పెళ్లి చూపుల పదనిసలు - సంధ్య కార్తీక్

Pellichoopula padanisalu

రమ్య ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసి కాలేజీ లో లెక్చరర్ జాబ్ కొరకు వేటలో పడింది. తను అందరిలా సాఫ్ట్వేర్ ఉద్యోగాల వైపు మొగ్గు చూపలేదు - కంప్యూటర్స్ తో రోజు మొత్తం జీవించడం నచ్చని పని అని తెలుసుకుంది.

జాబ్ వచ్చేవరకు ఖాళీగా ఉండటం ఎందుకని ట్యూషన్స్ చెప్పడం మొదలు పెట్టింది.

అల్లరి, అందం

ఇంకా

చలాకీతనం కలబోసిన అమ్మాయి.

పెద్ద కళ్ళు , తీరైన ముక్కు మరియు పెదాలపై చెరగని నవ్వుతో అందరినీ ఆకర్షించే రూపం తనది.
శ్రీధర్ కు ఒక్కతే కూతురు అవ్వడం తో అల్లారు ముద్దుగా పెంచాడు .
రమ్య పెళ్లీడు కొచ్చినoదువల్ల తెలిసిన వాళ్ళందరి తో సంబంధాలు ఏమన్నా ఉంటే చెప్పమని శ్రీధర్ విచారించ సాగాడు .
రమ్యకు టీచింగ్ చాలా ఇష్టం, ఖాళీగా ఉండకుండా ట్యూషన్స్ చెప్పడం మొదలు పెట్టింది. తను బి.టెక్. చదివినా టీచింగ్ ప్రొఫెషన్ చేపట్టాలని తన ఆశ.

రమ్య వాళ్ళ నాన్న యండమూరి వీరేంద్రనాథ్ వీరాభిమాని. ఆయన రాసిన " వెన్నెల్లో ఆడపిల్ల" చదివి రమ్యకు ఆ పేరు పెట్టుకున్నాడు.

ఒకరోజు రమ్యను వాళ్ళ నాన్న పిలిచి “నీకో మంచి సంబంధం వచ్చింది తల్లీ , వాళ్ళు ఎల్లుండే పెళ్ళిచూపు లకు వస్తా అన్నారు ” అని చెప్పాడు.

రమ్య : “ఎల్లుండా ! అస్సలు ఇప్పుడేమి ముంచుకొచ్చిందని ఈ హడావిడి, నాకు ఇంకా కొంచం వ్యవధి కావాలి నాన్నా ! ఉద్యోగం వచ్చిన తర్వాత చూద్దాం”.

అక్కడే ఉన్న వాళ్ళ అమ్మ “ మనకు తెలిసిన వాళ్ళ ద్వారా వచ్చిన సంబంధం,ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి, పెళ్లి తర్వాత ఉద్యోగమే చేసుకుంటావో , రాజ్యాలు ఎలుతావో నీ ఇష్టం, మనం అనుకున్నప్పుడు ఇలాంటి సంబంధాలు మళ్ళీ మళ్ళీ రావు “

రమ్య : “నాన్నా ! మొన్ననే చదువు పూర్తి చేశాను, ఉద్యోగ వేటలో ఉన్నాను, నన్ను కొన్ని రోజులు ఇలా ఉండనివ్వండి, మీకు అప్పుడే అంత భారమైపోయానా ?”

అప్పుడు శ్రీధర్ భార్య మణి ని కాసేపు ఊరికే ఉండమని సైగ చేసి తాను ఇలా చెప్పాడు

“అలా కాదు రా తల్లి ! ఏ తల్లి తండ్రులకు ఏ పిల్లలు బరువు , భారం కారు. కానీ వాళ్ళ కూతురును ఒక మంచి ఇంటికి అప్పగించాలనే తపన.

ముందు వాళ్ళను వచ్చి వెళ్లనీ, తరువాత నీ అభిప్రాయం చెబుదువుగాని, మేము నిన్ను ఒప్పుకోమని బలవంత పెట్టo . నీకు అంతా నచ్చితేనే ముందుకు వెళ్దాం” అని చెప్పాడు.

శ్రీధర్ మాటలకు రమ్య ఏదో తలూపింది కానీ ఈ విషయం మాట్లాడిన్నపటినుంచి తన మనసు మనసులో లేదు. అప్పుడే పెళ్లి ఏంటి ? అంటే అమ్మా నాన్నలను వదిలేసి వేరొకరి ఇంటికి వెళ్ళాలి, అస్సలు ఈ ఆలోచనే తనకు నచ్చలేదు, ఆ వచ్చే అబ్బాయి వాళ్ళతో ఏం మాట్లాడాలో? ఏమి ప్రశ్నలు వేయాలో? ఏ ప్రశ్న వేస్తే ఎలా తీసుకుంటారో ? అసలు తను ఒకేసారి పెళ్లి పేరుతో కొత్త ప్రపంచం లో అడుగు పెట్టాలా?

తను జీవితాన్ని పంచుకోవడానికి సిద్దంగా ఉందా ?

ఇలా ఎన్నో ప్రశ్నలు తన మదిలో మొదలయ్యాయి . ఎప్పుడూ గలగలా మాట్లాడే రమ్య ఆ రెండు రోజులు మౌనoగా ఉండడానికి ఇష్టపడింది. అంతేనా ,

గుండెల్లో రేగిన ఆలోచనల తుఫానును

దారి మళ్లించడానికి స్నేహితురాలు ఇంటికి కాసేపు వెళ్ళి తన గోడు వెళ్ళబొసుకొని వచ్చింది . ఒక వేళ అంతా సవ్యంగా సాగితే తాను కొన్ని రోజుల్లో వేరే దేశానికి వెళ్లాల ? ఎవ్వరికీ కనిపించని ఒక తెలియని భారాన్ని మోస్తున్నట్లు అనిపించింది రమ్యకు .

పెళ్లి చూపుల ముందు రోజు రాత్రి రెప్పవాల్చకుండా ఒకే చోట చూస్తూ అంతుచిక్కని ఆలోచనలలో మునిగిపోయి ఎప్పుడో తెల్లవారుజామున కునుకుతీసింది.

లేవగానే మణి రమ్యను చూసి “ ఇలా ఉన్నావేoటీ? హాయిగా తల స్నానం చేసిరా “ అoది, అసలే చికాకులో ఉన్న రమ్య “వాళ్ళెవరో వస్తారంటే నేను ఎందుకు తల స్నానం చేయాలి “ ఆo ది కోపంగా. ఈ విషయంలో అక్కడే ఉన్న వాళ్ళ నాన్న కూడా అమ్మకు వత్తాసు పాడటంతో చేసేదేమీలేక

ఆ పని అయిష్టoగానే ముగించింది . తనకిష్టమైన రెండు పనుల గురించి అబ్బాయిని ప్రశ్నించాలని అని తీర్మానించుకుంది.

ఇంతki రమ్యకు వచ్చిన సంబంధం
గిరిది. గిరి ఇండియాలో బి.టెక్. చదివి అమెరికాలో ఎమ్మె. స్. చేసి అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు.
20 రోజులు లీవ్ పెట్టుకుని, దానిలోనే వారం రోజుల్లో పెళ్లి చూపులు , మరో వారం రోజుల్లో పెళ్లి చేసుకుని వెళ్లాలని స్వదేశానికి ఎగిరి వచ్చాడు.

పెళ్లి చూపులకు అబ్బాయి వాళ్ళ కొరకు స్వీట్లు , హాటు, పండ్లు తెచ్చి పెట్టాడు శ్రీధర్. రమ్య అమ్మ కాఫీ కొరకు ఫిల్టర్ లో ఫ్రెష్ గా డికాషన్ వేసి పెట్టింది .
రమ్య ఎక్కువగా తయారవ్వడం ఇష్టపడని పిల్ల. వాళ్ళ అమ్మ మధ్యాహ్నం నుంచి చెప్తున్నా "నేను సింపుల్ గానే ఉంటా, నన్ను ఇష్టపడే వాళ్ళు ఇలానే ఇష్టపడాలి" అని సమాధానం.
శ్రీధర్ కూడా "అమ్మాయి ఇష్టం, ఎక్కువగా ఇబ్బంది పెట్టొద్దు" అని అన్నాడు.

గిరి వాళ్ళు ఆ రోజు సాయంత్రం పెళ్లిచూపులకు వచ్చారు. గిరి రమ్యలు పర్సనల్ గా మాట్లాడుకోమని పెద్దవాళ్లు చెప్పారు.

చిరునవ్వు కరువై రమ్య కళ్ళల్లో ఏదో తెలియని ఆందోళన స్పష్టంగా తెలుస్తుంది.

గిరి మొదట తన చదువు ,ఉద్యోగం గురించి చెప్పాడు. పోయిన ఏడాది వచ్చి పెళ్లి ఫిక్స్ చేసుకొని ఈ ఏడాది పెళ్లి చేసుకుందామనుకున్నాడు కానీ పోయిన సవత్సరం 9/11 (attack) ఎటాక్ తో తన ప్లాన్ అంతా

తారుమారయ్యింది అని, ఈ సంవత్సరమే అన్నీ ఒకేసారి పెట్టుకోవాల్సి వచ్చింది అని చెప్పాడు.

రమ్య కు తన ప్రశ్నలు ఎప్పుడెప్పుడు గిరిని అడుగుదామని మనసులో ఉండింది, గిరి తాను చెప్పాల్సింది చెప్పి , రమ్య వైపు చూసిన వెంటనే చట్టుకున

“ కథలు రాసే వారి పై మీ అభిప్రాయం? “ అని అడిగింది.

"కథలు కల్పితం రమ్య! చిన్నప్పుడు ఎవరన్నా కథలు చెప్తే నిజం అనుకునే వాడిని, అవి జీవితానికి ఏమి పెద్దగా ఉపయోగపడవు, ప్రాక్టికల్ గా ఉండే స్కిల్స్ , టిప్స్ ఎక్కువ గా ఇష్టపడతాను”.

“చదివితే కూడా ఇంగ్లీష్ నోవెల్స్ ఒకటి రెండు చదివాను. నాకు సినిమా కథలు కూడా పెద్దగా నచ్చవు రమ్య “.

“ టీచింగ్ మీద మీ అభిప్రాయం” అని ఇంకో ప్రశ్న వేసింది రమ్య
" ఏమో రమ్య ! ఎందుకో గొప్ప అభిప్రాయం లేదు, స్కూల్లో పాఠాలు చెప్పే పంతులమ్మకు ఆఫీసులో సాఫ్ట్ స్కిల్ ట్రైనర్ అని చెప్పడానికి ఎంతో తేడా ఉంది, ఇండియాలో ఎక్కువ శాతం మహిళలు సెలవులు ఎక్కువగా ఉంటాయనీ, పని వేళలు వెసలు బాటుగా ఉంటయాని స్కూల్లో జాయిన్ అవుతారని నా అభిప్రాయం. బయట దేశంలో అయితే వాళ్ళు బోధనా శిక్షణ తీసుకోవాల్సిందే. ఇక్కడ వేరే వృత్తుల కంటే వీలుగా ఉంటుందని మహిళలు చేపడతారని నా అభిప్రాయం. ఇండియా లో చాలా కొద్దిమంది బోధించడం ఇష్టంతో చేస్తారని నేను గమనించాను”.
రమ్యకు కాసేపు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు, బి. టెక్ చేసినా తనకు ఎంతో ఇష్టమైన పని కథలు రాయడం, పాఠాలు చెప్పడం, కానీ ఆ రెండిటి మీద అతని అభిప్రాయం ఎందుకో మనసుకు బాధ కలిగించింది.
గిరి ఇంకేమైనా అడుగుతారా అంటే ఇంకేమీ మాట్లాడలేకపోయింది.

వాళ్లు వెళ్లిపోయిన తర్వాత "నాన్నా! నేను పెళ్ళికి అస్సలు సిద్దంగా లేను , పై పెచ్చు ఆ అబ్బాయి అభిప్రాయాలు నాకు అస్సలు నచ్చలేదు, నాకు ఈ సంబంధం వద్దు అని చెప్పింది ,ఈ సంబంధమే కాదు నాకౌ కొన్ని రోజులు ఏ సంభంధాలు వద్దు “ అని తెగేసి చెప్పింది .
“ఎందుకు తల్లి ! ఈ నిర్ణయం తీసుకున్నావు?” అని అడగ్గా
" కలానికి కాగితానికి చాలా అవినాభావ సంబంధం ఉంది నాన్నా! కలం కాగితంపై కదలాలంటే అంటే ఎన్నో అనుభవాలు, ఎన్నో ఆలోచనలు రూపుదిద్దుకొని రాసే వాళ్ల మనస్సును తెలుపుతాయి.కొందరిని ఆ కథలు ఆలోచింప చేస్తాయి,మరి
కొందరు వాటిని చదివి స్ఫూర్తి కూడా పొందుతారు,

ఇంకొoదరిని ఆ కథలు ఆలోచింప చేస్తాయి.
నాకు ఇష్టమైన రెండు పనుల మీద తనకు గొప్ప సదభిప్రాయం లేదు, నన్ను చూసి అది మారుతుందని ఆశ లేదు. ఒక కొత్త మనిషి తో మాట్లాడినప్పుడు
ఒక పాజిటివ్ వైబ్ అన్నా రావాలి, లేదా కంఫర్ట్ జోన్ లో ఉన్నామన్న ఫీల్ రావాలి నాకు ఏదీ కలగలేదు".
ఇది విన్న వాళ్ళ అమ్మ
" అది చెప్పడం మీరు వినడం, బానే ఉంది వ్యవహారం , మనప్పుడు ఈ పాజిటివ్ వైబ్స్ , కoఫర్ట్ జోన్ లు లేవే" అo ది.
"మణి! నన్ను అలోంచించననీ " అన్నాడు శ్రీధర్ . ఎందుకో తనకు రమ్య అన్ని విషయాలలో సరైన నిర్ణయం తీసకుoటుంది అని గట్టి నమ్మకం ఉంది.
గిరి వాళ్లకు ఫోన్ చేసి " ఈ కొద్ది వ్యవధి లో పెళ్ళికి మా అమ్మాయి అంత సుముఖత చూపట్లేదండి " అని చెప్పాడు .

తను చెప్పే ట్యూషన్స్ లో నిమగ్నమయ్యింది రమ్య. తాను సాఫ్ట్ స్కిల్స్ కోర్సుల (course) లో కూడా శిక్షణ తీసుకోవడము మొదలు పెట్టింది.

నాలుగు నెలలు గడిచిన తర్వాత

వాళ్ళ పక్కింటి పిన్ని గారి బంధువుల సంబంధం అని రమ్య ను పెళ్ళిచూపూలకు ఒప్పించారు శ్రీధర్ ,మణిలు.

ముందు రోజే పిన్ని గారు వచ్చి పెళ్లికొడుకు విజయ్ ను , వాళ్ళ కుటుంబాన్ని చాలా పొగిడి వెళ్లారు . ఈ సంబంధం కుదిరితే రమ్య అంత అదృష్టవంతురాలు ఇంకెవ్వరు ఉండరని అని ఆమె అభిప్రాయం వెల్లడి చేసారు.
విజయ్ బిట్స్ పిలానీలో ఇంజనీరింగ్ చేశాడు. సoప్రదాయాలు, పట్టింపులు, మడి ఆచారం గల కుటుంబం .
పెళ్లి చూపుల్లో ఉన్న స్వీట్స్, హాట్ ఏది కూడా ముట్టలేదు , గతికితే అతకదు అని వాళ్ళ నమ్మకం.

రెండోసారి రమ్య మరీ సింపుల్ గా ముస్తాబయింది.

ఈసారి రమ్య అంత ఆందోళన చెందక పోయినా మదిలో ఎన్నో ప్రశ్నలు వెంటాడుతూనే ఉన్నాయి.విజయ్ కాసే పు మాట్లాడిన విధానం, విషయాలు రమ్యకు బాగానే అనిపించాయి, ఇంతలోనే తాను వేసిన ప్రశ్నలు రమ్యను ఆలోచింపజేశాయి.


" మీ దృష్టిలో జీవితం అంటే ఏంటి?"
అని అడిగాడు.
రమ్య ఏంటి ఈ ప్రశ్న? అనిలోలోపల నవ్వుకొని,కొద్దిగా ఆలోచించి
"జీవితమంటే కష్టాలు, సుఖాలు, బంధాలు, బాంధవ్యాలు, మన ఆశలు, అనుభవాలు “ అంది చిరునవ్వుతో . తను ఎప్పుడూ ఇలాంటి ప్రశ్నకు జవాబు ఇవ్వలేదు. తనకు తోచిన మాటలన్నీ కలబోసి చెప్పినందుకు తనకే నవ్వొచ్చింది.

ఆ రోజు ప్రొద్దున వాళ్ళ అమ్మ రమ్య చేత కొన్ని బట్టలు ఉతికించింది - అదే జీవితం, అని చెబుదాం అనుకుంది.
తను మాట్లాడదామనుకునేసరికి విజయ అందుకొని
"మీ ఇంట్లో కూడా మడి ఆచారాలు పాటిస్తారా?"
మీకు ముగ్గులు వేయడం వచ్చా ?
తెలుగు బాగా చదివగలరా, రాయగలరా?
అని ప్రశ్నల వర్షం కురిపించాడు.

ఈ ప్రశ్నలు విని రమ్యకు ఏదీ నోటితో జవాబు చెప్పాలని అనిపించలేదు . తల ఊపేసి ఇంక ఏమీ మాట్లాడకుండా ఉండిపోయింది.

ఈ 21 వ శతాబ్దం లో కూడా ఇద్దరు కలిసి ఉండాలంటే ఇలాంటి ప్రశ్నలకు జవాబులు కొలమానమా? అని అలోచనలో పడింది.
వాళ్లు వెళ్లిపోయిన తర్వాత వాళ్ళ నాన్నగారు అడగకుండానే "నాన్నా! తొందరపడకండి , నన్ను కొన్ని రోజులు స్వేచ్చతో ప్రశాంతముగా బ్రతకనివ్వండి ఈ అబ్బాయి చాలా చదువుకున్నాడు, కానీ జీవితాన్ని చదవలేదు. ముగ్గులు , మడి, ఆచారం ఇవే లోకం అనుకుంటూ ఉన్నాడు, తను పెరిగిన వాతావరణo అటువంటిది మరి. చదువు తప్ప వేరే ధ్యాస ,లోకo లేనట్టుంది.
ఈ సంబంధం వద్దు" అని కరాఖoడిగా చెప్పింది.

రమ్య వాళ్ళ అమ్మ ఉవ్వెత్తున్న లేచి కోపం తో "తండ్రి -కూతురు చేరి వచ్చిన సంబంధాలన్నీ ఏదో ఒక వంకతో తెగ్గొడుతున్నారు. ఇంక మన పిల్లకు పెళ్లి అయినట్టే,అలాంటి ప్రశ్నలు వేస్తే నీ కొచ్చిన ఇబ్బందే మేటో ?

అయితే నేను పెళ్లి చేసుకొని స్వేచ్చ లేకుండా బతుకుతున్నానా? ఇంక నీకు పెళ్లి అయినట్టే, అంది.

తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లు అనేవాళ్ళతో చాలా కష్టం .

అప్పుడు శ్రీధర్ అందుకొని "చూడు మణి! అమ్మాయి ఆస్తులు, అంతస్తుల కొరకు, చదువు కొరకు, విదేశాలకు వెళ్లడం కొరకు, ఆడబిడ్డల కొరకు అబ్బాయిలను కాదనటలేదు , తన ఆలోచనా విధానం పై, తను మనుషులను అంచనా వేయడంపై నాకు పూర్తి నమ్మకం ఉంది “.
“ఇరవై రెండేళ్ళు పెంచిన వాళ్ళము, కొంచెం ఓపిక పట్టకుండా, తొందరపడి ఎవరో ఒకరి చేతిలో పెట్టాలి అని అనుకోవటo సబబు కాదు . సమయం వచ్చినప్పుడు నిజంగానే తను చెప్పేది నాకు సబబుగా తోచకపోతే నేనే తనతో మాట్లాడతాను, తను మన మాటకు విలువ ఇస్తుంది. కొంచెం ఆవేశ పడొద్దు, తల్లిగా నీ ఆతృత నేను అర్ధంచేసుకోగలను" అని శాంతపరిచాడు .

అడపాదడపా కొన్ని సంబంధాలు వచ్చినా అవి అర్హతలు ,జాతకాలు వంటి కారణాల వల్ల పెళ్లి చూపుల దాకా రాకుండానే ఆగిపోయాయి . రమ్య (subjects) సబ్జెక్ట్స్ సులువు గా చెప్పే పద్దతి రమ్యకు మంచి పేరు, డబ్బు తెచ్చిపెట్టాయి. వాళ్ళ అమ్మకు రమ్య పెళ్లి గురించి లోలోన చింత ఉన్నా , రమ్య పిల్లలతో మరియు వాళ్ళ పేరెంట్స్ తో వ్యవహరించే పరిణితి, తీరు చూసి కాస్త ధైర్య పడేది.
కొన్ని రోజుల తర్వాత అభినవ్ అనే అబ్బాయి సంబంధం వచ్చింది. అభినవ్ ఎం.బీ.ఏ. చేసి ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. చామన ఛాయ,కోమల రూపం తనది.
ఆరోజు కూడ రమ్య వాళ్ల నాన్న స్వీట్, హాట్ , పండ్లు తెచ్చి పెట్టారు, రమ్య "వచ్చిన వాళ్ళందరికీ ఇవి ఇవ్వాలా నాన్నా ?" అని కొంచెం కోపంగా అడిగింది.
"దానిదేముంది తల్లి! సంబంధం కుదిరి నా కుదరకపోయినా వాళ్లు మన ఇంటికొచ్చిన అతిధులు , కొంచెం మర్యాద చేయడం మన పద్ధతి"అని అన్నాడు.

అమ్మా ! నన్ను మటుకు అందరికి కాఫీ ఇవ్వమని పురామీoచవద్దు అని చెప్పింది .

అభినవ్ వాళ్ళు రానే వచ్చారు. రాగానే శ్రీధర్ మణిలతో అభినవ్ వాళ్ళ అమ్మ, నాన్న చాలా కలవిడి గా మాట్లాడారు. అందరూ సరదాగా కలిసిపోయారు. కాఫీ లు ఇవ్వమని కూతురుకు చెప్పకుండా తానే స్వయo గా ఇచ్చింది మణి , అప్పుడు మణి చేయి తొణికి అభినవ్ వాళ్ళ అమ్మగారు చీర మీద కొంచెం కాఫీ పడింది. మణి ఖoగారు పడిపోయి బట్టను తడి చేసి తెచ్చి తుడుచుకోమని చేతికి ఇవ్వగా , అభినవ్ వాళ్ళ నాన్న “మరక మంచిదే , సర్ఫ్ ఎక్సెల్ వాడు “ అంటే అభినవ్ అమ్మ చిరుమందహాసంతో “ఈ చీర మెరుపు కోసం రిన్ వాడుతాను” అనే సరికి అభినవ్ అందుకొని “అమ్మా మనది సంస్కారవంతైన కుటుంబం నీవు xxx వాడాలి “ అని అన్నాడు. ఒక్కసారిగా అందరూ నవ్వారు. రమ్య కు ఇంత ఇబ్బందికరమైన వాతావరoలో చిరు సరదా వ్యాఖ్యలు చేసి అందరి మొహాల్లో చిరునవ్వు తెప్పించారు అని తెలియకుండానే ఆ కుటుంబo పై ఒక సదభిప్రాయం కలిగింది.

అభినవ్ , రమ్య ను వెళ్ళి మాట్లాడుకోమన్నపుడు కూడా అభినవ్ అమ్మ వచ్చి రమ్య తో “నీవు ఏమి మాట్లాడాలో అన్నీ మా వాడితో సంకోచం లేకుండా మాట్లాడు తల్లి “ అని చెప్పారు. ఈ చనువు రమ్యను ఏదో తెలియని ప్రశాంతతకు లోనయ్యేటట్లు చేసింది .
అభినవ్ రమ్యతో మొదట తన చదువు, ఉద్యోగం, తనకున్న అభిరుచులు , విదేశాలకు వెళ్లడం అంతగా ఇష్టం లేదని - ఇది ముందే అమ్మాయికి చెప్పడం అవసరమని అన్నాడు .
అభినవ్ అనవసరపు మాటలు చెప్పకుండా ,నిజాయితి గా ,సూటిగా మాట్లాడటం రమ్యకు చాలా నచ్చింది, అభినవ్ సంభాషణ మధ్యలో

రమ్య రూమ్ లో చలం, యుద్దనపుడి నవలలు గమనించి “మీరూ కథలు చదువుతారా? “అని అడగ్గా

రమ్య “అవునండి చదువుతాను “ అని తను ఏదో అడిగేలోపే అభినవ్
" భలే రాస్తారండి వీళ్ళు కథలు.ఈ కథలు రాయడం ఒక కళ , అవి చదువుతూ ఉంటే నేను తెలియని ఆనందానికి లోనవుతాను , రాసేవాళ్ళు చాలా ఉన్నతంగా ఆలోచిస్తారు ,

సృజనాత్మకత ఉన్నవాళ్లే రాయగలుగుతారని నా నమ్మకం.

వాళ్ల సృజనాత్మకతకు నా జోహార్లు ,
అన్నట్టు మర్చిపోయా .
ఇక్కడికి వచ్చే ముందు అమ్మ చెప్పింది మీకు టీచింగ్ అంటే ఇష్టం అంట కదా!
నాకు ఇన్ని డిగ్రీలు ఉన్నా ఎదుటి వాళ్ళకు సులువుగా అర్థమయ్యే పద్ధతిలో చెప్పడం కష్టంగా తోచేది. దానికి కూడా ఓర్పు , నేర్పు కావాలి. అది అందరూ చేయలేరని నేను భావిస్తున్నాను" అన్నాడు.
రమ్యకు చాలా ఆనందం వేసింది, మామూలుగా కంటే ఎక్కువసేపు మాట్లాడాలినిపించింది. ఇద్దరు అలా మాట్లాడుకుంటూ ఉండిపోయారు .
వాళ్లు వెళ్లిపోయిన వెంటనే శ్రీధర్ తో “అభినవ్ తో సంబంధం సమ్మతమే నాన్నా! “అని చెప్పింది.
వాళ్ళ అమ్మగారు" ఏంటే నువ్వు వద్దు అని వెంటనే చెప్తావు, సమ్మతమే అయినా వెంటనే చెప్తావ్? ఏమీ ఆలోచించవా?
"అమ్మా! పెళ్లిచూపులకు వచ్చే ముందే ఆ అబ్బాయి చదువు, ఉద్యోగం, కుటుంబం గురించి మనకు అన్నీ తెలుసు, మేమిద్దరు మాట్లాడుకున్న గంటలో అతని మాట తీరును బట్టి ఇలాంటి అబ్బాయి అని కాస్త అంచనా వేయగలనని నమ్మకం నాకుంది"
"నువ్వు గమనించావో లేదో అభినవ్ వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారి మాటలని ఎంతో గౌరవించారు. ఇంట్లో వాళ్ళ మధ్య ఎలా అయినా ఉండనీ, కానీ నలుగురిలో వాళ్ల అమ్మ తో చాలా మర్యాదపూర్వకంగా మాట్లాడాడo, పిల్లలకు ఎంత లేదన్నా వాళ్ల మీద తల్లిదండ్రుల ప్రభావం తప్పకుండా ఉంటుంది, అలా అభినవ్ నా అభిప్రాయాలను తప్పకుండా గౌరవిస్తాడని అనుకుంటున్నా”.

"నిన్ను, నాన్నను చిన్నప్పటినుంచి చూస్తున్నా అన్ని పనులు కలిసి చేస్తారు, అన్ని విషయాలు చర్చించుకుంటారు , నా కాపురం కూడా కూడా మీలానే ఉండాలనుకుంటున్నా" అంది రమ్య.

శ్రీధర్ , మణి ఏమీ మాట్లాడకుండా ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు, వాళ్లు ఏమీ చెప్పకపోయినా పిల్లలపై వాళ్ళ నడవడిక ఎంత ప్రభావం చూపిస్తుoదో అర్థమైంది.

అభిప్రాయాలు కలవడం తో అభినవ్ రమ్యల పెళ్లి పెద్దల దీవెనలతో
ఆర్భాటాలు లేకుండా
అనవసరపు హంగులతో కాకుండా
పొట్ట పగిలిపోయే లాగ
వంటకాలకు తావివ్వకుండా
నవ్వుల హరివిల్లు లో సవ్యంగా
సాంప్రదాయ బద్ధంగా ప్రశాంతంగా జరిగింది......

అప్పగింతల సమయంలో రమ్యతో
మణి “ఒక్కగానొక్క కూతురి పెళ్లి ఎంతో ఆర్భాటంగా చేద్దాం అనుకున్నా, కానీ ఎక్కడ నా మాట
పడానిచ్చారు తండ్రి కూతురు కలిసి “ అని బాధపడ సాగింది.....

“అమ్మా నాకు , అభినవ్ కు పెళ్లి ఆర్భాటాలతో చేసుకోవడం ఇష్టం లేదు, అయినా పెళ్లికి కావాల్సింది ఆ హంగులు కాదు, మేమిద్దరం తరువాత ఎంత సఖ్యత గా ఉన్నామనేది ముఖ్యం.....
అభినవ్ తో నా జీవితం చాలా ఆనందంగా సాగుతుందని నా బలమైన నమ్మకం ,
ఈ పెళ్లి తంతుల గురించి ఊరికే బాధ పడవద్దు “ అని రమ్య అనేసరికి మణికి కూడా ఈ కొద్దిరోజులలో
అభినవ్ అన్ని విషయాల్లోనూ రమ్య అభిప్రాయాలను గౌరవించడం గుర్తుకు రాసాగింది.
రమ్య అభినవ్లు తమ వైవాహిక జీవితాన్ని - ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, ప్రేమానురాగాలతో, సుఖసంతోషాలతో ఒక తీపి కావ్యంగా మలచుకున్నారు.

మరిన్ని కథలు

Vaikalyam
వైకల్యం
- డా:సి.హెచ్.ప్రతాప్
Nachhina jeevitham
నచ్చిన జీవితం
- డా. సి.యస్.జి. కృష్ణమాచార్యులు
Lockdown lo Amma
లాక్ డౌన్ లో అమ్మ
- సంధ్య కార్తీక్
Gjnapakala jwalalu
జ్ఞాపకాల జ్వాలలు
- డా:సి.హెచ్.ప్రతాప్
Nijamaina Vijetha
నిజమైన విజేత
- పడాల హరీష్ కుమార్
Railu prayanam
రైలు ప్రయాణం
- సంధ్య కార్తీక్
Prasna
ప్రశ్న
- isun finn
Daiva sankalpam
దైవ సంకల్పం
- డా:సి.హెచ్.ప్రతాప్