5G ప్రేమలు - మండా. సూర్యనారాయణ

5G premalu

“ఏమోయ్! టైమ్ అవుతుంది, త్వరగా టిఫిన్ పెట్టు” అని అన్నాడు శాస్త్రి. ​“అబ్బా! ఇదిగో వస్తున్నా, ఆగండి. ఒక ఐదు నిమిషాలు ఓపిక పట్టలేరా?” అంటూ టిఫిన్ తెచ్చి వడ్డించింది భాగ్యం. ​శాస్త్రి టిఫిన్ తింటూ, “ఏమోయ్! నీ చేతి వంట అమృతం అనుకో. నేను ఏదో జన్మలో పుణ్యం చేసుకున్నావోయ్” అన్నాడు శాస్త్రి. ​“చాలు లే ఊరుకోండి! ఊరికే కోపడటం, తర్వాత ఇలా పొగడటం మీకు అలవాటేగా!” అంటూ బుంగమూతి పెట్టుకుంది భాగ్యం. ​“ఇదేనోయ్ ప్రేమంటే!” అని చిరునవ్వుతో బదులిచ్చాడు శాస్త్రి. ​ఇంతలో... ‘ట్రింగ్ ట్రింగ్’ మని కాలింగ్ బెల్ మోగింది. ​“ఏమోయ్! వెళ్లి చూడు” అన్నాడు శాస్త్రి. ​భాగ్యం వెళ్లి తలుపు తీసింది. తలుపుకి అవతలి వైపు ఒక జంట ఉంది. “ఎవరు కావాలి?” అని అడిగింది భాగ్యం. ​వాళ్లిద్దరూ ఒకేసారి, “లాయర్ శాస్త్రి గారిని కలవాలి” అని బదులిచ్చారు. ​“ఆయన భోజనం చేస్తున్నారు. అదిగో అక్కడ గది కనిపిస్తుంది కదా! అదే ఆయన ఆఫీస్, లోపలికి వెళ్లి వెయిట్ చేయండి. ఆయన వస్తారు” అని అంది భాగ్యం. ​వాళ్లు “సరే” అని ఆఫీస్‌లోకి వెళ్లి కూర్చున్నారు. ​భాగ్యం మనసులో ఎన్నో ఆలోచనలు రేగుతున్నాయి. ఇంతలో, “ఎవరొచ్చారు?” అని పెద్దగా కేక వేశాడు శాస్త్రి. ​“విడాకుల కోసం అంట! మిమ్మల్ని కలవడానికి వచ్చారు. ఆఫీస్‌లో వెయిట్ చేయమని చెప్పి పంపాను” అంది భాగ్యం. ​“విడాకుల కోసమా! ఏమిటో భాగ్యం... ఈమధ్య విస్తరాకుల కన్నా విడాకులు అనే మాట ఎక్కువగా వినిపిస్తుంది. అయినా విధి ఎంత చిత్రమైనది కదా! మా నాన్నగారు పురోహితుడిగా ఎన్నో జంటలను కలిపారు, నేను లాయర్‌గా ఎన్నో జంటలు విడిపోవడానికి సహాయం చేస్తున్నాను. మా నాన్న పెళ్లిళ్లు చేసి మమ్మల్ని పెంచితే, నేను విడాకులు ఇప్పిస్తూ నా పిల్లలని పెంచుతున్నాను. మనసు రాదు గానీ వృత్తి ధర్మం కదా!” అంటూ చెయ్యి కడుక్కున్నాడు శాస్త్రి. ​“ఏమండీ! వాళ్ల జంట చాలా ముచ్చటగా ఉంది, ఈడుజోడు చక్కగా కుదిరింది. కుదిరితే రాజీ కుదర్చండి” అని నెమ్మదిగా అంది భాగ్యం. ​“నాకు మాత్రం జంటలను విడగొట్టాలని ఉంటుందా? నా వంతు ప్రయత్నం చేస్తాను, కుదరలేదు అంటే తప్పదుగా!” అంటూ ఆఫీస్‌లోకి బయలుదేరాడు శాస్త్రి. ​ఏమి జరుగుతుందో అని శాస్త్రి వెంటే భాగ్యం కూడా నడిచింది. ​ఆఫీస్‌కి వెళ్లేసరికి ఇద్దరూ కూర్చొని ఉన్నారు. “ఇప్పుడు చెప్పండి నాయనా, ఏమి కావాలి?” అన్నాడు శాస్త్రి. ​వాళ్లు కాస్త బిడియంగా, “విడాకుల కోసం వచ్చాము” అని అన్నారు. ​సరే అని శాస్త్రి వాళ్లకు ఎదురుగా కూర్చొని, “అమ్మా! చూస్తే పెళ్లయ్యి పదేళ్లు కూడా అవ్వనట్లు ఉంది, విడాకులు తీసుకోవాలనే ఆలోచన ఎందుకు వచ్చింది?” అని అడిగాడు శాస్త్రి. ​ఏమి చెప్తారా అని మౌనంగా వింటుంది భాగ్యం. ​“శాస్త్రి గారూ! నా పేరు సుమన్, నేను సాఫ్ట్‌వేర్‌గా పనిచేస్తున్నాను. తను నా భార్య సుమతి. ఇద్దరం కాలేజీ టైమ్‌లోనే లవ్ చేసి పెళ్లి చేసుకున్నాం. మాకు ఒక పాప ఉంది. మాకు పెళ్లైన కొంతకాలం బానే ఉన్నాం, కానీ కాలం గడిచేకొద్దీ తనలో మార్పు మొదలైంది. చిన్న చిన్న కారణాలకు గొడవ పడుతుంది, ఇద్దరిలో ఎవరూ సర్దుకోలేకపోతున్నాం. ‘నువ్వా-నేనా’ అనేలా మారింది పరిస్థితి. కలిసి ఉండడం నా వల్ల కాదు, ఇద్దరి అభిప్రాయాలు వేరు, ఆలోచనలు వేరు... నా వల్ల కావడం లేదు. ఎన్నిసార్లు చెప్పినా తనలో మార్పు లేదు, ఇక నా వల్ల కాదు... మాకు విడాకులు ఇప్పించండి” అని తన సమస్యను చెప్పాడు సుమన్. ​“అమ్మా! నువ్వు ఏమైనా చెప్పాలనుకుంటున్నావా?” అని సుమతిని అడిగాడు శాస్త్రి. ​“మొత్తం తప్పు నాదే అన్నట్టుగా ఉన్నాయి అతని మాటలు! నేను కొన్ని వందల కోట్లకు వారసురాలిని. ‘నువ్వంటే నాకు ప్రాణం, నీకోసం చావడానికి కూడా రెడీ, నువ్వు లేకపోతే బతకలేను’ అని వెంటపడితే ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. తీరా చూస్తే చాలీచాలని జీతంతో కుటుంబాన్ని నెట్టాల్సి వస్తుంది. చూస్తుండగానే ఒక పాప పుట్టింది, మా మధ్య తరచూ గొడవలు అవుతూనే ఉన్నాయి. ఈ గొడవలతో ఉండలేక నేను మా పుట్టింటికి పోయాను. ‘నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు, నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాము, విడాకులు తీసుకుని వచ్చేయ్’ అని సలహా ఇచ్చి పంపారు. ఆలోచిస్తే వాళ్ల నిర్ణయం కరెక్ట్ అనిపిస్తుంది. ఈ మనిషితో నేను వేగలేను, విడాకులు కావాలి” అని సుమతి తెగేసి చెప్పేసింది. ​“అవును, మీకు పాప ఉంది అన్నారు కదా! మీరు విడిపోతే తన పరిస్థితి ఏంటి?” అని అడిగాడు శాస్త్రి. ​“నేనా... మా ఇంట్లో వాళ్లు చెప్పే సంబంధం చేసుకుంటాను, కాబట్టి పాప బాధ్యత నేను చూసుకోలేను” అని అంది సుమతి. ​“నేను కూడా ఇంకో పెళ్లి చేసుకుంటాను, పాపను నాతో పాటు ఉంచుకోను. మా అమ్మవాళ్ల దగ్గర గానీ, లేదా ఏదైనా అనాథ ఆశ్రమంలో గానీ చేర్పిస్తాను. పాపను నేను నాతో ఉంచుకోలేను, తనని అప్పుడప్పుడు చూడడానికి ఇద్దరం వెళ్తుంటాం” అని చెప్పాడు సుమన్. ​ఆ మాటలకు శాస్త్రి ఆశ్చర్యపోయాడు. క్షణకాలం నోట మాట రాలేదు శాస్త్రికి. ​ఇద్దరికీ కలిసి ఉండే ఉద్దేశం లేదని శాస్త్రికి అర్థమైంది. “నేను మిగతా ఫార్మాలిటీస్ చూసుకుంటాను, ఇక మీరు వెళ్లొచ్చు” అని అన్నాడు శాస్త్రి. ​“కుదిరినంత త్వరగా అయ్యేలా చూడండి” అని సుమన్ అంటూ అక్కడ నుంచి వెళ్లిపోయారు. ​ఇదంతా గమనిస్తున్న భాగ్యం కళ్లల్లో నీళ్లు తిరిగాయి. తన మనసులో ‘ఆ పసిపాప భవిష్యత్తు ఏంటో’ అని మెదులుతోంది. ​భాగ్యం పరిస్థితిని గమనించిన శాస్త్రి, “ఏమిటోయ్! దిగాలుగా ఉన్నావ్? వాళ్లు విడిపోతున్నారనా?” అని అడిగాడు శాస్త్రి. ​“లేదండీ! వాళ్లు ఎలానో పోనీ, కానీ ఆ పసిపిల్ల కోసం కూడా ఆలోచించని అలాంటి మనుషులకు అమ్మ-నాన్న అని పిలిపించుకునే అర్హత లేదండీ! ఎంతమంది పిల్లలు పుట్టాక బాధపడుతున్నారు, పైగా ప్రేమ పెళ్లి అంట! ఇందులో కోరికలు తప్ప ప్రేమ ఎక్కడుంది?” అని విసుక్కుంటూ చెప్పింది భాగ్యం. ​“ఏమో ప్రేమలు! ఏంటో... పెళ్లికాకముందు కలిసి ఉండడానికి పెద్దవాళ్లతో గొడవ పడతారు, పెళ్లయ్యాక కలిసి ఉండడం కష్టమని గొడవలు పడుతుంటారు. నేను రోజుకి ఎన్నో ఇలాంటివి చూస్తూ ఉంటాను. పెళ్లి పందిళ్లు తీయకముందే తుస్సుమన్న ఆదర్శ జంటలు కూడా ఉన్నాయి! రాను రాను పెళ్లి అనే బంధానికి విలువ లేకుండా పోతుంది” అని అన్నాడు శాస్త్రి. ​“హ బావుంది! మరేం... మన కాలంలో ఎలా ఉండేవాళ్లు? ఒకసారి పెళ్లి అనే బంధంతో ముడిపడితే జీవితం మొత్తం కలిసి ఉండేవాళ్లు, ఒకరికొకరు ఇచ్చుకునే మర్యాదలు అలాంటివి. మా పెదనాన్న గారి తోటి అల్లుడు రోజు తాగి తాగి కొన్నాళ్లకు కాళ్లు చేతులు పడిపోయాయి, అయినా వాళ్ల ఆవిడ అతనికి సేవలు చేస్తూ కుటుంబాన్ని చూసుకుంది. అదీ కదా ప్రేమ అంటే! ఆవిడ కూడా ‘నాకు స్వేచ్ఛ కావాలి’ అనుకుంటే ఆ కుటుంబం ఉండేదా? అంత ఎందుకు... మన పెళ్లయిన కొత్తలో మన వీధి చివర ఒకతను ఉండేవాడు కదా, వాళ్ల భార్యకి రోడ్డు ప్రమాదం వలన మంచానికే పరిమితమైనా సరే, అతను తన భార్య బాగోగులు చూసుకునేవాడు కదండీ! ప్రేమలు అంటే మన కాలం వాళ్లవే. మన దేశంలో పెళ్లికి ఒక విశిష్టత ఉంది, అది ఈ రోజుల్లో పూర్తిగా పోయింది” అని దిగాలుగా అంది భాగ్యం. ​“అదంతా అప్పటి మాట భాగ్యం! ఇప్పుడు కాలం మారింది, స్వేచ్ఛ పేరుతో క్షణికావేశంలో జీవితాలను పాడుచేసుకుంటున్నారు. ప్రేమ స్థానంలో పంతం వచ్చింది, ఆప్యాయత స్థానంలో అనుమానం వచ్చి కూర్చుంది, మొండితనం ముందు మాంగల్య బంధం నిలవలేకపోతుంది” అన్నాడు శాస్త్రి. ​“సర్దుకుంటేనే సంసారం నిలుస్తుంది, కుటుంబాలను కూల్చేసేంత కోపాలు దేనికో? కుటుంబం అంటేనే కలిసి ఉండడం. అయినా సర్ది చెప్పాల్సిన తల్లిదండ్రులు విడాకులు తీసుకోమనడం విడ్డూరంగా ఉంది” అని అంది భాగ్యం. ​“ఏమి చేస్తాం! లోకం తీరు అలా మారింది. భార్యాభర్తలు ఒకరి శ్రేయస్సు ఒకరు కోరుకునే వాళ్ల కంటే ‘నీ అవసరం నాకు ఏంటి?’ అనుకునేవాళ్లు ఎక్కువయ్యారు. ఇంతకుముందు ఆడవాళ్లను కేవలం ఇంట్లో పనులు చేయడానికే అనే భావనలో సమాజం ఉండేది, నేడు ఆ ధోరణి లేదు. మగవాళ్లతో సమానంగా, ఇంకా చెప్పాలంటే మగాడిని మించి విజయాలు సాధిస్తున్నారు... ఇది గొప్ప విషయం! ఆడవాళ్లయినా, మగవాళ్లయినా దొరికిన స్వేచ్ఛను కుటుంబ శ్రేయస్సు కోసం, సమాజ శ్రేయస్సు కోసం, దేశ శ్రేయస్సు కోసం ఉపయోగించుకోవాలి. అంతేగానీ స్వేచ్ఛను కుటుంబాన్ని ముక్కలు చేసే ఆయుధంగా మార్చకూడదు” అని శాస్త్రి అన్నాడు. ​“నిజమేనండీ! అభివృద్ధి పేరుతో అంతరిక్షం చేరుకున్నాం, కానీ అనవసర పంతాలతో ఆప్యాయంగా ఉండాల్సిన బంధాలను తెంచుకుంటున్నాం. ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ, ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవిస్తూ, ఒకరికి ఒకరు తోడుగా కష్టసుఖాలు పంచుకుంటూ ఉంటే ఆ జంట కలకాలం బాగుంటుంది కదండీ” అని చెప్పింది భాగ్యం. ​“హా, నిజమే! కానీ ఇవి 5G ప్రేమలు, సిగ్నల్స్ ఉండేంత స్ట్రాంగ్‌గా సంసారాలు ఉండవు... నా జీవితంలో ‘విడాకులు వద్దు’ అని జంటలో ఒకరైనా అనే రోజు వస్తుందంటావా?” అంటూ లేచి మిగతా ఫార్మాలిటీస్ చూసుకోవడానికి పోయాడో శాస్త్రి. ​భాగ్యం మనసు మాత్రం ఆ పాప గురించే ఆలోచిస్తోంది. ‘వాళ్లు ఒక్కటై కలిస్తే ఎంత బాగుండో’ అనుకుంటూనే ఇంటి పనుల్లో నిమగ్నమైపోయింది. **********************************

మరిన్ని కథలు

Punarujjeevanam
పునరుజ్జీవనం
- డా:సి.హెచ్.ప్రతాప్
59 rujulu
59 రోజులు
- డా:సి.హెచ్.ప్రతాప్
Kulavrutti
కులవృత్తి
- ARADHYULA Pranav
Santrupthi
సంతృప్తి
- మండా సూర్యనారాయణ
Sanmanam
సన్మానం!
- బొల్లిముంత వెంకట రమణా రావు
Apramatthata
అప్రమత్తత
- డా:సి.హెచ్.ప్రతాప్
Samskaram
సంస్కారం
- మద్దూరి నరసింహమూర్తి
Chivari vuttaram
చివరి ఉత్తరం
- డా:సి.హెచ్.ప్రతాప్