ప్రేమానుబంధం - Kameswara Rao Rapaka

Premanubandham

ప్రసూతిగదిలోంచి బయటకు పసి ఏడుపు వినిపించగానే బాబో పాపో తెలియని ఆత్రుత... చేతుల్లోకి తీసుకునేంతవరకు ఉత్కంఠే... అటువంటి భావనే జీవితంలో వేర్వేరు ఘట్టాల్లో అద్భుతమైన అనుభూతికి అవకాశమిస్తుంది. జీవితంలో ప్రతి స్థాయిలోనూ ఆసక్తితో కూడిన ఆనందాన్ని మరియు విషాదాన్ని కలిగిస్తుంటుంది. సుమారు ముప్పయ్యేళ్ళ పాటు జరిగిన సంఘటనల సమాహారం ఇది.

——-///——-

"శారదా ఏం చేస్తున్నావే డాబా మీద"

"చదువుకుంటున్నానమ్మా"

"చీకటి పడుతుంది కదా ఆ గుడ్డి వెలుతురులో ఏం చదువుతావే కళ్ళు పాడవుతాయి కిందికి వచ్చెయ్ నాన్న గారు కూడ వచ్చెస్తారు" అమ్మ కృష్ణవేణి మందలింపు. అమ్మ మందలింపు కన్నా నాన్న గారు వచ్చెస్తారు అన్న మాటతో ఉలిక్కి పడి కిందికి దిగింది శారద.

రంగారావు గారు ఈ మధ్యనే సోంపేట ఆర్ అండ్ బి ఇంజనీరుగా బదిలీపై వచ్చారు. రంగారావు గారికి ఇంకా అయిదేళ్ళే సర్వీసు ఉంది. కూతురు శారదను రిటైర్ అయ్యే ముందు పెళ్ళి చేసి తన బాధ్యత తీర్చుకోవాలని చూస్తున్నారు. శారద ఆ ఊళ్ళోని జూనియర్ కాలేజి లో మొదటి సంవత్సరం ఇంటర్మీడియేట్ చదువుతుంది. వాళ్ళ పక్కింట్లో ఉంటున్న పురుషోత్తం తో పరిచయమయింది. పురుషోత్తం కూడ అదే కాలేజిలో చదువుతున్నాడు. శారద కన్నా ఒక సంవత్సరం సీనియర్.

జీవితంలో తొలి వసంతాన్ని చవి చూసిన ఆనందం శారద మనసు అనుభవిస్తుందిప్పుడు. తొలి చూపులో ఆకర్షణో మలి చూపులో ఇష్టపడో పురుషోత్తం కూడ ఆమెతో ప్రేమలో పడ్డాడు. తొలి యవ్వన పులకింతలలో తన్మయులవుతున్నారిద్దరు.

వీలు దొరికినప్పుడల్లా డాబా మీదికి చేరి మాట్లాడుకుంటారు మనసులు పంచుకుంటారు. ఈ మధ్య తరచుగా సాయంత్రం చదువు వంకతో డాబాపైకి చేరుతున్నారు ఇద్దరు. ఇలా ఒక సంవత్సరం గడిచింది. ఒకరిపై ఒకరికి ప్రేమ ముదిరి పాకాన పడింది.

"ఈ రోజు చిదంబరేశ్వర టాకీస్ లో ఫస్ట్ షో సినిమాకు వెళ్తున్నాము" ఉదయం శారద చెప్పింది.

“ఓహ్ బంగారు బాబు సినిమానా, అయితే చెంగావి రంగు వోణీలో ఈ రోజు అమ్మాయి గారిని చూస్తానన్నమాట" పురుషోత్తం శారదకు చెప్పకనే చెప్పాడు చెంగావి రంగు ఓణీలో రమ్మని. ఎప్పుడు సాయంత్రం అవుతుందా అని ఒకటే ఆరాటం పురుషోత్తం మదిలో.

సాయంత్రం రంగారావు గారు ఫామిలీతో రిక్షాలో సినిమా హాల్ కు వెళ్ళారు. వారి వెనుకనే పురుషోత్తం సైకిల్ పై వెళ్ళాడు. రంగారావు గారు ఫామిలీ కూర్చున్న వెనుక వరుసలో శారద వెనక్కి తిరిగితే కనబడేటట్టు పురుషోత్తం కూర్చున్నాడు. సినిమా నడిచిన మూడు గంటలు పురుషోత్తంకు కన్నుల పంట. శారద క్షణానికోసారి వెనక్కి తిరుగుతూనే ఉంది. ఆ నాలుగు కళ్ళకు ఆ రోజు నోముల పంటే!

-——///——-

పురుషోత్తం ఇంటర్మీడియేట్ పాస్ అయి విశాఖపట్నంలో ఎయు ఇంజనీరింగ్ కాలేజి లో జాయిన్ అయ్యాడు. శారదతో ప్రేమలో మునిగిన పురుషోత్తంకు నానాటికి చదువుపై శ్రద్ధ తగ్గిపోతుంది. చీటికిమాటికి సెలవులని చెప్పి ఇంటికి వచ్చెస్తున్నాడు. ఇంకో సంవత్సరం గడిచేటప్పటికి శారద ఇంటర్ పూర్తి అయింది.

ఒకసారి ఇంటికి వచ్చేటప్పటికి తెలిసింది రంగారావు గారికి బదిలీ అయిందని, రెండు వారాలక్రితమే వాళ్ళు సోంపేట విడిచి వెళ్ళిపోయారని. అక్కడ ఆర్ అండ్ బి ఆఫీస్ లో అడిగితే హైదరాబాదు ప్రధాన కార్యాలయములో రిపోర్ట్ చేసిన తరువాత వాళ్ళు ఎక్కడో ఓ చోట పోస్టింగ్ ఇస్తారు అని చెప్పారు. అది విన్న పురుషోత్తం పిచ్చివానిలా రోదించాడు. స్నేహితుల ఓదార్పుతో కొన్ని రోజుల తరువాత మళ్ళీ కాలేజికి వెళ్ళాడు.

కాని పురుషోత్తం చదువుపైన దృష్టి పెట్టలేకపోయాడు. అందువలన అది మధ్యలోనే ఆగిపోయింది. కొన్నాళ్ళు పిచ్చివాడిలా తిరిగాడు. ఒకసారి మాటల మధ్యలో వారిది రాజమండ్రి దగ్గర ఏదో పల్లెటూరని శారద చెప్పింది. ఆ విషయం గుర్తు చేసుకుని రాజమండ్రి పరిసర ప్రాంతాలలో శారద కోసం వెదికే ప్రయత్నాలు చేసాడు. కాని ఫలితం కనబడ లేదు. నిరాశా నిస్పృహలతో కృశించిపోతున్న కొడుకుని చూసి తలిదండ్రులు దిగులుతో మంచము పట్టారు.

తరువాత తలిదండ్రులు మరియు స్నేహితుల ఒత్తిడితో పురుషోత్తం బేంక్ పరీక్షల్లో నెగ్గి భారతీయ స్టేట్ బేంక్ లో జాబ్ సంపాదించాడు.

ఆ తరువాత కొన్నాళ్ళకు రంగారావు గారు విజయవాడ బదిలీ అయ్యారని తెలుసుకున్న పురుషోత్తం ఈ సారి తప్పకుండా వాళ్ళ ఆచూకీ తెలుస్తుందని కొండంత ఆశతో విజయవాడ వెళ్ళాడు. విజయవాడ ఆర్ అండ్ బి ఆఫీసుకు వెళ్ళి ఆయనకోసం వాకబు చేసాడు. కాని అప్పటికే ఆయన రిటైర్మెంటు అయ్యారని తెలుసుకుని పురుషోత్తం ఇంక ఆశలు వదులుకున్నాడు.

-----///-----

విజయవాడ బదిలీ అయిన వెంటనే రంగారావు గారు శారద పెళ్ళి ప్రయత్నాలు ముమ్మరం చేసారు.

"శారదా ఈ రోజు పెళ్ళివారొస్తున్నారు కాస్త తొందరగా లేచి తయారవ్వాలి" కృష్ణవేణి మాటలకు అయిష్టం గానే తల ఊపింది శారద.

శారదకు ఇంకా పురుషోత్తం గుర్తొస్తూనే ఉన్నాడు. ఈ సరికి ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ లో ఉంటాడేమో, ఏం చేస్తున్నాడో? ఎలా కలవాలి? అని ఆ రాత్రంతా ఆలో చించింది.

తన చిన్నాన్న గారబ్బాయి ఆనంద్ వైజాగ్ లో పని చేస్తున్నాడన్న మాట గుర్తొచ్చి ఆ మర్నాడు అతని దగ్గరికి వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంది. అతని సహాయంతో పురుషోత్తంను కలవొచ్చు అని తన నమ్మకం.

ఇంతలోనే పెళ్ళి చూపుల మాట తల్లి నోటినుండి విని కలవర పడింది. కాని తెల్లవారి పది గంటలైనా ఎవరు రాకపోవడంతో రంగారావు గారు మధ్యవర్తితో మాటలాడారు.

“అయ్యా క్షమించండి. నిన్ననే వారు నాకు కబురు పెట్టారు. అబ్బాయికి ఒంట్లో బాగా లేదట. మళ్ళీ ఎప్పుడొచ్చేది కబురు పెడతానన్నారు". అని ఆ మధ్యవర్తి చెప్పిన మాటలు విన్న

శారద "రొట్టె విరిగి నేతిలో పడ్డట్టు" చాల ఆనందపడింది. అనుకున్న విధముగానే ఆ రోజు సాయంత్రం ట్రైన్ లో వైజాగ్ బయలు దేరింది.

-----///-----

ఆనంద్ కు శారద అంటె వల్లమాలిన అభిమానం.

నాలుగు రోజులు సెలవు పెట్టి మొత్తం వైజాగ్ లో చూడవలసిన ప్రదేశాలన్ని తిప్పాడు.

తరువాత శారద అసలు విషయం చెప్పింది. "పురుషోత్తం అంటె నాకు చాల ఇష్టం అన్నయ్యా, పెళ్ళి చేసుకుంటె అతనితోనే" అని మనసులోని మాటను మృదువుగానే అయినా తెగేసి చెప్పింది.

ఆనంద్ శారదను తీసుకొని ఆ మరుసటి రోజు ఇంజినీరింగ్ కాలేజి హోస్టల్ కు చేరుకున్నాడు. ఆఫీస్ లో కనుక్కోమని ఎవరో చెప్పారు.

"సార్, పురుషోత్తం అని మాకు తెలిసిన వారబ్బాయి ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ఆయన ఎక్కడుంటాడో చెప్పగలరా?" అని ఆఫీస్ మేనేజర్ని అడిగాడు.

ఆయన రికార్డులు తిరగేసి "పురుషోత్తం సుమారు సంవత్సరం క్రితం రూం ఖాళీ చేసేసారు. చదువు మానేస్తున్నానని చెప్పారండి"

శారదకు కాళ్ళక్రింద భూమి పగిలిపోయి పాతాళం లోకి జారుకున్నట్టు అనిపించింది. అక్కడున్న బల్ల పై చతికిలబడింది. విధి ఎంత వికృతం గా తన జీవితం తో సయ్యాటలాడుతుందో అని కళ్ళ నీళ్ళు పెట్టుకుంది. తన శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరయ్యింది.

"సార్, ఆయన వివరాలు ఉంటె చెప్పండి" అని అడిగిన ఆనంద్ కు " ఆయన వెళ్తూ ఇచ్చిన వివరాలు ప్రకారం వారు శ్రీకాకుళం జిల్లా సోంపేటలో ఉంటున్నారండి". అని జవాబిచ్చాడు హోస్టల్ మేనేజర్.

మర్నాడే ఆనంద్ శారద ఇద్దరు కలిసి కారులో సోంపేట వెళ్ళారు. “దరిద్రుడి పెళ్ళికి వడగళ్ళ వాన” అన్నట్టు ఇక్కడ కూడ చుక్కెదురే. పురుషోత్తం అమ్మా నాన్నతో కలిసి ఉద్యోగ రీత్యా ఎక్కడికో వెళ్ళిపోయారని పక్కింటిలో ఉన్న వాళ్ళు చెప్పారు. ఎక్కడికెళ్ళారో తెలియదన్నారు.

శారద పరిస్థితిని చూసిన ఆనంద్ చాల బాధ పడ్డాడు. రెండు రోజుల తరువాత శారద విజయవాడ వెళ్ళిపోయింది. శారద కుదుటపడాలంటె త్వరగా పెళ్ళి చేయడమే మార్గమని తలచిన ఆనంద్ పెదనాన్న రంగారావుతో సంప్రదించి తన స్నేహితుడు వి యస్ కృష్ణ గవర్నమెంటు కాలేజీలో లెక్చరర్ గా చేస్తున్న సుబ్బారావుతో శారదకు పెళ్ళి నిశ్చయించాడు. సుబ్బరావుకు ముందు వెనకా ఎవరు లేకపోవడముతో అనుకున్నట్టుగానే పెళ్ళి జరిగిపోయింది. మరో రెండు

నెలల్లో రిటైర్ అవ్వబోతున్న రంగారావు దంపతులు ఊపిరి పీల్చుకున్నారు. కృష్ణవేణి పూజలు ఫలించాయని సంబరపడింది.

-----///-----

విధి ఆడిన వికృత క్రీడలో శారద మళ్ళీ బలి పశువయ్యింది. పెళ్ళి విజయవాడలో జరిగింది. తిరుగు ప్రయాణములో సుబ్బారావు శారద ప్రయాణిస్తున్న కారు కు ఆక్సిడెంట్ జరిగింది. ఆ ప్రమాదములో సుబ్బారావు రెండు కాళ్ళు తుంటి ఎముక దెబ్బ తిన్నాయి. శారదకు చిన్న చిన్న గాయాలయ్యాయి. అది విన్న రంగారావు కృష్ణవేణి చాల బాధపడ్డారు. రిటైరైన తరువాత రంగారావు కూతురుని తలచుకుని బాధ పడుతూ చివరికి కన్ను మూసారు.

త్వరగా తేరుకున్న కొత్త పెళ్ళి కూతురు శారద కోటి దేవుళ్ళకు మొర పెట్టుకుంది. సుబ్బారావు బ్రతికి బట్ట కట్టాడు. తన ప్రార్థనలు ఫలించి అందరు దేవుళ్ళు ఆశీర్వదించారని సంబర పడింది. కాని ప్రతి రోజు భర్తకు సేవలు చేయడం తోనే గడిచిపోతుంది. అయినా ఆమె నిరుత్సాహ పడలేదు. ఒక సంవత్సరం గడచిన తరువాత ఎక్స్ రే లు, స్కానింగ్ రిపోర్టులు చూసిన వైద్యులు సుబ్బారావు దాంపత్యానికి పనికి రాడని తేల్చి చెప్పారు. సుబ్బారావు వీల్ చైర్ కు పరిమితమయ్యాడు.

శారదకు విధి వెక్కిరించింది!

ముక్కోటి దేవతలు ముక్త కంఠంతో శపించారు!!

ఆమె జీవితం అడవి గాచిన వెన్నెలయింది!!!

"శారదా నా కోసం నీ జీవితాన్ని ఎందుకు బలి చేసుకుంటావు, ఇంకో పెళ్ళి చేసుకో" అని సుబ్బారావు ఎన్ని సార్లు అడిగినా శారద నోటి నుండి పలుకు లేదు.

తన జీవితానికి దేవుడు ఇదే రాసి పెట్టాడని సర్ది చెప్పుకుంది. విధివ్రాతకు ఎదురీది మళ్ళీ ఇంకొక ప్రయత్నం చెయ్యరాదనుకుంది. బండలా మారింది శారద గుండె.

పతి సేవయే పరమావధిగా ఇరవై ఏళ్ళు గడిచాయి. నా అన్న వాళ్ళు ఎవరు లేని సుబ్బారావుకు శారద పంచ ప్రాణాలు. యాబయ్యో దశకముకు చేరువలో ఉన్న సుబ్బారావుకు క్రమేపీ ఆరోగ్యం క్షీణించి కాలం చేసాడు.

-----///-----

"ఒరేయ్ ముప్పయ్యేళ్ళు దాటాయి ఇంకెప్పుడు పెళ్ళి చేసుకుంటావురా?" పురుషోత్తం తల్లి అడిగింది.

"ఆఫీసర్ అయ్యాక చేసుకుంటానమ్మా" ఏదో సాకు వెదుక్కుని చెప్పాడు పురుషోత్తం. కాని ఇంకా శారద కనిపిస్తుందనే ఆశ పోలేదు.

తరువాత అయిదేళ్ళకు ఆఫీసర్ అయిన పురుషోత్తంకు బదిలీ పై కాకినాడ దగ్గర రామచంద్రపురం బ్రాంచిలో కాష్ ఆఫీసర్ గా పోస్ట్ చేసారు బేంక్ వారు. అప్పటికి పురుషోత్తం నలబై కు చేరువలో ఉన్నాడు. ఈ మధ్యలో తలిదండ్రులు స్వర్గస్థులయ్యారు.

-----///-----

ఇరవై నాలుగు గంటలు బేంకు వర్క్ కే అంకితమైపోయిన పురుషోత్తంకు ఇక్కడ విజయలక్ష్మితో పరిచయమయింది. విజయలక్ష్మిని చూసినప్పుడల్లా శారద గుర్తొస్తుంది పురుషోత్తంకు.

"ఏమిటి సార్ మీరు స్వయంపాకమా? హోటల్ భోజనమా?" ఒక రోజు విజయలక్ష్మి అడిగింది.

"సత్రం భోజనం మఠం నిద్ర" అని జోకుగా చెప్పాడు పురుషోత్తం. అందరితో చనువుగా మాటలాడే పురుషోత్తంకు అక్కడేమి కొత్తనిపించలేదు.

ఒక రోజు రాత్రి పడుకునేటప్పుడు విజయలక్ష్మినే తలచుకుంటు పడుకున్నాడు. ఆమె ఎందుకో అప్పుడప్పుడు విచారముగా కనిపిస్తుంది.

మరునాడు బేంకుకు వెళ్ళగానే ఆమె వివరాలు మెసెంజర్నడిగాడు.

"విజయలక్ష్మి భర్త బేంకులో పని చేసేవాడు. తాగుడుకు బానిసై అయిదేళ్ళ క్రితం చనిపోయాడు, ఆమెకు కంపాసినేట్ ఉద్యోగమిచ్చారు"

"అయ్యో! పాపం ఆమెకు ఇంకెవరైనా ఉన్నారా?"

"ఆ.. పదేళ్ళ పాప ఉందండి.. తల్లిదండ్రులు వైజాగులో ఉంటారు. వారి దగ్గరే ఆ పాప ఉంటుంది. అన్నదమ్ములెవరు లేరు. అత్తవారి వైపువాళ్ళతో కటీఫ్ చేసుకుంది"

పురుషోత్తం మదిలో ఆమెపై జాలి ఎక్కువయింది. ఆ రాత్రి ఎడ తెగని ఆలోచనలతో సతమతమయ్యాడు. "తనకి నలబై దాటింది. ఇప్పుడు తన ఈడుకు సరిపడే అమ్మాయి దొరకడం కష్టమే. విజయలక్ష్మిని పెళ్ళి చేసుకుంటె ఎలా ఉంటుంది? " ఈ ఆలోచనలతో ఎప్పటికో నిద్ర పట్టింది

ఆ మరుసటి రోజు బేంకులో తన ఆలోచనను విజయలక్ష్మికి చెప్పుదామనుకుని పురుషోత్తం ఆత్రుతతో వెళ్ళాడు. కాని “తానొకటి తలిస్తె దైవం వేరొకటి తలచిందన్నట్టుగా” విజయలక్ష్మి బేంకులో కనిపించలేదు. ఆమె నాన్న గారు పోయారని కబురు రావడంతో ముందు రోజు రాత్రి వైజాగు వెళ్ళిపోయిందని తెలిసింది.

వైజాగు వెళ్ళిన విజయలక్ష్మి తిరిగి రాలేదు. అక్కడున్న యూనియన్ నాయకుల సాయంతో వైజాగుకు బదిలీ చేయించుకుంది. తరువాత ఎవరో దూరపు బంధువు, మొదటి భార్య పోయిన వాడిని పెళ్ళి కూడ చేసుకుంది.

-----///-----

నిరాశ నిస్పృహలతో రాటుదేలిన పురుషోత్తం కు ఇదేమి బాధ కలిగించలేదు. అక్కడినుండి రెండు బ్రాంచిలు మారిన తరువాత వైజాగులో జగదాంబ జంక్షన్ బ్రాంచిలో బ్రాంచి మేనేజరుగా పోస్టింగ్ వచ్చింది.

పురుషోత్తం వయసు హాఫ్ సెంచరీ దాటింది. ఒంటరి జీవితం కు అలవాటు పడిపోయాడు. కాని కనబడిన ప్రతి మహిళను తదేకముగా చూసేవాడు వారిలో శారద కనిపిస్తుందేమోనని.శ్వాస ఆగినదాకా ఆశ ఆగదుఅన్నట్టు ఇంకా శారదపై ఆశ చావలేదు.

-----///-----

"నమస్కారమండి. నేను రెండు నెలల క్రితమే పెన్షన్ అకౌంటు ఓపెన్ చేసానండి. ఇది నా పాస్ బుక్. నా పెన్షన్ పేపర్లు వచ్చాయాండి?"

అన్న మాటలతో అకౌంటెంట్ అప్పారావు గారు తల పైకెత్తి "కూర్చోండమ్మా చూస్తాను" అన్నారు.

కొంత సేపు తర్వాత ఆయన బీరువా తెరిచి పెన్షన్ ఫైళ్ళ కట్టను విప్పి చూసి " ఆ వచ్చాయమ్మా, రేపు రెండు పాస్ పోర్ట్ సైజు ఫొటోలు, మీఆధార్ కార్డు పట్టుకుని రండి" అన్నారు.

"అవి తెచ్చానండి. ఇప్పుడు ఇవ్వమంటారా?"

"ఆ ఇవ్వండి. ఇంకా ఈ పేపర్లపైన సతకాలు పెట్టండి."

"మీ పని అయిపోయిందమ్మా. ఈ నెలాఖరులో మీ పెన్షన్ మొత్తం పాత నెలల బాకీలతో కలిపి మీ అకౌంట్ లో జమ అవుతుంది. డెబిట్ కార్డుతో మీరు ఏ ఎటిఎం నుండైనా తీసుకొనవచ్చును."

ఈ మధ్యలో బ్రాంచి మేనేజర్ పురుషోత్తం తన చాంబర్ లోనుండి యథాలాపముగా రెండు సార్లు అటువైపు చూసాడు కాని ఆమె ముఖం కనిపించలేదు.

"ఎవరో ఒకామె అకౌంటంట్ దగ్గర కూర్చొని ఉంది. చాల సేపయింది ఏమిటి సంగతి?" అని మెసెంజర్ని అడిగాడు.

"ఏదో పెన్షన్ వ్యవహారమండి." అని బదులిచ్చాడు మెసెంజర్.

తరువాత కొంత సేపటికి "నమస్కారమండి. వెళ్ళొస్తాను" అంటు ఆమె తనకు తోడుగా వచ్చిన అబ్బాయితో కలిసి వెళ్ళిపోయింది.

-----///-----

సాయంత్రం ఆ పెన్షన్ పేపర్లన్ని బ్రాంచి మేనేజర్ టేబుల్ పైన పెట్టాడు మెసెంజర్. స్టాఫ్ అందరు వెళ్ళిపోయాక కొంత సేపు సేద దీరి ఆ తరువాత ఆ పేపర్లను ఒక్కొక్కటి తిప్పి చూస్తున్న పురుషోత్తం ఒక్కసారి అవాక్కయ్యాడు. ఒక పేపర్ పైన ఆమె ఫొటో అతికించి ఉంది. పేరు ఒకటికి రెండు సార్లు చదివాడు.

"నో డౌట్. .... ఈమె నా శారద.... నా చిన్ననాటి స్నేహితురాలు.

నా ప్రేమమయి.

నా అనురాగ దేవత.

కాని ఏమయింది ఈమెకు. ఈమె భర్తను కోల్పోయిన అభాగ్యురాలా? హతవిధీ.....

నా శారదను కలవాలి. ఆమెతో మాటలాడాలి"

ఆ పేపర్లన్ని కలయజూసి ఆమె ఫోన్ నంబరుకై వెతికాడు.

కాళ్ళునిలవటం లేదు. చేతులు వణుకుతున్నాయి

మొబైల్ చేతిలోకి తీసుకున్నాడుగాని వేళ్ళు తత్తరపడుతున్నాయి

"రాత్రి సమయములో ఒక లేడీ కస్టమర్ కు కాల్ చెయ్యడం మంచిదికాదేమో" అన్న శంక ఒక వైపు

"అయినా నా శారద...... కదా...... "అని సర్ది చెప్పుతుంది మనసు.

"ఇంట్లో ఇంకెంతమంది కుటుంబ సభ్యులుంటారో...."

ఇలా పరిపరి విధాల ఆలోచించి చివరకు ఆమె అడ్రసు చూసి నేరుగా ఇంటికి వెళ్తే సరి అనుకున్నాడు. వడివడిగా అడ్రస్ కోసం వెతికాడు.

"జడ్జి కోర్టు ఎదురుగా ప్రకాశరావు పేట."

"ఇంకేం అయిదు నిముషాల్లో అక్కడ ఉండవచ్చు" అనుకుని ఎక్కడివక్కడ వదిలేసి బ్రాంచి తాళం వేసెయ్యమని టెంపరరీ మెసెంజర్ కు చెప్పి బయలుదేరాడు.

-----//-----

మునిసిపాలిటీ లైట్ల మసక వెలుతురులో ఇంటిని కనుక్కున్న పురుషోత్తం, భావోద్వేగానికి లోనవుతూ ఇంటి తలుపు తట్టాడు.

తలుపు తెరుచుకుంది. ఎదురుగా శారద. తాను శారద కోసం వచ్చాడు కాబట్టి సులభంగా గుర్తు పట్టాడు. కాని ఆమె గుర్తు పట్టలేదు.

ఆమె "ఎవరు కావాలండీ?"

"శారద .....శారద గారు........"

"నేనేనండి. ఏమి కావాలి?"

"నేను మీ బేంక్ మేనేజర్ని. నా పేరు పురుషోత్తమండి."

ఆ పేరు వినగానే శారదలో చలనం. సోంపేటలో తన చిన్న నాటి ప్రేమికుడు పురుషోత్తం గుర్తొచ్చాడు.

"మీరు........"

"అవును నేనే శారద"

"రండి లోపలికి, కూర్చొండి అని సోఫా చూపించింది."

"ఇంట్లో ఇంకెవరు కనిపించడములేదే?"

"ఎవరు కావాలి?" అని తిరిగి ప్రశ్నిస్తూ కళ్ళ నీళ్ళు పెట్టుకుంది. తన జీవితములో జరిగిన సంఘటనలన్నీ పూస గుచ్చినట్టు చెప్పింది శారద. పురుషోత్తం కోసం తాను ఎక్కడెక్కడ వెదికిందో చెప్పింది.

పురుషోత్తం కూడ తన విషయాలన్ని చెప్పాడు.

"నీ కోసమే ఇంకా ఒంటరిగా మిగిలి ఉన్నాను శారదా"

అంటు ఆమె పక్కకు చేరి కళ్ళతడిని తుడిచాడు. కాని పురుషోత్తం కళ్ళ నుండి కూడ అశ్రు ధారలు కనిపిస్తున్నాయి.

అపురూపముగా ఒకరినొకరు పొదివి పట్టుకుని ఆనందమో విషాదమో తెలియని ఒక అనిర్వచనీయ అనుభూతిలో తాదాత్మ్యత చెందారు కొంతసేపు.

శారద పురుషోత్తంల జీవితాలలో ఎన్ని దుర్ఘటనలెదురైనా వారి ప్రేమ చావలేదు. ఏ మూలనో దాగిన అదృష్టం వారిని కలిపింది. ఈ అపూర్వ కలయికతో వారి ప్రేమానుబంధం విధిని గెలిచింది. నిజమైన ప్రేమకు దైవం ఎల్లప్పుడు తోడు నీడగా ఉంటుంది అని మరోసారి ఋజువయ్యింది.

-----///-----

మరిన్ని కథలు

Vyavasayam
వ్యవసాయం
- డా:సి.హెచ్.ప్రతాప్
Vaaradhi
వారధి
- ప్రభావతి పూసపాటి
Gunam pradhaanam
గుణం ప్రధానం!
- చెన్నూరి సుదర్శన్
Mamakarapu velugulu
మమకారపు వెలుగులు
- డా:సి.హెచ్.ప్రతాప్
Samskaram
సంస్కారం
- Karlapalem HanumanthaRao
Gayam-Oka agni putrika katha
గాయం - ఒక అగ్నిపుత్రిక కథ
- హేమావతి బొబ్బు
Aavu aaratam
ఆవు ఆరాటం
- చెన్నూరి సుదర్శన్