"శ్రీ... కొరియర్ పోస్ట్‌బాక్స్‌లో పెట్టారని మెసేజ్ వచ్చింది. ప్లీజ్ వెళ్లి తీసుకురా," అంటూ గారాలు పోతూ అడిగింది సుకన్య.
"మళ్లీనా! మొన్ననే కదా పెద్ద బాక్స్ వచ్చింది. ఇప్పుడు ఏమిటి?" అంటూ కొంచెం విసుగ్గా అన్నాడు శ్రీకర్.
కొరియర్ బాక్స్ దగ్గరకు వెళ్లి ప్యాకెట్ తీసుకొచ్చి ఆశ్చర్యపోయాడు.
"ఇన్ని చీరలా? అన్నీ ఒకే డిజైన్‌లో ఉన్నాయి. ఎనిమిది ఎందుకు?"
"వరలక్ష్మి వ్రతం వస్తోంది కదా! మా ఫ్రెండ్స్ అందరం కలిసి పూజ చేసుకుంటున్నాం. ఒక్కొక్కరం ఒక్కో అమ్మవారిలా రెడీ అవుతాం. తర్వాత ఒక మంచి రీల్ కూడా చేద్దాం," అంటూ పిల్లలా సంబరపడింది సుకన్య.
"పూజ కోసం చీరలా? లేక రీల్ కోసం చీరలా?భక్తి ,సంప్రదాయం మనసులో ఉంటే దాన్ని చూపించడానికి కెమెరా అవసరం లేదేమో సుకన్య." " అని కొంచెం అసహనంగా అడిగాడు శ్రీకర్.
"అయ్యో శ్రీ... నీకు అర్థం కాదు. ఈ కాలంలో మన సంప్రదాయాలు అందరికీ తెలియాలంటే సోషల్ మీడియాలో చూపించాలి. అందరూ చూస్తేనే కదా మన సంస్కృతి తెలుస్తుంది."
సుకన్య చిన్నప్పుడే తల్లిదండ్రులను పోగొట్టుకుంది. అప్పటి నుంచి ఆమెకు అమ్మానాన్నా అన్నీతానే అయ్యి పెంచి పెద్ద చేసిందిబామ్మే. బామ్మా అంటే వల్లమాలిన ప్రేమ తో కూడిన గారం.
"ఏమిటమ్మా సుకన్యా... మళ్లీ ఏదో హడావుడి చేస్తున్నావు ?"
"అవును బామ్మా. ఈసారి మా ఫ్రెండ్స్ అందరం కలిసి వరలక్ష్మి వ్రతం చేస్తున్నాం. అందరికీ ఒకే రకమైన కొత్త చీరలు తెప్పించాను. మీరు కూడా కొత్త చీర కట్టుకోవాలి. ఒక మంచి వీడియో తీసి ఆన్‌లైన్‌లో పెడతాం."
బామ్మ చిన్నగా నవ్వింది."వీడియో మాట అటువుంచు అమ్మవారిపూజ లో
భక్తి శ్రద్ధ అవసరం "ఏమిటి బామ్మా... మీరు కూడా శ్రీలా రీల్స్ వద్దు అంటూ పాతకాలపు మాటలు మొదలుపెట్టారా?" అంటూ నవ్వి అక్కడి నుంచి వెళ్లిపోయింది.
సుకన్య వెళ్లిన వైపు చూస్తూ బామ్మ మెల్లగా నిట్టూర్చింది.ఆమె కళ్ల ముందు తన చిన్ననాటి రోజులు మెదిలాయి.అప్పుడు కెమెరాలు , ఫోన్లు ,రీల్స్ లేవు. పండుగ అంటే ఆప్యాయంగా బంధువులపలకరింపులు , పిండివంటల ఘుఘుమలు పూల వాసనలు , పిల్లల అల్లరి...అంతే . ఆ రోజుల్లో తీసిన ఫొటోలు కన్నా జ్ఞాపకాలు ఎక్కువ.
******
వరలక్ష్మి వ్రతం రోజు ఇంట్లో సందడి మొదలైంది.
సుకన్య స్నేహితులంతా కొత్త చీరలు కట్టుకుని వచ్చారు.
"ముందు రీల్ చేద్దాం. తర్వాత పూజ చేద్దాం. సూర్యాస్తమయం లైట్‌లో చాలా బాగుంటుంది," అంది ప్రీతి, సుకన్య చీర సరిచేస్తూ.
"ఈ యాంగిల్ కన్నా కెమెరా ఇటువైపు పెట్టండి. అందరి చీరలు బాగా కనిపిస్తాయి," అంటూ మొబైల్ స్టాండ్ సర్దింది సౌమ్య.
"నా నగలు సరిగ్గా కనిపిస్తున్నాయా? మొన్ననే చేయించుకున్నాను," అంటూ జారిపోతున్న వడ్డాణాన్ని సవరించుకుంది రాగిణి.
అందరూ నవ్వుకుంటూ కెమెరా ముందు నిలబడ్డారు.
పూజా సామగ్రి, పూలు, పండ్లు, పిండివంటలు అన్నీ అందంగా అమర్చారు.
అమ్మవారిని కూడా ఘనంగా అలంకరించారు.
కానీ ఎవరి కి అమ్మవారి పూజ మీద మనసు ఎక్కువసేపు నిలవలేదు.
"రికార్డింగ్ అయిందా?""నా చీర మొత్తం ఫ్రేమ్‌లో ఉందా?""మళ్లీ ఒక్కసారి చేద్దాం. ఈసారి నేను సరిగా నవ్వలేదు."అంటూ ఫోన్ రీల్స్ చుట్టూనే అందరి హడావుడి.
బామ్మ కొంచెం దూరంగా కూర్చుని చూస్తోంది."బామ్మా..." అంటూ వీడియో తీస్తున్న తను "మీరు వీడియో అంతా కవర్ చేసేస్తున్నారు. కొంచెం పక్కకు కూర్చోండి."బామ్మ వెంటనే పక్కకు జరిగింది.సుకన్య ఇంకో రీల్, ఇంకో ఫొటో, ఇంకో వీడియో అంటూ స్నేహితుల హడావుడి తప్ప ఇంక ఏమి గమనించే స్థితి లో లేదు.
అందరూ వెళ్లిపోయిన తర్వాత సుకన్య ఫోన్‌లో ఆ రోజు తీసిన వీడియోలు చూస్తూ కూర్చుంది.అందమైన చీరలు ఉన్నాయి.నగలు ఉన్నాయి.అలంకరణ ఉంది.అందరి నవ్వులుఉన్నాయి.కానీ... ఎదో వెలితి .
వీడియోలో బామ్మను పక్కకు జరగమన్న తన మాట కూడా రికార్డయింది. మనస్సు కలుక్కుమంది. రీల్స్ పిచ్చి లో పడి ఎదో తప్పు చేశానన్న భావం మొదటి సారి అనిపించింది.
మరుసటి రోజు ఉదయం సుకన్య పాత ఫొటో తీసింది.అందులో పిల్లలు, పెద్దలుఅందరి ముఖాల్లో నవ్వులు.ఇందులో ఎవరి చీర బాగుందో, ఎవరి నగలు ఎక్కువో గుర్తులేదు.తాతయ్య నవ్వు ,చిన్నప్పుడు బామ్మ ఒడిలో కూర్చున్నది అందరం కలిసి తిన్న భోజనం గుర్తుంది."
"ఫొటో చిన్నదే . కానీ దాని వెనుక ఉన్న జ్ఞాపకం పెద్దది."అనుకొన్నది.
సుకన్య మనసులో ఆ ఫోటోలో వున్న సహజత్వానికి నిన్న రీల్ లో కనపడిన ఆర్భాటానికి తేడా స్పష్టం గా బోధ పడింది. .
*******
ఒక సాయంత్రం సుకన్య పిల్లలను పిలిచింది.
"రండి బంగారం... ఈ రోజు అందరం కలిసి భోజనం చేద్దాం."
"అమ్మా, ఒక నిమిషం.""అమ్మా, నా ఫ్రెండ్‌తో చాట్ చేస్తున్నాను."అని ఇద్దరూ ఫోన్‌లోనే ఉండిపోయారు.
సుకన్య చేతిలో ఉన్న ఫోన్ వైపు చూసింది.ఒక్కసారిగా బామ్మ ముఖం గుర్తొచ్చింది."మీరు వీడియో అంతా కవర్ చేసేస్తున్నారు..."
కొన్ని రోజుల క్రితం తాను బామ్మను పక్కకు జరిపింది.
ఇప్పుడు తన పిల్లలు తనను పక్కన పెట్టి ఫోన్‌లో మునిగిపోయారు.
తరం మారింది.కానీ దూరం మాత్రం అదే.
ఆమె శ్రీకర్ వైపు చూసింది.
"శ్రీ...""మన అలవాట్లే వాళ్లు నేర్చుకుంటున్నారు కదా..."
"పిల్లలకు మనం ఆస్తులు మాత్రమే ఇవ్వం సుకన్యా... మన తీరు కూడా ఇస్తాం."
ఆ మాట ఆమె గుండెల్లో గుచ్చుకుంది.
బామ్మ ఆరోగ్యం బాగోలేకమంచం మీద పడుకుని ఉంది.సుకన్య కి తన ఫ్రెండ్స్ నుండి మెసేజ్‌లు వరుసగా వస్తున్నాయి.
"సుకన్య త్వరగా రా.""నెక్స్ట్ వీక్ బర్త్‌డే రీల్ ప్లాన్ చేద్దాం.""కొత్త ట్రెండింగ్ సాంగ్ వచ్చింది."సుకన్య ఫోన్‌ను సైలెంట్ చేసి పక్కన పెట్టింది.
బామ్మ కళ్లుతెరిచి "నీ స్నేహితులు ఎదురు చూస్తుంటారేమో."
సుకన్య బామ్మ చేతిని పట్టుకుంది.
"ఈ రోజు వాళ్లు ఎదురు చూసినా పరవాలేదు బామ్మా. నాకు రీల్స్ కాదు ముఖ్యం మీ దగ్గర ఉండాలని వుంది. "బామ్మ ఆమె చేతిని మెల్లగా నిమిరింది.సుకన్య కి మానవతా విలువలు మళ్లీ దరిచేరిన భావం కలిగింది.
****************
కొన్ని రోజుల తర్వాత మళ్లీ వరలక్ష్మి వ్రతం వచ్చింది.
ఈసారి కూడా సుకన్య తన స్నేహితులందరినీ పిలిచింది.
అందరూ వచ్చారు.కొత్త చీరలు కట్టుకున్నారు.పూజా సామగ్రి సిద్ధం చేశారు.
"ఈసారి ఏ రీల్ చేద్దాం?" అని ప్రీతి అడిగింది.సుకన్య నవ్వింది.
బామ్మను పూజ దగ్గర కూర్చోబెట్టింది.
"ముందు మన పెద్దల ఆశీర్వాదం తీసుకుందాం. తర్వాత పూజ చేసుకుందాం."
అందరూ ఒక్కొక్కరుగా బామ్మకు నమస్కరించారు.భక్తి శ్రద్దలతో పూజ చేసారు.
అందరి ముఖంలో ఆ రోజు కనిపించిన చిరునవ్వు కెమెరా కోసం కాదు.ఎవరైనా చూడాలని కాదు.మనసులోంచి వచ్చిన నవ్వు. ఫ్రేమ్‌లో చీరలు, నగలు తో పాటు బామ్మ నవ్వు ఉంది.పిల్లల అల్లరి ఉంది.అందరి మధ్య కనిపించని ఆప్యాయత ఉంది.అంతా సహజంగా జరిగింది.
"జ్ఞాపకాలను దాచుకోవడానికి కెమెరా అవసరం... కానీ జ్ఞాపకాలు అందంగా ఉండాలంటే మనుషుల మధ్య ఆప్యాయత ఉండాలి."అంటూ రీల్‌ను పోస్ట్ చేసింది.
"ఏమిటి సుకన్యా... ఈ రోజు రీల్‌లో ఫిల్టర్ పెట్టలేదే?"అడిగాడు శ్రీకర్ .
"అవసరం లేదు శ్రీ... నిజమైన ప్రేమకు ఎలాంటి ఫిల్టర్ అవసరం లేదు."
కాలం మారవచ్చు.టెక్నాలజీ మారవచ్చు.జీవించే పద్ధతులు మారవచ్చు.మనిషిని మనిషిగా నిలబెట్టేది మాత్రం ప్రేమ, ఆప్యాయత, అనుబంధం అవి ఉన్న చోటే...నిజమైన జ్ఞాపకాలు పుడతాయి.

