గృహమే కదా స్వర్గసీమ - వేముల శ్రీమాన్

Gruhame kadaa swarga seema

“త్వరగా రా... ఆలస్యం అవుతోంది! ఎవరో నా చెవిలో గుసగుసలాడినట్టు అనిపించింది.

కళ్లుతెరిచి చూశాను.

ఎదురుగా ఇద్దరు యమభటులు నిలబడి ఉన్నారు. నల్లని దుస్తులు, గంభీరమైన ముఖాలు. వాళ్ల కళ్లలో ఎలాంటి భావోద్వేగం లేదు. నేను లేచి కూర్చోవడానికి ప్రయత్నించాను.

“ఎక్కడికి?” అని అడిగాను.

“స్వర్గానికి.”

“స్వర్గానికా?”

నా గొంతులో ఆశ్చర్యం కంటే అయోమయమే ఎక్కువ.

“అవును. నువ్వు మరణించావు. నువ్వు చేసిన మంచి కర్మల కారణంగా నిన్ను స్వర్గానికి తీసుకెళ్లమని ఆజ్ఞ.”

నా గుండె ఒక్కసారిగా బరువెక్కింది.

మరణించానా?

ఎప్పుడు?

ఎలా?

ఏమీ గుర్తులేదు.

వాళ్లు మాత్రం నా ప్రశ్నలకు సమాధానాలు చెప్పే స్థితిలో లేరు. తమ కర్తవ్యాన్ని నిర్వర్తించాలన్న తొందరలో ఉన్నారు.

“పద... సమయం అయిపోతోంది.”

వాళ్ల వెంట నడిచాను.

ఎక్కడికి వెళ్తున్నానో తెలియదు. ఎంత దూరం నడిచామో తెలియదు. చివరికి ఒక పెద్ద ద్వారం ముందు ఆగారు.

“ఇదిగో...”

అంతే.

నన్ను ఆ ద్వారం దగ్గర వదిలేసి,

“మా కర్తవ్యం ఇక్కడితో ముగిసింది. ఇక మేము వెళ్తున్నాం.”అని చెప్పి క్షణంలో మాయమైపోయారు.

నేను ఒంటరిగా నిలబడ్డాను.

ద్వారం అవతల ఏముందో చూడాలని ముందుకు చూశాను.

కానీ...

అది స్వర్గ ద్వారం కాదు.

నా కళ్లముందు కనిపించింది—ఒక ఇల్లు!

మా ఇల్లు!

ద్వారానికి ఎదురుగా ఇంటి ముందు వాకిలి. అందమైన పల్లెటూరి సంప్రదాయపు ముగ్గులు, మట్టి వాసన. ఆ దృశ్యం నా కళ్లకు ఎంత పరిచయమో!

ఒక్క క్షణంలోనే సంవత్సరాల కాలం వెనక్కి వెళ్లిపోయినట్టయింది.

“అరే... ఇది మా ఇల్లే!”

నా పెదవులపై తెలియకుండానే చిరునవ్వు మెరిసింది.

ఆ వాకిట్లో ఎన్ని ఆటలు ఆడుకున్నాం!

చార్పల్లి...తొక్కుడు బిళ్ల...దాగుడుమూతలు...సైకిల్ తొలిసారి నేర్చుకున్నది ఇక్కడే.

చిన్ననాటి అడుగులన్నీ ఆ వాకిట్లోనే ముద్రించబడి ఉన్నట్టనిపించింది.

ఆత్రుతగా గుమ్మంలోకి అడుగుపెట్టాను.మా ఇంటి అరుగే నన్ను పిలిచినట్టనిపించింది.

ఆ అరుగుతో ఎన్ని అనుబంధాలో!

మా నాన్న పిచ్చుకల కోసం ప్రత్యేకంగా గూళ్లు కట్టించాడు. అందుకే ఆ అరుగుగది ఎప్పుడూ ఒక రచ్చబండలా ఉండేది. రోజూ పదుల సంఖ్యలో మిత్రులు, బంధువులు వచ్చి కూర్చునేవారు.

ఒకవైపు పిచ్చుకల కిలకిలారావాలు...

మరోవైపు బంధువుల ముచ్చట్లు...

మధ్యలో గోడ గడియారం టిక్... టిక్...

అందరికీ సమయాన్ని గుర్తుచేస్తూ ఉండేది.

అరుగు మీద ఉన్న దుర్గమ్మ దేవికి దండం పెట్టుకుని మా బావి వైపు నడిచాను.

మా బావి...

అది మాకు ఒక కల్పవృక్షమే!

ఎన్నడూ ఎండిపోలేదు. నీళ్లకు కొదవ లేదు. చుట్టుపక్కల వాళ్లు కూడా అవసరమైనప్పుడు వచ్చి నీళ్లు తోడుకెళ్లేవారు.

అదే మా స్నానాల గది.అక్కడే బట్టలు ఉతికేవాళ్లం.

మా నాన్న దానికి కూడా తనదైన ప్రత్యేకతను జోడించాడు. కిందనుంచి మాత్రమే కాకుండా, భంగాల పైనుంచి కూడా బావి నీళ్లు తోడుకునేలా ఏర్పాటు చేయించాడు.

ఒక్కసారి బావిలోకి వంగి నీళ్లు తోడుకున్నాను.

ఆ నీటిని కళ్లకు అద్దుకున్నాను.

అంతే...జ్ఞాపకాల తలుపులన్నీ ఒక్కసారిగా తెరుచుకున్నాయి.

మా తాతయ్య గుర్తుకొచ్చాడు.

ఆయన రోజువారీ జీవితంలో సగం సమయం మా బావి దగ్గరే గడిచేది. ఎంత చలికాలమైనా ఆ బావి నీళ్లతోనే స్నానం చేయాల్సిందే.

“తాతయ్యా...”అనుకోకుండా నా నోటి నుంచి ఆ మాట జారింది.

ముందుకు నడిచాను.ఒక్కసారి కుదురుకున్నాను.

“ఏమిటి? స్వర్గానికి పంపిస్తున్నామని చెప్పి... నా ఇంటికి ఎలా వచ్చాను?”

రెండు అడుగులు ముందుకేశాను.అది మా తాతయ్య గది.

మెత్తని మంచం...పరుపు...ఆ గదిలోని వాసన...అన్నీ అలాగే ఉన్నాయి.

నా జ్ఞాపకాలు పొరలు పొరలుగా దొర్లుతున్నాయి.

మా తాతయ్య తన మంచంలో నాకొక్కరికే పడుకునే అవకాశం ఇచ్చేవాడు.

ఎంత మధురమైన జ్ఞాపకం!

అదే గదిలో ఒక పెద్ద రుబ్బుడు రోలు ఉండేది. చుట్టుపక్కల అమ్మలక్కలందరూ వచ్చి రుబ్బుకునేవారు. వాళ్ల మాటలు, నవ్వులు, ముచ్చట్లతో ఆ గది ఎప్పుడూ కలకలలాడుతుండేది.

అదే గది మా పెంపుడు పిల్లుల ఆవాసం కూడా.

మా ఇంటి సొంత మనుషుల్లాగే అవి కూడా అక్కడే నిరభ్యంతరంగా తిరుగుతుండేవి.

ఆ గది దాటుకుని ముందుకు వెళ్లాను.

మా వంటింటి వరండా.విశాలమైన వరండా.

చుట్టూ సపోటా చెట్లు...దొండ తీగలు...చిక్కుడు...కరివేపాకు చెట్టు...

అదే మా భోజనాల గది.అదే మా డైనింగ్ టేబుల్.

వంటింట్లో ఎంత స్థలం ఉన్నా, అందరం వరండాలో కూర్చొని భోజనం చేయాలన్నదే మా ఇష్టం.

అందరం కలిసి భోజనం చేసేవాళ్లం.

మా నాన్న ఆసక్తికరమైన ముచ్చట్లతో ఆ వరండా ఒక రచ్చబండలా మారిపోయేది.

అక్కడే తాజా మొక్కజొన్న కంకులు, వేరుశెనగలు కాల్చుకుని తినేవాళ్లం.

తరతమ భేదాలు లేవు.భేషజాలు లేవు.

మా నాన్నకు అందరితో కలిసి పంచుకుని తినడంలోనే మహా సంతృప్తి.

అదే వాకిట్లో వేడినీళ్ల పొయ్యి.పక్షుల కిలకిలారావాలు.

ఆ జ్ఞాపకాలన్నీ నా మనసును తడిపేస్తున్నాయి.

ఎదురుగా మా అమ్మ గది, వంటగదిలోకి అడుగుపెట్టాను.

మా అమ్మ రోజులో సగభాగం అక్కడే గడిపేది.

పెద్ద కుటుంబం.

పెద్ద వంట.

అయినా ఆమె ముఖంలో ఎప్పుడూ విసుగు కనిపించేది కాదు.

ఎంతో ఓపికతో అందరి కడుపులు నింపేది.

వంటింట్లోని పూజామందిరం నుంచి వస్తున్న పరిమళం ఇప్పటికీ ఉన్నట్టే అనిపించింది.

మా అమ్మ పెట్టిన పచ్చళ్ల సువాసన నా ముక్కును తాకినట్టయింది.

సంవత్సరానికి సరిపడా ఒక్కో సీజన్‌లో పచ్చళ్లు పెట్టేది.

కూరలు లేకున్నా పచ్చళ్లతోనే కడుపారా భోజనం చేసేవాళ్లం.

మా వంటింటి పొయ్యికి కూడా ఓ ప్రత్యేకత ఉండేది.

పొగ ఇంట్లోకి చేరకుండా, ఆ రోజుల్లోనే మా నాన్న పొగ పైకి వెళ్లేలా ప్రత్యేకంగా ఏర్పాటు చేయించాడు.

ఆ పొయ్యి కూడా ఇంటి సభ్యుడిలానే అనిపించింది.

ఇక నా కళ్లంతా పైకి చూశాయి.

అదే మా భంగాల గది.

మా నాన్న గది.

గునప పెంకులతో పూర్తిగా కప్పబడి ఉండేది. వేసవిలో కూడా చల్లగా ఉండేది.

ఆ గది నిండా పుస్తకాలే.

ఏ కొంచెం సమయం దొరికినా పుస్తక పఠనమే మా నాన్న అలవాటు.

అదే అలవాటు మాకు కూడా అబ్బింది.

ఒక మూలలో మా నాన్న చిన్న సూట్‌కేస్ ఉండేది.

దానినిండా రకరకాల మందులు, ఆయింట్‌మెంట్లు, సిరప్‌లు.

మాకు ఏ చిన్న అనారోగ్యం వచ్చినా మా చూపులు ఆ సూట్‌కేస్ వైపే.

నాన్న ఉన్నాడంటే ఆ గది మనుషులతో నిండిపోయేది.

ఊరి ముచ్చట్ల నుంచి అంతర్జాతీయ విషయాల వరకు...

అది ఒక నిరంతర స్రవంతి.

నాన్న గొంతులో నుంచి వచ్చే మాటలు వింటూ మైమరచిపోయేవాళ్లు ఎందరో.

ఏ విషయాన్నైనా ఆసక్తికరంగా వివరించడం నాన్నకు మాత్రమే సాధ్యమయ్యేది.

ఆ గది పక్కనే భంగాల అరుగు.

వేసవి కాలమంతా మేమందరం అక్కడే పడుకునేవాళ్లం.

పడుకునే ముందు ప్రత్యేక ఏర్పాట్లు.

నేల చక్కగా ఊడ్చి, నీళ్లు చల్లి, ఊకుండ నిండా మంచి నీళ్లు ఉంచుకునేవాళ్లం.

రాత్రి ఎప్పుడవుతుందా అని ఆత్రుతగా ఎదురుచూసేవాళ్లం.

ఆకాశం వైపు చూస్తూ...ఎన్నెన్నో కథలు వింటూ...ప్రపంచ విషయాలు...ఊరి కబుర్లు...

నవ్వులు...చర్చలు...ఎప్పుడు నిద్రపోయేవాళ్లమో తెలిసేది కాదు.

భంగాల గదికి అటువైపు మరో పెద్ద గది.దానికి ఆనుకుని బాత్‌రూమ్, టాయిలెట్లు.

ఎక్కువకాలం ఆ గదిని అద్దెకు ఇచ్చేవాళ్లం.

మా చిన్ననాటి జ్ఞాపకాలలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నది అక్కడ అద్దెకు ఉన్న డాక్టర్ అంకుల్ కుటుంబం.

మమ్మల్నందరినీ ఎంతో ప్రేమగా చూసేవారు.

సాయంత్రం తర్వాత ఎక్కువ సమయం మాతోనే గడిపేవారు.

వాళ్ల పిల్లలు ప్రతి వేసవి సెలవుల్లో వచ్చేవారు.

మాతో పూర్తిగా కలిసిపోయేవారు.

ఆ గదికి మరో ప్రత్యేకత కూడా ఉండేది.

వెనకవైపు నేరుగా బయటకు వెళ్లే మెట్లు.

మా ఊరి చరిత్రనంతా పెయింటింగ్స్ రూపంలో మా నాన్న ఆ వైపున చెక్కించాడు.

అది ఇల్లు కాదు.ఒక జ్ఞాపకాల గ్రంథం.

నేను ప్రతి పేజీని మళ్లీ చదువుతున్నాను.

అంతలో...

“త్వరగా రా!”ఒక గొంతు వినిపించింది.

నేను ఒక్కసారిగా వెనక్కి తిరిగాను.

యమభటులు!

“ఏమిటి? మళ్లీ వీళ్లెందుకు?”

ఇది భ్రమా?

నిజమా?

అర్థం కాలేదు.

భంగాలపైనే మిగిలిన మా గ్రంథాలయం, మా టీవీ రూమ్ వైపు చివరిసారి చూశాను.

మా కాలక్షేపానికి అవి ఎంత ఉపయోగపడ్డాయో!

ఇంతలోనే యమభటులు బలవంతంగా నా దగ్గరకు వచ్చి నన్ను లాక్కెళ్లసాగారు.

“ఏమిటి ఇది? నన్నెక్కడికి తీసుకెళ్తున్నారు?”

నేను కోపంగా అడిగాను.

వాళ్లలో ఒకడు నవ్వుతూ అన్నాడు—

“పొరపాటైంది.”

“ఏమిటి?”

“నిన్ను పొరపాటున ఇక్కడ వదిలేశాం.”

“అంటే?”

“ఇది స్వర్గం కాదు.”

నా గుండె ఒక్కసారిగా ఆగినట్టయింది.

“అందుకే నిన్ను ఇక్కడి నుంచి మళ్లీ స్వర్గానికి తీసుకెళ్లడానికి వచ్చాం. ఎంతసేపటి నుంచి నిన్ను పిలుస్తున్నాం! నువ్వు ఆలకించడం లేదు. అందుకే ఈ బలవంతం.”

వాళ్లు నన్ను లాక్కెళ్లసాగారు.

అప్పుడు...

నా మనసులో ఒక్కసారిగా అందరి ముఖాలు మెదిలాయి.

మా బంధువులు...

నా చిన్ననాటి మిత్రులు...

మా కజిన్స్...

మా నాన్న...

మా అమ్మ...

మా తాతయ్య...

మా ఇల్లు...

ఆ వాకిలి...

ఆ బావి...

ఆ అరుగు...

ఆ వరండా...

ఆ పిచ్చుకల కిలకిలారావాలు...

ఎన్ని మధుర జ్ఞాపకాలో!

నా గుండె ఒక్కసారిగా తిరుగుబాటు చేసింది.

“నేను రాను!”

యమభటులు ఆగిపోయారు.

“ఇక్కడే ఉంటాను!”

“ఇదే నాకు స్వర్గం!”

“నన్ను వదిలేయండి!”

అని అరిచాను.

అంతే...

ఒక్కసారిగా లేచి కూర్చున్నాను.

ఒళ్లంతా చెమటతో తడిచిపోయింది.

చుట్టూ చూశాను.

యమభటులు లేరు.

మా ఇల్లు లేదు.

ఆ వాకిలి లేదు.

ఆ బావి లేదు.

ఆ అరుగు లేదు.

అమ్మ లేదు.

నాన్న లేదు.

నేను నా గదిలో ఉన్నాను.

కొంతసేపు ఏమీ అర్థం కాలేదు.

తర్వాత నెమ్మదిగా గ్రహించాను.

అది కల.

కానీ అది సాధారణ కల కాదు.

నా మనసు దాచుకున్న ఒక ప్రపంచం నాకు చూపించిన కల.

నా ఇంటిని నేనెంతగా మిస్ అవుతున్నానో, నా మెదడులోని జ్ఞాపకాల పొరల్లో నిక్షిప్తమైన ఆ ప్రపంచం కల రూపంలో బయటకు వచ్చి ఉంటుందేమో.

నేను మళ్లీ ఆలోచనలో పడ్డాను.

ఇప్పుడు మా నాన్న లేడు.

ఆ ఇల్లు కూడా లేదు.

నాన్న చనిపోయిన సంవత్సరం కూడా పూర్తికాకముందే, ఊరి రోడ్డు విస్తరణలో మా ఇల్లు కనుమరుగైపోయింది.

ఒకప్పుడు మా ప్రపంచమంతా అయిన ఆ ఇల్లు ఇప్పుడు భౌతికంగా లేదు.

కానీ...నా జ్ఞాపకాలలో అది ఇంకా అలాగే ఉంది.

అదే వాకిలి.

అదే బావి.

అదే అరుగు.

అదే వరండా.

అదే పిచ్చుకల కిలకిలారావాలు.

అదే నాన్న గొంతు.

అదే అమ్మ వంట పరిమళం.

అదే తాతయ్య మంచం.

అన్నీ అలాగే ఉన్నాయి.

అప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది.

స్వర్గం అనేది మనం చనిపోయిన తర్వాత చేరుకునే ప్రదేశం కావాల్సిన అవసరం లేదు.

మనసుకు హత్తుకున్న మనుషులు ఉన్న చోట...

మన బాల్యం నవ్విన చోట...

మన జ్ఞాపకాలు ఊపిరి పీల్చుకున్న చోట...

మనసు ప్రశాంతంగా ఉండే చోట...

అదే స్వర్గం.

స్వర్గం అంటే పెద్ద పెద్ద భవంతులు కాదు.

లగ్జరీలు కాదు.

బంగారు గుమ్మాలు కాదు.

చిన్న చిన్న సంతోషాలు...
మధురమైన జ్ఞాపకాలు...
మనల్ని మనంగా నిలబెట్టిన మనుషులు...
వాళ్లతో పంచుకున్న అనుబంధాలే అసలైన స్వర్గం.

ఇల్లు కూలిపోవచ్చు.

గోడలు కనుమరుగైపోవచ్చు.

వాకిలి మట్టిలో కలిసిపోవచ్చు.

బావి పూడిపోవచ్చు.

మనుషులు మన మధ్య లేకపోవచ్చు.

కానీ...

మనసులో ఒకసారి ఇల్లు కట్టుకున్న జ్ఞాపకాలను మాత్రం కాలం కూడా కూల్చలేడు.

ఆ రాత్రి నా నిద్రను చెదరగొట్టింది ఒక కల.

కానీ ఆ కల నాకు జీవితంలోనే గొప్ప నిజాన్ని చెప్పింది—

“స్వర్గం ఎక్కడో లేదు...
మనసు మళ్లీ మళ్లీ వెళ్లాలనుకునే చోటే స్వర్గం.”

మరిన్ని కథలు

Bhakthi deepam
భక్తి దీపం
- డా:సి.హెచ్.ప్రతాప్
Flot No. 66-B
ఫ్లాట్ నెంబర్ 66-బి
- డా:సి.హెచ్.ప్రతాప్
SNEHAMANTE IDERAA
స్నేహామంటే ఇదేరా !
- సంధ్య కార్తీక్
Neelaveni pelli
నీలవేణి పెళ్ళి
- కొడాలి సీతారామా రావు
MOLAKETTINA VITTANAM
మొలకెత్తిన విత్తనం
- డా:సి.హెచ్.ప్రతాప్
Bandhavyaalu
బాంధవ్యాలు
- సంధ్య కార్తీక్