ఆవు ఆరాటం - చెన్నూరి సుదర్శన్

Aavu aaratam

హరి, గిరి వాదులాడుకోవడం వింటూ.. చిరునవ్వుతో హాల్లోకి అడుగు పెట్టాడు శేఖరం తాతయ్య.

హరి, గిరి ఆరో తరగతి చదువుతున్నారు. వారి ఇండ్లు పక్క, పక్కనే ఉండడం.. కలిసి బడికి వెళ్ళడం.. కలిసి చదువుకోవడం.. మంచి మిత్రులయ్యారు.

దేవుని విషయంలోనే ఏకాభిప్రాయం లేదని.. తాతయ్య ఇరువురిని లాలనగా దగ్గరికి తీసుకున్నాడు.

“మీరు దేవుని గురించి చర్చించుకోవడమే తప్ప పోట్లాడుకోక పోవడం నాకు బాగా నచ్చింది. ఏదైనా చర్చల ద్వారా పరిష్కరించుకోవడం శ్రేయస్కరం. అనవసరంగా అపార్థాలతో కొన్ని దేశాలు యుద్ధాలు చేస్తున్నాయి. అమాయక ప్రజలు బలికావడం మనం చూస్తూనే ఉన్నాం”

“అవును తాతయ్యా..” అంటూ ఇద్దరూ బావురుమన్నారు.

తాతయ్యకు మరింత దగ్గరికి జరిగి.. “దేవుని విషయం చెప్పండి తాతయ్యా.. మాలో ఎవరు పక్షం మీరు?” అంటూ గోముగా అడిగాడు గిరి.

“మీ ఇద్దరి పక్షమూనూ..” అంటూ నవ్వుతూ.. “ముందుగా నేను ఈమధ్య వార్తాపత్రికలో వచ్చిన ఒక వార్త చెబుతాను. అవి విన్నాక మీరే దేవుని గురించి తేల్చండి”

“ఓ..! అలాగే తాతయ్యా..” అంటూ ఇరువురు అమిత ఉత్సాహం చూపారు. ఏ విషయమైనా తాతయ్య ఒక కథలాగా చెబుతారని వారికి తెలుసు.

తాతయ్య గొంతు సవరించుకొని చెప్పడం ఆరంభించాడు.

“ఒక ఊళ్ళో రాజమ్మ, రామయ్య అనే రైతు దంపతులు ఉన్నారు. వారికి జీవనాధారం ఒక ఆవు. ఈమధ్యనే ఆవుకు ఒక దూడ పుట్టింది. దూడను ఎంతో ఆప్యాయంగా ఆవు తన నాలుకతో నిమురుతుంటే వారి మనసు అమితానందం పొందేది.

పశువుల కాపరి ఆవును దూడను మందలో కలుపుకొని ఊరికి దగ్గరలో ఉన్న చిన్న అడివికి తీసుకు వెళ్ళే వాడు. అక్కడ అవి కడుపు నిండా మేత మేసేవి. తిరిగి సాయంత్రం ఇంటికి వచ్చేవి.

ఒకరోజు ఆవు మిట్ట మధ్యాహ్నమే ఒంటరిగా ఇంటికి తిరిగి రావడం.. ఆవేదనగా ‘అంబా..!’ అని అరవడం రామయ్య భయంతో వణకి పోయాడు. దూడ లేదని అరుస్తుందా! లేక దాని కడుపులో ఏదైనా బాధనా..! అని తెలియక సతమతమయ్యాడు. ఎందుకైనా మంచిదని ఊళ్ళోని పశువుల డాక్టరుకు ఫోన్ చేసి పిలిచాడు. డాక్టరు ఇంటికి రాగానే ఆవు ఎదురుగా వెళ్లి ‘నాతో రామ్మన్నట్టుగా..’ తలను విదిలించి ముందుకు కదిలింది.

డాక్టరు, రామయ్య దాని వెనుకాలే అనుసరించారు. అది నేరుగా అడవిలోకి దారి తీసింది. ఒక పొద వద్ద ఆగి ‘అంబా..!’ అని ఏడువసాగింది. రామయ్య గబ, గబా పొద వద్దకు పరుగెత్తి తన చేతిలోని కర్రతో పొదను విశాలం చేసాడు.. దూడ కనబడింది. దాని ఒంటి నిండా గాయాలు. వెంటనే డాక్టరు ప్రథమ చికిత్స చేయడంలో మునిగిపోయాడు

కాసేపట్లో పశువుల కాపరి ఎడ్ల బండి మీద వాయువేగంగా వచ్చి విషయం చెప్పాడు. గంట క్రితం పశువులపై ఒక పులి దాడి చేసిందని. వెంటనే రామయ్య, పశువుల కాపరి దూడను బండి మీద పడుకో బెట్టారు. బండి మీద అంతా కలిసి పశువుల దవాఖానకు వెళ్ళారు.

అక్కడ దూడకు వైద్యం చేసి ఆవు ముందర నిలబెట్టాడు డాక్టరు. ఆవు సంతోషంగా దూడను నాలుకతో తృప్తిగా నిమురసాగగింది. రామయ్య కళ్ళలలో ఆనంద భాష్పాలు దొర్లాయి. డాక్టరుకు డబ్బులు ఇవ్వబోతుంటే సున్నితంగా తిరస్కరించాడు.

ఆవు ఆరాటం చూస్తుంటే నా మనసు చెదిరి పోయింది. అది తన బిడ్డను రక్షించుకుందని అంటుంటే డాక్టరు కళ్ళు చెమర్చాయి.

అప్పుడే వచ్చిన రాజమ్మ ఆవు ముందరి కాళ్ళపై పడి మొక్క సాగింది” అని చెప్పడం ముగించాడు తాతయ్య.

“ఇప్పుడు చెప్పండి.. ఈ సంఘటన వెనుక ఏ శక్తి దాగి ఉంది?. ఆవుకు మాటలు రావు కదా! తన దూడను రక్షించువడంలో వెనుక ఎవరున్నారు?” అంటూ ప్రశ్నించాడు తాతయ్య. హరి, గిరి దీర్ఘాలోచంలో మునిగి పోయారు.. అప్పుడు తాతయ్యనే చిరునవ్వులు కురిపిస్తూ..

“ఆ శక్తినే.. ‘దేవుడు’ అనవచ్చు. మనకు గాలి కనబడదు. కాని ఉందని తెలుసు. శక్తి మనకు కనబడుతుందా?.. మన శక్తి ద్వారా పనులు పూర్తవడం మనకు శక్తి ఉందని తెలుస్తుంది. అలాగే దేవుడు కనబడడు. కాని నిస్వార్థ సేవకులకు, మానవత్వంతో సాయపడే వారికి తిరిగి ఏదో ఒక రూపంలో సాయపడతాడు.

అయితే ఒక ముఖ్య విషయం.. వీలైనంత వరకు ఆపదలో ఉన్న వారికి సాయపడాలే కాని ద్రోహం మాత్రం చేయకూడదు. అప్పుడే అదృశ్య శక్తి నుండి ఏదో ఒక రూపంలో మనకు సాయం లభిస్తుంది” అంటూ తన అనుభవాలు కొన్ని వివరించాడు.

హరి, గిరి ఒకరి ముఖం మరొకరు చూసుకుంటూ.. తాతయ్య హితవును ఆచరిస్తామన్నట్టు చేతులెత్తి ఒకరి అరచేతులు మరొకరు సున్నితంగా చరుచుకున్నారు. *

మరిన్ని కథలు

Vanta gadi lo veerudi katha
వంట గదిలో వీరుడు కథ
- రాము కోలా దెందుకూరు
Avadhulu daatina abhimanam
అవధులు దాటిన అభిమానం
- మద్దూరి నరసింహమూర్తి,
Maarina jeevitham
మారిన జీవితం
- Prabhavathi pusapati
Dharmo rakshathi rakshitaha
ధర్మో రక్షతి రక్షితః
- డా:సి.హెచ్.ప్రతాప్
Prathiroopam
ప్రతిరూపం
- డా:సి.హెచ్.ప్రతాప్
Maarpu manathone
మార్పు మనతోనే
- జ్యోత్స్న జల్లూరి
Samayaspoorthi
సమయస్ఫూర్తి
- డా:సి.హెచ్.ప్రతాప్
Asooya techhina chetu
అసూయ తెచ్చిన చేటు
- బోగా పురుషోత్తం , తుంబూరు.