బతుకు గంప - వై.కె.సంధ్య శర్మ

Batuku gampa

బతుకు గంప సూరీడు నడినెత్తిన తాండవమాడుతున్నట్లు మిట్ట మధ్యాహ్నం వీధిలో నుంచి వినిపిస్తున్న ఓ గొంతు విని వాకిట్లోకి వెళ్ళిన సునంద "ఇదిగో...!"అని పిలిచింది. పెద్ద గంపను నెత్తిన పెట్టుకుని నిటారుగా నడిచొస్తున్న ధ్వజస్తంభంలా వుంది ఆమె, కాయ కష్టం చేసే చేతులేమో బాగా రాటుదేలి ఇనుప కడ్డీల్లా వున్నాయి. నడి వేసవి మధ్యాహ్నం కావడంతో ముఖమంతా చెమటతో తడిసిపోయి వయసు మీరిన ముడుతలు కనపడుతూనే వుంది. నెత్తిన పెట్టుకున్న గంపను కిందకు దించుతూ ఓ వైపు ఆయాసపడుతూనే "బాగుండాయమ్మా పచ్చి శనిక్కాయలు యేసుకోండ"అంది తమలపాకులు నమిలి నమిలి గార పట్టిన పళ్ళన్నీ కనబడేలా నవ్వతా.. ఆ నవ్వు లో అంతవరకు ఎండలో నడిచి అలసిన ఛాయలైనా కనపడలేదు. "ఎంతకిస్తావు..?"అనడిగింది సునంద గంపలోని కాయల్ని చేతిలోకి ఎత్తుకుంటూ, "నాలుగు పళ్ళు నూరు "అని గంపలో వున్న పడితో కొలిచి, తన చేతిలో వున్న పళ్ళెంలో వేస్తుంటే "ఐదివ్వకూడదా..?"అనడిగింది బేరమాడుతూ సునంద "లేదు బుజ్జమ్మా...రేటెక్కువుండాది నాకేమి గిట్టదు .."అంటూనే సగం పడిపైనే పళ్ళెం లో వేసి “గింజ బాగుండాదమ్మా..తిని సూడు" అన్నది. 'అవున్లే' అని మనసులోనే అనుకుని రెండు కాయలు ఒలిచి నొట్లో వేసుకుంటూ "గంపలో కాయలన్నీ అట్టే వున్నాయి.. ఎక్కడా అమ్మలేదా ?" అనడిగింది. " పొద్దుట్నించి ఈధీది తిరగతానే వుండా ఎవురు కొన్లా , నీదే తొలి బేరం "అంది అదే నవ్వు.‌ గంపలోని కాయల్ని ఆమెను ఒకేసారి చూసి ‘ఇంత బరువు మోసుకుని ఊరంతా తిరుగుతా వుందా’ అని, ఎదురెండ ముఖానికి తగలతా వుంటే ఒంటికి పట్టిన చెమటను నూలు చీరతోనే తుడుచుకుని గంపనెత్తి తలపై పెట్టుకుంటా వుంటే "నీళ్ళు తాగాతావా "అనడిగింది సునంద. "వద్దు బుజ్జమ్మా..,నీళ్ళు తాగితే అడుగడుక్కి ఒంటికి పొవాల్సొస్తది..ఈ టౌన్లో యాడికి పొయ్యేది..." అనేసి నిటారుగా నడిచెళ్ళిపోయింది. *** పదిహేను రోజుల తర్వాత మళ్ళీ ఆ గొంతు వినిపించింది.. వెళ్ళి పిలిచింది సునంద. ఆమె నవ్వుతూ గంప కింద పెడుతూ తనను గుర్తు పడుతున్నట్లు "బుజ్జమ్మా..! ఆ రోజు నీకిచ్చిపొయ్యినంక గంటలో కాయిలన్నీ ఐపాయ..ఈ ఈధిలోనే అంతా నీ సేతి సెలవ"అంటా తను అడక్కమునుపే పళ్ళెంలో ఐదు పళ్ళు యేసేసి ,ఈసారి కాయిలు సంద్రగిరికి పొయ్యి తెస్తిని..ఈడేడా కాయిలే లేవు బుజ్జమ్మా.. కాయి సూడు ఎంత బాగుందో” అంటా తను అడక్కపోయినా...శనక్కాయల మూట గురించి..ఎక్కడెక్కడ ఎంతకి అమ్ముతారో అన్నీ చెప్పుకుంటా తనకు జీవనాధారం ఇదేనని, ఊరికి బస్సు కూడా లేదు నాలుగు మైళ్ళు నడిచి రోడ్లోకొస్తే ఆడవచ్చే ఆటోలోనో ట్రాక్టర్లలోనే ఎక్కి బస్సుకు రావాల టౌన్లోకి రావాలంటే.. నాలుక్కాయలు అమ్మితేనే నాకు అంత అన్నం లేకపోతే లేదు” అని కొంచెం నీరసంగా తనలో తనే అంటుంటే ఆమె, మధ్యాహ్నం భోజనం వేళైందని "అన్నం పెడతాను తింటావామ్మా..?" అనడిగింది సునంద. తన పరిస్థితి చూసి మనసులో ఏదో బాధ అనిపించి , "వద్దు బుజ్జమ్మా పొద్దున్నే సంగటి తినేసి వచ్చిండా..ఇంగ సందేళొరకు ఆకలెత్తదు.." అనేసి నవ్వుతూ గంపనెత్తిన పెట్టుకుని వెళ్ళిపోయింది. *** ఆమె వెళుతున్న వైపే చూస్తూ నిల్చుంది , ఎంత అభిమానమో అంత ఆత్మాభిమానమూ చూపిస్తున్న ఆమెకు , అన్నం పెడతానన్నా.. వద్దని వెళ్ళిపోతుంటే ఏదో కన్నీటి పొర అడ్డుపడింది... ఏడుపదుల వయసులో కూడా ఆమె ఇంకా ఇలా కష్టపడటం చూస్తుంటే జాలేస్తుందని ,తీసుకున్న పచ్చి శనక్కాయలను శుభ్రం చేసి కొన్నింటిని వేయించి ,మరికొన్నింటిని ఉడికించి మరి కొన్ని కాయలు ఒలిచి గింజలు చేసి పెట్టింది. భర్త ,పిల్లలిద్దరికీ సరదాగా కబుర్లు చెబుతూ కాయలు ఒలిచి గింజలు తినిపించడం తనకెంతో ఇష్టం అందుకే అపుడపుడు మార్కెట్ దగ్గర అమ్ముతూ వుంటే చూసి తీసుకొచ్చేది. . మార్కెట్లో తెచ్చిన కాయలు చాలా మట్టి తో వుండి సగం కాయలు వృధాగా పొయ్యేవి. కానీ ఈమె దగ్గర చాలా బాగున్నాయని మొదటిసారే అనిపించి తను మళ్ళీ శుభ్రం చేసుకోవాల్సిన పని లేకుండా కాయ కడిగినట్లు ,ఇంకా లోపలి గింజలైతే లేత గులాబి రంగులో వుండి తియ్యగా వున్నాయి. అందుకే మళ్లీ రెండోసారి తన గొంతు వినగానే పిలిచింది . ఇక ఈమె దగ్గరే పచ్చిశనక్కాయలు కొనాలని నిశ్చయించుకుని. **** చీరకు అంచులు కుడుతున్న సునందకు వీధి తలుపు తీసిన శబ్దం వినగానే ,ఈ సమయంలో ఎవరొస్తారనుకుని వెళ్ళి చూడగానే… ఎదురుగా ఆమె నవ్వుతూ లోపలికి వస్తోంది.. ఈసారి తను పిలవలేదు సరి కదా, లోపలికి వస్తున్న ఆమెను ఆపలేదు.. "బాగుండావా బుజ్జమ్మా.. ?" అనడుగుతూ ఈమధ్య తను వచ్చి చాలా రోజులైంది.. ఎందుకు రాలేదో తెలియదు కానీ మధ్యలో ఓ రెండు మూడు సార్లు పిల్లలు పచ్చిశనక్కాయలు కావాలని అడిగినప్పుడు ఆమె వస్తే తీసుకుంటానని చెప్పింది.. కానీ తను వచ్చి రెండు నెలలవుతోంది..ఆ తర్వాత ఇప్పుడే రావడం. గంప కింద పెడతా వుంటే "ఏం పెద్దమ్మా మా ఇల్లు మరిచిపోయినావా ఏంది ఇన్నాళ్ళూ?"అనడిగింది కొంచెం సొంతంగా "అదేం లేదు బుజ్జమ్మా, నెలన్నాళ్ళప్పుడు ఆటోలో వస్తాంటే ఆటో బోల్తా పడిపోయి మా ఊరోళ్ళిద్దురు సచ్చిపొయినారు, నాకు కాళ్ళు సేతులు గోక్కపోయినాయి "అంది తనకు తగిలిన దెబ్బలు చూపిస్తూ.. "అయ్యో అవునా...ఇప్పుడు ఎట్లుంది .. దెబ్బలు బాగా తగిల్నాయా?"అనడిగింది కంగారుగా తన శరీరం వైపే చూస్తూ. మునుపటిలా లేదు తన మొహం. బాగా నీరసించిపోయినట్లు వుంది , "ఇంట్లోనే వుండక మళ్ళీ ఈ గంప ఎత్తుకోని ఎందుకు వచ్చావు పెద్దమ్మా..?" అనడిగింది సునంద. "కాలికి దెబ్బ తగిలిందని ఇంట్లో వుంటే ఎట్లా ,సేసిన అప్పు తీర్సాలి బుజ్జమ్మా... "అంది విరక్తి గా.. పెదవి విరుస్తూ "అప్పా...!"అంది ఆశ్చర్యంగా " ఆ.. మా మామ కోసం రెండేండ్లబ్బుడు ఆస్పత్రికి ఆరులచ్చలు అప్పుసేస్తి ..అది తీర్చే దాకా ఈ గంప ఎత్తాల్సిందే...అబ్బుడి వరకు నా పానం వుంటే సాలు బుజ్జమ్మా "అంది నవ్వుతా “ ఏమైంది పెద్దాయనకు ఇప్పుడెట్లా వుంది?"అనడిగింది గంపలోఎత్తుకున్న శనక్కాయలను గంపలోకే వేస్తా. "అబ్బుడేదో పురుగు ముట్టి జరమొచ్చి ఆస్పత్రిలో చూపిస్తే పెద్దాసుపత్రికి తీసుకుబోండని సెప్తే ఆడ చూపించి .. నెల్లాళ్ళు పెడితి..."అంది ఆ రోజులు గుర్తు చేసుకుంటూ.. "ఇప్పుడు బాగైపోయిందా..?"అనడిగింది తననే చూస్తూ. "మా మామే వుంటే నాకీ బాధేట్నుంచి వస్తుంది..బుజ్జమ్మా.. లేడు పొయినాడు ,మామ కోసం సేసిన అప్పు మిగిలింది " అన్నది. అరె ఎంత బాధ అనుకుని "నీకు కొడుకులున్నారన్నావు వాళ్ళు చూసుకోరా...?" అంటే "నువ్వు మాకోసం చేస్తివా అప్పు.. మా కాడ లేదు మే తీర్చలేం అన్రి.. , మా మామ మాట మీద నిలబడేటోడు తను లేకపోతేనేం.. నే ను తీరుస్తా అని ఆరోజు ఎత్తిన ఈ గంప.. కూలీ నాలీ సేసుకుంటా ,ఆ అప్పు తీర్సేంత వరకు నిలపకూడదని మా మామకు సెప్పుకుంటి. బతికున్నప్పుడు ఏరోజు గడప దాటనిచ్చింది లేదు మా మామ..బంగారంలా సూసుకున్నాడు వున్నన్నాళ్ళు, ఇబ్బుడు నాలుగు లచ్చలు దీర్చేసినా.. ఇంకో రెండు లచ్చలుండాది...అది కూడా డ్వాక్రా గ్రూపు లో లోను ఇస్తే ఇచ్చేద్దారని అనుకుంటి నాకు వయసైపోయిందని ఇచ్చేది లేదని సెప్పేసిరి... అందుకే...ఈపొద్దు వస్తి ఈ నెల వడ్డీ ఈలేదని తిరిగి పోతాండాడు మా సిన్న మరిది, సొంత తమ్ముడే అన్నకిచ్చిన డబ్బు కోసం పీడిత్తావుండాడు ఇంగ కడుపున బుట్టిన బిడ్లు సూస్తారని మాటేడుండాది "అంది. ఆమె తను పడిన బాధంతా కళ్ళలోకి నింపుకుంటావుంటే.. తనకేం చెప్పాలో అర్థం కాక చూస్తుండి పొయింది సునంద. "మళ్ళీ ఎబుడొస్తానో ఏమో ఇంగో నూరుకి యేసుకోమ్మా " అనగానే.. సరే నని తీసుకుని "జాగ్రత్త పెద్దమ్మా" అంది. అదే నవ్వుతో లేచి గంప తలపైకెత్తుకుని నడిచి వెళ్ళిపోయింది. ఆమె మోస్తున్నది శనక్కాయల గంపనే కాదు తన బతుకును పండించిన తన భర్తకు ఇచ్చిన మాటను కూడా రెండు సార్లు కలిసి ఆత్మీయంగా పలకరించినందుకే తన గురించి ఇంతలా బాధ కలుగుతుంటే తనకే ఆశ్చర్యం వేసింది. కానీ, తను చెప్పిన మాటల్లో ఒక్క మాట సునందకు చెంపపై చెళ్ళున తగిలినట్లు అనిపించింది. తీసుకున్న కాయలు వైపు కూడా చూడకుండా ఆలోచనలో పడింది. **** "అత్తమ్మా ...! ఇదిగోండి ఐదు లక్షలు” అంటూ అత్తగారి చేతిలో పెట్టింది. ఆమె కంట్లో కలవరం.. కనపడుతూనే వుంది. కొడుకును ఓ వైపు చూస్తూ తీసుకోవాలా వద్దా అని ఆలోచిస్తూ.. "అత్తమ్మా..! ఇది నేను మనస్ఫూర్తిగా ఇస్తున్నదే.. ఇంటి కోడలిగా నా బాధ్యతగా నేను సంపాదించి దాచిన డబ్బు ఇది.. , మీరు మరేం ఆలోచించుకండి" అంది. *** "మీ నాన్న ఆరోగ్యం బాగా లేక ఆస్పత్రిలో వున్నప్పుడు అప్పు చేసి ఆస్పత్రి బిల్లు కట్టాను రా.. అది ఇప్పుడు తీర్చుమంటున్నారు , ఆ డబ్బులు ఎలాగైనా సర్దుబాటు చెయ్యండి రా ఇద్దరూ" అనగానే గుడి పూజారిగా వున్న తండ్రి దశ కర్మలకే రెండు లక్షల పై చిలుకే ఖర్చయ్యిందని, ఇప్పుడు మేం ఏమి ఇవ్వలేం... అనేసి ఇద్దరు కొడుకులు తలా ఓ దారిన వెళ్ళిపోయారు. మధ్యలో తల్లి ఎప్పుడైనా ఫోన్ చేసినా డబ్బులు అడుగుతుందేమోనని తనతో మాట్లాడటం కూడా మానేశారు. కానీ భర్త కోసం చేసిన అప్పును తీర్చడానికి ,ఏనాడూ భర్త మాటను గీతను ఇంటి గడపను దాటని ఇల్లాలు, ఈరోజు వంట మనిషిగా నాలుగిళ్ళల్లో పని చేస్తుందని తెలిసినా పట్టించుకోలేదు ఎవరూ. మన అనుకున్న బంధాలన్నీ కూడా ఆర్థిక బంధాలైపోతున్న ఈ రోజుల్లో ఇక తల్లి బిడ్డల మధ్య కూడా అనుబంధాలకు తావు వుండదేమో అనిపించి ,ఇన్నాళ్లూ తను చేసిన తప్పు తెలిసొచ్చి, రెండు రోజులు పరిచయం వున్న ఆమె కోసమే అయ్యో అన్న తను.. ..కట్టుకున్న భర్తకు జన్మను ,జీవితాన్ని ఇచ్చిన తల్లి కోసం తను ఏం చెయ్యాలో తెలుసులేకపోయిందనే పశ్చాత్తాపంతో బంగారం కొనడానికి దాచిన డబ్బును తీసుకు వచ్చి అత్తగారి చేతిలో పెట్టింది. *** ఇప్పుడు అత్తమ్మ కళ్ళలో ఆనందం.. తన భర్త మనసులో మెచ్చుకోలు రెండూ మరచిపోలేనివే. బాధ్యత బంధాలను నిలబెట్టాలే కానీ విడదీసి సంబంధాలను వదిలేసుకుంటే వచ్చే అనర్థాలు అనంతమేనని తెలుసుకుంటే మన కుటుంబ వ్యవస్థ కుంటుపడకుండా వుంటుందని తనకు తనే గట్టిగా చెప్పుకుని...తన కళ్ళు తెరిపించిన ఆమె కూడా భర్తకు ఇచ్చిన మాట కోసం బతుకు గంపను మోస్తూ పడుతున్న బాధను అర్థం చేసుకుని కన్న కొడుకులు చేరదీయ్యాలని మనఃస్ఫూర్తిగా కోరుకుంది. ఆ రోజు త్వరగా రావాలని.. ***

మరిన్ని కథలు

O illali katha
ఓ ఇల్లాలి కథ
- అనిసా తబస్సుమ్ sk
Gnanodayam
జ్ఞానోదయం
- - బోగా పురుషోత్తం, తుంబూరు.
Tyaganiki pratiroopam
త్యాగానికి ప్రతిరూపం
- డా:సి.హెచ్.ప్రతాప్
Peratichettu
పెరటి చెట్టు
- టి. వి. యెల్. గాయత్రి
Manasuna Manasai
మనసున మనసై
- డా:సి.హెచ్.ప్రతాప్
anishi-Janthuvu
మనిషి – జంతువు
- Karlapalem HanumanthaRao
Iddaru yajamaanulu
ఇద్దరు యజమానులు
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Gulakarallu
గులకరాళ్ళు
- Lakshmi Priyanka