అచ్చియమ్మ - అనిసా తబస్సుమ్ sk

Achhiyamma

తెల్లవారుజామున.....అడవి ఇంకా సగం నిద్రలో ఉన్నట్లు కనిపిస్తుంది. చుట్టుపక్కల, చెట్లపైన ఏదో ఒక పలుచటి మంచు దుప్పటి కప్పినట్లుంది. సూర్యుడు ఎక్కడ తగ్గకుండా చెట్ల మధ్యగా బంగారు రంగు సూర్య కిరణాలూ మంచును చీల్చుకుంటూ నేలపై పడుతుంటే,అడవంతా బంగారు రంగు చీర కట్టుకున్నట్లు మెరిసిపోతుంది. సూర్య కిరణాలకు మెల్లగా మంచు కరుగుతూ...ఆకుల చివర్లో వేలాడుతున్న మంచు బిందువులు తొలి వెలుగును తాకి ముత్యాల్లా మెరుస్తూ సెలవు తీస్కుంటున్నాయి. చల్లని గాలి నెమ్మదిగా వీస్తూ, చెట్ల కొమ్మలను మృదువుగా ఊపుతుంటే....నిద్ర లేచిన పక్షులు,అంతవరకు నిశ్శబ్దంగా ఉన్న అడవిలో తీయనైన గొలను ఆరంభించాయి.అడవి తన అందాన్ని నిశబ్ధంగా పరిచయం చేస్తుంది. ఎంతో ప్రశాంతంగా ఉంది. అందమైన కలల లోకంలా ఉంది ఆ ప్రాంతం. ***************** కనుచూపు మేరకు చెట్లు,పచ్చదనంతో ఉన్న ఆ అడవిలో పెళ్లి కూతురి బుగ్గపై అందమైన దిష్టి చుక్కల కనిపిస్తుంది ఒక పాత పూరిగుడిసె. కాదు....కాదు ఏదో నాలుగు వైపులా వెదురు బొంగుల్తో కట్టిన తడికెలు,దానికి పై కప్పులా....ఎండుగడ్డి, దానిపై ఒక నల్లటి కవరు కప్పి ఉంది చేనుమకాం( గూడెంకి దూరంగా పొలం/చేనుకు కాపలాగ ఉండడం కోసం ఏర్పరుచుకుని చిన్న పూరిగుడిసె లాంటిది).గట్టిగ గాలి వీస్తే పడిపోయేలా,ఎంతో అసౌకర్యం ఉంది ఆ మకాం. ఆ మకాంకి తలుపులు బదులుగా కొన్ని వెదురు బద్దెలను పేర్చికట్టిన తడికెను పక్కకు జరుపుకొని బయటకు వచ్చింది ఓ ఎనభై ఏళ్ళ ముసలమ్మా. చూడడానికి చాల బక్క పలుచగా ఉంది, నిటారుగా నిలబడడానికి బలంలేక కొంత వంగిపోయి ఉంది. ముడతలు పడ్డ ముఖం,రేపటి గురించి ఎటువంటి చింత, ఆశ లేని కళ్ళు, ముక్కపై గుండ్రటి పెద్ద ఎనిమిద రాళ్ల బెసరి, చిరునవ్వు లేని ముఖం,కొంచం మురికి పట్టిన జాకెట్టు,పాత కాటన్ చీర (గోచి కట్టు కట్టింది),ఆ సన్నటి బలంలేని కళ్ళకు రెండు లావు వెండి కడియాలు...ఈ ముసలమ్మే అచ్చియమ్మ. ******************* చేతిలో దువ్వెన పట్టుకొని మెల్లగా అడుగులు వేస్తూ మకాం పక్కనే ఉన్న చెట్టు కింద, తుమ్మమొద్దుపై కూర్చుంది అచ్చియమ్మ. ఆ పక్షుల కిలకిలలు వింటూ జుట్టు దువ్వుకుంటుంది.తన దిన చర్య మొదలు పెట్టడానికి. అచ్చియమ్మకు తన చిన్న వయస్సులోనే రాజయ్యతో పెళ్లి జరిగింది.అచ్చియమ్మకు పెళ్ళయాక, అందరి ఆడవాళ్ళలానే కుటుంబాన్ని చూసుకుంటూ,భర్తకు సహాయంగా వారి సొంత పొలంలోనే కలిసి పనిచేసుకునే వారు.అచ్చియమ్మ జీవితం ఆనందంగా,సాఫీగానే సాగుతుంది. అచ్చియమ్మ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు,ఇద్దరు మగపిల్లలు,ఒక్క అమ్మాయి.కాలంతోపాటు పిల్లలు కూడా పెద్ద వాళ్ళు అయ్యారు.ముగ్గురు పిల్లలకు పెళ్లిళ్లు చేసింది.ఇద్దరు కొడుకులు కూడా వేరు కాపురాలు ఉంటున్నారు. అచ్చియమ్మ,తన భర్త, పూటకు ఇంత ఉడకేసుకొని తింటూ,పొలం చూసుకుంటూ, పండించిన వాటిని సంతకు తీసుకువెళ్లి, అమ్ముకొని, వచ్చిన ఆ కాస్తో...కూస్తో డబ్బుతో కాలం వెళ్లబుచ్చేవారు. ************ కాలం కరిగిపోతూనే ఉంది. రాజయ్యకు ఆనారోగ్య సమస్య రావడంతో ఇదివరకులాగా,పనులు చేయలేక పోతున్నాడు.పొలం పనులంతా అచ్చియమ్మ ఒక్కతే చూసుకో లేకపోతుంది.తనకు చేతనైనంతలో నెట్టుకొస్తోంది.ఏమీలేని రోజు...అడవికి వెళ్లి దుంపలో, ఆకుకూరలో తెచ్చుకొని ఆ పూటకు ఏదో ఒకటి వండుకొని తినేవాళ్లు. పిల్లాపాపలతో ఒక మంచి కుటుంబం ఉన్న, ఎవరు లేని ముసలి పక్షుల్లా మిగిలిపోయారు రాజయ్య,అచ్చియమ్మ. గడుస్తున్నా కాలాన్ని దృష్టిలో పెట్టుకొని,ముందు ముందు పరిస్తుతులు ఎలా ఉండబోతాయోనని గ్రహించిన రాజయ్య, తన పేరుమీద మీద ఉన్న పది ఎకరాలు భూమిని అచ్చియమ్మ పేరుమీదకు మార్చేశాడు. అచ్చియమ్మకు చదువులేదు,ఒక్క రోజైన బడి ముఖం చూసి ఎరుగదు.చాలా అమాయకురాలు అచ్చియమ్మ. తన కుటుంబం,తన గూడెం,ఆ అడవి,ఇదే అచ్చియమ్మ ప్రపంచం.తమ పొలంలో పండించిన చిరుధాన్యాలని....చిన్న చిన్న మూటల్లో వేసుకొని, దాదాపు మూడు కిలోమీటర్లు కొండా కింద ఉన్న గిరిజన సంతకు తెల్లారుజామునే ఆ ముసలి దంపతులు కాలినడకన వెళ్లి అమ్మగా, వచ్చిన ఆ కొంత డబ్బుతో వారికీ సరిపడా కూరగాయలు,నూనె, ఉప్పులు,పప్పులు తెచుకునేవారు. ************* అచ్చియమ్మకు వయస్సు మీద పడడంతో తాను ఒక్కతే పొలం పనులు చేసుకోలేకపోతుంది. రాజయ్యకు ఆరోగ్యం రోజు రోజుకు క్షిణిస్తుంది. ఇంటి పట్టునే ఉంటున్నాడు రాజయ్య. ఈ ముసలి దంపతులు ఎలా ఉన్నారో అని తిరిగి చూసే దిక్కులేకుండా పోయింది. అచ్చియమ్మ కూలి పనులకు వెళ్లడం మొదలు పెట్టింది. పనులేమీ లేనప్పుడు అచ్చియమ్మ అడవిలోకి వెళ్లడం.... కాయ,దుంప తీసుకురావడం,అచ్చియమ్మ ఒక్కతే అంత కష్టపడడం చూడలేకపోయిన రాజయ్య, అనారోగ్యంతోనే పొయ్యిలోకి కట్టెలు తీసుకురావడం లాంటి చిన్న చిన్న పనులు చేసేవాడు.ఆలా ఆ పూటకు వొండుకొని తినేవారు. అదే వర్షాకాలం అయితే వారికీ పూటగడవడం కూడా ఇంకా కష్టంగా ఉండేది. చేయడానికి పనులు దొరక్క, వండుకోడానికే ఏమి లేక పస్తులు ఉండేవాళ్ళు అచ్చియమ్మ,రాజయ్య. కష్ట కాలం ఎక్కువైంది. రాజయ్య ఆనారోగ్యంతో కన్నుమూశాడు. అచ్చియమ్మ ఒంటరిదైంది. ఆ వృధాప్య వయస్సులో బిక్కు బిక్కుమంటూ అతికష్టంగ జీవితాన్ని నెట్టుకొస్తోంది అచ్చియమ్మ. తన కడుపు నింపుకోడానికి పనికి వెళ్ళక తప్పలేదు. కాఫీ తోటల్లో, మిరియాల తోటల్లో కూలిపనులకు వెళుతుంది. కష్టం చేసే ఓపిక లేక తనకున్న భూమిని కౌలుకిచ్చి బ్రతుకుదాం అనుకుంది,కానీ అప్పటికే ఆలస్యం అయింది. మూలిగే నక్క పైన తాటాకు పడ్డట్టు....అచ్చియమ్మ పక్షాన మాట్లాడేవారు లేరని, ఆవిడకు అక్షర జ్ఞ్యానం లేదని,అచ్చియమ్మ పది ఎకరాల భూమిని ఎవరో అన్యాయంగా లాక్కున్నారు. జరుగుతుంది చూస్తున్న జనాలు ఐయ్యో పాపం అన్నారేగాని అచ్చియమ్మకు మద్దతుగా నిలిచినా వారెవర్రు లేరు.విషయం పాతబడింది,ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. ఎలాగో కాళ్ళీడ్చుకుంటూ...ఎవరిపై ఆధారపడకుండా మిగిలిన జీవిత కాలాన్ని వెళ్లబుచ్చుతుంది అచ్చియమ్మ. ఉన్న కష్టాలు సరిపోవంటు కోతకష్టం వచ్చిపడింది అచ్చియమ్మకు.చివరికి తాను ఉంటున్న ఇంటినికూడా తన రక్తసంబంధీకులే లాక్కున్నారు,దిక్కులేని ఒంటరి పక్షి అయింది అచ్చియమ్మ. *************** గూడెంకు కొద్దీ దూరంలో అడవిలో ఉంటున్న అచ్చియమ్మ అన్న,వదినకు జరిగిన విషయం తెలిసింది. వాళ్ళుకూడా ముసలి దంపతులైన,వాళ్ళు ఆ ముసలి వయస్సులో ఎవరిపై ఆధారపడకుండా,కష్టం చేసుకుంటూ బ్రతుకుతున్నారు. అలాగని అచ్చియమ్మను ఆలా ఒంటరిగా వదిలేయ లేకపోయారు. వారితోపాటు అచ్చియమ్మను కూడా అడవిలోకి తీసుకువెళ్లారు. వారి పూరిగుడిసెకు రెండడుగుల దూరంలోనే ఒక పాత మకాం ఉంది.అచ్చియమ్మను ఆ మకాంలో ఉంచి, వారు పనిచేసే ఆ తోట యజమానికి అచ్చియమ్మ గురించి చెప్పి ఒప్పించి , అదే తోటలో అచ్చియమ్మను పనికి కుదిరించారు అచ్చియమ్మ అన్న,వదిన. ఆ చేనులో, తోటలో, తన చేతనైన పని చేసుకుంటు,ఆ మకాంలోనే వండుకొని,తింటుంది అచ్చియమ్మ. కొంత కాలానికి అచ్చియమ్మకు తోడుగా రెండు పెంపుడు అడవి కుక్కలు అలవాటు అయ్యాయి.అచ్చియమ్మ వాటిని ఎంతో ప్రేమగా చూస్కుంటూనేది, అవికూడా అంతే విశ్వాసంగా అచ్చియమ్మకు కాపలాగా ఉండేవి. పురుగులు,పాములు,ఎమన్నా ఇతర జంతువులు వచ్చినా వెంటనే పసిగట్టేవి.ఇవేకాకుండా అచ్చియమ్మ ఓ మూడు,నాలుగు కోళ్లను కూడా పెంచుకుంటుంది.ప్రతిరోజు అవి గుడ్లను ఇచ్చి అచ్చియమ్మకు కృతజ్ఞత తెలుపుకుంటాయి.ఆ రెండు కుక్కలు,కోళ్లు కూడా అచ్చియమ్మతో పాటు ఆ మకాంలోనే ఉంటాయి. *********** తాను పనిచేసినందుకు డబ్బుకి బదులుగా, తిండి పెట్టేవారు...ఆ తోట యజమానులు. గుడెంనుంచి అడవిలోకి వచ్చాకే కొంచం ప్రశాంతంగా ఉంటుంది అచ్చియమ్మ. పగలంతా పనులు చేసుకొని,సాయంత్రం కాసేపు చలిమంట వేసుకొని కూర్చొని....అచ్చియమ్మ ,తన అన్న,వదిన, ఆ కబుర్లు,ఈ కబుర్లు చెప్పుకుంటూ...అడవిలో దొరికే పనసపండు ద్రవ్యాన్ని పుచ్చుకునే వారు. ఎప్పుడైనా అచ్చియమ్మకు సుస్తీ చేసిన, ఆ పూటకు తన వదినే ఇంత వండి పెట్టి చూసుకునేది. ఇద్దరు చేదోడు వాదోడుగా ఉండేవారు.ఎపుడైనా చేపలు పట్టడానికైనా,కూరలకు తెచ్చుకోవాలి అనుకున్న అడవిలోపలికి వెళ్లేవారు అచ్చియమ్మ,తన వదిన. తాగడానికి,వండుకోడానికి నీళ్లు కావాలంటే మాత్రం ప్రతిరోజు కొండా కిందకు దిగి,అక్కడ వచ్చే ఊట నీళ్లను పట్టుకొని,ఎమన్నా వంట పాత్రలు,గిన్నెలు ఉంటె అక్కడే కడిగి,శుబ్ర పరుచుకొని,పట్టిన ఆ ఊట నీళ్ల బిందెను తలపై పెట్టుకొని కాలినడకనే తిరిగి వెళ్లేవారు.ఇక వర్షాకాలంలో అయితే వాళ్ళు పడే కష్టాన్ని చెప్పనక్కర్లేదు. ఇప్పటికి అచ్చియమ్మ భర్త కాలం చేసి పది సంవత్సరాలు అవుతుంది.ఇన్నేళ్ళగ తన అన్న,వదిన తప్ప,ఆమెను పలకరించినవారు లేరు. అయినా ఇవేమి లెక్క చేయకుండా,అచ్చియమ్మ తన శేష జీవితాన్ని ఆ అడవి ఒడిలో ఒక పసిపాపలాగా గడుపుతుంది. అక్కడ ప్రాంతాన్ని చుట్టూ చూసుకొని,జుట్టు దువ్వుకొని,కొప్పు ముడి పెట్టుకుంది. మెల్లగా లేచివెళ్లి ఓ నాలుగు పుల్లలు పొయ్యిలో పెట్టి,నిప్పు రాజేసి కొంత రాగి అంబలి కాచుకొని తాగింది. కొంత తాను పెంచుకునే కుక్కలకు పోసింది.కోళ్లకు,కోడి పిల్లలకు కొని జొన్నలు జల్లి, ఆ పూరిగుడిసె ద్వారానికి తడికను అడ్డుపెట్టి తోట వైపు అడుగులు సాగించింది అచ్చియమ్మ. *******

మరిన్ని కథలు

5G premalu
5G ప్రేమలు
- మండా. సూర్యనారాయణ
Punarujjeevanam
పునరుజ్జీవనం
- డా:సి.హెచ్.ప్రతాప్
59 rujulu
59 రోజులు
- డా:సి.హెచ్.ప్రతాప్
Kulavrutti
కులవృత్తి
- ARADHYULA Pranav
Santrupthi
సంతృప్తి
- మండా సూర్యనారాయణ
Sanmanam
సన్మానం!
- బొల్లిముంత వెంకట రమణా రావు
Apramatthata
అప్రమత్తత
- డా:సి.హెచ్.ప్రతాప్
Samskaram
సంస్కారం
- మద్దూరి నరసింహమూర్తి