అరవై వేల కిలోమీటర్లు - Priyatham Swamy

Aravai vela kilomeetarlu

మా ఇంట్లో కారు గొడవ మొదలై అప్పటికే చాలా రోజులైంది.

"ఉన్న స్కూటీ బానే ఉంది కదా మధు, ఇప్పుడు కారు ఎందుకు?" అని నేను ఎంత వాదించినా నా భార్య వినలేదు. నెల క్రితం ఆఫీస్ నుంచి వస్తూ వానలో స్కూటీ పైనుంచి నేను జారిపడ్డప్పటి నుంచి తన పట్టుదల ఇంకా ఎక్కువైంది. నేను వాదించి విసిగిపోయి, చివరికి ఒక సెకండ్ హ్యాండ్ కారు కొందామని నిర్ణయించుకున్నాను.

షోరూమ్ కారు కొనేంత బడ్జెట్ లేదు. పైగా మా అవసరానికి ఒక మామూలు కారు ఉంటే చాలనుకున్నాను. సరిగ్గా అప్పుడే యూట్యూబ్‌లో వాడిన కార్ల ప్రకటన ఒకటి చూశాను. ఒకప్పటి స్టార్ క్రికెటర్ ఆ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్. ఇప్పుడు ఆయన టూత్‌పేస్ట్ దగ్గర నుండి అగర్బత్తీల వరకు అన్ని వస్తువుల యాడ్స్‌లోనూ కనిపిస్తున్నాడు.

"ఇతను అసలు జీవితంలో ఎప్పుడైనా సెకండ్ హ్యాండ్ కారు ఎక్కి కూడా ఉండడు" అని నేను నవ్వుతూ అంటే, మధు పేపర్ లోంచి తల పైకి ఎత్తి, "ఆయన ఎక్కాడా లేదా అని కాదు.. ఆయన కనిపిస్తే కారు బాగుంటుంది అని జనం నమ్ముతారని వాళ్ల ధీమా" అంది. ఆ మాటతో నా వెటకారం ఆగిపోయింది. ఆ రోజే యాప్ డౌన్లోడ్ చేశాను. రెండు కార్లు షార్ట్‌లిస్ట్ చేశాము.

అప్పటినుంచి ఆ కంపెనీ వాళ్ల మెసేజ్‌లు, ఫోన్ కాల్స్ ఊపిరి సలపనివ్వలేదు. “సార్, మీ కోసం ఒక బెస్ట్ కారు సెలెక్ట్ చేశాం. సింగిల్ ఓనర్, క్లీన్ రికార్డ్” అంటూ ఊదరగొట్టారు. చివరికి ఒకరోజు టెస్ట్ డ్రైవ్‌కి ఇంటికే పంపించారు.

అది నీలి రంగు ఫోర్డ్ ఎకోస్పోర్ట్. 2018 మోడల్, డీజిల్ వేరియంట్. సరిగ్గా అరవై వేల కిలోమీటర్లు తిరిగింది. కారు చూడగానే ఎందుకో పాత పరిచయం ఉన్నట్టు అనిపించింది. ఫ్యూయల్ క్యాప్ పక్కన ఒక చిన్న నొక్కు... అది దెబ్బలా లేదు, ఆ కారుకి ఉన్న ఒక పుట్టుమచ్చలా అనిపించింది. లోపల కూర్చుంటే ఒక వింతైన నిశ్శబ్దం. కొత్త కార్లలో ఉండే ఆ ఘాటైన వాసన లేదు, అలాగని పాత కార్లలో ఉండే వెక్కసమైన వాసన కూడా లేదు. మనుషులు లేని ఒక ఖాళీ ఇల్లు ఎలా ఉంటుందో అలా ఉంది. ఒక్కసారి డ్రైవ్ చేసిన తర్వాత, ఎలాగో తెలియదు.. ఆ కారులో ఏదో నచ్చింది.

“ఈ కారు మీకు బాగా సూట్ అయింది సార్” అన్నాడు ఆ సేల్స్ ఎగ్జిక్యూటివ్ అలవాటైన నవ్వుతో. ‘ప్రతి కస్టమర్‌కి ఇదే డైలాగ్ చెప్తారు కదా’ అని నాలో నేను అనుకున్నానే గానీ, ఆ కారు స్టీరింగ్ పట్టుకోగానే మనసు మార్చుకోలేకపోయాను. రెండు రోజుల్లోనే ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయిపోయాయి, కారు మాదైపోయింది. రోజూ ఆఫీస్ కి కారులో వెళ్లడం మొదలుపెట్టాను.

కొన్ని సాయంత్రాలు ఇంటి దగ్గర్లోని చెరువుకి, వారాంతాల్లో చిన్న చిన్న ట్రిప్స్‌కి వెళ్లడం అలవాటైంది. కానీ ఒక నెల తిరిగేసరికి ఆ కారులో ఏదో ఒక తెలియని వెలితి. ఒకరోజు సిగ్నల్ దగ్గర ఆగినప్పుడు, ఆ నిశ్శబ్దంలో నాకో పిచ్చి ఆలోచన వచ్చింది. అసలు ఈ కారులో అంతకుముందు ఎవరు ఉండేవారు? ఎవరెవరు ప్రయాణించారు ఇందులో? అరవై వేల కిలోమీటర్లు... ఒక్కో కిలోమీటరు ఒక్కో జ్ఞాపకాన్ని తనలో దాచుకుని ఉంటుంది కదా! నా మది మెల్లగా ఊహల్లోకి జారిపోయింది.

బహుశా ఒక కొత్త జంట... పాత హిందీ పాటలు పాడుకుంటూ, చిన్న చిన్న ముచ్చట్లతో ఈ సీట్లను నింపేసి ఉంటారేమో. దారిలో ఏవో చిన్న గొడవలు పడినా, గమ్యం చేరేసరికి మళ్ళీ ఒక్కటయ్యి నవ్వుకునేవారేమో.

లేదా ఒక అమ్మ... తన కూతురిని డాన్స్ క్లాస్‌కి తీసుకెళ్తూ, పాప స్కూలు కబుర్లను మురిపెంగా వింటూ ప్రయాణించేదేమో. ఆ పాప తన సైన్స్ ప్రాజెక్ట్ గురించి ఉత్సాహంగా చెప్తుంటే, ఆ తల్లి గర్వంగా నవ్వుకుని ఉంటుంది. రాత్రిపూట ఇద్దరూ కలిసి ఈ కారులోనే ఐస్‌క్రీమ్ తినడానికి వెళ్లేవారేమో!

ఇంతకీ ఈ కారుని ఎందుకు అమ్మేశారో? ఆర్థిక ఇబ్బందులా? ఆ ఆలోచన రాగానే మనసు చివుక్కుమంది. లేదు, బహుశా కుటుంబం పెద్దదై ఇంకా పెద్ద కారు కొనుక్కున్నారేమో! కారు తన పాత జీవితాన్ని బలవంతంగా చెరిపేసుకుని, కొత్త బతుకు మొదలుపెట్టినట్టు అనిపించింది.

“ఎప్పుడూ ఏదో ఒక పీకులాట నీకు! ప్రశాంతంగా కారుని ఎంజాయ్ చేయడం వదిలేసి, ఆ పాత విషయాలన్నీ నీకెందుకు? ఇప్పుడు ఇది మనది, అది ఒక్కటే ముఖ్యం” అని మధు నచ్చచెప్పే ప్రయత్నం చేసింది. ఆమె చెప్పింది నిజమే అనిపించినా, నా ఆలోచనలు మాత్రం ఆగలేదు. పాత జ్ఞాపకాల తాలూకు ఆనవాళ్లు ఏవైనా ఈ కారులో ఇంకా మిగిలే ఉన్నాయేమో అని నా కళ్లు వెతకడం మొదలుపెట్టాయి.

ఒక ఆదివారం మధ్యాహ్నం, అబిడ్స్ సండే బుక్ మార్కెట్ దగ్గర కారు ఆపాను. బయట పెట్టిన పుస్తకాలను తిరగేసి, పక్కనే ఉన్న స్టాల్ లో టీ తాగుతున్నాను. రోడ్డు అవతలి వైపు ఒక వ్యక్తి నా కారునే రెప్ప వేయకుండా చూస్తూ నిలబడటం గమనించాను. గళ్ళ చొక్కా, కళ్లద్దాలు... మధ్య వయస్కుడే కానీ, జీవితంలో బాగా అలసిపోయినవాడిలా కనిపిస్తున్నాడు. అతను మెల్లగా రోడ్డు దాటి కారు దగ్గరికి వచ్చి, దాని వెనుక వైపు ఉన్న ఒక చిన్న స్క్రాచ్‌ని తదేకంగా చూస్తున్నాడు. నేను టీ గ్లాస్ పట్టుకుని అటుగా వెళ్లాను.

నన్ను చూడగానే అతను కొంచెం తడబడ్డాడు. "ఏమండీ..?" అని నేను అడిగాను. "ఏం లేదు సార్.. ఇది నా పాత కారేమో అని డౌట్ వచ్చి చూస్తున్నాను" అన్నాడు గొంతు సవరించుకుంటూ. "ఓ.. మీదా ఇదివరకు?" అని నేను క్యాజువల్ గా అడిగాను.

అతను అవునన్నట్టుగా తల ఊపి, మెల్లగా కారు మీద చెయ్యి వేశాడు. అది తాకగానే అతని కళ్లలో ఏదో మెరుపు. "ఈ డెంట్ నా భార్యకి ఆరోగ్యం సీరియస్ గా ఉన్నప్పుడు పడింది సార్. తను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు డాక్టర్ చెప్పారు.. పరిస్థితి కొంచెం సీరియస్ గా ఉంది అని. ఆ మాట విన్నాక తను కారులో కూర్చున్నప్పటి నుంచి ఏడుస్తూనే ఉంది. కారు రివర్స్ తీస్తుండగా కన్ఫ్యూజన్ లో గోడకి తగిలించాను. ఆ రోజు కారుని చూసుకోలేదు, తనని చూసుకోలేదు.. లోపల ప్రాణం కొట్టుకుపోతుంటే స్టీరింగ్ పట్టుకుని ఆ ప్రయాణమంతా దేవుణ్ణి వేడుకుంటూనే ఉన్నాను.. మాకు ఈ బిడ్డ కావాలి అని.

అక్కడి నుంచి ఒక రెండు వారాలు గాలి కూడా భారంగా అనిపించేది. కానీ దేవుడు కరుణించాడు. తర్వాతి చెకప్‌లో ‘బిడ్డ నిలకడగా ఉంది’ అని డాక్టర్ చెప్పగానే.. ఆఖరి స్కాన్ రోజు అయితే, ‘మరో రెండు వారాల్లో మీ పాపని ఎత్తుకోవచ్చు’ అని డాక్టర్ అన్న మాట ఇప్పటికీ నా చెవుల్లో మోగుతూనే ఉంటుంది. ఆ రోజు హాస్పిటల్ నుంచి ఇంటికి వస్తుంటే, ఈ కారు మాకు ఒక కారులా అనిపించలేదు సార్.. ఒక ఊయలలా అనిపించింది. పుట్టబోయే బిడ్డ కోసం ఎన్ని కలలు కన్నామో.. ఆ నవ్వులన్నీ ఈ సీట్లలోనే ఉన్నాయి.”

అతను ఆ జ్ఞాపకాల్లో మునిగిపోయి మాటలు ఆపేసి నిశ్శబ్దంగా కారుని నిమురుతుంటే, నేనేం మాట్లాడాలో తెలియక ఆగిపోయాను. ఇంతలో అతను నాతో ఏమీ చెప్పకుండా, మెల్లగా పక్కనే ఉన్న బుక్ షాప్ లోపలికి వెళ్ళిపోయాడు. ఏదో మాట్లాడాలి అన్నట్టు నేను కూడా అతని వెంటే లోపలికి వెళ్లాను. కానీ లోపల అతను లేడు. షాపు ఖాళీగా ఉంది. కౌంటర్ వెనుక ఒక ఆవిడ పుస్తకాలు సర్దుతోంది.

“అదే.. ఇప్పుడే ఒకాయన లోపలికి వచ్చారు కదా, గళ్ళ చొక్కా.. ఆయన ఎక్కడున్నారు?” అని అడిగాను. ఆమె నా కారు వైపు చూసి, ఫోన్లో ఒక ఫోటో చూపించింది. ‘మీరు చూసింది ఇతన్నేనా?’ అని అడిగింది. అవును, అతనే.

‘ఇతను మా అన్నయ్య రఘు. రెండేళ్ల క్రితం చనిపోయాడు. వదినని హాస్పిటల్‌కి తీసుకెళ్తుంటే దార్లో గుండెపోటు వచ్చింది. ఆ షాక్‌లో కారు దారి తప్పింది. వదినని కాపాడగలిగారు, పాప పుట్టింది.. కానీ అన్నయ్యే ఆ పాప ముఖం చూడకుండానే వెళ్లిపోయాడు. ఆ కారు వదినకి అన్నయ్య జ్ఞాపకం. కానీ పరిస్థితులు బాగోక అమ్మేయాల్సి వచ్చింది...’

నాకు కాళ్లు వణికినట్టు అనిపించింది. గొంతులో ఏదో అడ్డుపడి మాట రావడం లేదు. ఆ షాపులో నుంచి బయటకి ఎలా వచ్చానో కూడా నాకు గుర్తులేదు. కారులో కూర్చున్నాక కూడా కాసేపు స్టీరింగ్ పట్టుకోలేకపోయాను. వణుకుతున్న చేతులతో ఫోన్ తీసి గూగుల్‌లో వెతికాను... ఆ వార్త నిజమే.

అప్పుడు నాకు అర్థమైంది—నేను ఇందాక మాట్లాడింది ఒక మనిషితో కాదు, ఒక ఆవేదనతో. ఆ భయం, ఆ వణుకు నన్ను వదలలేదు. కానీ విచిత్రంగా, అదే కారులో కూర్చున్నప్పుడు ఒక రకమైన 'రక్షణ' కూడా అనిపించింది. ఒక తండ్రి చూడని కల, ఒక భర్త మోసిన బాధ్యత.. రఘు పలకని మాటలన్నీ ఆ నిశ్శబ్దంలో ప్రతిధ్వనిస్తున్నట్టు అనిపించింది. ఆ అరవై వేల కిలోమీటర్ల జ్ఞాపకాలని నా భుజాన వేసుకుని సాగుతున్న ఈ ప్రయాణం.. నా మనసులోని భారాన్ని కాస్త తగ్గించింది.

రాత్రి ఇంటికి తిరిగొచ్చేసరికి మధు సోఫా మీద నిద్రలోకి జారిపోయి ఉంది. నెమ్మదిగా ఆమె పక్కన కూర్చుని తన చేతిని నా చేతుల్లోకి తీసుకున్నాను. “మధూ... ప్రతి ప్రయాణాన్ని మనమే మొదలుపెట్టక్కర్లేదు. ఎవరో వదిలేసిన దాన్ని మనం ముందుకు తీసుకెళ్లినా అది మన ప్రయాణమే అవుతుంది కదా!” అన్నాను.

తను కళ్లు తెరిచి, “ఏంటి బాబూ ఈ అర్ధరాత్రి వేదాంతం?” అంది చిన్నగా నవ్వుతూ. నేను తన కళ్లలోకి చూస్తూ, “ఏం లేదు... ఇవాళ ఆ కారు సీట్లో కూర్చుంటే ఎందుకో నువ్వు గుర్తొచ్చావు. మన మధ్య ఉన్న ఈ నిశ్శబ్దం, ఆ వెలితి... అన్నీ కూడా ఇష్టంగానే అనిపించాయి. నువ్వు పక్కన ఉంటే చాలు మధూ” అన్నాను.

మధు ఒక్క క్షణం మౌనంగా ఉండిపోయింది. నా మాటల్లోని గాఢత తనకి అర్థమైంది. ఏమీ మాట్లాడకుండా నా భుజం మీద తల వాల్చి నా చేతిని గట్టిగా నొక్కింది. ఆ తర్వాత నా కళ్లలోకి చూస్తూ.. “సరేలే, సంతోషం! ఇప్పటికైనా నీకు ఆ విషయం అర్థమైంది.. అదే చాలు!” అంది ఒక చిన్న చిలిపి నవ్వుతో.

తన మాటల్లో ఒక అచంచలమైన ప్రేమ. ఆ కారులో ఒక తండ్రి చూడని కలలు, ఇక్కడ నా భుజం మీద తల వాల్చిన మధు ఆప్యాయత... అన్నీ కలిసి నా మనసును ఒక తెలియని నిశ్శబ్దంతో నింపేశాయి. ఆ అరవై వేల కిలోమీటర్ల ప్రయాణం ఇవాళ నా ఇంటి గుమ్మం దగ్గర ఒక నిండుదనాన్ని సంతరించుకుంది.

మరిన్ని కథలు

Samskaram
సంస్కారం
- Karlapalem HanumanthaRao
Gayam-Oka agni putrika katha
గాయం - ఒక అగ్నిపుత్రిక కథ
- హేమావతి బొబ్బు
Aavu aaratam
ఆవు ఆరాటం
- చెన్నూరి సుదర్శన్
Nissabda vedana
నిశబ్ద వేదన
- డా:సి.హెచ్.ప్రతాప్
Kalayamudu
కాలయముడు
- డా:సి.హెచ్.ప్రతాప్
Vivekapu varasatwam
వివేకపు వారసత్వం
- హేమావతి బొబ్బు
Asalaina sampada
అసలైన సంపద
- డా:సి.హెచ్.ప్రతాప్