గుణం ప్రధానం! - చెన్నూరి సుదర్శన్

Gunam pradhaanam

“హరీంద్రా.. నీవు లేనిదే నేను బ్రతకను” అంటూ కంట నీరు పెట్టుకుంది కళ్యాణి.

“నేను మాత్రం బ్రతగ్గలనా కళ్యాణీ!” అంటూ ఆమెను గుండెలకు హత్తుకున్నాడు హరీంద్ర.

ఇరువురి మధ్య కాసేపు మౌనం అలుముకుంది. కళ్యాణి ఎదలో నుండి తన్నుకువస్తున్న బాధకు నివారణోపాయం చెప్పాలని.. తన మనసులోని నిర్ణయాన్ని బయటపెట్టాడు హరీంద్ర.

“చూడు కళ్యాణీ.. దైవవశాత్తు నాదిశలో మార్గం సుగమమయ్యింది. ఇక మిగిలింది నీ నిర్ణయాన్ని అడ్డుకుంటున్న వారికి తగిన బుద్ధి చెప్పడమే. అప్పుడే మనం వివాహం చేసుకోగలం.. నేనొక సలహా ఇస్తాను. దాన్ని అమలుపర్చడం అంతా నీ చేతుల్లోనే ఉంది” అంటూ కళ్యాణి వంక ‘ఏమంటావ్?’ అన్నట్టుగా చాశాడు హరీంద్ర. ‘ఏంటా సలహా?’ కళ్ళతోనే ప్రశ్నించింది కళ్యాణి.

“నువ్వు నర్సువు కదా..!” అంటూ చేయాల్సిన పని వివరించాడు. “గుండె దిటవు చేసుకొని పని పూర్తి చేస్తేనే మనకు శాశ్వత ఆనందం” తప్పదన్నట్టుగా అర్థించాడు.

కళ్యాణి మౌనమే అంగీకార సమాధానమని సంబరపడ్డాడు హరీంద్ర.

***

హరీంద్ర సలహాను అమలు పర్చాలని సర్వసన్నద్ధంగా ఇంట్లోకి అడుగు పెట్టింది కల్యాణి. వంట గదిలో నుండి తన గురించి మాట్లాడుకోవడం.. రహస్యంగా వినసాగింది.

“కళ్యాణికి ఇష్టమని పాయసం చేస్తున్నాను సదయ్యా. బిడ్డ పొద్దంతా రోగులకు సేవలు చేస్తుంటే.. ఏం తినబుద్ధైతది చెప్పు? తీసుక పోయిన టిఫిన్ సగం ఇంటికే తిరిగి తెస్తోంది. నా ప్రాణమంతా అవిసిపోతోంది. రోజూ ఏదో ఒక పిండి వంట చేయందే.. బిడ్డ కడుపునిండా తినందే.. నాకు నిద్రపట్టదు” అంటుంటే శాంతమ్మ ముఖంలో దిగులు ప్రస్ఫుటమవుతోంది. ఆమె ఆవేదనను అర్థం చేసుకున్నాడు సదానందం . తనను ఎంతో ఆప్యాయంగా ‘సదయ్యా!’ అని పిలిచే శాంతమ్మ వంక చిరునవ్వుతో చూసుకుంటూ..

“అందుకే అంటారు.. తల్లి మనసు వెన్నలాంటిదని. అంత ప్రేమ ఉన్నదానివి.. బిడ్డ పెండ్లి ముందుపడి చేయడంలేదెందుకు?” అంటూ కాస్త వెటకారంగా అడిగాడు సదానందం.

“అదుగో మళ్ళీ నామీదకే తెస్తున్నావు. కులం కాని వాడిని ఇంటల్లుడుగా తెచ్చుకుంటే ఊళ్ళో పరువు పోతుందని మనం మొదట అనుకున్నది నిజమే.. కులవృత్తిని కాపాడుకోవాలని అప్పట్లో అంతా అలా తాపత్రయ పడేవారు. మనమూ కులవృత్తికి తిలోదకాలిచ్చి బండి మీద కూరగాయలు అమ్ముకుంటున్నాం. బిడ్డ ఎంత బాధ పడుతోందో గమనించడం లేదా? నిద్రలో అది ఏడుస్తోందని చెప్పినా.. నీ మనసు కరగడం లేదు. కులం.. కులమని పట్టుకొని వేళ్ళాడుతున్నావు” దెప్పి పొడిచినట్టుగా అంది శాంతమ్మ.

“కులం కాదు శాంతమ్మా.. గుణం ప్రధానం!. నీఉపదేశంతో.. నేనూ కులం పట్టింపులను సడలించాను. హరీంద్ర ఎలాంటి వాడో!.. మన ఒక్కగానొక్క బిడ్డను బాగా చూసుకుంటాడో!.. లేదోనని అతని గుణగణాలను ఆరాతీశాను. ఒక ఘోరమైన నిజం బయట పడింది. హరీంద్ర ఇంట్లో కూడా మన అమ్మాయితో పెళ్ళికి ఒప్పుకోలేదట. అయితే వారి అడ్డు తొలగించుకోవాలని పథకం వేసి.. తల్లిదండ్రులు కారుప్రమాదంలో అసువులు బాసేలా చేసాడట. అలాంటి వాడు మన అమ్మాయితో మాత్రం కాపురం సజావుగా చేస్తాడని నమ్మకం ఏమిటి? మరో అమ్మాయి మీద మనసుపడితే.. మన కళ్యాణిని కూడా ఒదిలించుకుంటాడేమోనని భయపడుతున్నాను” అంటుంటే సదానందం కళ్ళు కన్నీటి కడవలయ్యాయి.

శాంతమ్మ గజ, గాజా వణకి పోతూ సదానందాన్ని హృదయానికి హత్తుకొని బావురుమంది.

ఆదృశ్యం చూడగానే కళ్యాణి హ్యాండ్ బ్యాగ్ ను నేలకు విసరికొట్టి.. వాయు వేగంగా వెళ్లి తల్లిదండ్రుల కాళ్ళమీద వాలిపోయింది. శాంతమ్మ, సదానందం నివ్వెర పోయారు. లిప్తకాలంలో తేరుకొని కళ్యాణిని పైకి లేపి తమ గుండెలకు హత్తుకున్నారు. తమ మాటలు విన్నదేమోనని.. హ్యాండ్ బ్యాగు నుండి నేల మీద పడ్డ సిరంజిని చూస్తూ..

“మా కాళ్ళ నొప్పులకు ఇంజక్షన్ చేస్తానని తెచ్చావమ్మా?” అంటూ మాట మార్చింది శాంతమ్మ.

“అవునమ్మా.. రేపు మళ్ళీ తెస్తాలే..” అంటూ మళ్ళీ వారి పాదాలపై తల ఆన్చి కన్నీటితో కడుగసాగింది కళ్యాణి.

క్షణకాలం ఆలస్యమైతే.. హంతకురాలుగా మారేది. సర్వదా తన మేలును కోరే తల్లిదండ్రులను విదిలించుకోవాలని హరీంద్ర పథకానికి తల వంచిన ఆమె కన్నీరు విషతుల్యమైన సిరంజీలోని మందుకు కట్ట వేసింది.*

మరిన్ని కథలు

Vanta gadi lo veerudi katha
వంట గదిలో వీరుడు కథ
- రాము కోలా దెందుకూరు
Avadhulu daatina abhimanam
అవధులు దాటిన అభిమానం
- మద్దూరి నరసింహమూర్తి,
Maarina jeevitham
మారిన జీవితం
- Prabhavathi pusapati
Dharmo rakshathi rakshitaha
ధర్మో రక్షతి రక్షితః
- డా:సి.హెచ్.ప్రతాప్
Prathiroopam
ప్రతిరూపం
- డా:సి.హెచ్.ప్రతాప్
Maarpu manathone
మార్పు మనతోనే
- జ్యోత్స్న జల్లూరి
Samayaspoorthi
సమయస్ఫూర్తి
- డా:సి.హెచ్.ప్రతాప్
Asooya techhina chetu
అసూయ తెచ్చిన చేటు
- బోగా పురుషోత్తం , తుంబూరు.