సుగుణమ్మ వంటింట్లో కాఫీ కలుపుతుండగా ప్రక్కనే చూస్తున్న శంకర రావుతో , “ ఏమండీ, ఈ మధ్య మన అబ్బాయి తరచూ ఏదో ఆలోచనల్లో మునిగి ఉంటున్నాడు , ఈ రోజు కూడా ఆఫీసు నుంచి రాగానే ఎందుకో మేడ మీదకు వెళ్ళిపోయాడు. మామూలుగా అయితే టీ . వి ముందు వాలిపోయేవాడు.
శేఖర్ కు కాఫీ ఇచ్చినట్టు ఉంటుంది, అలానే సంగతేమిటో కొంచం మెల్లగా కనుక్కుని రండి “ అని కాఫీ కప్పుతో పురామాయించింది.
“ నిజమేనోయ్”! నేను ఈ మధ్య కొద్దిగా మార్పు గమనించాను “ అని అన్నాడు శంకర రావు
శంకర రావు, సుగుణమ్మలకు ఒక్కగానొక్క కొడుకు శేఖర్ . తను ఏం.బి.ఏ చేసిన వెంటనే ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం వచ్చింది.
కొడుక్కు కాఫీ ఇచ్చి విషయమేమిటొ
కనుక్కుందామని మేడ మీదకు వెళ్ళాడు శంకర రావు .
ఎప్పుడూ ఫోన్ లో మునిగిపోయే కొడుకును కొత్తగా చూసాడు శంకర రావు
శేఖర్ చాలాసేపటి నుంచి ఫోన్ చేతిలో లేకుండా ఏదో ఆలోచనలో ఉన్నాడు .
“ ఏంట్రా ! ఏమో దీర్ఘంగా ఆలోచిస్తున్నావు ? కొంపతీసి ప్రేమలో పడ్డావా ఏంటి ?
నీ వయస్సు పిల్లలు ఇంతలా ఆలోచిస్తున్నారంటే అది ప్రేమ గురించే అయ్యి ఉంటుంది ” కాఫీ ఇస్తూ అన్నాడు శంకరరావు .
ఈ మాటలు వినగానే శేఖర్ కొంచెం చిరాకు గా “అబ్బా నాన్నా! నువ్వు అమ్మ నాకు చాలా
స్వా తంత్ర్యం ఇచ్చారు, నేను ఎవరినైనా ఇష్టపడితే ఇంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు, మీతో ఏ సంకోచం, భయo లేకుండా చెప్పగలను, మీరు నేను చెప్పేది తప్పకుండా వింటారని , నా మాటకు విలువ ఇస్తారనే నమ్మకం నాకుంది” .
కాసేపు ఆగి మళ్ళీ అడిగాడు శేఖర్ -
“ఇదంతా కాదులే నాన్నా! నీకు ఎవరన్నా ప్రాణ స్నేహితులు వున్నారా? వాళ్ళను ఎప్పుడూ కలుస్తూ ఉంటావా? నీ మాటల మధ్యలో ఇద్దరి పేర్లు విన్నానే కానీ, ఎప్పుడూ నేను కలిసింది లేదు!”
దానికి శంకరరావు వెంటనే
“ అవును రా! శేఖర్ , ఉన్నారు, కానీ చాలా దూరంలో. ఉద్యోగరీత్యా ఇలా ఎక్కడి వాళ్ళు అక్కడ స్థిరపడిపోయాము. అదేంటో కాని వాళ్ళను ఎప్పుడు కలసినా , ఏ విషమైనా నిస్సంకోచంగా మనసు విప్పి మాట్లాడగలను. కానీ ఇప్పుడు ఎవరినీ విడదీ యకుండా మీకు ఇప్పుడు ఫేస్ బుక్ , వాట్సాప్ లు ఉన్నాయి ! అందరితో టచ్ లో ఉండడానికి భలే ఉపయోగపడతాయి. ఒకందుకు అదీ మంచిదే , కానీ వాటిని వాడే విధానం చూస్తేనే మితిమీరి పోతున్నారనిపిస్తుంది”.
శేఖర్ అంతా విని మరొక ప్రశ్న వేశాడు.
“ఈ కాలం పిల్లల స్నేహం పై నీ అభిప్రాయం ఏమిటి నాన్నా?”
“ పరికరాలపై మమకారం పెరిగిపోతూ
మానవ సంబంధాలపై తరిగిపోతోoది రా!”
అన్నాడు శంకర్ రావు కవితాత్మకంగా
శేఖర్ “ నాన్నా నీ కరకర కవితా స్రవంతి తర్వాత ముందు నేను అడిగిన ప్రశ్నకు జవాబివ్వు “
శంకరావ్ :
“మన జీవిత గ్రంధములో ఎన్నో పేజీలు మారుతున్నా , మరుపురాని మధురమైన పేజీ ఈ స్నేహ బంధం “
ఇక ఈ కాలం స్నేహ బంధాల గురించి చెప్పాలంటే, ఈ కాలం పిల్లలు అని అందరిని అనలేము కానీ , ఎక్కువ శాతం పిల్లలు కలిసి మాట్లాడటం కంటే సోషల్ లో మీడియాలో స్నేహ జీవితం గడుపుతున్నారనిపిస్తుంది.
మా రోజుల్లో స్నేహితులంతా కొంతసేపే కలిసి మాట్లాడుకున్నా, మనసుకి చాలా హాయిగా ఉండేది .ఇప్పుడు రోజంతా కలిసి ఉన్నా ఒక గీత గీసుకొని ఉంటున్నారు. ఎమన్నా అంటే ప్రైవసీ అంటారు .
మనసు విప్పి
మాట్లాడుతున్నట్టు అనిపించట్లేదు.
మొన్ననే పత్రికలో చదివా,
ఏడాదికి 52 లక్షలు సంపాదిస్తున్నా ఒకడు నా జీవితం ఒంటరి వాడి వలె అనుభవిస్తున్నా! అని ట్విట్టర్ లో పోస్ట్ చేశాడంట!”
శేఖర్ : “ అబ్బా నాన్నా! ఈ కాలం స్నేహం పై అభిప్రాయం చెప్పమంటే నీ పదునైన మాటలతో అందరినీ మెత్తగా మొట్టడం మానవు కదా !”
శంకర్ రావు : “ నేను చెప్పింది అదేరా ! ఇంతకీ నువ్వేం ఆలోచిస్తున్నావు రా! అది చెప్పనే లేదు , ఏదో స్నేహం మీద ప్రశ్నలతో అసలు విషయం దాటేశావుగా ? “
శేఖర్ ఒక పెద్ద నిట్టూర్పు విడిచి , “ఆఫీసులో ఇద్దరు సహఉద్యోగుల సఖ్యత మధ్య జరిగిన విషయం నమ్మలేకపోతున్నా. ఏదో అలాంటివి సినిమాలో చూసానే కానీ, నిజజీవితం లో ఎప్పుడూ వినింది కూడా లేదు.
మీరు ఇందాక చెప్పిన విషయం వీరికి ఏమాత్రం
వర్తించదు.
గుర్తుందో లేదో, మూడు నెలల క్రితం మా ఆఫీసు లో ప్రసాద్ అనే అబ్బాయికు కార్డియాక్ అరెస్ట్ వచ్చి చనిపోయినట్టు చెప్పాను కదా! ఆ అబ్బాయి వయస్సు 32 ఏళ్ళే , కొద్ది కాలంలోనే ఆఫీసు లో పెద్ద స్థాయికి ఎదిగిన అబ్బాయి.
తన పని తను చేసుకుంటూ ఏమీ ఆశించకుండా ఇతరులకు సహాయం చేసేవాడు.
రోజుకు రెండు గంటల ధ్యానం, గంటసేపు యోగా,
మరో గంట పూజ చేసేవాడు. ఆఫీసు
గాస్సిప్స్ లో అస్సలు తల దూర్చే వాడు కాదు , ఆఫీసు తర్వాత పార్టీలలో కూడా పాల్గొనేవాడు కాదు.
ఫోన్ కూడా ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఎక్కువగా ఉపయోగించుకునేవాడు.
చాలా నెమ్మదస్తుడు.
ఈ కాలంలో కూడా ఇలాంటి అబ్బాయి ఉంటాడా అనిపించేది “
ఇలాంటి అబ్బాయా పోయిందీ? అని ఆఫీసులో అందరూ భాదపడ్డారు. ఆ అబ్బాయికు రెండేళ్ల క్రితమే పెళ్లి జరిగి, పది నెలల పాప కూడా ఉంది.
ఎవ్వరితో ఎక్కువగా మాట్లాడని ప్రసాద్ తనతోపాటు చేరిన సాయి అనే అబ్బాయితో మాత్రం చాలా కలుపుగోలుగావుoడేవాడు .
సాయి, ప్రసాద్ కు పూర్తిగా విరుద్ధం , నాస్తికుడనే చేప్పాలి . ఆధ్యాత్మికట లో కలవకపోయినా ప్రాణ స్నేహితులయ్యారు.
సాయి ఏడాదిలోనే పై స్థాయికి ఎదిగినా, వీరి స్నేహం చెక్కుచెదరలేదు.
ఆఫీసులో ఉన్నంతసేపు కలిసే ఉండేవాళ్ళు, అలా ఏడాదిన్నర గడిచిపోయింది.
ఈ మధ్య కాలం లోనే సాయికి కూడా పెళ్లి అయ్యింది. సాయి పెళ్లి కి ప్రసాద్ వారం రోజులు
సెలవు పెట్టి
ఇంట్లో వాళ్ళకు తలలో నాలుకగా మెలిగాడంట.
ఒకరోజు అనుకోకుండా ప్రసాద్ కు ఇంట్లో ఉన్నప్పుడు ఛాతి నొప్పి రావడం తో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. విషయo తెలిసి సాయి కూడా వెంటనే
ఆసుపత్రికి చేరుకొని
ప్రసాద్ ను కలిసి “నీకు ఏమీ కాదు రా, నే నున్నాను “ అని ధైర్యం చెప్పాడు .
డాక్టర్ చిన్న సర్జరీ చేస్తే సరిపోతుంది అని చెప్పి మరుసటి రోజు ఉదయానికి అన్నీ సిద్ధం చేసి పెట్టుకున్నాడు .
మరుసటి రోజు ఉదయం మరలా కార్డియాక్ అరెస్ట్ అయ్యి సర్జరీ కన్నా ముందే ,
ప్రసాద్ తుది శ్వాస విడిచాడు. కుటుంబమo తా శోక సముద్రo లో మునిగిపోయింది . సాయి భోరున విలపించాడు. సాయిని పట్టుకోవడం ఎవ్వరి తరమూ కాలేదు.
ఆ మరుసటి రోజే మాకు తెలిసిందేoటంటే సాయి కూడా పదిహేను రోజులు సెలవు పెట్టాడు అని. బహుశా ప్రసాద్ జ్ఞాపకాల నుంచి బయటకు రావడానికి కొంత సమయం కావాలి, కనుక సెలవు పెట్టాడు అనుకున్నాo. కానీ ఆ తర్వాత తెలిసిన విషయమo నన్ను ఆశ్చర్యానికి గు రిచేసింది. తను ప్రసాద్ తల్లితండ్రులకు అసరాగా నిలిచి పదమూడు రోజులు కర్మకాండలో పాల్గొన్నాడని .
తండ్రి ఉన్నవారు ఈ కర్మలు చేయడానికి పనికిరారు. కానీ సాయికి చిన్నప్పుడే తండ్రి పోవడంతో -------.
ఆ పదమూడు రోజులు ఆ ఇంటికి పెద్దకొడుకై బా ధ్యత గా అన్ని పనులు దగ్గరుండి మరీ చూసుకున్నాడట .
ఆఖరి రోజున మామూలుగా అందరూ పోయిన వాళ్ల గురించి ఒక మాట మాట్లాడతారు, ఆ రోజు సాయి “ప్రసాద్ నా స్నేహితుడు కావడం నా అదృష్టం , ఆ స్నేహితుడు చిరకాలం నాతో ఉండలేకపోవడం నా దురదృష్టం. ప్రసాద్ భౌతిక రూపం కనుమరుగైంది నిజమే.. కానీ ఈ కొద్ది రోజులలోనే చాలా జ్ఞాపకాలను శాశ్వతoగా మిగిల్చి వెళ్ళాడు.
ఇప్పుడు తను లేకపోయినా,ఈ కుటుంబం రూపంలో నాతోనే ఉన్నాడు”.
అని కన్నీటీపర్యంతమయ్యాడు.
ఆరోజు కార్యక్రమం అయిపోయిన తర్వాత సాయిని పట్టుకొని ప్రసాద్ నాన్నగారు భోరున విలపించాడు , అప్పుడు సాయి “ ప్రసాద్ లేని లోటు తీర్చలేను కానీ , ఇక మీదట నేనున్నాను,మీకు దగ్గరగా ఇల్లు తీసుకుంటాను , నా స్నేహితుడికి నా మీద అపారమైన నమ్మకం. ఆ నమ్మకము నిలబెడతాను నేను మీకు అండగా ఉంటాను “ అని వాళ్ళ నాన్నకు ధైర్యం చెప్పాడు.
అందరూ వాళ్ల కుటుంబాన్ని ఓదార్చడానికి
సాయి ఏదో ఆ నిమిషంలో తోచింది చెప్పాడులే అనుకున్నారు.
కానీ, పదిహేను రోజుల క్రితం సాయి ప్రసాద్ వాళ్ళ అమ్మ-నాన్న ఇంటికి దగ్గరగా మారి ,ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు.
సాయి వాళ్ళ అమ్మా నాన్నలకు ఆసరాగా నిలిస్తే సాయి భార్య ప్రసాద్ భార్య కు అండగా నిలిచింది. అంతే కాదు ప్రసాద్ భార్యకు వాళ్ళ బంధువుల కంపెనీ లో అప్లై చేయించి చాలా ఫార్మాలిటీస్ దగ్గరుండి పూర్తి చేసి మూడు నెలల్లో ఉద్యోగం వచ్చేటట్టు చేసింది.
ఈ మధ్య అంతా నేను వాళ్ల స్నేహబంధం గురించే ఆలోచిస్తున్నా నాన్నా.
ఈ రోజుల్లో ఎన్నో కథలు వింటున్నాం.
తల్లిదండ్రులను చూడట్లేదని, అన్నదమ్ములు సరిగ్గా లేరని, అక్క చెల్లెళ్ళ మధ్య మాటలు లేవని కానీ ,
రెండేళ్ల పరిచయంతోనే అంత బంధం ఏర్పరుచుకొ ని ప్రసాద్ కుటుంబాన్ని కూడా తన వాళ్లలాగా చూసుకోవడం చాలా గొప్ప విషయం.
ఈ కాలంలో ఎవరికీ సొంత వాళ్ళతోనే పొసగట్లేదు . అని వింటున్నాము . అలాంటిది పోయిన వాడి కుటుంబం కోసం తను ఏమీ ఆశించకుండా ఇంత చేస్తున్నాడు నాన్నా !
సాయి ఒక్కడినే కాదు, వాళ్ల భార్యను, వాళ్ళ అమ్మగారిని కూడా మెచ్చుకోవాలి
మనకెందుకు ఆ కుటుంబం గురించి అని వాళ్లు అడ్డుచెప్ప లేదు . పై పచ్చు
సాయి మాటకు విలువిచ్చి ఇల్లు మారడంతో పాటు ప్రసాద్ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉన్నo దుకు .
ఎప్పుడైనా వీలున్నప్పుడు వాళ్ల అమ్మా నాన్నల ను బయటికు తీసుకెళ్తాడంట అని ఎవరో చెప్తుంటే విన్నాను.
నువ్వు ఎప్పుడు అంటూ ఉంటావు కదా , ఈ తరం పిల్లలు బంధాలకు విలువ ఇవ్వరని. కానీ వీళ్ళ స్నేహబంధానికి మాత్రం నీ పదునైన మాటలు వర్తించవు ”.
శంకర రావు : “అవునురా శేఖర్ ! ఒప్పుకుంటా,
వెయ్యి మంది ఫేస్ బుక్ ఫ్రెండ్స్ కంటే ఇలాంటి ఒక నిజమైన స్నేహితుడు ఎవరికైనా ఉంటే వాళ్లు మనం సంపాదించే
ఆస్తిపాస్తులన్నిoటి కంటే ఎంతో విలువైనది పొందినట్టే .
ప్రసాద్ ఆస్తి పాస్తులేమి సంపాదించి వెళ్లాడో తెలీదు కానీ నిజంగానే డబ్బుతో కొలవలేని అమూల్యమైన స్నేహాన్ని సంపాదించుకొని పోయాడు .
కాలం ఆ స్నేహానికి అడ్డుకట్ట వేసిన
నిజమైన స్నేహం మరణంతో ముగిసిపోదు, అది కాలతీతం అని నిరూపించింది వీళ్ళ స్నేహబంధం .
వీళ్ళ కథ విన్న తర్వాత నాక్కూడా ఒక్కసారి మా చిన్ననాటి స్నేహితులతో మనసు విప్పి మాట్లాడాలని , పాత జ్ఞాపకాలను నెమరు వేసుకోవాలని ఉంది రా! “
ఈ నెలలోనే లాంగ్ వీకెండ్ వస్తుందిగా అందరు స్నేహితులను ఒక చోట కలిసేట్టు ఏర్పాటు చేస్తా రా!”
భుజం మీద చెయ్యేసి మాట్లాడితేనే అది స్నేహం కాదురా ! నీ భుజం తట్టి వెన్నంటూ నిలిచేవాడు రా స్నేహితుడు. దూరం పెరిగినా, కాలం మారినా మసకబారనిది స్నేహమే రా ! “
అని అనేసి మేడ మీదనుంచి చిన్న సంతృప్తి భావం తో కిందకు వచ్చి
“ఏమో అనుకున్నాను కానీ మన కొడుకు బంధాల గురించి లోతుగా ఆలోచించేoత పెద్దవాడిగా ఎదిగాడు . చాలా ఆలోచన విధానం లో పరిణితి కనిపిస్తోందనే చెప్పాలి, ఇక వాడి గురించి ఏ దిగులు పెట్టుకోకు” అని సుగుణమ్మ తో అంటాడు.
శేఖర్ కూడా చిన్ననాటి స్నేహితుడైన రవికి ఫోన్ చేసి “ వస్తున్నా నేస్తమా ” అని బైక్ మీద రుయ్ మని దూసుకెళ్ళాడు. హెల్మెట్ మాత్రం మరవకుండా వేసుకొని!!!

