అం జలి, మేఘనా చిన్ననాటి స్నేహితులు. చిన్నపటినుంచి అంజలి మనస్తత్వం పరిస్థితులను అర్ధం చేసుకుని వాటికి తగిన విధం గా ఎవరికీ ఇబ్బంది కలగకుండా నిర్ణయాలు తీసుకోవడం. దీనికి పూర్తిగా వ్యతిరేక మనస్తత్వం మేఘనది. రెండు వ్యతిరేక మనస్తత్వాలు ఇలా స్నేహ బంధం లో కలిసాయి.
అందం లో మేఘన కి సాటి రారెవరు. అంజలి అందం మేఘనతో పోటీ పడలేదు. ఏ మాత్రం మేకప్ లేకున్నా కూడా మంత్రముగ్ధులని కలిగించే అందం మేఘన సొంతం. అయిదు అడుగుల పది అంగుళాల ఎత్తు, సెలయేరుల గల గల లాంటి నవ్వు, తెల్లని మేని ఛాయ, నుదుటిపై పై పడే అందమైన కేశ సౌందర్యం, నాజూకైన శరీరం, తీర్చిదిద్దినట్టుందే కనుబొమ్మలు ఇలా చెప్పుకుంటూ పొతే అంతే ఉండదు.
ఇద్దరి మనస్తత్వాలు పూర్తిగా వ్యతిరేకమైనవి. అంజలి ఆలోచనతో ప్రవర్తిస్తే, మేఘన ఆవేశం తో ప్రవర్తిస్తుంది. అలా అని మేఘన తెలివితేటలని తక్కువ అంచనా వెయ్యకూడదు. తన ఆలోచనలని తన ఆవేశం డామినేట్ చేయ్యకపొతే మేఘన అధ్బుతాలు సృష్టిస్తుంది. కానీ ఆవేశం లో నిర్ణయాలు తీసుకోవడం మేఘన యొక్క వీక్ పాయింట్.
ఈ విషయం లో మేఘన కి అన్ని విధాల అంజలి అండగా నిలిచింది. వివిధ సందర్భాలలో ఆవేశం లో నిర్ణయాలు తీసుకుంటే పరిణామాలు ఎలా ఉంటాయో మేఘనకి వివరించేది. కొన్ని సార్లు సరిదిద్దేది కూడా.
మేఘనా, అంజలి కాలేజీ లో చదివే రోజులలో జరిగిన సంఘటన ఇది.
ఎంతో మంది మేఘన ప్రేమ కోసం తపించేవారు. చదువు సంధ్యలు మాని మేఘన కి ఎంతో మంది జీతం లేని బాడీగార్డులుగా పనిచేసారు. మేఘన కోసం ఒకరితో ఒకరు పోట్లాడుకునే వారు కూడా. ఎన్నో ప్రేమలేఖలు మేఘన కోసం ఎదురు చూస్తూ ఉండేవి. కనీసం తన వైపు చూస్తే చాలు అని అనుకునే మేఘన అభిమానులకి కొదవే లేదు. ఈ విషయం మేఘనకి గర్వ కారణం గా కూడా అనిపించేది. చిన్నపాటి గర్వం ఆమె నవ్వులో ప్రతిబింబించేది.
అలాంటి ఒక ప్రేమమయం అయిన రోజున మేఘనా అంజలి కలిసి షాపింగ్ కి వెళ్లి వస్తుంటే "ఆంటీ" అన్న పిలుపు వినిపించింది.
తన చుట్టు పక్కల ఉన్న వారెవరినయినా పిలుస్తున్నారేమో కాబోలు అని మేఘన అంజలి మాట్లాడుకుంటూ నడుస్తున్నారు. మళ్లీ "తెల్ల చుడీదార్ ఆంటీ" అని వినబడేసరికి మేఘనకి కొంచెం అనుమానం వచ్చింది.
"కొంప దీసి వీడు తనని గాని ఆంటీ అని పిలవలేదు కదా, పిల్లలకి ఎవరు చీరలో లేదా చుడీదార్లో కనబడిన వాళ్ళందరూ అంటీలే, అలా అలవాటు చేసారు పెద్దవాళ్ళు" అని ఆ అబ్బాయితో "ఏంట్రా, అంటీ ఏంట్రా, ఏం కావాలి" అని గట్టిగా అడిగింది.
" మీరంటే .... "
"చెప్పు, అవతల లేట్ అవుతోంది"
"అదే మేడం, మీరంటే మా అంకుల్ కి అసహ్యమట..."
"వ్హాట్"
"అవును అంటీ, అసహ్యమట"
ఇంత వరకు తనని ప్రేమిస్తున్నానని తన అందాన్ని పొగిడి వెంట పడిన వారినే తను చూసింది. తానంటే అసహ్యమనే వ్యక్తి మీద ముందుగా కోపం వచ్చినా అతని గురించి తెలుసుకోవాలని మేఘనకి అనిపించింది.
మేఘన తో పాటు అంజలికి ఆశ్చర్యం కలిగింది.
"ఎవరు మీ అంకుల్, పద నన్నతని దగ్గరికి తీసుకువెళ్ళు" అని అంది
"అంకుల్ ఇప్పుడు ఇక్కడ లేడు ఆంటీ, మీరంటే అసహ్యమని చెప్పమన్నాడు చెప్పాను"
అసహ్యం అన్న మాట కన్నా ఆంటీ అన్న మాట ఇంకా బాధిస్తోంది మేఘనని
"బాబూ నన్ను అక్కా అని పిలు నీకు ఒక చాక్లెట్ కొనిస్తాగా" అంది
వెంటనే వాడు "చాక్లెట్ ఏది ఆక్కా" అనగానే అబ్బా వీడు మరీ ఫాస్ట్ గా ఉన్నాడే కొనిచ్చే వరకు వదిలేలా లేడు" అని మనసులో అనుకుని, తీసుకో అని తన బాగ్ లోంచి ఒక డైరీ మిల్క్ చాక్లెట్ తీసి ఇచ్చింది.
"సరే, ఈ సారి మీ అంకుల్ ని నాకు చూపించు" అని అంది
"సరే అక్కా" అన్నాడు వాడు
"వాడెవడే, ఇంత అందగత్తెని, రాజ్ కపూరు సినిమా లో ని హీరోయిన్ లా ఉంది ఫిగరు అని నా చుట్టూ తిరిగే జనాలు, నా చూపు తగిలితే చాలు అని జనాలు ఉండగా 'నువ్వంటే నాకు అసహ్యం' అని ఒక పిల్లవాడి చేత చెప్పిస్తున్నాడు"
"దీనిలో రెండు కారణాలు ఉండొచ్చు మేఘనా, వాడు ఎయిథర్ నీ దృష్టిలో పడాలని అయినా ఇలా చేసుండొచ్చు లేదా నిన్ను వాడు నిజంగా అసహ్యించుకోవచ్చునువ్వీ విషయాన్నీ అంత సీరియస్ గా తీసుకోకు. "
"ఏంటి నన్నుఅసహ్యించుకోవటమా, నో ఐ కాంట్ ఇమాజిన్. మేఘనా మేఘనా అంటూ ఈ ప్రపంచం నా పాదాల కింద ఉండాలి"
"మేఘనా మరీ నీకంత పొగరు మంచిది కాదే, రాను రాను నువ్వే ఇబ్బందుల్లో పడతావేమోనని నాకు భయం వేస్తోంది"
"అమ్మమ్మ కాలం నాటి కబురులు నువ్వూ, అయినా ఇంత చిన్న వయసులో నే నీకు వేదాంతాన్ని నూరిపోసిన మీ అమ్మమ్మననాలి."
"ఇదేమి వేదాంత ధోరణి కాదు, కాదు సత్యం, ఈ వయసులో ని ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండాలి. దేనికీ అతిగా రియాక్ట్ అవ్వకూడదు. ఎనీవేస్ నువ్వు వాడి గురించి ఆలోచించుకుని నీ బుర్ర పాడుచేసుకోకు. ఆ పిల్లాడికి మళ్ళీ వాడు కనిపిస్తే చెప్తాడుగా అప్పుడు ఆలోచిద్దాం ఏం చెయ్యాలో, టేక్ కేర్ నాకు కొంచెం పని ఉంది. కొత్తగా ఒక పుస్తకం రిలీజ్ అయిందట. అర్జెంటు గా ఆన్లైన్ లో ఆర్డర్ చెయ్యాలి, బై"
"నువ్వూ నీ పుస్తకాల పిచ్చి. పుస్తకాలు ఉంటే నీకు ఎవరూ కనిపించరు కదా. ఓకే బై" అని మేఘన ఇంటి దారి పట్టింది.
ఎంతసేపటికి నిద్రపట్టకపోవడం తో మేఘన ఆ రోజు సాయంత్రం తను షాపింగ్ నుండి తిరిగి వస్తుండగా జరిగిన విషయం గురించి ఆలోచిస్తోంది.
"వాడు ఎవడయి ఉంటాడు, తనని ఎందుకు అసహ్యించుకుంటున్నాడు. వాడు ఎలా ఉంటాడు. వీడు నన్నే అంటీ అని అన్నాడంటే ఆ లాజిక్ ప్రకారం చూస్తే అతను కూడా యువకుడే అయి ఉండుంటాడు. చూద్దాం రేపు కనిపిస్తాడుగా నన్నెందుకు అసహ్యించుకుంటున్నాడో తెలుసుకోవాలి" అని మెల్లగా నిద్రలోకి జారిపోయింది.
***
తెల్లారింది. త్వరగా రెడీ అయి టిఫిన్ తింటున్న సమయం లో అంజలి మేఘనా వాళ్ళింటికి వచ్చింది.
"రామ్మా, కూర్చో. నువ్వు కూడా టిఫిన్ చెయ్యి" అని మేఘనా వాళ్ళ అమ్మ ఆప్యాయంగా అంజలిని పిలిచింది.
"లేదు ఆంటీ నేను ఆల్రెడీ టిఫిన్ చేసేసాను. ఇవాళ నేను కాలేజీకి వెళ్ళట్లేదు మేఘన నోట్స్ నా దగ్గర ఉంది తనకిచ్చి వెళ్దామని వచ్చాను"
కనీసం మజ్జిగ తాగమ్మ అని మేఘన అమ్మగారు లోపలికి వెళ్లారు
"ఎంటే, బాయ్ ఫ్రెండ్ తో డేటా ఇవాళ"
"నీకెప్పుడు ఇదే గోల కదా, అలాంటిదేమీ లేదు మా ఇంటికి దూరపు బంధువులు వచ్చారు. అందుకని రావట్లేదు. సాయంత్రం కలుస్తాను క్లాస్ లో ఏం చెప్పారో చెప్పు."
"మజ్జిగ తాగమ్మ" అని మేఘన వాళ్ళమ్మ గారు అంజలికి మజ్జిగ ఇచ్చారు.
"థాంక్స్ అంటీ, మజ్జిగ చాలా బాగుంది. ఇంక వెళ్లొస్తాను, బై మేఘనా"
"బై" అని చెప్పి టైం చూసుకుంటూ హడావిడిగా టిఫిన్ తినడంలో నిమగ్నమయిపోయింది మేఘన.
***
ఆరోజు కాలేజీ నుండి వస్తున్నప్పుడు ముందు రోజు కనబడిన అబ్బాయి మేఘనకి కనిపించాడు.
"ఒరేయ్ అగరా, ఆ అంకుల్ ఎవరో చెప్పు, నీకు బోలెడు చాక్లెట్స్ ఇస్తాను" అని బతిమాలుతూ అడిగింది మేఘన
"ఆంటీ" అని చాక్లెట్ చూడగానే "అక్కా చూపిస్తాను అదిగో దూరం గా నిలబడి ఫోన్ లో మాట్లాడుతున్నారే ఆ అంకులే" దొరికాడు. నేనంటే అసహ్యమా. చెప్తాను వాడి సంగతి అని దగ్గరికెళ్ళి నిలుచుంది. తానెవరో కాదు తన క్లాస్ మేటే. అందంగా నే ఉంటాడు కానీ ఎప్పుడూ మేఘన దృష్టి అతనిపై పడలేదు. ఇవాళ మాత్రం అతనిని నిశితం గా గమనించింది. "రాహుల్, ఏంటి నేనంటే అసహ్యం అది ఇది అన్నావట"
"అవును, అన్నాను"
"అంత అసహ్యమయితే నన్ను ఫాలో అవడం ఎందుకు"
"అసహ్యం నీ మీద కాదు. అందగత్తెవనే పొగరు నీ కళ్ళని కప్పేస్తుంది. ఆ పొగరు అంటే అసహ్యం"
"పొగరేంటి"
"మొన్న జరిగిన సంఘటన గుర్తుతెచ్చుకో. ఆ రోజు చైతన్య నీకు ప్రోపోస్ చేస్తే నలుగురిలో వాడి చెంప చెళ్ళుమనిపించావు. ఇష్టముంటే ఉందని చెప్పాలి లేదంటే లేదని చెప్పాలి. ఇంకా విసిగిస్తే పెద్దవాళ్ళకి చెప్పాలి. అంతే కానీ అలా నలుగురిలో అవమానించకూడదు. నీ వల్ల వాడు ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. సమయానికి నేను వెళ్ళాను కాబట్టి ఆపాను. ఆ పొగరంటే నాకు అసహ్యం. ఇక మీదటైన నువ్వు మారతావని అనుకుంటున్నాను"
"నిజంగా అంత పని చేసాడా, నేనతన్ని కలవాలి క్షమాపణ అడగాలి"
"ఇప్పుడు అతను నువ్వంటేనే అసహ్యించుకుంటున్నాడు"
ఈ లోపు అటు వైపుగా వస్తున్నా అంజలి ఇదంతా గమనించింది. కన్నీటి పర్యంతమవుతున్న మేఘన వద్దకి వచ్చి "పద ఇంటికెలదాం" అని "రాహుల్ మేఘన తరపున క్షమాపణ అడుగు. మళ్ళీ కలుస్తాం" అని బయలుదేరారు.
దారిలో "చూసావా మేఘనా! ఆవేశం తో నువ్వు చేసిన పనికి ఓక ప్రాణం బలి అయ్యేది. ఇకనైనా మించి పోయింది లేదు. నువ్వు అందగత్తెవే కానీ నీ అందానికి అందం నీ మనస్సు. అందమైన మనస్సు ఉంటేనే ఎవరైనా గౌరవిస్తారు. అందం శాశ్వతం కాదు. ఇప్పుడు బాధపడకు. అతనికి ఏమీ కాదు." అని సముదాయించింది.
తన తప్పు తెలుసుకున్న మేఘన అప్పటి నుంచి వివేకం తో వ్యవహరించడం తెలుసుకుంది. అందానికి ఆభరణం మనసేనని అర్ధం చేసుకుంది.