రేపటి ఆకలి - సుకృతి సుశీల

Repati Aakali

భవనంలోకి అడుగు పెట్టడమే పద్మవ్యూహంలోకి వెళ్ళినట్టుంది. ముందు పెద్ద హాల్. హాల్ లో ఓ పక్క పక్కా ఆంగ్లం తప్ప తెలుగు తెలియనట్టున్న రిసెప్షనిస్ట్. ఆమె దగ్గరకి వెళ్ళి మా అబ్బాయిని చూపెడ్తూ - "ఆరో తరగతిలో అడ్మిషన్" ఎందుకో తెలీదు, తడారిన గొంతులోంచి పొడిగా మాటలు బయటకు వచ్చాయి. రిసెప్షనిస్టు సంతాప సభకి వచ్చిన వాడిని ఎలా పలకరించాలో తెలీక నవ్వినట్టు , చిత్రమైన నవ్వు నవ్వి, ఓ కాగితం నా చేతికిచ్చి " ఫస్ట్ ఫిల్ దిస్ ఫామ్" అంది. అడ్మిషన్ అప్లికేషన్ లో చాలా ప్రశ్నలు ఉన్నాయి. అప్పటి వరకు నా జీవితంలో జరిగిన, జరగబోతున్నాయని వూహిస్తున్న వివరాలతోబాటు, మా ఆవిడ, ఇతర సంతానం వివరాలు యివ్వాలని వుంది.

వివరాలు పూర్తి చేసి, ఫోనులో మాట్లాడుతూ మెలికలు తిరిగిపోతున్న రిసెప్షనిస్ట్ దగ్గరకు వెళ్ళాను. ఓ వంద రూపాయలు తీసుకుని రిసీట్ ఇచ్చి " నెక్స్ట్ వీక్ ఎగ్జాం" అంది. 'సిల్బస్' వినయంగా అడిగాను. అటుగా వున్న గోడ వైపు చూపెట్టింది. అప్పటికే ఆ గోడ దగ్గర నా లాంటి మంద భాగ్యులు సిలబస్ రాసేసుంకుంటున్నారు. మా అబ్బాయి ఇష్టం లేని పనిలా చేయి పట్టుకు లాగేస్తున్నాడు. వీడికి ఇక్కడికి రావడం ససేమిరా ఇష్టం లేదు. పరుగు పందెం లో వెంక పడిపోతాడేమోనని, భయంతో ఇక్కడికి తీసుకు వచ్చాను.జననం దగ్గర నుండి మరణం వరకు అనీ కార్పోరేట్ అయిపోయిన ఈ రోజుల్లో, చాదస్తంగా, అపురూపమైనది 'బాల్యం'. దానిని అంత అధ్బుతంగానూ పిల్లలకు అందివ్వాలనుకోడం, అర్థం లేని వెర్రితనమనే సందేహ సముద్రంలో పడిపోయాను. సముద్రంలో ఎక్కువసేపు ఈదలేము. మునక తప్పదు. అంచేత మునిగిపోకుండా, ఒడ్డు లాంటి పరిష్కారం వెతుకుతూండగా ఇదేదో కార్పోరేట్ స్కూల్ రూపంలో కనిపించింది. చిత్రమేమిటంటే, సందేహ సముద్రంలో తోసేసిందీ ఈ కార్పోరేట్ స్కూల్సే.!

పెద్ద పెద్ద ప్రకటనలతో పత్రికలలో, టీవీలలో, హోరెత్తిస్తూంటే, ఆరో తరగతి పిల్లాడిని, పిల్లాడిగా చూస్తే వాడు ఎందుకూ పనికి రాడని, ఐఐటి ఫౌండేషన్ వేస్తే, ఏడేళ్ళ పునాదుల మీద ఐఐటీ లోకి అతి సులువుగా వెళ్ళి పోవచ్చనీ, తీవ్రమైన ఆశ పుట్టించారు. ఏడేళ్ళ బాల్యాన్ని యవ్వన ప్రారంభ దశని పట్టించుకుంటే, 'ఐఐటియన్' అయిపోయి, భవిష్యత్తు బంగారుమయమైపోతుందని వూహ పుట్టించారు. జగమే ఐఐటి మయం చేశారు. అంచేత కార్పోరేట్ స్కూలు వారి లెక్కల ప్రకారం ఐదో తరగతి పాస్ అయ్యాకా, 'బాలుడు ' 'బాలుడు' కాదు. 'వుడ్ బీ ఐఐటీ యన్'.

మొదట్లో ఆ ప్రకటనల సందడి చూసినా, మనసు మొరాయించింది. కాకపోతే, ఇంటి చుట్టుపక్కల వాళ్ళ తీరు, ఇల్లాలి పోరు ఇరవైనాలుగ్గంటల చానెల్ లా నిరంతరం మోత మోగించేసరికి, దగ్గర్లో వున్న కార్పోరేట్ స్కూలుకి రాక తప్పలేదు. అప్పటికి నేను "ఐఐటిలో సీటు రాకపోతే, కష్టం కదా అంటే లోకంతో పాటే మనం..."ఐఐటీ కాకపోతే ఇంజనీరైనా అవుతాడు." ఢంకా మోగించింది మా ఆవిడ. "అధమం ఇంజనీరేమిటే? ఎంత కిరాణా షాపుల్లా ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చినా అంత లోకువగా చూడొద్దు." " అయినా ఏ తెలు పండిటో, సైన్స్ లెక్చరరో, సోషల్ ప్రొఫెసరో, సైంటిస్టో, యాక్టరో, సింగరో, యివేమీ కాకపోతే, నోట్లో నాలుక వుండి ఫుల్ స్టాప్ లేకుండా మాట్లాడగలడు కనుక యాంకరవుతాడులే" అన్నాను.

ససేమిరా అనేసింది మా ఆవిడ. నేను చెప్పినవన్నీ అస్సలు వృత్తులే కానట్టుగా చూపు విసిరింది. ఆమెని తప్పు పట్టలేము.సుప్రభాత సేవ నుండి పవళింపు సేవ వరకు కార్పోరేట్ ప్రభంజనం వీస్తుండే సరికి ర్యాంకుల బ్యాంకులు తమ దగ్గరే వున్నాయని ఏటిఎం లో డబ్బు విత్ డ్రా చేసుకున్నట్టుగా ఐఐటీ సీట్లు చేరుకోవడమే తరువాయి అని హోరెత్తించేసరికి, మరో మార్గం కనిపించలేదు. ఎలా చూస్తే అలా కనిపిస్తుంది. ఏది చూస్తే అదే కనిపిస్తుంది. టీకా కేంద్రంలా ఐఐటి చిట్కా కేంద్రంలా వున్నా ఒక కార్పోరేట్ స్కూల్ కి ఎడ్మిషన్ ప్రయత్నంలో అందుకే వచ్చాను. ఆవిడ ఇంట్లోనే వుంటుంది కనుక ఛానెల్ టు ఛానెల్ మార్చేస్తూ అవసరమైన, అనవసరమైన లోకజ్ఞానాన్ని పోగేసి గభాలున గుమ్మరిస్తుంది. ఆ పరంపరలోనే "మన కార్తీకం తెలివైన వాడు...స్కాలర్ షిప్ వస్తే అంతా ఫ్రీయే.. వీడి అడుగు జాడల్లోనే కౌశిక్ నడిచేస్తాడు.'అని రెండో వాడి భవిష్యత్తుకి రాజమార్గం వేసేస్తున్నట్టు చెప్పింది. కొడుకు తెలివి తల్లికి ముద్దైనా, స్కాలర్ షిప్ అనేసరికి నాలోని మధ్య తరగతి మానవుడు అమాంతం పైకి లేచి ఆశ పడ్డాడు.

"ఏడేళ్ళు ఫ్రీగా అంత ఈజీగా చదవనిస్తారా?" నా సందేహాలు నాకు వున్నాయి. అన్నింటికీ మించి ఏడేళ్ళంటే సెంటిమెంటుగా బాల్యాన్ని మింగేస్తున్న ఏలినాటి శనిలా అనిపించింది. ఇన్ని ఆలోచించి 'వెనకబడ్తే వెనకనెనోయ్' అనుకొని ఈ స్కూల్లో చేర్చే నిర్ణయం తీసుకొన్నాను.అప్లికేషన్, పరీక్ష సిలబస్ రాసుకొని ఇద్దరం బయటకొచ్చాము. ఓ చాకొలెట్ కొనిచ్చాను.ఎప్పుడు చాకొలెట్ ఇచ్చినా ఠక్కున నోట్లో వేసుకునే మా వాడు చాకొలెట్ వైపు అదో రకంగా చూసాడు. దీర్ఘంగా నిట్టూర్చాడు. ఐఐటీయన్ లక్షణాల్లో ఇదీ ఒకటి కాబోలు అనుకున్నాను. కోల్పోతున్న బాల్యాన్ని తల్చుకుంటున్నాడన్న ఇంగితం లేక!!

"నో టీవీ..నో ఫిలింస్..నో ఆటలు..నో పాటలు.. మా అబ్బాయి స్కాలర్ షిప్ కోసం మా ఆవిడ కర్ఫ్యూతో కలిసిన నానా రకాల చట్టాలు, సెక్షన్లు విధించేసింది. అండమాన్ సెల్యులార్ జైలులా వుంది ఇల్లు. నేను పొరబాటున నవ్వినా, మాట్లాడినా, అనవసరంగా చిన్నతనలో రికామిగా తిరగబట్టే, చిన్న ఉద్యోగం వెలగబెడ్తున్నానని వెక్కిరించింది. అంచేత మా అబ్బాయిని గ్రహాంతర వాసిగా దూరం పెట్టి, పరిక్షకి ఇతోధికంగా సిద్ధం కావడానికి కృషిచేశాను.!!

పరీక్ష పూర్తయింది, ఫలితాలొచ్చాయి. మావాడు పదేళ్ళ స్కాలర్ షిప్ పరీక్షలో మొదటి ర్యాంకు సాధించక పోయినా గణనీయంగా మార్కులు వచ్చినందుకు ఫీజులో రాయితీ ఉంటుందని ఫోన్ వచ్చింది. 'వచ్చింది' అనే ఏకవచనం కన్నా ఫోన్లు వస్తూనే వున్నాయి అంటే కరెక్ట్. నక్షత్రకుడి నక్షత్రంలో పుట్టారు కార్పోరేట్ సిబ్బంది, అస్సలు వదిలిపెట్టలేదు. త్రికాలాల్లోనూ అదీ ఇంటికే ఫోన్ రావడంతో మా ఆవిడ అత్ర్రుతని ఆపలేకపోయాను. అప్పటికే ఆవిడకి ఫోన్లో కౌన్సిలింగ్ అయిపోయింది. తెలివైన అబ్బాయిని, తెలివి తక్కువ తనంతో మామూలు స్కూల్లో చదివిస్తున్నారని ఇప్పటికైనా కళ్ళు తెరవండని హెచ్చరిక లాంటి ఆహ్వానాలు అందాయి. వలలో చిక్కిన చేపలా గిలగిలా కొట్టుకుంటూ , తప్పించుకోలేక స్కూలుకి వెళ్ళాము. మా అబ్బాయి మార్కులు చూపెట్టారు. ఆరో క్లాసు పరీక్షలో ఏడెనిమిది క్లాసుల ప్రశ్నలు ఇచ్చారట..ధైర్యం చేసి మొదటి మాటగా అడిగేసాను. 'మా స్కూలు పిల్లలకి ఇది మామూలే ' నాప్రశ్నని అస్సలు పట్టించుకోనట్టుగా జవాబు ఇచ్చాడ స్కూల్ ప్రిన్సిపాల్. ఆ వెంటనే ప్రధాన ఘట్టంలోకి అడుగు పెట్టాను. 'అస్సలైతే అరవై వేలు కట్టాలట. ' మా వాడు ప్రతిభ చూపెట్టాడు కనుక పదివేలు తగ్గిస్తున్నామని చెప్పాడు. మా ఆవిడ " మాట్లాడండి" అని నాకు అవకాశం ఇచ్చినట్టుగా తనే మాట్లాడేసరికి బేరం నలభై ఐదు వేలకి ఖరారైంది. మా ఆవిడ ఆనందానికి అవధులు లేవు. 'నా టెన్షన్ కి అవధులు లేవు' - లోటు బడ్జెట్ ఎలా పూడ్చాలో తెలీక. ఆ తర్వాత అప్పు తేవడం, కట్టడం అయిపోయింది.భవిష్యత్తులో ఐఐటీయన్ జాబితాలో మా వాడు ఉండాలని మా ఆవిడ ఈస్ట్మన్ కలలు కనేస్తోంది.

స్కూలుకి వెళ్ళిన మొదటి రోజే ' మీ అబ్బాయి సంగతి మేము చూసుకొంటాం' అని భరోసా ఇచ్చారు. ఆ మరునాటి నుండే మావాడు చెరుకు పిప్పిలా అయిపోయాడు. ప్రొద్దున్నే ఏడింటికి వెళ్ళడం, రాత్రి ఎనిమిదింటికి రావడం, ఆదివారాల్లో పరీక్షలు, పొరపాటున సెలవు ఇచ్చినా, టీచర్ ఫోన్ చేసి "కార్తీక్..డూ త్రీ హండ్రెడ్ ప్రాబ్లం' అని ఫోన్లోనే వర్క్ ఇచ్చేస్తున్నాడు. స్టూడెంట్ పరిస్తితి ఎలా ఉన్నా సెలవు రోజు కూడా పని కట్టుకొని ఫోన్ చేసే కర్మ పట్టిన ఆ టీచర్ని తల్చుకొని జాలి పడ్డాను.

స్కూళ్ళోనే వీర తోముడు తోముతుండే సరికి నేను చదవమంటే పిల్లాడు డంగై పోతాడని, బాల్యంలోనే సన్యాసాశ్రమం స్వీకరిస్తాడని సధ్యమైనంత వరకు చదువు మాట ఎత్తడం మానేసాను. ఈ మధ్య మావాడికి కడుపు నొప్పి వచ్చింది. అప్పుడప్పుడు మెలికలు తిరిగిపోతున్నాడు.చిట్కా మందులు వేసినా తగాలేదు. స్కూలు మానిపించకూడదు. అప్పటికీ కడుపు నొప్పి గురించి చెప్తే, 'టాబ్లెట్ ఇవ్వండి, ఇక్కడే వేసి చదివిస్తాం' అన్నారు. టాబ్లెట్స్ కి కడుపు నొప్పి తగ్గకపోయేసరికి దగ్గర్లోనే వున్న కార్పోరేట్ ఆసుపత్రికి తీసుకెళ్ళి అనవసరంగా మరో పులి బోనులో అడుగుపెట్టి, 'నిల్' రిపోర్టుకి ఆరేడువేలు వదిలించుకున్నాము. డబ్బు ఖర్చయినా సమస్య ఏమీ లేనందుకు ఆనంద పడిపోతూ వస్తూంటే చిరకాల మిత్రుడు ఆనందరావు కనిపించాడు. మాటల మధ్యన మావాడి కడుపు నొప్పి విషయం చెప్పాను. అంతకు ముందు అతని సలహా కూడా కార్పోరేట్ స్కూల్ విషయంలో తీసుకున్నాను. ఆనందరావు కిసుక్కున నవ్వేసి 'కంగారు పడకు, కొన్ని రోజుల్లో సర్దుకుంటుందిలే, ఇది శారీరక అజీర్తి కాదు చదువు వల్ల వచ్చే అజీర్తి., చదువు ఓవర్ ఫ్లో అయితే ఇదే పరిస్థితి. మనం తెలుసుకోలేని టెన్షన్ లో పిల్లలు పడ్తారు. అదే ఈ పెయిన్ అలవాటయిపోతుంది.' అన్నాడు- సర్వం తెలిసున్న వాడిలా నేను ఏదో అడగబోతే ఇంటికి వెళ్ళి పుస్తకాలు చూడు, నీకే అర్థమవుతుందీ అన్నాడు. వెంటనే ఇంటికి వచ్చి వాడి పుస్తకాలు తీసి చూసాను. ఆరో తరగతి స్టేట్ , సి.బి.ఎస్. సిలబస్ పుస్తకాలతోబాటు సైన్స్, లెక్కలు, ఏడెనిమిది క్లాసుల పుస్తకాలు ఉన్నాయి. అవి చాలవన్నట్టుగా కొన్ని పోటీ పరీక్షల పుస్తకాలు వున్నాయి.

అవన్నీ ఒక్కక్షణం బాల్యం మీద పడ్డ శిలువల్లా అనిపించాయి. రాబోయే తరగతుల పాఠాలు యిప్పుడే చెప్పడమేమిటి ? " రేపటి ఆకలి" ని ఈ రోజే తీర్చేసుకోవడం అత్యాశ అవుతుందిగా - ఎవరినైనా అడిగితే ఐటీ ప్రపంచం అంటున్నారు -- ఐటీ ప్రపంచంలో వెనకబడకూడదు. కానీ ముందుకు వెళ్ళే మార్గం ఇదేనా? నా ప్రశ్నకి జవాబు ఏ కార్పోరేట్ కన్సల్టెంటో చప్పగలడేమో?! ఎందుకో తెలీదు, కార్పోరేట్ అన్న మాట మనసులో తట్టిన వెంటనే తెలియకుండానే వెన్నులో వణుకు పుట్టింది.

మరిన్ని కథలు

Aachari mastari vupayam
ఆచారి మాస్టారి ఉపాయం (బాలల కధ )
- కొత్తపల్లి ఉదయబాబు
Aadaleka maddela odu
ఆడలేక మద్దెల ఓడు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Garam chai
గరం చాయ్
- వేముల శ్రీమాన్
Kudi Edamaithe
కుడి ఎడమైతే
- మద్దూరి నరసింహమూర్తి
Complaint
కంప్లైంట్
- Kodali sitarama rao
Aakali
ఆకలి
- అరవ విస్సు
Alludigari alaka panpu
అల్లుడుగారి అలక పాన్పు
- మోహనరావు మంత్రిప్రగడ