“అయ్యా, నా బాకీ ఉంది సూడండయ్యా, ఇంక ఎంత మిగిలిందో”
‘ఆసుబోసిన కండెలా అటు ఇటు తిరుగుతున్న’ టెంపరరీ మెసెంజర్ గణేష్ ని అడుగుతున్నాడు ఒకాయన.
టెక్కలి స్టేట్ బ్యాంకు లో ఇసుకేస్తే రాలనంత జనం. బ్యాంకింగ్ హాల్ లో సుమారు అయిదు వందల మంది ఉంటారు. గత నెల రోజులుగా ఇదే తీరు. జనధన్ సేవింగ్స్ ఖాతాలు ఓపెన్ చేసుకుంటే మనిషికి పది హేను లక్షల రూపాయలు ప్రభుత్వం వారు ఇస్తారని పుకార్లు రావడంతో ఇంతకు ముందు ఖాతాలు ఉన్న వారు సైతం మళ్లీ కొత్త ఖాతాల కోసం బారులు తీరారు. ‘ఆశకు అంతు లేదు’ కదా!
మెసెంజర్ సిబ్బంది ఒక్కొక్కరు రిటైరయ్యాక, బ్యాంకు ఖర్చుల నివారణకు తద్వారా లాభాలు పెంచుకోవడానికి, కొత్త వారిని నియమించక పోవడం వలన ఆ పని భారమంతా గణేష్ మరియు నరేష్ పంచుకుంటున్నారు. ఇద్దరు కూడా టెంపరరీ మెసెంజర్లే.
పని ఒత్తిడిలో ఉన్న గణేష్ కసురుకుంటూ "కొద్ది సేపు ఆ కుర్చీలో కూర్చోవయ్య చూస్తాను” అన్నాడు. కొనసాగింపుగా “ఒక పని చెయ్యి, ఇప్పుడు డబ్బులు తెచ్చుంటె కట్టెయ్యి, లేదంటె సాయంత్రం రా, ఇప్పుడు అందరు బిజీగా ఉన్నారు” అంటూ ఒక సలహా కూడా ఇచ్చాడు.
"అలాగే నయ్యా" అంటూ కుర్చీలో కూర్చున్నాడు ఆ వచ్చిన వ్యక్తి.
-——///——-
బ్యాంకు లో జనాలు పలచబడ్డారు. ఉదయం పది గంటలకొచ్చిన ఆయన అలాగే ‘గోడకు కొట్టిన మేకులా’ కుర్చీలో కూర్చున్నాడు. అప్పుడు బ్రాంచి మేనేజర్ నేతాజీ ఆయన్ని గమనించారు. గణేష్ ని పిలిచి ఆయన పనేమిటో కనుక్కోమన్నారు.
"ఆయన మన బ్యాంకు లో అప్పు తీసుకున్నాడటండి. క్రిందటి నెల వచ్చి ఎంత బాకీ ఉందో చెప్పమని అడిగితే మన ఫీల్డ్ ఆఫీసర్ గారు కంప్యూటర్ లో వెతికారు. ఎక్కడా కనిపించలేదు. సరే తరువాత రమ్మని చెప్పి పంపించేసారు"
"సరే నా దగ్గరికి పంపించు" అన్నారు మేనేజర్
"ఇదుగో, నిన్నే, పెద్దయ్యగారు రమ్మంటున్నారు. ఆయన గదిలోకి వెళ్ళు" అన్నాడు గణేష్.
"దండాలయ్యా, నాపేరు పున్నేసండి”
"నమస్కారం, మీ దగ్గర ‘లోను పాస్ బుక్’ ఉందా?"
"లేదండి, ఈ రసీదులున్నాయి" అంటు తన చేతిలో ఉన్నవి చూపించాడు.
“ఈ రసీదులు మీద పేరు పుణ్యకోటి అని ఉంది”
“అదేనండి మా అమ్మ నాయన పెట్టిన పేరు, మాఊరిలో అందరు ‘పున్నేసు’ అని పిలుస్తారండి”
అవి అప్పటికి ఇరవై సంవత్సరాల క్రితం ఆయన కట్టిన డబ్బులుకి ఇచ్చిన రసీదులు.
"ఇప్పుడు అప్పు తీర్చమని ఎవరైనా అడిగారా? లేక
ఏమైనా నోటీసులు వచ్చాయా?”
"లేదు బాబు, నీను అప్పు తీరసకుండా సచ్చిపోతానేమోనని బయమండి"
"ఏ ఊరు మీది? అప్పు దేనికి తీసుకున్నావు? "
"మాది అక్కివరం, గీదల కోసం అప్పు తీసుకున్నానండి, పాలు అమ్మకం సేసీవోడినండి. బాస్కర్రావు మేనేజర్ గారు అప్పిప్పిచ్చారండి"
"సరే కూర్చో" అని చెప్పి మేనేజర్ గారు ఆ రసీదులను చూడగా అందులో ఉన్నది కంప్యూటర్ ఖాతాల నంబరు కాదు. అంటె బ్యాంకు లో కంప్యూటర్లు లేని రోజుల్లో తీసుకున్న అప్పు. "రాని బాకీల" ఖాతాలను ఆయన పేరుతో కంప్యూటర్లో వెతికారు. అయినా ఏం కనిపించలేదు.
"ఎంత అప్పు తీసుకున్నావో తెలుసా?"
"అప్పుడు బేంక్ అప్పు పదేను వేలు, నాది ఐదు వేలు కలిపి ఇరవై వేలుకి రెండు గీదలు కొన్నానండి. నెలకి అయిదు వందలు కట్టమన్నారండి. భాస్కర్రావు గారికి నేను పాలు పోసీవోడినండి. అయ్యగారు నాకు ఇవ్వాల్సిన డబ్బుల్తో నెల నెలా బేంక్ అప్పుకి వాయిదాలు కట్టేసి నాకు రసీదులిచ్చేవోరండి"
“భాస్కర్రావు గారు బదిలీ అయిపోయిన తరువాత, పిల్లల సదువులికి, కర్సులకి డబ్బుసాలక జరుగుబాటు కస్టమయిందండి. పూరాగా కట్టలేకపోయానండి. ఇప్పుడు తీరిసెస్తానండి.”
"సరే ఇంకా కొన్ని రికార్డులు వెతకాలి. నీకు కబురు పెడతాము. అప్పుడు వచ్చి కట్టొచ్చు"
మేనేజరు గారు గణేష్ ని పిలిచి " ఈ కౌంటర్ ఫాయిల్స్ జెరాక్స్ తీసి నాకు ఇవ్వు, ఒరిజినల్స్ ఆయనకు ఇచ్చెయ్యి" అన్నారు.
-----/////-----
పుణ్యకోటి, సత్తె కాలపు మనిషి. నీతి నిజాయితీకి పెట్టింది పేరు. పాపభీతి ఎక్కువ. ధర్మముగా పాల వ్యాపారం చేస్తూ కొడుకుని చదివించాడు. ఇప్పుడా అబ్బాయి డిగ్రీ పూర్తి చేసి ఆ ఊరి కాలేజిలో గుమస్తాగా పని చేస్తున్నాడు.
రెండేళ్ళ క్రితం కూతురి పెళ్ళి కోసం, తన పూర్వీకుల నుండి సంక్రమించిన ఎకరా భూమిపైన ‘భూమి తనఖా బ్యాంకు’ లో అప్పు తీసుకున్నాడు పుణ్యకోటి. ఆ బ్యాంకు వారు స్టేట్ బ్యాంకు చెక్కు ఇచ్చారు. అది మార్చుకోవడానికి స్టేట్ బ్యాంకు కు వెళ్ళగా, “ఈయనకి మన బ్యాంకు లో అప్పుండేదని, పూర్తిగా తీర్చలేదని” ఒక మెసెంజెర్ చెప్పడం వలన అప్పుడున్న మేనేజర్ రంగారావు గారు చెక్కు మార్చుకోవడానికి ఇబ్బంది పెట్టారు. ఆయన కాళ్ళా వేళ్ళా బడి కూతురి పెళ్ళి నిమిత్తం అప్పు తీసుకున్నానని చెప్పడంతో మేనేజర్ గారు “సరే వేగంగా తీర్చెయ్యి” అని చెప్పి వదిలేసారు. కాని పుణ్యకోటి చాల బాధపడ్డాడు. ఎలాగైనా స్టేట్ బ్యాంకు అప్పు తీర్చెయ్యాలని అనుకున్నాడు.
ఇప్పుడు కొడుకుకి ఉద్యోగం రాగానే అప్పు తీర్చడానికి బ్యాంకు కు వెళ్లాడు.
——-///——-
బ్రాంచి మేనేజర్ నేతాజీ తన కంటె ముందు అక్కడ పని చేసిన మేనేజర్ రంగారావు గారికి ఫోన్ చేసి అడిగారు. ఆ మేనేజర్ గారు రెండేళ్ళ క్రితం పుణ్యకోటి చెక్కు మార్చుకోవడానికి వచ్చినప్పుడు జరిగిన ఉదంతం గుర్తుకు తెచ్చుకుని అది ఇప్పటి మేనేజర్ నేతాజీ గారికి వివరముగా చెప్పారు.
కాని ఇప్పుడున్న మేనేజర్ నేతాజీ ఎన్ని విధాలుగా ప్రయత్నించినా పుణ్యకోటి లోను వివరాలు పట్టుకోలేక పోయారు. “పుణ్యకోటి దగ్గరున్న కౌంటర్ ఫాయిల్స్ లో ఉన్న అమౌంట్ మొత్తం కూడగా పదిహేను వేలకన్నా ఎక్కువే ఉంది. అంటే అసలు పూర్తిగా చెల్లించేసాడన్న మాట. అప్పుడున్న వడ్డి రేట్లు కూడా తక్కువే. కాబట్టి పుణ్యకోటి చెల్లించాల్సిన బాకీ తక్కువే అయ్యుంటుంది. అది కూడ ఎప్పుడో మాఫీ చేసి ఉంటారు” అనుకున్నారు మేనేజర్ నేతాజీ.
——-///——-
రెండు రోజుల తరువాత మళ్ళీ పుణ్యకోటి బ్రాంచి మేనేజరు
నేతాజీ ని కలవడానికి వచ్చాడు.
“అయ్యా నా బాకీ సూసారా? ఎంతో సెప్పండయ్యా కట్టెస్తాను”
“తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టే వారే ఎక్కువగా ఉన్న ఈ రోజుల్లో ఇంత నిజాయితీగా లోను తీర్చెస్తానని వచ్చిన వాళ్ళు ఉంటారా!” అని అనుకుంటూ “ఇంకా కొన్ని రికార్డులు వెతకాలి. మేము కబురు పెడతాం. అప్పటిదాకా రావద్దు” అన్నారు మేనేజర్ గారు.
“అలాగేనయ్యా, వారం తర్వాత రమ్మంతారా”
“కబురు పెడతామయ్యా, వెళ్ళు” అని విసుగ్గా అన్నారు మేనేజర్ నేతాజీ గారు.
పుణ్యకోటి వెనుదిరిగిన వెంటనే మేనేజర్ నేతాజీ, ఫీల్డ్ ఆఫీసర్ అప్పారావు గారితో ఈ విషయం చర్చించారు. “ఎక్కడా పుణ్యకోటి లోను వివరాలు దొరకలేదు కదా, ఆయన అప్పు తీరిపోయిందని చెప్పి పంపించేద్దామా” అని అడిగారు.
“సార్, ఎంతో కొంత నామినల్ గా తీసుకుని ‘సండ్రీ డిపాజిట్’ లో వేసెయ్యండి. మనమెంతో కొంత తీసుకుని ఆయన అకౌంట్ క్లోజ్ చేసామని చెప్పితే గాని శాంతిచ్చేటట్టు లేడు” అన్నారు ఫీల్డ్ ఆఫీసర్ అప్పారావు గారు.
‘“సండ్రీ డిపాజిట్’ కు మనం ఏమి రీజన్ చెప్పుతాం?”
“అయితే ఆయనికి అప్పిచ్చిన బ్రాంచి మేనేజర్ భాస్కర రావు గారిని సంప్రదిస్తే బాగుంటుంది. ఆయన ఏమైనా సలహా ఇస్తారేమో చూడండి.” అన్నారు అప్పారావు గారు.
“ఆయన రిటైర్ అయి పది సంవత్సరాలు అయింది. ఇప్పుడు ఎక్కడున్నారో ఏమో”
“నాకు తెలుసండి, భాస్కర రావు గారిది మా ఊరే. ఇప్పుడు విశాఖపట్నం లో నివాసం. అప్పుడప్పుడు అమెరికాలో ఉన్న వాళ్ళ అబ్బాయి దగ్గరకి వెళ్తుంటారు. ఆయన మొబైల్ నంబర్ ఇస్తాను మాట్లాడండి.”
“సరే ఇవ్వండి, రాత్రికి మాట్లాడతాను”
——///——-
“నమస్తే, భాస్కర రావు గారు, నా పేరు నేతాజీ అండి. ప్రస్తుతం టెక్కలి లో మన బ్రాంచి మేనేజర్ గా ఉన్నాను. మీరెలా ఉన్నారు? “
“నమస్తే అండి, బాగానే ఉన్నాను.”
“ఎక్కడున్నారిప్పుడు?”
మా స్వంత ఊరు బరంపురం గానీ రిటైరయ్యాక విశాఖపట్నం లో సెటిల్ అయ్యాను.”
“మా ఫీల్డ్ ఆఫీసర్ అప్పారావు గారు మీ విషయం చెప్పారండి. ఆయనది కూడా మీ ఊరేనట. ఆయనే మీ కాంటాక్ట్ నంబర్ ఇచ్చారు. వైజాగులోనే ఉన్నారా లేక మీ అబ్బాయి దగ్గరకి అమెరికా వెళ్ళారేమోనని అడిగాను “
“ఓహ్ అలాగా, వైజాగు లోనే ఉన్నాను. మీది ఏ ఊరు?
“మాది మీ పక్కనే సోంపేట అండి.”
“ఓహ్, ‘మనం మనం బరంపురం’, వెరీగుడ్.”
“మాది సోంపేట అండి”
“అదేనండీ, ఆంధ్ర ఒడిస్సా బోర్డర్ కు ఇవతల మీరు, అవతల మేము. మన ప్రాంతంలో సాధారణంగా వాడే జాతీయం ‘మనం మనం బరంపురం’ కదా! అందుకే ఛలోక్తి గా అలాగన్నాను. ఏమిటి సంగతులు? అప్పారావు గారు బాగున్నారా? బ్రాంచి బిజినెస్ బాగుందా?”
“ఆ… బాగున్నారండి, బ్రాంచి బిజినెస్ కూడా బాగుంది. ఒక విషయం మిమ్మల్ని అడగాలని ఫోన్ చేసాను.”
“ఏమిటి?”
“మీరు ఇక్కడ బ్రాంచి మేనేజర్ గా ఉన్నప్పుడు ‘పుణ్యకోటి’ అని ఒకాయనకు గేదెలకు లోను ఇచ్చారట. మీకు ఆయన పాలు కూడా పోసేవారట, గుర్తుందా?”
“ఆ…ఆ… ఆయన్ని ఎవరైనా సరే గుర్తు పెట్టుకుంటారు. చాలా మంచి వాడు. నిరక్షరాస్యుడైనా నిజాయితీ పరుడు. ధర్మమే ఆయన జీవన విధానం. అందుకే ఆయనతో పరిచయమున్న వారెవరూ ఆయన్ని మరిచిపోలేరు.”
“ఇంత బాగా ఆయన వ్యక్తిత్వం గురించి చెప్పారంటే నిజంగా ‘హి ఈజ్ గ్రేట్’. నాకు కూడా అలానే అనిపించాడు.”
“ఇప్పుడేమయింది?”
“మీకు ఇబ్బంది పెడుతున్నానని అనుకోకండి. మీరున్నప్పుడు పుణ్యకోటి తీసుకున్న లోను ఇంకా బేలన్స్ ఉందని మన మెసెంజర్ ఒకాయన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వలన నా ముందు బ్రాంచి మేనేజర్ గారు, పుణ్యకోటి ‘ఎల్ ఎం బ్యాంకు’ వాళ్ళు ఇచ్చిన చెక్కు మన బ్యాంకు లో మార్చు కోవడానికి వచ్చినప్పుడు ఇబ్బంది పెట్టారట. దానితో బాధ పడినట్టున్నాడు. అందుకే ఇప్పుడు అప్పు తీర్చెస్తాను ఎంతో చెప్పండి అని అడుగుతున్నాడు, ఆయన అప్పు విషయంలో మనం నోటీసులు కూడా ఇవ్వలేదు. కానీ నెల రోజుల నుండి మన బ్యాంకు చుట్టూ తిరుగుతున్నాడు. మన రికార్డుల్లో ఆ లోను వివరాలు ఎక్కడా కనిపించడం లేదు. ‘రైట్ ఆఫ్’ చేసిన దాఖలాలు కూడా లేవు. మీకు ఆ లోను విషయం ఏమైనా తెలుసుంటుందని అడుగుతున్నాను.”
“నాకు బాగా గుర్తుంది. నేనున్నప్పుడే ‘అగ్రికల్చరల్ అండ్ అలైడ్ ఏక్టివిటీస్’ కింద తీసుకున్న అప్పులకు వడ్డీ మాఫీ జరిగింది. అప్పటికే పుణ్యకోటి తీసుకున్న అప్పులో అసలు మొత్తం తీరిపోయినందున వడ్డీ మాఫీ కారణంగా ఆయన లోను అకౌంట్ క్లోజ్ చేసాము. అయితే నాకు ట్రాన్స్ ఫర్ అయిన హడావుడిలో నేను ఆయనకి ఆ విషయం చెప్పలేకపోయాను.”
“అలాగా, అయితే ఈసారి ఆయన వస్తే లోన్ క్లోజర్ లెటర్ ఇచ్చెస్తాను.”
“అలా చెయ్యండి నేతాజీ గారు, ఒక మంచి పని చేసిన వారవుతారు.
ఆయన మిమ్మల్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటారు.
భాస్కర రావు గారు తమ మనవళ్లకు ప్రతి రోజు రాత్రి పడుకునే సమయంలో చాలా సార్లు చెప్పిన ‘ఆవు పులి’ కథలో ‘పుణ్యకోటి’ అనే ఆవును గుర్తు చేసుకున్నారు. “ఎంత నిజాయితీ! ఇది కథే కదా! అనుకుంటాం మనం. కాని ఈ కాలంలో, మనుషుల్లో కూడా పుణ్యకోటి లాంటి నిజాయితీ పరులు ఉన్నారంటే నమ్మశక్యంగా లేకపోయినా ఇది నిజం.” అనుకున్నారు.
——///——

