అది ఒక అందమైన అపార్ట్మెంట్... లక్ష్మీనివాసం అనే బోర్డు చూస్తూ కార్లోంచి కిందికి దిగింది సుగుణ.. నాలుగు రోజులు ముందు అద్దెకు ఫ్లాట్ చూడటానికి వచ్చినప్పుడు చుట్టుపక్కల సరిగా గమనించలేదు. ఇప్పుడు చూస్తుంటే చుట్టూ మొక్కలు తో,గేటు దగ్గర సెక్యూరిటీ తో,మధ్యలో గణపతి గుడి ఇవన్నీ ఎంతో ఆహ్లాదంగా ఉంది సుగుణ కి.. ఉదయం 8 గంటలు అయిందేమో, స్కూల్ బస్సు లు గేట్ దగ్గరకి వస్తుంటే, వారి స్కూల్ బస్సు లో పిల్లలు ఎక్కుతున్నారు. పిల్లలు కూర్చోవటానికి కొన్ని చైర్స్ కూడా వేసివుంచారు... స్కూల్ డ్రెస్, షూ, టై ఇవన్నీ పెట్టుకున్నాక పిల్లలు ముద్దుగా ఉంటారు అనుకుంది.. మాములుగా అయితే, మన వాతావరణానికి షూ వేసుకోమనటం సుగుణకి బొత్తిగా నచ్చదు.. అది హిల్ స్టేషన్స్ స్కూల్స్ కి సరిపోతుంది అని తన భావన. భర్త అద్దె ఎక్కువ పెట్టాడు అని అనిపించినా, గేటెడ్ కమ్యూనిటీ ఫెసిలిటీస్ కి ఆ మాత్రం పెట్టాలిలే అని అనుకుంది. ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళు సామాను సద్దుతుంటే, భర్త వ్యాన్ దగ్గర మరియు తను ఇంట్లో ఉండి దగ్గరుండి సర్దించుకుంది. సామానుదింపేసరికి మధ్యాహ్నం అయింది. ఇక లంచ్ చేసి సర్దుకోవడం మొదలుపెట్టారు ఇద్దరు.. రాత్రిలోపు సద్దటం పూర్తి చేయడంతో, వాళ్ల కూతురుని ఊర్లో ఉన్న పిన్ని గారి ఇంట్లో ఉంచటం,సర్దుకోవడానికి ఎంత మంచిదైందో అని అనుకున్నారు ఇద్దరు.. పక్క ఫ్లాట్ రజని పొద్దున్నే బెల్ కొట్టి ఫ్లాస్క్ లో టీ ఇచ్చి, పరిచయం చేసుకోవడంతో పొద్దున్నే కిచెన్ డ్యూటీ తప్పినందుకు ఆనందపడింది.. భార్యాభర్తలిద్దరూ టీ తాగి ఊళ్లో ఉన్న పిన్ని గారి ఇంట్లో నుంచి పాప ను తీసుకురావడానికి బయలుదేరారు. మధ్యాహ్నం లంచ్ చేసి పాప ని తీసుకొని, వారి కొత్త ఇంటికి తప్పకుండా రమ్మని పిన్నిని ఆహ్వానించి సెలవు తీసుకున్నారు భార్యాభర్తలు . సాయంత్రం అయ్యాక పరిచయం చేసుకుందామని గుడి వద్దకు వెళ్ళిన సుగుణకు అక్కడ గ్రూప్స్ గా ఉండి గుడి పైన అజమాయషి చేయడం కోసం మాటల యుద్ధం చేసుకుంటున్న రెండు గ్రూపులు పరిచయం అయ్యాయి.. గొడవలకి దూరంగా ఉండే సుగుణ, దేవుడికి నమస్కరించి తిరిగి ఇంటికి వచ్చింది. తర్వాత రోజు భర్త కమ్యూనిటీ వాట్సప్ గ్రూపులో పేరు ఎడ్ చేయించారు కామన్ ఇన్ఫర్మేషన్ కోసం.. ఆ వాట్సాప్ గ్రూప్ లో కొత్త కమిటీ కోసం, మళ్ళీ రెండు గ్రూపులు డైరెక్ట్ గా మాటలు యుద్ధం చేసుకుంటున్నారు.. పేరుకి గేటడ్ కమ్యూనిటీ గాని ఒకరి మధ్య ఒకరికి అంత సాన్నిత్యం, పక్కవారి మంచి చెడు తెలుసుకోవడం అనే అలవాటు లేని అపార్ట్మెంట్లో సుగుణకి కొంచెం ఇబ్బందిగా ఉంది రోజులు యాంత్రికంగా గడుస్తున్నాయి. ఒకరోజు పార్క్ దగ్గర వాళ్ళ పాపని ఆడుకోవడానికి తీసుకెళ్తే, పార్క్ లో పిల్లలు బెంచికి ఇద్దరు చొప్పున కూర్చుని మొబైల్ చూస్తున్నారు. సుగుణకు చాలా కోపం వచ్చింది,పిల్లలు చేతుల్లో మొబైల్ చూసి. వారు వీడియో గేమ్స్ ఆడుతున్నారు. కొంతమంది రీల్స్ చూస్తున్నారు. అది చూసిన సుగుణకి అక్కడ ఉండాలనిపించక తిరిగి ఇంటికి వచ్చేసింది. రాత్రి భర్త ఆఫీస్ నుంచి వచ్చాక పార్క్ లో చదువుకునే పిల్లల ఒక్కొక్కళ్ళ చేతిలో మొబైల్స్ తో ఏమి చేస్తున్నారో చెప్పి బాధపడింది. చిన్న ఏజ్ లోనే ప్రతి వారి చేతిలో ఒక సొంత మొబైల్ ఉండడం అనేది కరెక్ట్ కాదు అని తన భావన.. మరుసటి రోజు అప్పటివరకు తనకు పరిచయమైన ఒక ఐదుగురు లేడీస్ తో కూర్చుని ఖాళీ సమయంలో పిల్లలు మొబైల్ చూడటం మాన్పించడానికి ఏం చేయాలా అని ప్రణాళిక సిద్ధం చేసింది రోజు సాయంత్రం 6 నుంచి 7 వరకు అపార్ట్మెంట్లో ఉండే పిల్లలకు తన ఐదుగురు ఫ్రెండ్స్ కలిసి రోజుకొకరు చొప్పున ఉచితం గా క్లాస్ తీసుకునేటట్టుగా ఒక ప్రోగ్రామ్స్ సిద్ధం చేసింది. సోమవారం శ్లోకాలు మంగళవారం మోరల్ స్టోరీస్ బుధవారం మెదడుకి మేత గురువారం గేమ్స్ శుక్రవారం సంగీతం శనివారం జనరల్ నాలెడ్జ్ ఆదివారం ఆసనాలు ఇలా ఏడుగురు ఆడవాళ్లు రోజుకొకరు చొప్పున ఆ ఫ్లాట్లో ఉన్న పిల్లలకు ఉచితంగా చెప్తామని మొదలుపెట్టారు మరుసటి రోజు కామన్ గ్రూప్ లో మెసేజ్ పెట్టారు వీళ్లు చేయబోయే పని గురించి. రోజు సాయంత్రం ఆరయ్యేసరికి ఏ రోజు క్లాస్ తీసుకునే వాళ్ళు ఆరోజు కమ్యూనిటీ హాల్ లో కూర్చునేవారు. ఏది చెప్పినా పిల్లలని తిట్టకుండా, భయపెట్టకుండా చెప్పాలని నిర్ణయించుకున్నారు.. మొదట్లో అయిదుగురు పిల్లలతో మొదలైన క్లాసెస్ కాలక్రమేణా 50 మంది పిల్లలుగా మారింది. మిగతా తల్లులకు కూడా ఇది బాగా నచ్చింది.. మొదట్లో ఇష్టపడని పిల్లలు కూడా మిగతావారు ఆడుతూ పాడుతూ రోజు ఏదో ఒకటి నేర్చుకునే సమయాన్ని చూసి వారు కూడా క్లాసెస్ కి రావడం మొదలుపెట్టారు.. అలాగే తల్లులు కూడా కొత్త విషయాలు నేర్పించడానికి వారు కూడా నేర్చుకోవడం మొదలుపెట్టారు. సుగుణ మొదలు పెట్టిన కొత్త ఐడియాతో అపార్ట్మెంట్లో పిల్లల తల్లులు ఆనందంగా ఉన్నారు, వారి పిల్లలు మొబైల్ వాడటం తగ్గించినందుకు.. ఇది చూసి నచ్చిన పెద్దవారు కూడా వారు కూడా వారి అనుభవాలను క్లాస్ గా చెప్తామని ముందుకు వచ్చారు. కొత్తగా వచ్చిన సుగుణ వల్ల అపార్ట్మెంట్లో మార్పు రావడంతో అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ తర్వాత వచ్చిన ఒక పండుగ రోజు, సుగుణ ను సన్మానించారు.. మిగతా అపార్ట్మెంట్ లో కూడా ఇలా అమలుపరిస్తే బాగుంటుంది అని ఆశించారు .. దూరం నుంచి తన భార్యని సన్మానించడం చూస్తూ , ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక కొత్తదనం తీసుకువచ్చే భార్యని చూసి లో లోపల గర్వ పడ్డాడు సుగుణ భర్త... జ్యోత్స్న జల్లూరి

