విల్లుపురాన్ని వీరబ్రహ్మం పాలించేవాడు. వీరబ్రహ్మానికి ఓ కొడుకు వున్నాడు. అతడిని సమీపంలోని గురుకులంలో చేర్చారు.
వీరబ్రహ్మం చాలా అసూయపరుడు. తన కొడుకు వీరప్పకు విద్య వంటబట్టలేదు. గురువు వద్దకు వెళ్లి '’ ఎలాగైనా నా కొడుక్కి మాత్రమే విద్య వచ్చేలా మిగిలిన వారు విద్యా వంతులు కాకూడదు..`` అని ఆదేశించాడు.
రాజు మాటకు గురువు ఎదురు చెప్పలేదు. రాజు ఆదేశం శిరసా వహించాడు. ప్రతి రోజూ గు రు కులంలో రాజు కుమారుడు వీరయ్యను మాత్రమే తన వద్దకు పిలుచుకుని విద్య నేర్పేవాడు. . అతనికి ఎంత చెప్పినా బుర్ర గోక్కుని '’ నాకు ఏమీ అర్థం కాలేదు `` అని తల అడ్డం తిప్పేవాడు.
గురుకులంలో మిగిలిన విద్యార్థులలో సూరయ్య ఏకసందాగ్రాహి.. '' రాజు కుమారుడు తప్ప మిగిలిన విద్యా ర్థులపై వివక్ష చూపడం ఏమిటి?`` అని గురువును ప్రశ్నించాడు. అయినా గురువు రాజ శాసనాన్ని పాటించాడు.
ఈ విషయాన్ని రాజదృష్టికి తీసుకెళ్లాడు. ఇది విన్న రాజు గురుకులానికి వచ్చి '’ నా కొడుకు మాత్రమే చదవాలి.. మిగిలివారు అసమర్థులు..ఇది రాజ ఆజ్ఞ ..`` అని చెప్పి మిగిలిన విద్యార్థులను అక్కడి నుండి ఇంటికి తరిమివేశాడు.
గురువుపక్షపాత బుద్ధికి మిగిలిన విద్యార్థులు విస్మయం చెందారు. వారిలో సూరయ్య తనలో దాగిన ప్రతిభతో రోజూ గురుకులం బయట వుండి గురువు బోధించే పాఠాలు విని విద్యావంతుడయ్యాడు. తన తెలివి తేటలతో గాలిలో ఎగిరే విమానాన్ని తయారు చేశాడు. అటవీ ప్రాంతంలో ఆ విమానాన్ని ఎక్కి విహరించసాగాడు సూరయ్య.
అప్పటికే గగనతలంలో విహరిస్తున్న విగంగాన్ని నడపడంలో మంచి నైపుణ్యం సంపాదించాడు.
ఇది వీరబ్రహ్మం చెవిన పడింది. వెంటనే రాజభటుల సాయంతో అతడిని పిలిపించాడు. అతను రూపొందించిన విమానాన్ని తన అనుమతి లేనిదే నడపకూడదని, ఏపని చేయకూడదని, నైపుణ్యం కలిగిన పనులు రాజు, అతని కుమారులు మాత్రమే చేయాలని అప్పుడే ప్రజలకు ఉపయోగపడుతుందని చెప్పి ఆ విమానాన్ని స్వాధీనం చేసుకున్నాడు.
దాన్ని తయారు చేసింది తన కుమారుడే అని గొప్పలు చెప్పుకోసాగాడు రాజు వీరబ్రహ్మం.
అయితే రాజు తీరు సూరయ్య ఊరి ప్రజలకు నచ్చలేదు. అప్పటికే గిరిజన ప్రాంత ప్రజలను, కొండలు, గుహలు దాటించి ప్రయాణ సాధనంగా వినియోగిస్తున్న ఆ విమాయాన్ని రాజు లాక్కుని తన కుమారుడు తయారు చేశాడని గొప్పలు చెప్పుకోవడం గిరిజనులకు మింగుడుపడలేదు.
ఓ రోజు వీరబ్రహ్మం స్వయంగా ఓ పర్వతం వద్దకు వెళ్లాడు. అక్కడ ప్రకృతి అందాలు తిలకిస్తుంటే కుండపోత వర్షం కురిసింది. వీరబ్రహ్మం `` ఏమి చేయాలో దిక్కుతోచడంలేదు. కొండపై పడిన వర్షానికి బాగా తడిచి ముద్దయ్యాడు. లోయలోని నీళ్లలో చిక్కుకున్నాడు.
ఆ సమయంలో విమానం వుంటే ఎక్కి ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు కదా?`` అనుకున్నాడు. కాని దాన్ని నడపడం తెలియకపోవడంతో రక్షించుకోలేకపోయాడు. తన స్వార్థంతో ఆ విమానం నిరుపయోగంగా వుందని తెలుసుకున్నాడు. రెండు రోజులు ఓ కొండ గుహలో దాక్కుని సాయం కోసం అర్తించాడు.
అప్పటికే వర్షాలకు పల్లపుప్రాంతం నీటిలో మునిగిపోయి చెట్లు, ఇళ్లపై కూర్చున్న ప్రజలను తను చేసిన మరో విమానంతో మిట్టప్రాంతాలకు తరలించి సాయం చేస్తున్నాడు సూరయ్య.
దారిలో వెళుతుండగా రాజు ఆర్తనాధాలు విని కొండ గుహలోకి దిగి చలికి వణుకుతున్న రాజును రక్షించాడు సూరయ్య.
ఆపద సమయంలో వున్న తనను సూరయ్య ప్రతిభతో చేసిన విమానం సాయంతో రక్షించినందుకు కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. వీరబ్రహ్మం. అసూయకు పోతే చేటు ఎదురవుతుందని గ్రహించాడు. ప్రతిభ తన కొడుకు సొంతం కావాలని స్వార్థంతో మిగిలిన పిల్లలను వెళ్లగొట్టడాన్ని తలుచుకుని పశ్చాత్తాపపడ్డాడు.
ప్రతిభను దాచివుంచాలని ఎన్ని కుయుక్తులు పన్నినా అది దాగదని గ్రహించాడు వీరబ్రహ్మం. అప్పటికే ప్రజాసేవ చేస్తున్న సూరయ్యను అభినందించి తన వద్ద నిరుపయోగంగా వున్న విమానంతో పాటు సూరయ్య సాయంతో మరికొన్నింటిని రూపొందించి దేశ ప్రజలకు విపత్కర సమయాల్లో సేవలు అందించసాగాడు చదువు, ప్రతిభ విలువ గ్రహించిన రాజు వీరబ్రహ్మం.

