రుల నుంచే పిల్లలు సత్ప్రవర్తన నేర్చు కుంటారు కదా ,నేను నా తొడ బుట్టిన వాళ్ళ పట్ల నా ధర్మం నెరవేర్చలేదు ,ఫలితం నా కొడుకు కూడా తన తోడబుట్టిన అక్కల ప్రేమ అనురాగాలకి దూరం అయిపోయాడు."గొంతు జీర పోవటం వలన ఆగి "వయసులో చిన్న పిల్లలు ఐన నన్ను మన్నించమని అడుగుతున్నాను "అంటూ ఇద్దరినీ దగ్గరికి తీసు కొన్నాడు.
అనుకోని సంఘటనకి సుధ నివ్వెర పోయింది,ఎప్పుడు అమ్మ పెద్దమ్మ మా తమ్ముడు అంత మంచివాడు అంత మనుసున్నవాడు అని చెప్పగా వినడమే గానీ మొదటిసారి నిర్మలమైన మనసుతో మాట్లాడుతున్న మావయ్యని చూసి విన్నది నిజమేనా అన్న భావం తో "పెద్దవారు అంత మాట అనకండి మావయ్య ,ఇప్పుడు మిమ్మలిని చుస్తే అమ్మ వాళ్ళు ఎంత సంతోషిస్తారో"కళ్ళ నీళ్లు తుడుచు కొంటూ చెప్పింది.
"నిజం మావయ్య !ఇన్నాళ్లు ఈ ఆప్యాయతకి అనురాగానికి దూరం అయి పోయాము మావయ్య.....అత్తయ్య ఇన్నాళ్లుఅమ్మ ,పిన్ని మీ జాడ తెలియక మిమ్మలిని కలవ లేక పోయారు.మీ గురించి ఆరా తెలిసాక కలుద్దాము అనుకొనే లోపల రామం నుంచి పెళ్లి శుభలేఖ అందింది. "తప్పు మావైపు కూడా కొంచెం ఉంది అనేలా ధ్వనిస్తూ చెప్పింది.
"ఏదయినా మనకి దగ్గరగా ఉంది అన్నప్పుడు దాని విలువ తెలియదు,అది దూరం అయితేనే తెలుస్తుంది దాని విలువ. అది వస్తువు ఐన లేదా బంధం ఐన ,విదేశాల్లో వున్నప్పుడు నాకు బంధాలు బాంధవ్యాల విలువ పూర్తిగా తెలిసి వచ్చింది.నా అనేవాళ్ళు ఇంతమంది ఉండికూడా నేను ఒంటరిగా ఎందుకు బ్రతుకుతున్నానో ,ఏమేమి కోల్పోతున్నానో తెలిసి వచ్చింది" గదిలోకి వచ్చి తండ్రి కాళ్ళ వద్ద కూర్చుంటూ చెప్పాడు రామం .
" నాకు మొదటి నుంచే తెలుసు మన మధ్య అనుబంధం చెక్కు చెదర లేదని ,కానీ ప్రతి వాళ్ళు బింకంగాను ,మొదటి అడుగు నేనే ఎందుకు వెయ్యాలి అన్న పట్టుదలతోనూ ,మనస్సులో కలవాలని ఉన్నకలవకుండా ఇలా దూరంగా ఉండి పోయాము" అని,"మావయ్య.. అమ్మ పిన్ని వయసు భారం వల్ల పెళ్ళికి రాలేక పోయారు ,
రేపు మాతో పాటు మన అందరం కలిసి మా ఇంటికి వెళుతున్నాము.మిమ్మలిని కలవాలని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు " నిజమా అక్క! రేపు మావయ్య వాళ్ళు మనతో వస్తున్నారా ?నేను ఇప్పుడే ఫోన్ తీసుకొని అమ్మకు ఈ విషయం చెపుతాను అంటూ సుధ చిన్నపిల్లలా సంబరపడిపోయింది.
**************
" నన్ను క్షమించి ,ఏమైనా మాట్లాడు అక్క" మావయ్య అమ్మ కాళ్ళ దగ్గర కూర్చుని అడుగు తున్నాడు ."బావ మన్నించాను అని ఒక్క మాట అను బావ "దాదాపు వచ్చినప్పటి నుంచి మావయ్య పదే పదే అడుగుతున్నాడు.మావయ్య కనిపిస్తే"మా ప్రేమ లో ఏమి లోటు ఉంది అని అనిపించి నీ జీవితం లో నుంచి మమ్మలిని అంత దూరంగా నెట్టేసావు అని అడుగుతాను "అన్న అమ్మ మౌనంగా తమ్ముడి తల నిమురుతూ ఉండిపోయింది.అందరి మనసులు భారంగా వున్నాయి.అందరి కళ్ళు చమర్చి వున్నాయి .అందరు అమ్మ ఏమి మాట్లాడు తుందా అని చూస్తున్నారు.
"దాదాపు పాతిక ఏళ్ళు ,పెద్దగా ఇది అని చెప్పడాని కి కారణాలు ,సమస్యలు లేకపోయినా ఒక కుటుంబం చెదరి పోయింది ,నువ్వు బంధాలని చాల తేలికగా తీసుకొని మా నుండి దూరంగా వెళ్ళిపోయావు ప్రభాకరం .మనిషివి దూరం అయ్యావుగాని మనసులో ఎప్పుడు వున్నావు లేవయ్యా ,లే లే లేచి పైన కూర్చో ,మనలో మనకి మన్నింపు ఏమిటి?" అంటూ ప్రభాకరాన్ని కుర్చీ లో కూర్చో పెట్టారు నాన్నగారు.
"చిన్నప్పుడు నీకు మాటలు రావటం లేటు అయ్యిందని అమ్మ బెంగ పడుతుంటే నేను చెల్లి నీకు ప్రతి పదం పలకడం లో సహాయ పడే వాళ్ళం,అటువంటి మాతో మాట్లాడటం ఏమిటిలే అని ఎంత తేలికగా తీసుకొన్నావు రా "గంభీరంగా వినపడింది అమ్మ గొంతు.
తమ్ముడు కనిపిస్తే చాలు కాలర్ పట్టి మరీ నిలదీస్తాను అన్న పిన్ని కూడా "తొడ బుట్టిన వాడిగా నీ నుండి మేము ఆశించింది ఏమి లేదు,కేవలం అక్క,చెల్లి ఎలా వున్నావు అన్న ప్రేమగా పలకరింపు తప్ప,అది కూడా భారం అయి పోయింది నీకు,నీ గురించే నువ్వు చూసు కొన్నావు కానీ మా అత్తవారి ఇంట్లో మా పరువు ఏమి అవుతుందని కానీ,బావలకి ఇవ్వాల్సిన కనీస మర్యాద కూడా అదే అని తెలుసు కో లేక పోయావు" ఇన్నేళ్ల నుంచో ఉగ్గపట్టు కొన్న బాధ గొంతులో వినపడేలా అడిగింది.
"నీ మీద కోపం అప్పుడు లేదు,ఇప్పుడు లేదు,గడిచిన కాలాన్ని తిరిగి తేలేము,కలిసి ఉంటే నెమరు వేసుకునేందుకు,పిల్లలకి చూపించేందుకు కొన్ని అనుభూతులు జీవితపు విలువలు ఉండేవి. ఇప్పుడు జీవిత చరమాంకం లో కి వచ్చేసాము ,ఇప్పటి కి ఐన కలిసామని అమ్మ నాన్నల ఆత్మలు సంతృప్తి పడతాయి,పద ఎప్పుడు ఎంగిలి పడ్డారో ఏమో ,కలిసి అందరం భోజనం చేద్దాము "వాతావరణం తేలిక పరుస్తూ అమ్మ అందరిని లేవదీసింది.కనపడిన వెంటనే ఎన్నో అడగాలని అనుకొంది కానీ వృద్ధ్యాపు ఛాయలు కనపడుతూ క్షమించు అని అడగటానికి వచ్చిన తమ్ముడిని మనస్ఫూర్తిగా మన్నించ గలిగింది అమ్మ.
"నిజం అక్క మీరు చెప్పింది,పట్టుదలతో రాలేకపోయాను గానీ,మీ అభిమానం ఆప్యాయత నేను మరిచిపోలేదు అక్క ,ఇప్పుడుకూడా నా కొడుకు కి రక్త సంబంధం ఎంత గొప్పదో , మానవీయ బంధాల విలువలు ఎంత అపురూపమని తెలిసి నేను ఇన్నాళ్లు మూర్ఖత్వంతో ఎన్ని కోల్పోతున్నానో తెలియ చెప్పి మన మధ్య ఏర్పడిన దూరం పోయి అందరం ఒక్కటి అయ్యేలా చేస్తానని వేసిన మొదటి అడుగు ఫలితమే అక్క ,ఈ రోజు మళ్ళి నేను మీ అందరి మధ్య నిలబడగలిగేలా చేసింది "సంతోషం తో కళ్ళ నీళ్లు తుడుచుకొంటూ చెప్పాడు ప్రభాకరంమావయ్య.
ఇది ఇంటిటి గాధ,ప్రతి ఇంటి కధ.ఎన్నో కుటుంబాలు ఎవరు ముందు అడుగు వెయ్యాలి అన్న భావం తో తప్పు అని తెలిసినా కూడా తమవారిని కలవలేక దూరంగా ఉండి పోతున్నారు. కథ లో రామం ల "కలిసి ఉంటే కలదు సుఖం" అని తెలుసుకొని "మొదటి అడుగు" వేయ గలిగిన నాడే ఇటువంటి దూరాలు తరిగి మరల కుటుంబాలలో సంతోషం వెల్లి విరియ గలదు అని ఆశిస్తూ...

