తెలుగు చిత్రసీమకు మకుటంలేని మహారాజులా వెలుగుతున్న కథానాయకుడు రాఘవ. పురిటి నొప్పులతో సతమతమౌతున్న భార్య జానకితో అతను వస్తున్నారన్న వార్తతో, ‘ఆసరా’ ఆసుపత్రివారు పైన అంతస్తు ఖాళీ చేయించి, వారికి ప్రత్యేకంగా రెండు గదులు కేటాయించి, అక్కడనే ఆమెకు వైద్యం చేయ నిశ్చయించేరు. రాఘవ సూచనతో అక్కడ సిసిటివిలు ఆపివేసి, అతనికి అత్యంత సన్నిహితుడైన మారుతి తప్పించి ఎవరూ అక్కడకు రాకుండా ఏర్పాట్లు చేసేరు.
రాఘవ అభిమానుల సంఘాలన్నింటికీ కలిపి రాష్ట్రస్థాయి అద్యక్షుడు మారుతి. ఏ శుభముహూర్తంలో వారిరువురూ పరిచయమయ్యేరో కానీ, వారిద్దరి మధ్య ఘనిష్టమైన స్నేహబంధం ఏర్పడింది. రాఘవ మారుతికి దైవసమానుడైతే, మారుతి రాఘవకు బహిప్రాణం.
తమ ప్రియతమ కథానాయకుడు తొలిసారిగా తండ్రి కాబోతున్నాడని, రాఘవ అభిమానులు లెక్కలేనంతగా ఆసుపత్రికి చేరుకొని, శుభసమాచారం వినగానే తమ సంతోషాన్ని గొప్పగా జరుపుకొని రాఘవ యెడల తమ అభిమానాన్ని తెలియచేయాలని ఎదురుచూస్తున్నారు. ఆసుపత్రి ప్రాంగణంలో ఇతర రోగులకు అసదుపాయం కలగకుండా, అభిమానులు నిశ్శబ్దంగా ఉండేటట్టు మారుతి తగు జాగ్రత్త తీసుకున్నాడు.
జానకికి కొంత వైద్యం జరిపిన వైద్యులు రాఘవతో – “బిడ్డ అడ్డం తిరిగింది కనుక మీభార్యకు శస్త్రచికిత్స చేస్తాము” అని చెప్పి, అతని సమ్మతికై అవసరమైన కాగితాలు పంపేరు.
అప్పుడు సమయం రాత్రి 08.40 అయింది.
“నాకు భయంగా ఉంది మారుతీ” అన్న రాఘవతో ---
“అధైర్యపడకు అన్నా, అంతా మంచే జరుగుతుంది” అని మారుతి ధైర్యం చెప్పసాగేడు.
రెండు గంటల తరువాత వచ్చిన వైద్యులు రాఘవతో –
“సారీ రాఘవగారూ, ఎంత ప్రయత్నించినా బిడ్డను కాపాడలేకపోయేము. మీభార్య ప్రాణాలు కాపాడేందుకు ఆమె గర్భసంచీ తీసేయవలసి వచ్చింది. అందువలన భవిష్యత్తులో ఆమెకు పిల్లలు పుట్టే అవకాశం లేదు. మత్తుమందుతో తెలివి తప్పి ఉన్న ఆమెకు తెలివి రావడానికి రెండు గంటలు పైనే పడుతుంది” చెప్పేరు.
“జానకి ఆరోగ్యం గురించి ఏమీ చింత లేదు కదా”
“మృతశిశువుకు జన్మనిచ్చినట్టు తెలిస్తే, ఆమె ఎలా స్పందిస్తుందో చూడాలి. తట్టుకోలేకపోతే, మరలా స్పృహ కోల్పోవచ్చు లేక కోమాలోకి వెళ్ళినా వెళ్లవచ్చు” అని చెప్పేరు వైద్యులు.
అప్పుడు సమయం రాత్రి 10.50 అయింది.
“మృతశిశువుకు జన్మనిచ్చిన మీ వదిన, ఇక పిల్లలు పుట్టే అవకాశం కూడా పోగొట్టుకుందని తెలుస్తే, ఆమెకు ఏమవుతుందో అని భయంగా ఉంది మారుతీ” అంటూ విచారించసాగేడు రాఘవ.
రెండు నిమిషాలు ఆలోచించిన మారుతి, దూరంగా చరవాణిలో మాటలాడి వెనక్కు రాఘవ దగ్గరకు వచ్చి – “అన్నా, నేనుండగా వదినకు ఏమీ అవనివ్వను. నువ్వు నాతో పద”
“ఎక్కడికి మారుతీ? ఇప్పుడున్న పరిస్తితిలో మీ వదినను వదిలి నేను నీతో ఎలా వచ్చేది?”
“వదినకు తెలివి వచ్చేసరికి సమయం పడుతుందని చెప్పేరు కదా. ఆలస్యం చేయకుండా నాతో రా” అన్న మారుతితో రాఘవ, తల మీద టోపీ పెట్టుకొని ముఖానికి మాస్క్ పెట్టుకొని, ఆసుపత్రి వెనక వైపునుంచి ఆటోలో బయలుదేరేరు.
పది నిమిషాలలో, ఆటో మారుతి ఇంటి దగ్గర ఆగింది. రాఘవను ఇంటి లోపలికి తీసుకొనివెళ్ళిన మారుతి, భార్య చూస్తూ ఉండగా, తొట్టెలో ఉన్న మగబిడ్డడిని తీసి రాఘవ చేతికి అందించేడు.
“పండంటి ఈ పసిపాపడు ఎవరు? నాకెందుకు ఇస్తున్నావు మారుతీ”
“ఈ పాపడు ఈరోజు ఉదయం మాకు పుట్టిన బిడ్డ అన్నా. ఈ బీదవాడికి పుట్టిన బిడ్డడు అని నువ్వు చిన్నచూపు చూడకుండా స్వీకరించి, వదిన పక్కలో పడుకోపెట్టు. వదినను బ్రతికించుకునేందుకు ఇంతకంటే నాకు వేరే దారి తోచలేదు. ఇందుకు నాభార్య మనఃపూర్తిగా సమ్మతించింది. మాకు ఇంకో బిడ్డ పుట్టకపోదు”
“అభిమానానికైనా హద్దుండాలి మారుతీ. నాభార్య ప్రాణం కోసం, తల్లి బిడ్డడిని వేరు చేసిన పాపానికి నన్ను ఒడిగట్టమంటావా”
“మేము ఇస్తే తీసుకుంటున్నప్పుడు, నీకు పాపం ప్రసక్తి ఎక్కడిదన్నా”
“మా ఇద్దరి సమ్మతితో మీకిస్తున్న ఈ బీదవారి బిడ్డడిని స్వీకరించి, మీభార్యను బ్రతికించుకోండి బాబూ” అన్న మారుతి భార్య మాటలు విన్న రాఘవ –
“నాభార్య బ్రతకాలన్న సదుద్దేశంతో, కన్నబిడ్డడిని మాకిస్తున్న మీరు ఎప్పటికీ బీదవారు కాదమ్మా. అమృతతుల్యమైన మనసు కల మీకు కృతజ్ఞతలతో ఈ బిడ్డడిని తప్పకుండా మా బిడ్డడిగా స్వీకరిస్తున్నాను. ఇకనుంచీ మేమే కాదు, మీ దంపతులు కూడా వీడికి తల్లితండ్రులే” అని ఉద్వేగంతో పలికిన రాఘవ మాటలకు మారుతి –
“వదిన ఆరోగ్యం బాగుపడాలంటే, ఈ బిడ్డడు ఆమెకు పుట్టిన బిడ్డడే అని ఆమెతో అబద్ధం చెప్పడమే కాక నువ్వు కూడా అలాగే వ్యవహరించాలన్నా. వదినకు తెలివి వచ్చేలోపల ఈ బిడ్డడిని ఆమె పక్కలో పడుకోపెట్టాలి, త్వరగా పద” అని రాఘవను తొందర చేయసాగేడు.
“ఒక్క క్షణం మారుతీ. మీ బిడ్డడిని తీసుకోవాలంటే, నేను సంతోషంగా సంతకం చేసి ఇచ్చే ఖాళీ చెక్కు నీవు స్వీకరించి, నీకు కావలసిన అంకె వేసుకో” అన్న రాఘవ మాటలకు –
మారుతి “బిడ్డడిని అమ్ముకొనేవాళ్లతో మాటలాడినట్టు మాటలాడి మాకు కష్టం కలిగించకన్నా” అన్నాడు.
“నాభర్త చెప్పినదేదైనా పాటించాలన్న పతివ్రతా ధర్మానికి కట్టుబడి, బిడ్డడిని మీకు ఇవ్వడానికి అంగీకరించేను కానీ, మీ డబ్బుకు ఆశించి ఎంత మాత్రమూ కాదు బాబూ” అంది మారుతి భార్య.
“క్షమించమ్మా, మీ ఇద్దరి మనసులూ నొప్పించి చాలా పొరపాటు చేసేను. మీ బిడ్డడిని ఆనందంగా స్వీకరిస్తున్నాను. మీకెప్పుడు ఏ అవసరం పడినా, నేనున్నానని మరవకండి. మీ భార్యాభర్తలకు మరొకసారి నా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను” అని, రాఘవ బిడ్డడిని తీసుకొని మారుతితో కలిసి బయలుదేరేడు.
దారిలో రాఘవ మెల్లగా “మారుతీ, ఇప్పుడు అక్కడ బిడ్డడి మార్పిడి ఎలా?”
“నేను చూసుకుంటానన్నా. నువ్వు నిశ్చింతగా ఉండు”
పూర్తిగా కప్పబడి, పైకి ఏమీ కనబడకుండా ఉన్న బిడ్డడిని ఎత్తుకున్న మారుతి, రాఘవతో కలిసి ఆసుపత్రి వెనక వైపునుంచి, జానకి ఉన్న గదిలోనికి నేరుగా వెళ్లిపోయేరు.
అక్కడ రాఘవకు బిడ్డడిని అందించిన మారుతి, తొట్టెలో ఉన్న మృతశిశువును పూర్తిగా కప్పివేసి, పైకి ఏమీ కనపడకుండా తన భుజం మీదకు చేర్చుకున్నాడు. మారుతి సలహా మీద, ఆసుపత్రివారు మృతశిశువు కాలుకు ఆనవాలుగా కట్టిన చీటిని తీసి, తొట్టెలో పరుండబెట్టిన బిడ్డడికి కట్టేడు.
మృతశిశువును ఒక చిన్న సంచీలో పెట్టుకొని, తల మీద టోపీతో ముఖానికి మాస్క్ పెట్టుకొని, త్వరత్వరగా ఆసుపత్రి వెనక వైపున ముందుగా అట్టిపెట్టుకున్న ఆటోలో తీసుకొని వెళ్ళి, అరగంట తరువాత వచ్చిన మారుతిని మృతశిశువును ఏమి చేసేవని రాఘవ అడగలేదు, మారుతి చెప్పలేదు కూడా.
అప్పుడు సమయం రాత్రి 11.20 అయింది.
మారుతి మరియు రాఘవ ఐదు నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని, ఏమి చేయాలో ఎలా నటించాలో మాటలాడుకున్నారు.
మారుతి హెడ్ నర్స్ ఉన్న చోటుకి వెళ్ళి – “డాక్టరుగారు ఎక్కడ” అని కొంచెం గట్టిగా అడిగేడు.
“ఏమైంది”
“రాఘవ చాలా కోపంగా ఉన్నారు. ‘డాక్టరుగారిని వెంటనే రమ్మను’ అంటూ చిందులు వేస్తున్నారు”
ఆమె పక్క గదిలో ఉన్న జూనియర్ డాక్టరు దగ్గరకు పరుగున వెళ్ళి మారుతి మాటలు చెప్పింది.
ఆ డాక్టరు వెంటనే వచ్చి “పదండి” అంటూ మారుతితో కలిసి రాఘవ ఉన్న గదిలోనికి వెళ్ళి –
“ఏం జరిగింది సార్”
“ఇక్కడ ఏం జరుగుతోంది? మాకు పుట్టిన పాపడు హాయిగా బ్రతికి ఉంటే, ‘చనిపోయేడు’ అని చెప్పి మాకు విచారం కలగచేసేందుకు సాహసం చేసినది ఎవరు? నేను మీ ఆసుపత్రి సూపరెంటుకి ఫిర్యాదు చేయాలి. వెంటనే ఆయనను పిలవండి” అని చాలా కోపంగా కేకలు వేస్తూ రాఘవ అడిగేసరికి –
ఆ డాక్టరుకి ఏమి చేయాలో తోచక –
“మీకు పుట్టిన పాపడు హాయిగా బ్రతికి ఉన్నాడా”
“మీరే చూడండి, తొట్టెలో పాపడు బ్రతికి ఉన్నాడో లేదో”
“ఒక్క నిమిషం సార్” అని జూనియర్ డాక్టరు తొట్టెలో పడుకొని ఉన్న బిడ్డడి గుండె పరీక్షించి –
సీనియర్ డాక్టరుగారికి ఫోన్ చేసి జరిగింది వివరించేడు.
సీనియర్ డాక్టరుగారు సూపరెంటుగారికి ఫోన్ చేసి జరిగినది చెప్పగా, ఆయన సీనియర్ డాక్టరుగారితో –
“మీరు వెంటనే వెళ్ళి రాఘవతో మాటలాడుతూ ఉండండి, పది నిమిషాల్లో నేను వస్తాను” అని చెప్పి రాఘవను కలిసేందుకు త్వరత్వరగా రాసాగేరు.
తన దగ్గరకు వచ్చిన సీనియర్ డాక్టరుగారితో రాఘవ “నేను మీ సూపరెంటుతో తప్ప వేరెవరితో మాటలాడను” అని కోపంగా చెప్పడంతో –
ఆయన చేసేది లేక “సూపరెంటుగారు బయలుదేరేరు, పది నిమిషాల్లో ఇక్కడ ఉంటారు” అని రాఘవకు చెప్పి సూపరెంటుగారి కోసం వేచి చూస్తూ నిలబడ్డారు.
పది నిమిషాల్లో అక్కడకు వచ్చిన సూపరెంటుగారు “సార్, క్షమించాలి. హాయిగా బ్రతికి ఉన్న మీ బిడ్డడిని మృతశిశువుగా ఎలా నిర్ధారించారన్న విషయం మీద, మా ఆసుపత్రిలో ఎవరి ద్వారా తప్పు జరిగిందో తెలుసుకొనేందుకు వెంటనే విచారణ చేయిస్తాను. మీరు పెద్ద మనసు చేసుకొని, ఈ పొరపాటును క్షమించమని వేడుకుంటున్నాను” అని చేతులు జోడించి నమస్కారం చేసేరు.
అక్కడే ఉన్న సీనియర్ డాక్టరుగారు జూనియర్ డాక్టరు సూపరెంటుగారి వెనుక చేతులు జోడిస్తూ రాఘవకు నమస్కారం చేస్తూ నిశ్శబ్దంగా నిలబడ్డారు.
అంతవరకూ అక్కడే మౌనంగా ప్రేక్షకునిలా ఉన్న మారుతి, రాఘవతో –
“అన్నా, సూపరెంటుగారు పొరపాటైందని ఒప్పుకుంటున్నారు కదా, పెద్ద మనసుతో వారిని క్షమించు”
“క్షమించడానికి ఇదేమీ చిన్న తప్పు కాదు మారుతీ. ఇరవై నిమిషాల క్రిందట తొట్టెలో కదులుతున్న బిడ్డడిని నేను చూసినంతవరకూ, వాడు మృతశిశువే అనుకొని ఎంతగా విచారించానో నీకు తెలుసు కదా. మీ వదినకు ఇంతవరకూ తెలివి రాలేదు కాబట్టి సరిపోయింది. లేకుంటే, మృతశిశువుకు జన్మనిచ్చేను అనుకొని, ఆమెకు జరగరానిది జరిగి ఉంటే, తలచుకునేందుకే నాకు భయం వేస్తున్నది. మా దంపతులను అనవసరమైన మానసిక క్షోబకు గురిచేసిన వాళ్ళను క్షమించే ప్రసక్తే లేదు. రేపే లాయరుతో మాటలాడి, ఈ ఆసుపత్రి మీద పరువునష్టం దావా వేస్తాను”
“నువ్వు చెప్పినది నిజమే అన్నా. నీకు పుట్టినది మృతశిశువు కాదు హాయిగా ఉన్న బిడ్డడు అని తెలిసిన శుభ తరుణంలో వీరిని క్షమిస్తే, నీ మంచితనం అందరికీ తెలియడమే కాక, నీ బిడ్డడికి అందరి ఆశీస్సులు లభిస్తాయి. కాబట్టి, నా మాట విని, ఈ విషయంలో ఆసుపత్రివారిని క్షమించి, పరువునష్టం దావా ఆలోచన విరమించుకో. ఈ విషయం మరెవరికీ తెలియకుండా ఉండేందుకై, ఆసుపత్రివారు కూడా ఎటువంటి విచారణ చేయరు. ఇప్పుడు వదినకు ఎంత త్వరగా తెలివి వస్తుంది అన్నది ముఖ్యం మనకు”
అక్కడే ఉన్న సీనియర్ డాక్టరుగారు “రాఘవగారూ, బిడ్డడిని మీ ఆవిడ పక్కలో ఆమెకు దగ్గరగా పడుకోపెట్టండి. బిడ్డ స్పర్శతో ఆమెకు త్వరగా తెలివి రావచ్చు”
“అలాగంటారా” అంటూ రాఘవ తొట్టెలోని బిడ్డడిని భార్య పక్కలో పడుకోపెట్టేరు.
ఐదు నిమిషాల తరువాత బిడ్డడి స్పర్శతొ పాటూ, ‘కేరు’ మంటూ బిడ్డడి ఏడుపు చెవిలో పడిన జానకిలో కదలిక వచ్చింది. మరో ఐదు నిమిషాలకు ఆమెకు పూర్తిగా తెలివి వచ్చింది.
అది చూసిన రాఘవ మారుతిని దగ్గరకు తీసుకొని “మీ వదినకు తెలివి వచ్చింది మారుతీ” అని –
సీనియర్ డాక్టరుగారితో చేయి కలిపి “మీరు చెప్పినట్టే జరిగింది. నాకు చాలా ఆనందంగా ఉంది” అని -- సూపరెంటుగారితో “ఈ ఆనంద సమయంలో ఇంతవరకూ జరిగినది అందరం మరచిపోదాం” అని చెప్తూ, ఆయనతో కూడా కరచాలనం చేసి తన ఆనందం వ్యక్తం చేసేడు. చిరునవ్వుతో చూస్తున్న జూనియర్ డాక్టరుతో కూడా కరచాలనం చేసి, చిన్నాపెద్దా తేడా లేకుండా వ్యవహరిస్తున్న రాఘవ సరళ స్వభావానికి అందరూ అభినందించేరు.
అభిమానులతో శుభవార్త చెప్పడానికి వెళ్తున్న మారుతితో –
“అందరినీ రేపు ఉదయం విందుకి రమ్మని నా మాటగా చెప్పి, మీ దంపతులు తప్పకుండా రావాలి” అని చెప్పిన రాఘవ, అక్కడున్న ఆసుపత్రి అధికారులను కూడా మరుసటి విందుకి ఆహ్వానించేరు.
కొసమెరుపు : ఇక్కడే ఉంటే, తమకు పుట్టిన బిడ్డడిని చూడాలన్న కోరిక ఆపుకోవడం
కష్టం అనుకున్న మారుతి దంపతులు, ఎవరికీ చెప్పకుండా,
మరునాడుదయం ఊరు వదలి వెళ్లిపోయేరు.

