ఊటీలో స్థిరపడ్డ తెలుగు కుటుంబం మాది. మా పూర్వీకుల౦తా ఒక్కప్పుడు చెన్నైలో ఉండేవారట. ఆ సమయoలో మా తాతగారికి ఒక టీ-ఎస్టేట్ లో మేనేజర్ ఉద్యోగం రావడం, అలా మేము ఊటీలో స్థిరపడడం జరిగిoది. మా నాన్నగారు సాహితీ ప్రియులు, దానికి తోడు ఆధ్యాత్మిక చింతన కూడా ఎక్కువే. నాకు, మా ఆన్నయ్యకు ఎప్పుడు వీలుంటే అప్పుడు ఎందరో గొప్ప సాహితీవేత్తల గురించి, మరియు ఎన్నో పురాణ కథలు చెప్పేవారు. ఊటీలో ఉన్నా ఇంట్లో అందరూ తెలుగు భాష తప్పనిసరిగా మాట్లాడాలని మా నాన్న పట్టుబట్టే వారు. నేను కాటుక కళ్ళని తిప్పుకుంటూ , వాలు జడను ఊపుకుంటూ ఇంట్లో తిరుగుతూ వుంటే నాన్న నన్ను బాపు బొమ్మలా ఉన్నావనేవారు .
పచ్చని ప్రకృతి అందాల మధ్య పెరగటం మూలాన ఏమో నాకు చిన్నప్పటి నుంచే భావుకత ఎక్కువ. మొన్ననే ఇంటర్మీడియట్ పాస్ అయ్యి డిగ్రీ కళాశాలలో బి.ఎస్సి. లో చేరాను. మా అన్నయ్య కోయంబత్తూర్ లో పి.జి చేస్తున్నాడు.సెలవులకు ఇంటికి వచ్చి వెళ్తూ ఉంటాడు.
నాకు ఎందుకో చిన్నప్పటి నించి కూడా స్కూల్ నుంచి తిన్నగా ఇంటికి వచ్చే అలవాటు లేదు. స్కూల్ నడిచేoత దూరoలోనే ఉండడoతో నడక దారి లో చెట్లు- చేమలతో మాట్లాడుతూ, ఆడుకుంటూ, పూసిన పువ్వుల నవ్వును ఆస్వాదిస్తూ, గల గలా పారేటి సెలయేరు శబ్దాలను ఆలకిస్తూ, మెల్లగా ఇంటికి చేరుకునేదాన్ని. అన్నయ్య ఇక్కడ ఉన్నన్నాళ్ళు , ఇంటికి త్వరగా చేరాలి అని నన్ను కూడా తొందర పెడుతూ, దిక్కులు చూస్తావేo? అని ఆక్షేపిస్తూ ఉండేవాడు. నాకు ప్రకృతిని అస్వాదించే సమయం ఇవ్వడం లేదని తనతో ఎప్పుడూ గొడవే.
అన్నయ్యకు ఎంతసేపు తొందరగా వెళ్ళి క్రికెట్ ఆడుకోవాలని ఉండేది. తాను ఆడే ఆ మైదానం అంతా ఒక్కప్పుడు పచ్చని గడ్డితో ఉండేది. గాలి తాకిడికి ఆ గడ్డి పరకలు ఊగుతుంటే పచ్చని పట్టు వస్త్రం రెప రెప లాడుతున్నట్లుగా చాలా ఆహ్లాదకరo గా ఉండేది. క్రికెట్ మైదానం కోసం ఆ అనుభవం లేకుండా చేశారని అన్నయ్యతో ఎప్పుడూ తగువులాటే !
ఇప్పుడు అన్నయ్య లేనందువల్ల చాలా సమయం ఈ ప్రకృతి సోయాగలలో మైమరచి ఇంటికి మరింత ఆలస్యంగా చేరుకుంటున్నాను. రోజూ నాకు అమ్మతో తిట్లు తప్పేవి కావు.
మా కాలేజీలో ఒకసారి సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతుండగా వ్యాస రచన పోటీల నోటీస్ వచ్చింది. దానిలోని అంశాలు –
1. మనం చంద్రుడి మీద నివసిస్తే--,
2. దేవుడు వరమిస్తే – అందరికీ ఉపయోగకర మైన మూడు కోరికలు ,
3. నువ్వే గనుక దేశానికి ప్రధానమంత్రి అయితే మొదట అమలు చేసే మూడు మార్పులు,
4. మరో మూడేళ్ళలో నిన్ను నువ్వు ఎలా అభివృద్ధి చేసుకుంటావు?
అని ఉన్నాయి. ఏదయినా ఒక అంశం మీద ప్రిపేర్ అయ్యి ఉండమని, మూడురోజుల తర్వాత పోటీ ఉందని తెలిపారు. మా లెక్చరర్లు “సొంతంగా ఎవరు రాస్తారో ,గూగుల్ చూసి ఎవరు రాస్తారో మాకు ఇట్టే తెలిసిపోతాయి, కాబట్టి స్వంతంగా, మీ మెదడుకు కాస్త పదను పెట్టి రాయండి” అని గట్టిగా చెప్పారు.
నాకు అన్ని ఆంశాలలో దేవుడు వరమిస్తే ఎందుకో చాలా నచ్చింది . పైగా ఆ దేవుడు వరమిస్తే శీర్షిక కింద, ఆ వరాలు అందరికీ పనికొచ్చే విధంగా ఉండాలని ఒక ట్యాగ్ లైన్ కూడా ఉండడం నన్ను చాలా ఆకర్షించింది. మనకోసం మనం కోరుకునే కోరికలు కావన్నమాట! దేవుడు అనగానే నాకు ఎందుకో మన జడలజుట్టు కైలాస వాసుడు-శివయ్య స్పురించాడు. వరాలిచ్చే దేవుడు అని ప్రసిద్ధి చెందిన వాడు కనుక, నాన్న ఎందరో దేవుళ్ళ పురాణ కథలు చెప్పినా . నాకు ఎందుకో నీలకంఠుడితో ఒక తెలియని అనుబంధం ఏర్పడసాగింది. అప్పట్నుంచి ఏ చిన్న ఆపద వచ్చినా శివ నామంతో నా లోకం ప్రశాంతoగా మారిపోయినట్టు అనిపించేది.
ఎవరైనా ఎదుటి వాళ్ళకు సహాయపడ్డప్పుడు, సాధారణమైన జీవితం గడుపుతున్నా, ఎన్నో కష్టాలను దిగమింగుకొని నవ్వుతూ జీవితం సాగిస్తున్నప్పుడు, అన్ని ఒడిదుడుకలలోనూ ప్రశాంతoగా జీవించే వాళ్ళను చూస్తే నాకు ఎందుకో ప్రతిమనిషి లోనూ ఒక శివుడు ఉన్నాడనే భావన కలిగేది.
ఈ జగత్తు అంతా ఒక మాయ శక్తి తో నడుస్తున్నదని, ఆ శక్తి పరమ శివుని లో దాగి ఉందని నా నమ్మకం, ఆ శక్తి మరేదో కాదు , మన ఆర్ధ నారీశ్వరుని లో సగభాగమైన పార్వతి దేవి , ఈ త్రిలోకాలను ఏలే తల్లి . పార్వతి దేవి ఆదిశక్తి, అంటే ప్రకృతి. సృష్టిలో కదలిక, అందం, జీవం, మరియు మార్పులన్నీ పార్వతి స్వరూపాలే.
నా వయస్సు చిన్నదే అయినా నాకు
దైవిక పరిణితి ఎక్కువే అని చెప్పాలి-దానికి ఉదాహరణ మా స్కూల్ లో జరిగిన ఒక సంఘటన .
ఎడో తరగతిలో ఒకసారి మా మాస్టారు సరదాగా అందరిని “మీ కోరికలు ఏమిటి?” అని అడగ్గా కొత్త ప్రదేశాలకు వెళ్లాలని కొందరు, ఏదో కొత్త పుస్తకాలు కావాలని మరి కొందరు, రకరకాల కొత్త బట్టలు కావాలని కొందరు, అనేక ఆట వస్తువులు కావాలని కొందరు, ఒకడు ఏకంగా సెల్ ఫోన్ చేతిలో ఉండాలని చెప్పారు. నేను మాత్రం ఆ ఉమామహేశ్వరులను ఒక్కసారి కలవాలని జవాబిచ్చాను. అంతగా ఆ శివయ్య ప్రభావం నా మీద పడేలా చేశారు నాన్న. తను చెప్పే గౌరి శంకరుల కథలు అలాంటివి మరి!
మా మాస్టారును కూడా నా జవాబు ఆశ్చర్యానికి గురిచేసింది. తరువాత పిలిచి ఎలా వచ్చిందమ్మా నీకు ఈ ఆలోచన? అని అడగ్గా నాన్న చెప్పిన కథలు నా మనసులో ఆలా నిలిచిపోయాయని, పార్వతి పరమేశ్వరులని కలవాలనే తపన చిన్నప్పటి నించే బలంగా నాటుకుందని చెప్పను.
ఇప్పుడు నా మెదడు నిండా దేవుడు వరమిస్తే ---- అందరికి ఉపయోగమైనవి ఏమి రాయాలి అని ఎన్నో ఆలోచనలు తిరుగుతున్నాయి.
కాలేజీ నించి ఇంటికి రాగానే అమ్మ దగ్గరికి వెళ్లి “అమ్మా! దేవుడు వరమిస్తే నువ్వు ఏం కోరుకుంటావు?” అని అడిగాను. వెంటనే అమ్మ తడుముకోకుండా “నాకు ఈ వంటింటి నుంచి విముక్తి ప్రసాదించు స్వామి! అని అడుగుతాను” అనింది. “ఏమిటమ్మా! దేవుడే ప్రత్యక్షమైతే నువ్వు కోరుకునేది ఇదా?” అని అడిగాను నేను .
అప్పుడు అమ్మ - “అయ్యో రామ! నీకేం తెలుసు ఈ వంటింట్లో జరిగే భాగోతం ?- వండడం కంటే, ఏమి వండాలి అని ఆలోచించేసరికి నా మెదడు మొద్దుబారిపోతుంది. రోజూ అందరికీ నచ్చేవి చేయాలంటే ఎన్ని పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ చేయాలో నీకేమి తెలుస్తుంది? అయినా ఎప్పుడూ చెట్ల వెనకాల, పుట్ల వెనకాల తిరిగే దానివి ఎలా బతుకుతావో ఏమో? ఈ వంటింటి పని తెగదు, తెల్లవారదు ----ఇప్పుడు నీకు అర్ధం కాదులే !
రేపు పొద్దున నువ్వు వంటింట్లోకి అడుగు పెట్టాక తెలుస్తుందిలే “ అని చెప్పింది.
అది కాదమ్మా! ఇంకేదన్నా చెప్పు అది అందరికీ పనికొచ్చేది అయి ఉండాలి “ అని నేను అంటే, చటుక్కున “ ఎవరింట్లోను పని వాళ్ళు మానేయకుండా రావాలి” అని అనింది, పైగా తన కోరికలు ఆడవాళ్లందరికి పనికొచ్చేవి అని చెప్పింది.
“దేవుడా! నీ కోరికలన్నీ ఇలా వంటిల్లు, పని వాళ్ళ చుట్టే తిరుగుతున్నాయి బాబోయ్ “ అని చెప్పేసి, “అయినా రాను రాను అన్నిటికీ రోబోలు, మెషిన్లు వస్తున్నాయి. అప్పుడు ఈ వంటింటి బాగోతం, పనివాళ్ళ గోల ఏమీ ఉండదులే అని” నేను చెప్తుంటే అమ్మ - “ ఆ రోబోలకి ఏమి చేయాలో మనమే అలోచించి చెప్పాలి కదే - అక్కడే సమస్యంతా” అని సమాధానమిచ్చింది. ఇంకేదో చెప్పే లోగా “నాకు వద్దు నీ గోల” అని , నాన్న వద్దకు తుర్రుమని పరుగుతీసాను .
నాన్న ఒక పుస్తకo చదువుతూ ఏదో దీర్ఘాలోచనలో ఉన్నట్లు కనిపించారు, బహుశా తన ప్రభావo వల్లనేమో నేనూ సాహిత్యాభిలాషినే. “నాన్నా! దేవుడు వరమిస్తే నువ్వు ఏం కోరుకుంటావు? అని ,వెంటనే అది అందరికీ ఉపయోగపడేది ఆయ్యి ఉండాలి” అని అడిగేసా. తను “మన భారతదేశానికి ఒక మంచి నాయుకుడిని కోరుకుంటాను అని - ఒక మంచి నాయకుడు వచ్చి దేశాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేసి, కరప్షన్ ఫ్రీ దేశంగా చె యాలనీ కోరుకుంటాను” అని చెప్పారు. “అయ్యో నాన్నా! ప్రపంచములో అందరు మనుషులకు ఉపయోగపడేది ” అంటే, “ దేశాల మధ్య యుద్దాలన్నీ ఆగిపోయి శాంతి నెలకొ నాలి” అని చెప్పారు.
“బాగుంది, కానీ ఇది అందరికి ఎలా ఉపయోగపడుతుంది” అనేది వివరించమనేసరికి “యుద్ధాల వల్ల ఎంతో ప్రాణ నష్టంతో పాటు దేశంలో అభద్రతా భావము మరియు తీవ్రమైన ఆర్థిక సంక్షోభం ఏర్పడతాయి. ఇది కాక చాలామంది ప్రియమైన వారిని కోల్పోవడం వల్ల తీవ్రమైన మానసిక వేదన కలుగుతుంది. ఇవన్నీ మనo ఆపవచ్చుకదా తల్లి ” అన్నారు . నాకు నాన్న జవాబు కొంచం నచ్చినా పూర్తిగా సంతృప్తి
చెందలేకపోయా .
సెలవులు అవటం మూలాన అన్నయ్య ఇంట్లోనే ఉండటంతో నా ప్రశ్న తో తన గదిలోకి వెళ్లాను.
అన్నయ్యకు క్రికెట్ అంటే ప్రాణం అని చెప్పాగా. అలా అని ఆ ఒక్క అట మీదనే తన ధ్యాస ఉండదు, పెరగుతున్న కొద్దీ అన్ని ఆటలు మీద తనకిష్టమైనాయి. ఎక్కడ ఏ మ్యాచులు జరిగినా వదలకుండా కళ్లప్పగించి చూస్తాడు. ఒక్క మాటలో చెప్పాలంటే స్పోర్ట్స్ ఫ్యాన్ అన్నమాట. నేను వెళ్లి ఈ ప్రశ్న వేయగానే తడుముకోకుండా “ఈసారి ఇండియా వరల్డ్ కప్ గెలిస్తే బాగుండు అని కోరుకుంటాను” అని అన్నాడు , “అది అందరికి ఎలా ఉపయోగమవుతుందన్నయ్య? ” అని అడగ్గా తను “ఒక్కసారి మన దేశం వరల్డ్ కప్ గెలిచిందంటే ఎంత మంది సంతోషిస్తారో! అందరికీ ఆనందం. ఇంతకంటే ఉపయోగపడేది ఏముంది?” అని అన్నాడు.
నాకెందుకో వీళ్ళు చెప్పినవేవి అంతగా రుచించలేదు. ఇక కాసేపు ఈ ఆలోచన పక్కనపెట్టాలనిపించి, మా మేడ మీదకు వెళ్ళాను.
అది మా ఇంటి మొత్తo లో నాకు ఎంతో ఇష్టమైన ప్రదేశము.
మేడ అంటే ఉట్టి మేడ కాదండోయి! అది నా నేస్తాలన్నిటిని తనివి తీరా చూసుకునే చోటు. అమ్మ వంటింటి పనితో తీరిక ఉండదు అంటుందే కానీ, మా మేడను ఎన్నో పూల చెట్లతో అలంకరించి ఒక చిన్న ఉద్యానవనo గా మార్చింది. పైగా ఆ పూలచెట్లను పసి పాపాయిల వలె చూసుకుంటుంది . అంతేనా, ఈ పూల చెట్ల మధ్యలో ఏ కలుపు మొక్క మొలచినా అది తీసేదాక నిద్రపోదు .
ఎన్నో సార్లు మా మేడ పై నిల్చొని నీలి వర్ణపు తివాచిలో మేఘాల హావభావలను చూస్తూ, మధ్యమధ్యలో పిల్ల గాలి వచ్చి నన్ను పలకరిస్తుంటే , మరోపక్క సన్న తుంపర నా చెంపలను ముద్దాడుతుంటే చాలా సేపు వేరే లోకంలో విహరించేదాన్ని.
ఈ రోజు మా మేడ మీదకు వచ్చినప్పుడు దూరo గా ఏదో భవన నిర్మాణం జరగుతుండడం గమనించాను, దాని కోసం అక్కడున్న చెట్లను తొలగించారని అర్దమయ్యింది. నా మనస్సు ఎందుకో వ్యధకు గురయ్యింది . ఎందుకు శివపార్వతుల వలె మానవుడు - ప్రకృతి ఉండలేరు? శివుడు లేనిదే శక్తి లేదు, శక్తి లేనిదే శివుడు లేడు. అలాగే ప్రకృతి లేనిదే మనిషి లేడు, మనిషి ఉనికికి ప్రకృతే ఆధారం.
మనుషులు ఎందుకు ఇలా ప్రకృతిలో జీవిస్తూ , దాని మీదె ఆధారపడి దాన్నే కడతేర్చాలని చూస్తారు ?
నాకు ఎందుకో కాళిదాసు కనిపించాడు,తాను కూచున్న కొమ్మను తానే నరుకుతూ ..........
ఇలా నా ఆలోచనలలో నేనుండగా నా మానస మందిరములో ఏదో మెరిసింది. పరుగెత్తుకుని కిందకు వచ్చి నేను అనుకున్నదంతా ఒక పుస్తకంలో వ్రాసి కూర్చి పెట్టి, పోటీలో ఏమి వ్రాయాలో తీర్మానించుకున్నాను.
వారం రోజుల తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు ముగిసి, బహుమతుల ప్రధా నోత్సవంలో వ్యాస రచన పోటీలో , నాకు మొదటి బహుమతి వచ్చినట్టు ప్రకటించారు.
మా కళాశాల ప్రిన్సిపాల్ నాకు బహుమతిని , ప్రశంసా పత్రాన్ని అందిస్తూ, నన్ను అభినందించి , “తల్లి! నీ ఆలోచనలు చాలా బాగున్నాయి” అని పొగిడి, “అందరి ముందు నువ్వే నీ రచనను చదువు “ అని నా వ్యాస పత్రాలు అందజేసారు . నేను ముందు కొంచం ఖంగారు పడ్డా, కాసేపటికి కుదురుకొని ,
మైక్ ముందు నిల్చొని నా వ్యాసాన్ని చదవటం ప్రారంభించాను.
ప్రపంచంలో రకరకాల కష్టాలు ఉన్నాయి. కొందరికి డబ్బులు లేవని బాధ , మరికొందరికి జబ్బులతో బాధ , చాలామందికి కనీసం కట్టడానికి బట్ట , ఉండడానికి చోటు లేదని, మరికొందరికి ఇవన్నీ ఉండి కోరుకున్న పదవి దక్కలేదని బాధ, కొందరు చదవలేక, ఇంకొందరికి చదువు లేక, ఇంకొందరికి ఎంత డబ్బు ఉన్నా మనశ్శాంతి లేక బాధ. కొందరికి పరుల మాటలతో, మరికొందరికి మాట్లాడటానికి నాధుడే లేక . ఇలా చెప్పుకుంటూ పోతే, అంతు లేని బాధలు - ఇది మన ఒక భారతదేశo లో కష్టాలు కావు, అన్ని దేశాలలో మనుషులు పడే బాధలు .
దేవుడు వరమిస్తే ఇవన్నీ తీర్చమని నేను అడగలేను , కాకపోతే దేవుడంటే , నాకు మా శివయ్య ప్రత్యక్షమైనట్లే ఊహించుకొని- తప్పకుండా అడిగేవి మాత్రం ...
నాకెప్పుడూ మనుషుల తత్వాలు, సంఘర్షణలు ఇవన్నీ కూడా బాహ్య ప్రకృతిలో విభిన్న రూపాల్లో దర్శనమిస్తాయి అని అనిపిస్తుంది. మనిషిలోని కోరిక, స్వార్థం, అహంకారం మితిమీరితే అనర్ధానికి దారి తీస్తుంది. ఇవే సమాజంలో వెర్రితలలు వేసి ఎలాగైతే ప్రకృతిలో విపత్తులు, ప్రళయాల రూపంలో చూస్తామో...
మనుషులకు కోపం, బాధ, దుఃఖం, సంతోషం , ఓర్పు, త్యాగం, ఓర్వలేని తత్త్వం ఇవన్నీ సహజ గుణగుణాలు. ఇవన్ని లేకపోతే మనిషి జీవితం చప్పగా సాగుతుంది. కానీ ఇవి మోతాదుకు మించితేనే కష్టాలు. అందుకే నా మొదటి కోరిక ప్రతి మనిషికి అన్ని గుణాలు ఉగాది పచ్చడిలా సమ పాళ్లలో ఉండాలని పైగా వాటిని నియంత్రించే మర ఒకటి బిగించాలని .
రెండవది -ప్రతి మనిషి తన భావాలను స్పష్టంగా వ్యక్తపరిచేటట్లు చేయమని, ప్రతి మానవ సంబంధానికి పునాది భావ వ్యక్తీకరణ, ఎందుకంటే అది లోపించే చాలా అపార్ధాలు, అనర్ధాలు , వెరసి యుద్ధాలు కూడా
మొదలయ్యే అవకాశం. స్పష్టత లేకనే మానవ సంబంధాలు దెబ్బ తింటున్నాయి.
మానవ సంబంధాలు మెరుగుపరిస్తే ఏ విషయoలోనూ సమస్యలు తలెత్తవు .
మూడవది మనిషి కోరికలకు అంతు లేదు. అవి స్వీయ నియంత్రణ లోపించి, ఒక మోతాదుకు మించితే ప్రమాదమే. అసలు కోరికలే లేకపోతే మనిషిలో కష్టపడే తత్వం కూడా మరుగున పడుతుంది, కావున మనిషి కోరికలు ధర్మభద్ధమైనవి గా ఉండాలని నా మూడవ కోరిక .
ఈ మూడు కోరికలు మానవాళికoతా ఉపయోగకరమైనవి .
ఇవి ప్రసాదిస్తే ఎటువంటి సమస్యలు రావు అని నా వ్యాసాన్ని చదవటం ముగించాను.
అక్కడున్న వారంతా ఒక్కసారి సంతోషo గా చప్పట్లతో నన్ను అభినందించారు.
ఇదండీ నా వరాల బుట్టలో దాచుకున్న కోరికల చిట్టా.ఇంతకీ నా పేరు చెప్పనేలేదు! నా పేరు శివాత్మిక.
మరి మీ ముందు దేవుడు ప్రత్యక్షమైతే ఏం కోరుకుంటారు? మర్చిపోకండి ,
అది అందరికీ ఉపయోగపడేది ఉండాలి సుమీ!

