మంగాపురంలో మల్లి అందరికీ తలలో నాలుకలా మెలుగుతూ వూళ్ళో వారందరి పనులు చేసేవాడు. ఎవరేది ఇస్తే అదే పుచ్చుకునేవాడు. ఇల్లిల్లూ తిరిగేకంటే ఒక్క చోటే పని చేసుకుంటే మంచిదని పెద్దలు సలహా ఇవ్వడంతో సంపన్నుడైన భూపాలుడి ఇంట్లో పనికి కుదిరాడు. తిండి పెడుతూ, పండక్కి బట్టలు కుట్టిస్తూ పనులు చేయించేవాడు భూపాలుడు. నెమ్మదస్తుడైన మల్లి చెప్పిన పనంతా చేసేవాడు.
కొన్నాళ్లకి మంగతో పెళ్లయింది మల్లికి. సంసారంలో దిగాక ఇంటి ఖర్చుల కోసం నెల జీతం అడిగాడు మల్లి. అలాగే అని చెప్పి ఎంతో కొంత ముట్టజెప్పేవాడు భూపాలుడు. ఆ జీతం ఎటూ చాలడం లేదనుకున్నారు మంగ,మల్లి. కొన్నాళ్ళకి ఇద్దరు ఇద్దరు పిల్లలు పుట్టారు వారికి . ఖర్చులు పెరిగాయి కానీ జీతం చాలడం లేదు.
ఇంట్లో ఎదుగుతున్న పిల్లలను చూస్తుంటే గుండెల్లో గుబులు కలిగేది మల్లికి. అది కనిపెట్టింది మంగ. ‘రోజంతా ఒక్కదగ్గరే పని చేసే బదులు ఒక్క పూట వెళ్లి, రెండో పూట ఇంకెక్కడైనా పని చేసుకుంటే ఎక్కువ డబ్బులైనా వస్తాయని’ అంది.
భార్య సలహా నచ్చింది మల్లికి. ఉదయం పూట భూపాలుడింట్లో చేసిన తరువాత మధ్యాహ్నం మరోచోట చెయ్యాలనుకున్నాడు. ఉన్న ఊర్లో అయితే భూపాలుడికి తెలిసే అవకాశం ఉందని, దగ్గర్లోని వూళ్ళో పెద్దరైతు మంగయ్యని కలిసాడు మల్లి. మల్లికి పని ఇవ్వడమే కాకుండా కొంత జీతం ఇస్తానన్నాడు.
ఒకరి గురించి రెండో దగ్గర తెలియకుండా జాగ్రత్త పడ్డాడు మల్లి. కొత్తగా చేరిన మంగయ్యతో సమస్య లేదు కానీ భూపాలుడితోనే సమస్య అనుకున్నాడు. ‘పెళ్లయింది కదా. ఇంటి పనులు చూసుకోవాలని’ అబద్ధం చెప్పాడు భూపాలుడితో.
రెండు చోట్లా పని చేసి ఇంటికి వెళ్లేసరికి ఒళ్ళు హూనమయ్యేది మల్లికి. బాగా అలసిపోయి ముసుగుతన్ని పడుకునేవాడు. కుటుంబంతో గడిపిందే లేదు. అయితే మునుపటి కంటే ఎక్కువ డబ్బు వస్తుందని కొంతలో కొంత సంతోషం మాత్రమే మిగిలేది.
ఒకసారి భూపాలుడి పెద్ద కొడుక్కి పెళ్లి సంబంధం వచ్చింది. ఉదయానికే వస్తామని చెప్పిన వాళ్ళు మధ్యాహ్నానికి వచ్చారు. వాళ్ళు వెళ్లే వరకూ ఉండమని మల్లిని బ్రతిమలాడాడు భూపాలుడు. ఆయన మాట కాదనలేక పనులన్నీ అయ్యేవరకూ ఉన్నాడు మల్లి.
భూపాలుడింటికి వచ్చిన చుట్టాలు సాయంత్రం వెళ్లిపోయిన తరువాత మంగయ్య ఇంటికి వెళ్ళాడు మల్లి. అవతల మధ్యాహ్నం నుండి మల్లి కోసం చూస్తున్నాడు మంగయ్య. గేదెకు జబ్బు చేసినందున వైద్యం చేయించడానికి పశువైద్యుడి దగ్గరకు మల్లిని పంపాలని చూస్తుంటే ఆలస్యంగా వెళ్ళాడు మల్లి. చూసి చూసి విసిగిపోయి మరొకర్ని పశు వైద్యుడి దగ్గరకు పంపాడు మంగయ్య. ఆలస్యం చేసినందుకు మల్లిని తిట్టాడు మంగయ్య.
తన భార్యకు బాగోలేనందున ఆలస్యమైందని అబద్ధం చెప్పాడు మల్లి. కానీ మంగయ్య సహించలేదు.
ఇంకోసారి కూతురి పెళ్ళికి నగలు కొనడానికి పట్నం వెళుతున్నానని తోడుగా రమ్మని మల్లిని పిలిచాడు మంగయ్య. అతన్ని అనుసరించాడు మల్లి. అయితే పట్నంలో పనయ్యేసరికి చీకటి పడింది. రాత్రి ప్రయాణం ప్రమాదమని అక్కడే ఉండాల్సి వచ్చింది. చీకటినే బయల్దేరి ఇంటికి చేరారు. మంగయ్యను వదిలేసి భూపాలుడి ఇంటికి వెళ్ళాడు మల్లి.
మల్లి కోసం చూస్తున్నారు భూపాలుడింట్లో . భూపాలుడి చిన్న కొడుకుని చదువుల కోసం పట్టణం పంపుతున్నారు. సామన్లున్న అతడి పెట్టెను మొయ్యడానికి, పట్టణంలో దిగబెట్టి రావడానికి మల్లిని వెళ్ళమన్నాడు భూపాలుడు. కుదరదని చెప్పలేక, కోపంగా చూస్తున్న భూపాలుడి కుటుంబ సభ్యుల చూపులు తప్పించుకోవడానికి పెట్టెను తలమీద పెట్టుకుని బయల్దేరాడు మల్లి. తిరిగి వచ్చేసరికి రాత్రి అయింది. మరి మంగయ్య ఇంటికి వెళ్లలేదు ఆ రోజు.
తరువాత రోజు మంగయ్య బాగా విసుక్కున్నాడు మల్లి మీద. చెప్పిన పనంతా చేస్తున్నా మాట కాయాల్సి వచ్చిందని, తిట్లు తగులుతున్నాయని బాధపడ్డాడు మల్లి.
అలా చాలాసార్లు జరిగింది. పనుల్ని నిర్లక్ష్యం చెయ్యడం తెలియని మల్లి ఆలస్యంగా రావడంతో కారణం ఉంటుందని అనుమానించాడు భూపాలుడు. ఒక పని వాణ్ణి మల్లి వెనుకే వెళ్లి చూడమన్నాడు. వాడు మల్లిని కనిపెట్టి జరుగుతున్నదంతా చెప్పాడు.
భూపాలుడు మల్లి కనబడినప్పుడు ‘రెండు చోట్లా ఎందుకు చేస్తున్నావని’ అడిగాడు. భూపాలుడికి తెలిసినందుకు ముందు ఆశ్చర్యపోయాడు మల్లి. ఇప్పుడేమీ చేయలేమనుకుని భావించి ఆదాయం చాలడం లేదని, డబ్బు కోసమే చేస్తున్నానని చెప్పాడు.
“వాళ్ళకి మా ఇంట్లో పనిచేస్తున్న విషయం తెలుసా” అని అడిగాడు భూపాలుడు. లేదన్నట్టు తలాడించాడు మల్లి.
భూపాలుడు స్వతహాగా మంచివాడు కావడంతో పెద్దగా నవ్వేసి ‘బాగుంది నీ వ్యవహారం. అలా చెయ్యొచ్చా? వాళ్ళు కనుక నిన్ను బాగా చూసుకుంటే మా మీద ద్వేషం పెరిగే అవకాశం ఉంది. ఒకవేళ మేమే నిన్ను బాగా చూసుకున్నామనుకో , వాళ్ళ మీద నీ కోపం పెరిగేది. అకారణంగా ఒకరిని ద్వేషించే స్థితి కలిగేది. ఇద్దరు యజమానుల దగ్గర పనిచేయకూడదు నువ్వు. మాలో ఎవరివల్లనైనా నీకు కష్టం కలిగే అవకాశం ఉంది. మేము జీతమిస్తున్నాము కాబట్టి పనులు చెబుతాము. నీకు కోపం కలిగి దేనికైనా పూనుకుంటే ఒకరికి ప్రమాదమే కదా. నువ్వు రెండో చోట పని చేస్తున్నావని తెలియక ఎక్కువసేపు ఉంచినా ఉంచుతాము. అలాంటప్పుడు కోపం వచ్చిందా?” అని అడిగాడు.
“మీమీద రాలేదు కానీ నా పేదరికానికి నా మీదే కోపం వచ్చేది. ఇద్దరు ఇళ్లలో చేయడం వలన ఇంటికి వెళ్లి పడుకోవడం తప్ప మా వాళ్లతో సంతోషంగా గడపలేదు ఒక్కరోజు కూడా. డబ్బు అవసరం ఉండడంతో పని చేయక తప్పటం లేదు”అన్నాడు మల్లి. భూపాలుడు కాసేపు ఆలోచించి “రేపటి నుండి అక్కడ మానేసి పూర్తిగా ఇక్కడే ఉండిపో. జీతం పెంచుతాను. అదీగాక మన దగ్గర రేపో ఎల్లుండో ఈనబోయే గేదెలు ఉన్నాయి. ఒకటి తీసుకెళ్లి పోషించు. ఆ పాలతో వ్యాపారం చేసుకోండి. వేన్నీళ్లకు చన్నీళ్లలా ఆదాయం పెరుగుతుంది. నువ్వు బాగా కుదురుకున్నాక నా గేదెను తిరిగి ఇవ్వడమో డబ్బు చెల్లించడమో చేయవచ్చు” అన్నాడు.
భూపాలుడి మాటలు, ఇచ్చిన అవకాశం నచ్చాయి. సరేనన్నాడు మల్లి. భూపాలుడిచ్చిన గేదెపాలతో వ్యాపారం చేసి కొంత డబ్బు కూడబెట్టి సొంతంగా కూడా రెండు గేదెలు కొనుక్కున్నారు. పాలవ్యాపారం లో మంగకు సాయపడుతూ పిల్లలని చూసుకుంటూ గడపడంతో సంతోషం కలిగేది మల్లికి.
----**------

