ప్రతి సీటు కి ఒక కథ - మీలో నేను

Prathi seat ki oka katha

బస్సు నోరెత్తింది… "అవును... ఈరోజు నేను నోరెత్తుతున్నాను. ప్రమాదం గురించి కాదు. మనుషుల మరుపు గురించి. నన్ను తగలబెట్టిన వాళ్ల గురించి కాదు... ఒకప్పుడు నన్ను ఇంటి మనిషిలా చూసిన వాళ్ల గురించి." అప్పట్లో నన్ను ఎంత గౌరవంగా, పదిలంగా చూసుకునేవాళ్ళు…..చిన్న పాప లాగ ముద్దు చేసేవాళ్ళు….దసరా వస్తే ఇంక ఆ సంబరం చెప్పక్కర లేదు…..దసరా మాత్రమే కాదు…..ప్రతి పండక్కి మా దర్జానే వేరు….. బ్రహ్మాండమైన అలంకారాలు చేసేవాళ్ళు……. డ్రైవర్ నరసింహులు ఐతే , ఒక చిన్న మరక పడ్డా, గీత పడ్డా ఊరుకునేవాడు కాదు…..అబ్బులు గాడి దుంప తెంచేవాడు….అబ్బులు గాడు క్లీనర్….నాకు పూర్తిగా పెర్మనెంట్ ….నా బాధ్యత అంతా వాడిదే……రోజుకు రెండు సార్లు సబ్బు నీళ్ళతో తోమి తోమి మెరిసేదట్టు చేసేవాడు……అద్దంలాగ ఉండాలంట…వత్తైన జుట్టును పదే పదే నాలోకి చూస్తూ దువ్వుకొనేవాడు….ఆ రోజుల్లో నాదే హవా…….ఇక కండక్టర్ నాగేశ్వర రావు , తన , నాలుగో కూతురు లాగా చూసుకునేవాడు…….ఎంతో చలాకీగా, అందరినీ అక్క , బావ , మావ అని పలకరిస్తూ , నవ్విస్తూ టికెట్స్ ఇస్తూ ఉండే నాగేశ్వరరావు అంటే అందరికీ అభిమానమే…ఇష్టమే…. బయట కనపడేవాళ్ళు వీళ్ళు ఐతే, నన్ను బాగు చెయ్యాలంటే ఇంకా చాలామంది….మెకానిక్, సూపర్వైజర్, ఇంకా పై అధికారులు…మొత్తం పదకొండు మంది , వాళ్ళ కుటుంబాలు నా మీద ఆధారపడి ఉండేవి…… "నా గురించి కథ కూడా రాశారు. అమరావతి కథల్లో సత్యం శంకరమంచి గారు నాకు చోటిచ్చారు. ఆ రోజుల్లో నేను కేవలం ఒక బస్సును కాదు... అమరావతి జీవితంలో ఒక భాగాన్ని. నా కోసం ఊరంతా ఎదురు చూసేదట. నరసింహులు, నాగేశ్వరరావు, అబ్బులు వస్తున్నారంటే... మన ఇంటివాళ్లు వస్తున్నట్టే చూసేవాళ్లు. మరి నగరాల్లో ఐతే, డబల్ డెక్కర్ , డబల్ కోచ్ బస్సులు………మా బ్రదర్స్ అన్న మాట…. ఇంక ఇప్పుడు, ఎవరికి కోపం వచ్చినా, మమ్మల్నే తగలేస్తారు….. విద్యార్థులు అయినా, రాజకీయ నాయకులు అయినా ఇంకా ఎవరైనా ముందుగా మేమే కనబడటం….బుగ్గి అయిపోవడం…. కానీ మా మనసులు ఎవరు అర్థం చేసుకుంటారు…………అసలు మాకు మనసులు వుంటాయా? ఏమో , నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది….మనసు వుందా అని …ఒకవేళ ఉంటే ఎందుకు ఉందా అని…… పెళ్లి వారి బస్, వన భోజన బస్, పిక్నిక్ బస్ ఇలా ఎన్నో రకాలుగా అలంకరిస్తారు …….పిలుచుకుంటారు……ఇకపోతే రక రకాల రథాలుగా మారుస్తారు…….ప్రచార రథాలుగా…వైకుంఠ రథాలుగా…… అందుకే తట్టుకోలేక పోతున్నాను…..నేను ఒక్కడిగా తిరగబడితే….అయినా…..ఈ మనుషులలో మార్పు వస్తుందేమో చూడాలి…………… ఇతనెవరో ….కథలు రాస్తాడంట….అన్ని చోట్ల తిరుగుతున్నాడు……నన్నడిగితే నేను చెప్పనా?…..వందల కథలు……… 5 సీట్లో ఉన్న పద్మ, 9 సీట్లో వున్న రవి, 32 లో ఉన్న సాంబశివరావు అనబడే పెద్దాయన….16 లో ఉన్న స్టూడెంట్, 22 లో పెద్దవ్వ, అదిగో లాస్ట్ సీటు లో కూర్చున్న రాంపండు వరకు అందరికీ ఒక కథ ఉంది……చెప్పుకుంటే పోతే, కాశి మజిలీ కధలు మాదిరిగా చాలా వస్తాయి……నా దగ్గర టికెట్లు మాత్రమే కాదు... జీవితాలు కూడా ప్రయాణించాయి.” అవును…..చాలా ఉన్నాయి…..నా నిండా కథలే…..ప్రతి సీటు కి ఒక కథ….రోజు రోజు మారిపోయే కథ…..ఎప్పటికప్పుడు కొత్త ఆరంభాలు….కొత్త ముగింపులు…..కొన్ని సుఖంతాలు కొన్ని విషాదాలు…….పద్మ ను మోసం చేసిన ప్రియుడి కథ ఐతే విషాదం అనుకుంటే…..రవి కథ సుఖాంతం…మంచి ఉద్యోగం రాగానే అమ్మాయికి , ఇంట్లో చెప్పేశాడు…..కథ సుఖాంతం చేశాడు…. మరి పెద్దాయన……..కూతురి పెళ్లి కోసం దాచిన డబ్బులు దొంగోడు ఎత్తుకుపోతే పోలీస్ చుట్టు తీరుతున్నారు….ఎప్పుడు దొరకాలి?….ఎప్పుడు పెళ్లి చెయ్యాలి?…..మరి విషాదం అవుతుందా లేక సుఖాంతమవుతుందా ….కాలమే చెప్పాలి…. మరి స్టూడెంట్…పరీక్ష ఫలితాలు వచ్చాయి……మామూలే ….ప్రతి సంవత్సరం లానే మళ్ళీ ఫెయిల్……ఈసారి ఏమి చెయ్యాలి….చచ్చిపోవాలా?...ఆలోచిస్తున్నాడు……. మనమేమి చెయ్యగలం…..చూద్దాం పైన ఒకడున్నాడుగా…..చూసుకుంటాడు….. అదేమిటి ! నువ్వు కూడా పైన వాడిని నమ్ముతావా అంటే…..నమ్మాలి…..లేకపోతే నన్ను అంతగా ప్రేమగా చూసుకునే నరసింహులు అర్థంతరం గా అలా స్టీరింగ్ మీద వాలిపోవడం ఏమిటి?….ప్రాణం పోవడం ఏమిటి ?….… చివరి నిమిషం లో నన్ను పక్కకు తిప్పి 40 మంది ప్రాణాలు రక్షించడం ఏమిటి?……నా మొహం పగలడమేమిటి?……….తృటిలో చావు తప్పి కన్ను లొట్ట పోయినట్టు……………...మరి పై వాడి దయ కదా…………. "నరసింహులు లాంటి వాళ్లు పోయారు. నాగేశ్వరరావులు రిటైర్ అయ్యారు. అబ్బులు మనవళ్లను ఆడిస్తున్నాడు. నన్ను మాత్రం అందరూ మర్చిపోయారు. కానీ నేను మర్చిపోలేదు. నా సీట్లలో నవ్విన వాళ్లను, ఏడ్చిన వాళ్లను, ప్రేమించిన వాళ్లను, ఓడిపోయిన వాళ్లను, గెలిచిన వాళ్లను……..ఒక్కరిని కూడా మర్చిపోలేదు….అయినా నేనేమి రాజకీయ నాయకుడిని కాదు కదా?……ఏరు దాటగానే తెప్ప తగలెయ్యడానికి…… అందుకే ఈ రోజు తిరగబడుతున్నాను…. ప్రమాదంతో కాదు. అసహనంతో,అవమానంతో,ఇంకా సమాధానం దొరకని మరెన్నో ప్రశ్నలతో. ఆ రోజు ఇంకా గుర్తుంది…..మధ్యాహ్నం అవుతుంది….పిడుగు లాంటి వార్త…ఒక పెద్ద రాజకీయ నాయకుడు కాలం తీరి చనిపోయాడు….. అంతే….ప్రజలు అందరూ రోడ్డు మీదకు….మిట్ట మధ్యాహ్నం ….ఆకలవుతుంది ..నాకు….నరసింహులు కి…నాగేశ్వరావు కి….అబ్బులు కి కూడా …….నరసింహులు …పాపం అసలే చక్కెర వ్యాధి ఉంది…..ఆకలికి ఉండలేడు….అందుకే ఆమె ఎప్పుడూ ఆయన్ని కంటికి రెప్పలా చూసుకుంటుంది…..మందులు వేళకు వేసుకునేలా గమనిస్తుంది…. అల్లరి మూక మాట వినడం లేదు….40 మంది ప్రాణాలు….’ఆపేస్తాను, ప్రయాణికులందరిని దింపేసి వెళ్ళిపోతాను’ అని ఎంత బ్రతిమాలినా , నెత్తి నోరు మొత్తుకున్నా వదలలేదు .పాపం నరసింహులు అలసిపోయాడు…విసిగిపోయాడు… నిర్దాక్షిణ్యంగా నిప్పంటించారు…. తప్పనిసరిగా వాళ్ళ నుండి నన్ను రక్షించడానికి, నా వాళ్ళను, నా మీద, తన మీద ఆధారపడ్డ ఆ అమాయక ప్రయాణికులను రక్షించడానికి…నా….నరసింహులు…నన్ను ముందుకు నడిపాడు……తనకు తెలుసు…తన ప్రాణాలకు రక్షణ లేదని……పోలీస్ సహాయం రావాలంటే ఇంకా సమయం పడుతుంది…తప్పదు…తెగించాలి…. రమ ఏమంటుంది? పిచ్చిది…. ఎదురు చూస్తుంటుంది…. నన్ను నమ్మి, తనవాళ్ళను వదిలేసి కట్టుబట్టలతో వచ్చేసింది… పిల్లలిద్దరూ కళ్ళ ముందు కదలాడే సరికి కళ్ళమ్మట నీళ్ళు వచ్చాయి తనకు. చిన్నదానికి ఇప్పుడిప్పుడే మాటలు వస్తున్నాయి…….ముద్దు ముద్దు గా మాట్లాడుతుంది……ఒక్కసారిగా తల విదిలించి ఆలోచనల నుంచి బయటకు వచ్చాడు….. బస్సు ను ముందుకు నడిపించాడు……అందరినీ సురక్షితంగా రక్షించగలిగాడు………కానీ ..ఆ టెన్షను తట్టుకోలేకపోయాడేమో, లేక ఆ దేవుడు , చాలయ్యా, ఇక నీ డ్యూటీ ముగిసింది..వచ్చేయి …అన్నాడో..…..నరసింహులు ఆమె నుంచి, నానుంచి దూరం అయిపోయాడు……..నా మొహం కూడా పగిలింది….ఏడ్చాను…. మొత్తుకున్నా…….ఒక్కడు కూడా వినలేదు….నా నరసింహులు గారిని చివరిసారిగా కూడా నన్ను చూడనీయలేదు…..వైద్యం కోసం షెడ్ కి తీసుకెళ్లారు……..తిరిగి వచ్చేసరికి…..కొత్త డ్రైవర్…కొత్త మనుషులు….కొత్త ప్రయాణం…..నరసింహులు కొడుకు కి ఉద్యోగం ఇస్తారేమో అనుకుంటే, ‘విధి నిర్వహణ లో లోపం చూపించాడు’ అని చెప్పి అతని కొడుకు కి కనీసం కారుణ్య నియామకం కింద కూడా ఉద్యోగం ఇవ్వలేదు….ఏదో చిన్న షాపులో పని చేసుకుంటూ అమ్మను, చెల్లినీ పోషించుకుంటున్నాడంట…… వాళ్ళు వీళ్ళు చెప్పుకుంటుంటే చెవిన పడింది….కళ్ళమ్మట నీళ్ళు కారిపోతున్నాయి… “అరేయ్, రేడియేటర్ నీళ్ళు లీక్ అవుతున్నాయి, శుభ్రం చెయ్యి” అని డ్రైవర్ కొత్త క్లీనర్ కి ఆర్డర్ ఇచ్చి, టీ తాగడానికి వెళ్ళిపోయాడు…… ఈ మనుషులకు గుర్తుందా? వాళ్ల జీవితాల్లో ఒకప్పుడు “నేనూ ఉన్నాను” ఆని.... " నేను ఏమి చేశాను” అని….. దివిసీమ ఉప్పెనలో నా పాత్ర ఏమిటో వీళ్లకు తెలుసా? సునామీ అప్పుడు……ప్రతి తుఫాను లో……..అలసట లేక…..అలుపు లేక శ్రమించాను…..ఊళ్ళలో, కాలేజీలలో, దూర దూర ప్రదేశాల్లో ఒంటరిగా చిక్కుకుపోయిన ఎంతోమందిని వాళ్ళ వాళ్ళ గమ్యప్రదేశము లకు చేర్చాను….నాతో పాటు నా మిత్రులు ఎందరో……ప్రదర్శనలలో, ప్రజా యాత్రలలో, దేవుళ్ళ ఊరేగింపుల్లో, ….నా పాత్ర లేనిదెక్కడ? " రవి కాంచని” గ్రామాలకు కూడా తిరుగుతున్నామే?”ఎందెందు వెదికినా అందందు” మేముంటన్నాము కదా …. అందుకే నేను తిరగబడేది రోడ్డుమీద కాదు. మనుషుల మరుపుపై. ఒకప్పుడు నన్ను వాళ్ళ ఇంటి మనిషిలా చూసిన వాళ్ల కాలం నుంచి, నన్ను కేవలం వాహనంలా చూసే కాలంపై." అవును!!! మారుతున్న సమాజ విలువలపై…..మనుషుల దృక్పదాలపై ,అభిమానాలపై, అనురాగాలపై…. అయినా…. కని, పెంచిన తల్లితండ్రులనే వదిలి దూరంగా వెళ్ళిపోయే వాళ్ళు …అనాథ, వృద్ధ ఆశ్రమాలలో డొనేట్ చేసేవాళ్ళు …...నా లాంటి ప్రాణం లేని వాటిని ఎలా పట్టించుకుంటారు….ఎందుకు…పట్టించుకోవాలి?…….. అయినా నేను ఎవరిని?….అవును…నేను ఎవరిని?… నా పని కేవలం మనుషులను ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి తీసుకెళ్లడం మాత్రమే కదా? ఆ పని కళ్ళు మూసుకుని చేయొచ్చు కదా? వాళ్ల కథలను ఒక దశ నుంచి ఇంకో దశకు మోసుకెళ్లడం ఎందుకు….అవును ఎందుకు…?.లేదు నేను అలా ఉండలేను……ఎందుకంటే నేను ఇంకా చాలా మందిని చూసాను…… అలాగే 5వ సీటు పద్మ…,9వ సీటు రవి...32వ సీటు పెద్దాయన… వీళ్ళు అందరూ నాకు కావాలి …వాళ్ళ ఙ్ఞాపకాలు కావాలి………నాకు అన్నం పెట్టి, జీవితం ఇచ్చిన వాళ్ళను నేను మరువలేను……ఒట్టు వేసి చెబుతున్నా….వాళ్ళ కథలు నాలోనుంచి బయటకు తీస్తా….నా శరీరం మీదే చిన్న చిన్న కథలుగా రాపిస్తా…..ఒక్కరు కూడా చదవరా? ...అవును... కానీ నాకు మాత్రం వాళ్లందరూ గుర్తున్నారు. ఎందుకంటే నేను బస్సును…… ఒకప్పుడు నన్ను వాళ్లలో ఒకరిగా చూసిన స్వర్ణ యుగం మళ్ళీ రావాలి… నన్ను కేవలం ఇనుప ముక్కగా చూసే కాలం పోవాలి…. సరే... అదిగో... ఇంకో బస్సు వస్తోంది. అందులో కూడా కొత్త కథలు ఎక్కుతున్నాయి... కొత్త ప్రేమలు... కొత్త కన్నీళ్లు... కొత్త ఆశలు… కథలు ఎప్పుడూ ఆగవు... బస్సులు మాత్రమే రిటైర్ అవుతాయి. నన్ను గుర్తు ఉంచుకోండి… రేపు మీరు మరో బస్సు ఎక్కుతారు. ఏ బస్సు ఎక్కినా…మొదటి మెట్టు మీద కాలు పెట్టినప్పుడు... ఒక్కసారి దాన్ని ప్రేమగా తాకండి. అది ఇనుప మెట్టు కాదు. ఎన్నో కథల గడప. ప్రేమగా ఎక్కండి. స్టీరింగ్ వెనుక కూర్చున్న డ్రైవర్‌కు ఒక చిరునవ్వు ఇవ్వండి. ఎందుకంటే... అతను మిమ్మల్ని కేవలం గమ్యస్థానానికి కాదు... ఎవరో ఎదురుచూస్తున్న ఇంటికి తీసుకెళ్తున్నాడు. నేను బస్సును. నా చక్రాలు తిరుగుతూనే ఉంటాయి. నా కథలు కూడా... మీతో పాటు… ఎందుకంటే... బస్సులు మనుషులను మాత్రమే కాదు... వాళ్ల జీవితాలను కూడా మోస్తాయి."** ఉంటాను మరి… సదా మీ సేవలో…. మీలో నేను

మరిన్ని కథలు

Manavatwam gelichindi
మానవత్వం గెలిచింది
- డా:సి.హెచ్.ప్రతాప్
Dinadina gandam noorella ayusshu
దిన దిన గండం నూరేళ్ళు ఆయుష్షు
- కాశీ విశ్వనాథం పట్రాయుడు
Dwesham
ద్వేషం
- డా:సి.హెచ్.ప్రతాప్
Manasupaddaanu kaanee
మనసు పడ్డాను కానీ!
- మీ రాము కోలా
Nenu mallee podupu chestaa
నేను మళ్ళీ పొదుపు చేస్తా...!
- బొందల నాగేశ్వరరావు
Rakthaksharaalu
రక్తాక్షరాలు
- డా:సి.హెచ్.ప్రతాప్
Pakshi premikudu
పక్షి ప్రేమికుడు (బాలల కథ)
- చెన్నూరి సుదర్శన్
Panimanishi nmerpina gunapatham
పని మనిషి నేర్పిన గుణపాఠం
- కామేశ్వర రావు రాపాక