నేనే - సింగనమల మస్తాన్ వలి

Nene

నేనే

సామాజిక నాటిక

ప్రవేశిక

(వేదికపై ఒక మనిషి అకస్మాత్తుగా కుప్పకూలి పడిపోతాడు. చుట్టూ ఉన్నవారి గొంతులు వినిపిస్తాయి.)

మొదటి వ్యక్తి: అయ్యో! మనిషి చనిపోయాడేమో!

రెండో వ్యక్తి: అతడా? చాలా మందిని మోసం చేసినవాడు.

మూడో వ్యక్తి: నా భూమిని కూడా కాజేశాడు.

నాలుగో వ్యక్తి: నా దగ్గర డబ్బు తీసుకుని తిరిగి ఇవ్వలేదు. పాపిష్టివాడు!

(అంతలో నేలపై పడివున్న మనిషి ఒక్కసారిగా లేచి కూర్చుంటాడు తన శరీరంపైన విదిలించుకుంటూ.)

మనిషి:- ఛీ... ఛీ...! ప్రశాంతంగా ఉండనివ్వరు. ఎక్కడ చూసినా ఈ భూమి మీద పురుగులే కనిపిస్తున్నాయి!

(దూరం నుంచి ఒక గంభీరమైన నవ్వు వినిపిస్తుంది.)

మనిషి:- ఎవరు...? ఎవరు నవ్వుతున్నారు?

భూమి:- బాగా చూడు... నేనే!

మనిషి:- అరే... భూమివా! ఎందుకలా నవ్వుతున్నావు? పిచ్చిదానిలా!

భూమి:- పిచ్చిదాన్ని నేనా? ఈ భూమి మీద పురుగులే ఉన్నాయని చెప్పింది నువ్వే కదా! మరి నువ్వు ఎవరు? నీ గురించి నువ్వే మర్చిపోయావు?!

మనిషి:- ఏమిటి? నేను పురుగునా?

భూమి:- అవును. నువ్వు కూడా ఒక పురుగువే. కానీ మిగతా జీవుల్లా కాదు... తననే గొప్పవాడినని భావించే ప్రత్యేకమైన పురుగు.

మనిషి:- అలా ఎందుకు అంటున్నావు?

భూమి:- వేల సంవత్సరాలుగా, ఎన్నో తరాలను చూశాను. మహా మేధావులు కూడా చివరికి నాలోనే కలిసిపోయారు. కానీ నువ్వు మాత్రం నాపై గీతలు గీసి, "ఇది నా భూమి" అని హక్కులు చెప్పుకుంటున్నావు. నన్నే నీ సొత్తు అని ప్రకటిస్తున్నావు. అది పిచ్చి కాదా?

మనిషి:- నేను సంపాదించుకున్న భూమి నువ్వు!

భూమి:- నన్ను సంపాదించావా? నా మీదే పుట్టి, నా మీదే బ్రతికి, చివరికి నాలోనే కలిసిపోతావు. అయినా నన్ను నీ సొత్తు అంటావా? ఎందుకు?

మనిషి:- నిన్ను డబ్బు కోసం నా పేరు పైన ఉంచాను. అదితప్పా?

(ఇంతలో డబ్బు పాత్ర ప్రవేశిస్తుంది.)

డబ్బు:- ఆగు... ఆగు! నాకోసం భూమిని దాచుకున్నానని అన్నావు కదా! నీకు సిగ్గులేదా? నువ్వే నన్ను సృష్టించావు … నువ్వే నాకు విలువ ఇచ్చావు.. కానీ ఇప్పుడు నా కోసమే మోసాలు, అన్యాయాలు చేస్తున్నావు…

మనిషి:- మరేం చేయమంటావ్? నువ్వు లేకపోతే తిండి లేదు... చదువు లేదు... వైద్యం లేదు... సమాజంలో విలువ లేదు. అందుకే నిన్ను సంపాదిస్తున్నాను.

డబ్బు:- సంపాదించడం తప్పు కాదు. కానీ నా కోసం మనిషితనాన్ని అమ్ముకోవడమే తప్పు. నన్ను అవసరానికి వాడాలి... జీవిత లక్ష్యంగా కాదు… ఇదంతా నీ స్వార్థం

(డబ్బు మాటలు విన్న వెంటనే మరో స్వరం వినిపిస్తుంది.)

స్వార్థం:- ఆగండి... నన్ను మర్చిపోయి తీర్పు చెప్పకండి!

మనిషి:- ఎవరు నువ్వు?

స్వార్థం:- నేనే... స్వార్థం.

డబ్బు:- అంటే నువ్వే ఈ సమస్యలన్నింటికీ కారణమా?

స్వార్థం:- అంత తొందరగా నన్ను నిందించకండి. నేను లేకపోతే ఈ ప్రపంచంలో ఒక్క జీవి కూడా బ్రతకదు.

మనిషి:- అది ఎలా?

స్వార్థం:- తల్లి తన బిడ్డను ప్రేమించడం... తండ్రి కుటుంబం కోసం కష్టపడటం... రైతు తన పంటను కాపాడుకోవడం... ఇవన్నీ కూడా ఒక రకమైన స్వార్థమే. అయితే అది ప్రేమతో కూడిన స్వార్థం.

భూమి:- అయితే మనిషి చేస్తున్న విధ్వంసం?

స్వార్థం:- అది నేను కాదు... అది అతి స్వార్థం.అవసరానికి మించిన ఆశ, అధికారం, దురాశ మనిషిని మారుస్తాయి.

డబ్బు:- అందుకే నా కోసం మనుషులు ఒకరినొకరు మోసం చేస్తున్నారు.

స్వార్థం:- అవును. నేను పరిమితిలో ఉంటే మనిషిని కాపాడుతాను.హద్దులు దాటితే... మనిషినే నాశనం చేస్తాను.

మనిషి:- ఇప్పుడర్థమవుతోంది... తప్పు నీలో కాదు. నిన్ను నేను ఎలా ఉపయోగించుకున్నానో అందులో ఉంది. ఇదంతా నేను ఆశ తో చేశాను

(ఇంతలో మరో స్వరం వినిపిస్తుంది.)

ఆశ:- అంతా నాపైనే నెట్టేయబోతున్నారా?

మనిషి:- ఎవరు నువ్వు?

ఆశ:- నేనే... ఆశ.. నేను లేకపోతే మనిషి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేడు.
చదవాలనే ఆశ... ఎదగాలనే ఆశ... కుటుంబాన్ని సంతోషంగా ఉంచాలనే ఆశ... ఇవన్నీ జీవితానికి బలం.

భూమి:- అయితే ఈ సమస్యలన్నింటికీ కారణం ఎవరు?

ఆశ:- నేను కాదు.అత్యాశ అది అవసరాన్ని మించి అన్నీ నాకే కావాలనే కోరికే మనిషిని మానవత్వం నుంచి దూరం చేస్తుంది. ఆ కోరిక పెరిగినప్పుడు కోపం, ద్వేషం, అసూయ, అహంకారం పుడతాయి. అప్పుడే మనిషి మృగంలా మారిపోతాడు.

ఆశ:- మనిషి జీవితంలో ఆశ అవసరం. కానీ ఆశకు హద్దులు ఉండాలి.
హద్దులు దాటిన ఆశ అత్యాశగా మారుతుంది.
అత్యాశే మనిషిలో స్వార్థం, కోపం, ద్వేషం, అసూయ, అహంకారాన్ని పెంచుతుంది.

భూమి:- నన్ను ప్రేమగా కాపాడితే నేను అందరికీ జీవనాధారం. నన్ను దోచుకోవాలని చూస్తే నేను కూడా మౌనంగా ఉండను.

డబ్బు:- నేను అవసరానికి మాత్రమే ఉపయోగపడాలి. నన్ను మనిషి జీవిత లక్ష్యంగా మార్చుకుంటే శాంతి దూరమవుతుంది.

స్వార్థం:- నేను ప్రేమతో కలిసినప్పుడు కుటుంబాన్ని కాపాడుతాను. అత్యాశతో కలిసినప్పుడు సమాజాన్ని నాశనం చేస్తాను.

ఆశ:- తప్పు మాలో లేదు...మమ్మల్ని ఎలా ఉపయోగించుకుంటాడో అదే మనిషి భవిష్యత్తును నిర్ణయిస్తుంది.

భూమి, డబ్బు, స్వార్థం, ఆశ (ఒకేసారి):-
మనిషీ... నువ్వు నిజమైన మనిషిగా జీవించాలంటే ప్రకృతిని ప్రేమించు.
డబ్బును అవసరానికి వాడు….. స్వార్థాన్ని హద్దుల్లో ఉంచు…..
ఆశను లక్ష్యంగా మార్చుకో... అత్యాశగా కాదు….

(నాలుగు పాత్రలు నెమ్మదిగా నిష్క్రమిస్తాయి. మనిషి ఒక్కసారిగా మేల్కొంటాడు.)

మనిషి:-అరే! ఇదంతా కలా? కానీ... ఆ కలలో విన్న ప్రతి మాట నిజమే. నా తప్పులకు కారణం భూమి కాదు...డబ్బు కాదు...స్వార్థం కాదు... ఆశ కూడా కాదు...

నా తప్పులకు కారణం నేనే. ఇకపై ప్రకృతిని కాపాడుతూ, మానవత్వాన్ని నిలబెడుతూ, నిజమైన మనిషిగా జీవిస్తాను. అంటూ ప్రేక్షకుల వైపు చూస్తాడు.

మనిషి: మనుషులు ప్రకృతికి యజమానులు కాదు...మనమంతా ఆమె సంతానం మాత్రమే.

(వెలుతురు మెల్లగా తగ్గుతుంది.)

— శుభం —

మరిన్ని కథలు

Achhiyamma
అచ్చియమ్మ
- అనిసా తబస్సుమ్ sk
5G premalu
5G ప్రేమలు
- మండా. సూర్యనారాయణ
Punarujjeevanam
పునరుజ్జీవనం
- డా:సి.హెచ్.ప్రతాప్
59 rujulu
59 రోజులు
- డా:సి.హెచ్.ప్రతాప్
Kulavrutti
కులవృత్తి
- ARADHYULA Pranav
Santrupthi
సంతృప్తి
- మండా సూర్యనారాయణ
Sanmanam
సన్మానం!
- బొల్లిముంత వెంకట రమణా రావు
Apramatthata
అప్రమత్తత
- డా:సి.హెచ్.ప్రతాప్