దిన దిన గండం నూరేళ్ళు ఆయుష్షు - కాశీ విశ్వనాథం పట్రాయుడు

Dinadina gandam noorella ayusshu

ఒకరోజు జున్నుబాబు, కాశీతాతను కథ చెప్పమని అడిగాడు. “సరే” అని కథ చెప్పడం మొదలుపెట్టాడు కాశీ తాత. అనగనగా ఒక గ్రామంలో రామయ్య అనే వృద్ధ రైతు ఉండేవాడు. ఎనభై ఏళ్లు దాటినా ఆరోగ్యంగా ఉంటూ తన పనులు తాను చేసుకునేవాడు. కష్టపడటం, ధైర్యంగా ఉండటం అతని స్వభావం. ఒకరోజు పొలానికి వెళ్తూ దారిలో రాయికి కాలు తగిలి కిందపడిపోయాడు. కాలికి గాయం అయింది. కొద్దిరోజులు విశ్రాంతి తీసుకుని మళ్లీ మామూలుగా పనులు మొదలుపెట్టాడు. కొన్ని నెలల తర్వాత ఎద్దులకు మేత వేస్తుండగా ఒక ఎద్దు అతన్ని తోసేసింది కానీ అదృష్టవశాత్తూ చిన్నచిన్న దెబ్బలతోనే బయటపడ్డాడు. అది మరచిపోకముందే తీవ్రమైన జ్వరం వచ్చింది. “ఈసారి కోలుకోవడం కష్టమే!” అని గ్రామస్తులు అనుకున్నారు. అయితే సరైన వైద్యం చేయించుకోవడంతో ఆరోగ్యం కుదుటపడింది. మరోసారి వర్షాకాలంలో చెరువు గట్టు మీద నడుస్తూ జారి నీళ్లలో పడిపోయాడు. దగ్గరలో ఉన్నవారు వెంటనే గమనించి అతన్ని కాపాడారు. ఆ ప్రమాదం నుంచి కూడా క్షేమంగా బయటపడ్డాడు. ఇలా తరచూ ఏదో ఒక గండం వస్తూనే ఉండేది. అయినా ప్రతిసారీ రామయ్య దానిని దాటుకుని మళ్లీ మామూలుగా జీవించేవాడు. ఒకరోజు రచ్చబండ దగ్గర కూర్చున్న వాళ్లలో ఒకడు “రామయ్యకు ఎప్పుడూ ఏదో ఒక ప్రమాదం వస్తూనే ఉంది. అయినా ప్రతిసారీ క్షేమంగా బయటపడుతున్నారు!” అన్నాడు. అది విన్న మరొకడు “అయ్యా! రామయ్యను చూస్తుంటే ‘దినదిన గండం నూరేళ్ల ఆయుష్షు’ అన్న సామెత గుర్తుకు వస్తోంది. రోజుకో గండం వచ్చినా అన్నింటినీ దాటుకుని హాయిగా జీవిస్తున్నారు!” అన్నాడు. అలా రామయ్య తొంభై ఏళ్ళు జీవించాడు.” అని కథ ముగించాడు కాశీతాత. “తాతయ్యా! ‘దినదిన గండం నూరేళ్ల ఆయుష్షు’ అంటే ఏమిటి?” అని అడిగాడు జున్నుబాబు. కాశీతాత నవ్వుతూ, “తరచూ ప్రమాదాలు, అనారోగ్యాలు లేదా ఇబ్బందులు ఎదురైనా, వాటి నుంచి బయటపడి దీర్ఘకాలం జీవించే వారిని గురించి ‘దినదిన గండం నూరేళ్ల ఆయుష్షు’ అంటారు బాబూ!” అని చెప్పాడు. “అంటే రామయ్య తాతయ్యలాంటివాళ్లన్నమాట!” అన్నాడు జున్నుబాబు. “అవునురా!” అన్నాడు కాశీతాత. “భలే ఉంది తాతయ్యా!” అంటూ జున్నుబాబు ఆనందంగా చప్పట్లు కొట్టాడు.

మరిన్ని కథలు

Tana kopame tana shatruvu
తన కోపమే తన శత్రువు!
- - బోగా పురుషోత్తం
Bongaram
బొంగరం
- సూర్య. మండా (MS)
Vellanu
వెళ్ళను
- isun finn
Punyakoti
పుణ్యకోటి
- కామేశ్వర రావు రాపాక
Prema.. O maaya
ప్రేమ.. ఓ మాయ
- డా:సి.హెచ్.ప్రతాప్
Doutya vijayam
దౌత్య విజయం
- డా:సి.హెచ్.ప్రతాప్
Teeru marchina reelu
తీరు మార్చిన రీలు
- ప్రభావతి పూసపాటి
Ido prema katha
ఇదోప్రేమ కథ
- కొడాలి సీతారామా రావు