మహిత - సామాన్య

mahita

'బుజ్జమ్మా! ఒక రవ్వంత ఇది చదువు నాయన, కంటిచూపు ఆనటం లేదాని నాయనమ్మ పిలిస్తే చదవదామని పోతా ఉండానా, అంతలోకి మా నాయనొచ్చి మొన్న చూసిపోయిన పెళ్ళిచూపులోళ్ళ గురించి చెప్పడం మొదలుబెట్టేడు.

ముందుగా మీకు మా గురించి చెప్పనీయండి. నా పేరు మహిత. ఆ పేరు మా అత్త కూతురు చెప్పింది. నాకిప్పుడు పదహారేళ్ళు. మొన్ననే నా పదోతరగతి రిజల్ట్స్ తెలిశాయి. నేను లెక్కల్లో, సైన్సులో ఫెయిలయ్యాను. అందరికీ ముందుగానే తెలుసు కాబట్టి నన్నెవరూ తిట్టలేదు. అదీకాక ఒకేళ్ పాసయినా మా ఊరి నుండి టౌనుకు పోయి చదవడం మా నాయనకు రొవ్వంత కూడా ఇష్టం లేదు. ఎందుకంటే ఇప్పుడసలే కాలం బాలేదు కదా, ఏమయినా అయితేనో... దారిలో ఎవడైనా నన్ను ఏమైనా చేస్తేనో అని మా నాన్నకి భలే భయం.

సైగ్గా మీకో విషయం చెప్పాలి, అదేంటంటే... . నేను నిజంగానే అందంగా వుంటా. పదోతరగతి వచ్చాక రవనాడ్డోళ్ళ పెద్ద కొడుకు నా క్లాసులోనే చిన్నప్పటినుంచి చదవతా వుండాడా, ఇప్పుడేమో నా పక్క అదొక రకంగా చూడ్డం మొదలుబెట్టేడు. వాడట్ట చూడ్డం నాకేం బాగుండదు. కానీ, ఎంతైనా నేను అందమైన దాన్ని కాబట్టే కదా అట్టా చూస్తావుండాడు. నా ప్రక్కన కూర్చునే ప్రసూనని చూస్తా వుండాడా? చూట్టం లేదు కదా! అనిపిస్తది. నాకు సన్నటి నడుము, నడుం పై నడిచే జడ ఉన్నాయి... జడంటే మామూలు జడ కాదు. ఈంత లావు, ఈంత పొడుగు జడ నాది... నా జడ చూసి మా అత్తలు మహితకి జుట్టు మాదొచ్చింది అంటారా, మా అమ్మేమో చాటుగా, ఏది బాగుంటే అదంతా వీళ్ళ పోలికలే అని తిట్టుకుంటది. కానీ నిజంగా నా జడ మా అత్తల పోలికే. అంత పొడుగు జడకి జడకి కుచ్చులు పెట్టుకుని ఎప్పుడైనా పైటా, పావడా వేసుకుంటే భలే బాగుంటా.

పదహారేళ్ళకే పెళ్ళేందని మా అత్త కూతురు మా నాయన దగ్గర నస పెడతా వుంటది గానీ, నాకు మాత్రం పెళ్ళంటే ఇష్టమే. చదవడం, పరీక్షలు రాయడం నాకేం ఇష్టం గా అనిపించవు. మా ఇంట్లో ఆ పక్క వస్తువు ఈ పక్కకి, ఈ పక్క వస్తువు ఆ పక్కకి జరిపినా మా అమ్మ ' నీ ఇంటికి పోయిన పాట నీ ఇష్టప్రకారం చేసుకుందువులే గానీ ఇప్పటికి అట్ట ఉండనియ్యమ్మా, ' అంటది. ఆ మాట ఇని ఇని నాగ్గూడా పెళ్ళి చేసుకుంటే బాగానే వుంటది అనిపిచ్చింది. అప్పుడు చామంతి పూల తొట్ట్లు నా కిష్టమైన చోట పెట్టగలను కదా అని నా ఉద్ధేశం. బాగా పూసిన పూల తొట్టిని ఎవరైనా జనాలకి కనిపించకుండా పెట్టుకుంటారా? మా అమ్మకి చెప్పినా అర్ధం కాదు. వచ్చేపోయే దారికి అడ్డమంటది. నా కోసం రోజు వచ్చే కుంటి కాకి అంటే కూడా అమ్మకి ఇష్టమే వుండదు. ' ఎందుకు మే దాన్ని పోతును మేపినట్టు మేపతా వుంటా ' వంటది. ' పాపం అది కుంటిది కదా, మళ్ళీ అక్కడా, ఇక్కడా తిరగడమెందుకు, మనమే పెడదామా, అని చెప్ప్పినా మా అమ్మకి అర్ధమే కాదు. తరిమి పారేస్తది.

మా అమ్మయేమంటదంటే, మా నాయన ఏడు మున్నోరు కాలం చేనుకి చాకిరి చేస్తానే ఉంటాడంట గానీ, అదేం మాయో అంతెత్తున కనిపించే పంట కూడా చేతికొచ్చేసరికి చిటికంత, నోటికొచ్చేసరికి నలుసంత అయిపోతదంట. ' ఏదో ఒకటి అమ్మకపోతే అమ్మి పెళ్ళి జేయడం ఎట్ట కుదురద్ది... ' అని నేను ఎనిమిదోతరగతిలోకి వొచ్చినప్పటి నుండి మా అమ్మ అదే పనిగా కయ్యను అమ్మెయ్యమని మా నాయన దగ్గర నస మొదలుబెట్టింది. మా నాయన మా అమ్మ మాటలకి 'ఊ' అనో 'ఆ' అనో అనకుండానే నేను పదోతరగతి ఫెయిలయిపోయా.

ఇది ఇట్ట జరగతా వుండగా ఒకరోజు మా అమ్మకి వాళ్ళ దూరపు చుట్టాలెవరో ఒక సంబంధం గురించి చెప్పేరు. 'ఒకడే కొడుకంట, ముగ్గురు అప్పజెళ్ళెళ్ళు, ముగ్గురికీ పెళ్ళిళ్ళయిపోయీనాయంట . మీరెప్పుడంటే అప్పుడు పెళ్ళిచూపులు పెట్టుకుందాం' అన్నారు. ఆ సబంధం విషయం ఆ రోజే మా నాయనకి చెప్పిని మా అమ్మ. "పెళ్ళి చేయడానికి మన చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు. ఏదో ఒకటి అమ్మితే తప్ప చెయ్యాడే వసతి లేదు. మంచి, చెడ్డ ఇచారించుకుని చేద్దాం. తొందరపడమాక." అన్నాడు మా నాయన.

ఆ పై వారానికి మళ్ళీ వచ్చేరు వాళ్ళు. అన్ని మాటలు విన్న మా నాయన "అట్టేలే ఒకసారి ఆ ఊరికి బొయ్ చూసుకొద్దాం. ముందూ, ఎనకా ఇచారించాలి కదా" అన్నాడు.

ఆ పై శుక్ర వారం సాయంత్రం అయిదు గంటలకి పెళ్ళి చూపులకి వచ్చారు. ఈ సారి పెట్టినవి తింటూ పిల్ల నచ్చింది అని చెప్పారు. పెద్దోళ్ళు ముహూర్తాల గురించి మాట్లాడకుంటా వుండారు. అట్టా మాఘమాసం పద్నాలుగో తేదీన పెళ్ళయిపోయింది. మా కొనగట్ట చేన అమ్మి మా నాయన నా పెళ్ళి ఘనంగా చేసినాడు, మూడు రాత్రులు విచిత్రంగా గడిచాయి. ఎలాగంటేవ్.. నాకు మల్లెపూల జడ వేసి, పాల గ్లాసుతొ లోపలికి పంపారు. ఎళ్ళి చూద్దును గదా మా ఆయన సుబ్బరంగా గోడ పక్కకి తిరిగి పొడుకుని కనిపించాడు. ఉలుకూ లేదు, పలుకూ లేదు. తరువాత తెల్లవారగానే అందరూ అడిగిన ప్రశ్నలకి ఏం జరిగిందో, జరగలేదో, చెప్పొచ్చో లేదో అర్ధంకాక నేను చెప్పకపోయినా కొందరు పెద్దోళ్ళు ఏం జరగలేదని కనిపెట్టారు.' పిల్ల చిన్నది కదా ఆ యబ్బయ్య బయపడి ఉంటాడ్లే. ' అన్నారు. ఇంకొన్ని రోజులకి నేను వాళ్ళ ఊరికి బయల్దేరా. ఆరుగురు కూర్చోవాల్సిన కార్లో పన్నెండు మందిమి కూర్చున్నామా ఒకటే ఉమ్మదం. వాళ్ళ ఊరికి చేరేసరికి మధ్యాహ్నం రెండయ్యింది. ఇల్లు మా నాయన చెప్పినట్లు బాగానే ఉంది కానీ బయటకి మాత్రమే బాగుంది. లోపల చీకటి గుయ్యారం. ఆ ఇంటి ఎనకమాల ఇంకో ఇళ్ళుంది. ఆ తరువాత అంతా అడివే.

నాతో పాటు వొచ్చినోళ్ళందరూ ఒకట్రెండు రోజులుండి ఎళిపోయినారు. కడాన మా అమ్మ బయలుదేరింది. మా అమ్మ పోతావుంటే మటుకు నాకు బాగా ఏడుపు వచ్చింది. ఏడస్తావుంటే మా అమ్మ నన్ను ఇదిలిచ్చుకోని "అమ్మిని బాగా చూసుకో అమ్మ. ఇంక అండెన, దండెన అంతా నీదే." అని అత్తతో చెప్పి ఎనక్కి తిరిగి చూడకుండా కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ ఎళ్ళిపోయింది.

పెళ్ళయిన తరువాత మా వాళ్ళంతా అనటం మొదలెట్టారు. మహిత అత్తగారు భలేగుంది. లేస్తే కూచోలేదు కూచుంటే లేవలేదని, మా అత్త అంత లావు . ఇంతకాలం ఈ ఇంటి పనంతా ఎట్టజేసుకుందో నాకు ఒక్క రొంత కూడా అర్ధంకాలేదు. కూచున్న కాడ్నించి లేవకుండా కళ్ళు నా మీదేసి మా అత్త, నేను చేసిన ప్రతి పనికి వంకలు పెడతా వుంటది.

మా అమ్మ ఎళ్ళిపోయిన మూడు రోజులకి మా ఆయన ఇంటికొచ్చాడు. మా ఆయనకి రొయ్యల ఫీడు అమ్మే యాపారం ఉంది. దానికోసమో ఏమో ఏదో పని మీద గూడూరికి పొయ్యాడని మా అత్త చెప్పింది. కానీ పోతా పోతా ఆయన నాకేం చెప్పిపోలా. గూడూరుకాడె మా నడిపి ఆడబిడ్డ ఉంటది. పొద్దుకూగే యాళకి ఇంటికొచ్చాడు మా ఆయన. ఒచ్చిన కాడ్నించి ఆయన నతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆయన తిని లేసిన తరువాతా, మా యత్తకు పెట్టి, నేను తిన్న. ఆ చీకటింట్లో అయిదు రూములు ఉన్నాయి. మూడో రూము మా అయన పొడుకునేది. నేను ఆడనే పొడుకోవాలనేది నాకు తెలుసు. అందుకని ఆ రూములోకి పొయ్యా. మ ఆయన మంచం మీద పొడుకోనున్నాడు. నేను పోగానే గడిపెట్టి ఇట్రా అన్నాడు. నాకు బలే సిగ్గేసింది. అయినా మా ఆయన కాడికి పోయి నిలబడ్డా. ఆయన ఒక్క మాటన్నా మాట్లాడలే. ఆయన్నే నా రొమ్ముల మీద చెయ్యేసాడు. వెంటనే నేను గట్టిగా రైకని పట్టేసుకుని గింజుకోవడం మొదలుపెట్టా. మా ఆయన అటు గుంజుడు, నేను ఇటు గుంజుడు. ఇంతలో ఒక సిటంలో నా చెంప పేలిపోయింది. నేను మంచం మీద పడ్డా. తరువాత ఏం జరిగిందో నాకు అర్ధం కాలే. పొద్దులకి నాకు ఒళ్ళు ఎచ్చబడి లేవబుద్దికాలా. ఆయన పొద్దున్నే లేచి ఎట్టబోయ్యాడో తెలీదు. నాకు కనిపిచ్చలా. ఆ రోజు పోయినోడు మా ఆయన తరువాత వారానికొచ్చాడు. మా ఆయన్ను చూడగానే ఘోరంగా భయమేసింది. తప్పించుకోని తప్పించుకోని తిరగతావుంటే మా అత్త ' సాల్లే నీ సింగినాదపు సిగ్గులు. వాడికేం కావాలో వైనంగా చూడు.' అన్నది.

మా ఆయన అన్నం తిని ఊళ్ళోకి పోయాడు8. మా మావ చేలోకి పొయ్యాడు. ఏడున్నరకి మా ఆయన ఇంటికొచ్చాడు. నేను పీట వాల్చి అన్నం పెట్టాను. వంటింట్లో అన్ని సర్ది నిదానంగా మా ఆయన రూములోకి పొయ్యా. ఆయన నిద్దరపోతావుండాడు. నాకు బలే సంబరమేసింది. అబ్బ ఈ రోజుటికి బాధ తప్పింది అని. శబ్ధం కాకుండా ఒక మూలగా చాపేసుకుని పడుకున్నా. పడుకున్నానేగాని మనసులో భయం. ఈ రోజైతే సరే రేపెట్టా?... పోనీ అమ్మకు చెప్తేనో. ఆలోచిస్తావుంటే నిదరపట్టింది.

ఒక రాతికాడ ఏదో కుట్టినట్టు సుర్రుమంటే అబ్బా అని లేసి కూచున్నా. ఎదురుగా మా ఆయన. నిదర మత్తులో ఏమి అర్ధం కాలేదు. తలెత్తి మా ఆయన్ను చూసే లోపల ఇంకోసారి అదే పని జరిగింది. ఆ రోజు మా అయ్యన ఏం చేసాడొ నేను మీకు నోరు తెరచి చెప్పలేను. మా ఆయన చేతిని తోసేసోలోపల నా చెంప మళ్ళీ పేలిపోయింది. కళ్ళ నీళ్ళు తెరిపి లేకుండా కారిపోయినాయి. ఆగకుండా ఎక్కిళ్ళు వస్తావుండాయి. ఇటువంటి మనుషులు కూడా వుంటారా అనిపించింది. పొద్దటికి భగభగమని మండిపోతా జరమొచ్చింది. మా అత్త వచ్చి చూసి, "ఇదేం చోద్యమో చీటికీ మాటికీ జరమని మంచమెక్కద్ది. వొచ్చిందమ్మా భలే కోడలా," అన్నది.

ఆ రోజు సాయంత్రం మా అత్త పెట్టిపోయిన కాఫీ కొన్ని గుక్కలు తాగి, దొడ్లోకని చెప్పి బయటకొచ్చి, మా ఇంటికి నాలుగిళ్ళ అవతల వాళ్ళింట్లో ఫోనుందని మా అత్త ఒకసారి ఎవరికో చెప్తుంటే ఇన్నా, దొడ్డిదారిన వాళ్ళింటికి పోయి ఒకసారి ఫోన్ చేసుకోవచ్చా అని అడిగా. నా అవతారం చూసి ఏమనుకున్నారో చేసుకోమ్మా అన్నారు.

అవతల మా నాయన ఫోన్ ఎత్తాడు. నాకు ఇంకా ఏడుపు ఆగలే. ఒకటే ఏడుపు, ఒకటే ఎక్కిళ్ళు. ఆ ఎక్కిళ్ళ మధ్యే అంతా చెప్పా. అవతల మా నాయన గొంతు వజవజా వణికిపోతుంది. "ఇదిగో నాయనా ఈ బస్సుకే బయల్దేరతావుండా, బయపడబాక, ఆ పెళ్ళీ వద్దు, పెటాకులూ వద్దు. ఇంక ఆ ఇంటికి పోబాక ఊర్లో ఏదన్నా గుడో, బడో వుంటే కూర్చో తల్లా మా అమ్మా... వొచ్చేస్తా వుండా," అన్నాడు మా నాయన. నేను మా నాయన చెప్పినట్టే ముత్యాలమ్మ గుడిలో కూర్చున్నా. మా ఊరి నుండి ఈ ఊరికి రావడానికి సమయానికి బస్సు చిక్కితే సరిగ్గ నాలుగంటల ప్రయాణం. కానీ మా నాయన బస్సులో రాలే. కారు బాడుక్కి తీసుకుని వచ్చాడు. గుడి కాడ ఆగాడు. కార్లో మా నాయన, మా చిన్నాయన, మా అత్త వచ్చినారు. కార్ లో నెను మా నాయన పక్కన కూర్చుని, మా అత్త ఒళ్ళో తల పెట్టుకున్నా, ఒకరొంత దూరం లోనే కారాగితే తలెత్తి చూసా మా అత్తోళ్ళిళ్ళు. నాకేం అర్ధం కాలే. అందరూ కార్లోంచి దిగారు. నేను మాత్రం దిగలే. పెద్దపెద్దగా అరుపులు, అంతా గోలగోలగా వుంది. రొంత సేపటికి అందరూ కారెక్కారు. మేం మా ఊరికి బయలుదేరినాం.

ఏమైనా మా ఊరికి ఒస్తావుండే నాకు సంతోషంగా వుంది. పోంగానే మా యమ్మ నా మహితే అంటా ఏడవడం మొదలెట్టింది. మా ఇళ్ళు చూసే సరికి నాకు చానా ధైర్యమొచ్చింది. అందుకని. మా యమ్మని యాడవబాకుమా, అని మా అమ్మని నేనే ఓదార్చా. ఇంకేముందిలే. అబ్బా ఒచ్చేసాం. అని నా ప్రాణానికి హాయిగా అనిపించింది. మా అమ్మా, నాయన నన్ను ఆ ఇంటికి పంపనని, అదే మాట మీద నిలబడ్డారు. రెండేళ్ళు గడిచిపోయినాయి.

రెండేళ్ళకి ముందు నాకు పెళ్ళయ్యింది అన్న మాట గుర్తు తెచ్చుకోవాలన్నా నాకు భయంగా ఉంటది. ఇంకొక నాలుగు రోజులు పోతే సంక్రాంతి. ఏకోజామునే లేసి మా ఇంటిముందర ముగ్గేసి రంగులద్దతావుండా, నేను ముగ్గు పూర్తి చేసి,మా నాయన ముఖం కడిగి కాఫీ తాగాక నిదానంగా.. నాయనా ఎంకురెడ్డి సచ్చిపోయినాడంట అన్నా.. మా నాయనకి మొదట ఏ ఎంకురెడ్డో గవనానికి రాలే. 'ఏఎంకురెడ్డి పాపా" అన్నాడు. నాకు మా మావ అని చెప్పడానికి మనసు రాలే. అందుకే వాళ్ళే నాయనా అరెంపాలెపు ఎంకురెడ్డి అన్నా అప్పుడే మళ్ళ ఫోనొచ్చింది. ఈ సారి మాట్లాడలేదు. మా అమ్మకి విషయం చెప్పాడు. మా అమ్మ కూడా ఏం పట్టించుకోలేదు. మానాయన మా అమ్మని పిలిచి, "ఒకసారి పావనిని తీసుకుపొయ్యి నీళ్ళు చల్లిచుకుని వద్దాం. సావు కాడ పగలెందుకే. పోయినోడెట్ట పోయే.." అన్నాడు మా నాయన.

పదకొండు గంటల ట్రిప్పుకు ముగ్గురం బయలుదేరినాము. ఆ ఇల్లు, ఆ మొహాలు చూడ్డం నాకు ఒక్క రవ్వంత కూడా ఇష్టమనిపించలే. మా నాయన వస్తా వస్తా ఓ పూల మాల కొన్నాడు. దాన్ని తీసుకుని పోయి నన్ను వేయమన్నాడు, కానీ నేను పోను నాయనా అని నువ్వే వేసిరా అన్నాను, మా నాయనే పోయి పూలమాల వేసొచ్చాడు. మా ఆయన ఎక్కడా కనిపించలే. నేను ఆ తతంగాలంతా చూస్తూ షామియానా కింద ఏసిన కుర్చీలో కూర్చున్నా, వాళ్ళ ఏదుపుల్ని చూస్తా వున్ననే గాని, అదే అరుగుపైన ఇంకో రెండు వారాల్లో నేను శవమై పడుంటానని మా అమ్మ నాయన నా మీద పడి యాడస్తా వుంటారని నాకు ఒక్క రొంత ఆలోచన కూడా లేదు.

అన్ని తతంగాలు అయిపోయాకా. మా నడిపి ఆడపడుచు మా నాయంతో, అయ్యిందేదో అయ్యింది మావా, ఈ సారి అట్ట జరక్కుండా మేం జూస్తాం. అమ్మిని ఈడే వుండిచ్చండి. అని ఒకటే బతిమిలాడింది. మానాయన నా వైపు చూసి "ఏం నాయనా మహితా ఉంటావా" అన్నాడు. నేనేం మాట్లాడలే. "అక్కోల్లు అందరూ వున్నారు గదమ్మా, ఇంకో పదేను రోజులుండురోజులు చూడు. నీకంత వుండలేననిపిస్తే వచ్చేద్దువుగాన్లే. నా ఫోను కూడా నువ్వే పెట్టుకో అమ్మ, ఏ కష్టమొచ్చిన చిన్నాయనకి ఫోన్ చెయ్యి నిముషంలో లగెత్తుకొచ్చేస్తాం." అన్నాడు
అందుకు మా చిన్నాడపడుచు "ఈ సారి అంత కష్టం రానీములే మావా" అన్నది. నాకేం చెప్పాలో తోచలే. మనసులో చాలా భయంగా వుంది. అయినా సరే సరే అని తలూపాను. ఎందుకంటే... మా నాయనంటే నాకు ప్రాణం. మా నాయన మాటకు ఎదురాడ్డం నాకు ఇష్టముండదు.

అలా కొన్ని రోజులు గడిచిపోయినాయి. ఇంటినిండా మనుషులుండడంతో మా ఆయనతో మాట్లాడడం కుదరలేదు. కానీ చిన్నగా ఎవరికి వాళ్ళు ఎళ్ళిపోవడం మొదలెట్టారు.

చాన్రోజులకి తలారా స్నానం చేసి అరుగు మీద కూర్చున్నా. ఏదేదో ఆలోచిస్తావుంటే గేటు శబ్ధం అయ్యింది. చూద్దును కదా... మా అమ్మ, తాత. నన్ను చూసిపోదామని వచ్చారు. మా అమ్మా, తాత నాకు జాగ్రత్తలు చెప్పి ఆయంత్రం కల్లా వెళ్ళిపోయారు. ఈ రోజు మా ఆయన వస్తాడు అని మా యత్త చెప్పింది. అందుకని మా అమ్మ తెచ్చిన ఎండు చేపల్లో వంకాయేసి కూరొండా. మా అమ్మ పోయిన రెండు గంటలకు మా ఆయనొచ్చాడు రావడం రావడమే ధుమధుమలాడతా వొచ్చేడు. మా అత్తని బూతూ బొండూ తిట్టేడు. నాకు భయమేసింది. నేనేం తల దూర్చలా. సక్కా పోయి పడుకున్నా... ఒక రాత్రికాడ గట్టిగా తన్నినట్టనిపిస్తే దడుసుకుని లేసా. చూస్తే ఎదురుగా మా ఆయన. ఈసారి నాకు కోపమొచ్చింది. ' ఎందుకు తంతా వుండావు? మీరంతా ఉండమని పీకులాడితేనే ఇక్కడుండా. రేపే ఎళిపోతా... కొట్టడం గిట్టడం కుదరదు. అని ధైర్యంగా అన్నాను. మా ఆయంకి కోపం పెరిగిపొయ్యింది. దిండు తీసుకుని నా మొహం మీద పెట్టి అదమడం మొదలు పెట్టేడూ. నేను చేత్ల్తోటి గిచ్చడం మొదలుపెట్టా. మా ఆయన ఎక్కి నా గుండెల మీద కూర్చున్నాడు. మోకాళ్ళు నా చేతుల మీదేసి అదిమేసాడు. నాయ్నా..నాయ్నా అని అరుద్దామనిపిచ్చింది. గింజుకుని గింజుకుని నాకు పూర్తిగా ఊపిరాడ్డం మానేసింది.

పదకొండు గంటలకి మా ఊరి నుండి బంధువులందరూ దిగిపొయ్యారు. మా నాయన కారు కాడ్నించి పరిగెత్తతా వొచ్చేడు. రాంగానే నన్ను, నాశవాన్ని జూసి నా కాళ్ళ దగ్గర కూలబడిపొయ్యి నాయినా మహితా... మహితా... మహిలూ లెయ్ నాయనా.. నాయనా సచ్చిపోబాకమ్మా... నా బంగారు తల్లీ.... మహిలూ...' అని యాడవడం మొదలుబెట్టాడు. మా అమ్మ వచ్చి నా పక్కన పడిపోయింది. ఏడుపూ లేదు, ఏం లేదు. ఒకటే ఎర్రి చూపు. మా అత్తలు గుండెలు బాదుకుని యాడస్తా ఉండారు. నాకు మళ్ళా ఏడుపొచ్చింది. ' నాయనా నేనేం జేసేది నాయనా, యాడవకు నాయనా' అని చెప్పాలనిపించింది.

మా మావలు, చిన్నాయన్లు, ఇంకా ఊర్లో పెద్ద మనుషులు జరగాల్సిన తతంగం గురించి మాట్లాడుకుంటూ ఉండారు. ఎవరో పోలీసులకి ఫోన్ చేశారు. పోలీసులు ఫోన్ జేసిన ప్రెతీ తడవా ' ఇదిగో వస్తా వుండాం, అదిగో వస్తా ఉండాం' అంటా ఉండారు. ఎవరెవరో ఎవరెవరికో ఫోన్లు జేసుకుంటా వుండారు.

చివరికి ఆ మూలుండే పెద్ద మనుషులు మా నాయన్ని నా దగ్గర్నుండి లేపి అవతలికి తీసుకపొయ్యి ' ఏణు రెడ్డా! ఏడిసిన పాట పోయిన అమ్మిగాన తిరిగొస్తదా? మొగోడివి జరగాల్సినవి చూడొద్దా? ' అన్నారు. మా నాయన ఆ మాటిని ' అనా! నేను మొగోడ్ని కాదనా...నేను మొగోడ్ని కాను. నాకు నా బిడ్డ కావాలనా! నా బిడ్డ కావాల...నా బిడ్డని నాకు దెచ్చియన్నా అని నేల మీద కూలబడ్డడు. పెద్ద మనిషి మా నాయన్ని లేపి కుర్చీలో కూచోబెట్టి ' ఏణు రెడ్డా! చెప్పేదిను. కేసులు గీసులంటే పోయిన బిడ్డ తిరిగొస్తదా.మీరు పెట్టినయ్యంతా రాబట్టుకుందాం. రెండెకరాలమ్మి గదా బిడ్డ పెళ్ళి జేస్నావు. ఆ రెండెకరాలకి ఇంకో రెండెకరాలు కలిపి కొనుక్కునేట్టు డబ్బులడుగుదాం. లేకపోతే కేసు పెడతామని బెదిరిద్దాం. ' అన్నాడు.

ఆ మాటింగనే మా నాయిన ఆమన్నే లేసి నిలబడి ' అన్నా! అమ్మి పోయిందన్నా...ఆస్తి నేనేం జేసుకొనేదన్నా? బంగారు తల్లి గదంటన్న పిల్ల..కాపరం జెయ్యాలని మేమనుకోలేదే.... అదిగో తా తల్లి , మావా పూచీ నాదీ అని అంటే గదాబిడ్డనీడ వదిలిపెట్టిపోయింది. అమ్మ ప్రవీణమ్మ తల్లీ ఏమమ్మా ఆరోజు నాదీ పూచీ అంటివే? ఇదేనా తల్లీ పూచీ అంటే? అని యాడవడం మొదలుపెట్టాడు.

పెద్దమనుషులు ' ఏణయా మేం జెప్పేది ఇను ఆడదానికంటే ఘోరంగా ఉండావే, కేసులు గీసులని ఏమొస్తది. అయిందేదో అయింది. మన డబ్బైనా మనం రాబట్టొద్దా అన్నారు. తాటి చెట్టంత పొడుగు కదా నేను, అందుకని డిక్కీలో పట్టలా. నాకాళ్ళూ చేతులూ వంచి, వంచి డిక్కీలో కూర్చి డిక్కీ ఏసేసినారు. ఇప్పుడు నేను మహితను కాను. మహిత శవాన్ని. అందుకని డిక్కీలో కూడా ఉండొచ్చు. ఊపిరాడదనే భయం లేదు. మా ఆయన ఎప్పుడో నిన్న రాత్రే నా ఊపిరి తీసేసాడు కదా అందుకు. మా పెద్దమ్మ ఒకామే టౌన్ లో ఉండేది. హాస్పిటల్ ఎంక వీధుల్లో వాళ్ళిల్లు ఉండేది. వాళ్ళింటికి పోవాలంటే రోడ్లో బస్సు దిగి హాస్పిటల్ గుండా పోతే దగ్గర దారి తొందరగా ఎల్లిపోవచ్చు. అందుకని మా నాయ్న ఆ దార్లో తీసుకపొయ్యేవాడు. ఆ దార్లో పాడుబడినట్టు ఒక చిన్న బిల్డింగ్ ఉండేది. ఒకసారి మా నాయన్ని ' అదేంది నాయనా' అనడిగితే అక్కడ శవాల్ని కోస్తారని దాని మార్చురీ అంటారని చెప్పి అదిప్పుడు వేరే బిల్డింగ్ కీ మారిందిలే భయమేం ళెడూ ఆణీ ఛేప్పేడు. అయినా సరే ఆ బిల్డింగు వచ్చిందంటే నాకు భయమేసిపోయేది. ఆ పక్క తల తిప్పకుండా పోయేదాన్ని.

నన్ను మార్చురీకి తీసుకొచ్చేసరికి రాత్రి ఏడున్నరయింది. మా ఆయన తరపనోళ్ళు గూడా ఎవరో వొచ్చేరు. డాక్టర్లు ముగ్గురు నన్ను కోయడం మొదలుపెట్టారు. వాళ్ళలో మగ డాక్టరు నా జడ, మొహము జూసి, ఎంత చిన్నపిల్లో, ఎంత పెద్ద జడో! పాపం ఆ జడ పెరిగినన్ని రోజులు కూడా పట్టలా సచ్చిపోవడానికి.' అన్నాడు.మా ఆయన తరపువోళ్ళు డాక్టరుతో ఏవో మంతనాలాడారు. డాక్టరు అది విని ' ఏమయ్య, అంత పసిబిడ్డ, అన్యాయంగా చంపి పారేస్నారు. పొమ్మంటే పొయ్యి, ఎట్నో ఒకట్ట బతుక్కోబోయిందా, ఇప్పుడు తప్పుడు రిపోర్టు రాసి మీ దగ్గర డబ్బు తీసుకుంటే జీసస్ నన్నెప్పటికీ క్షమించడు, పొండి అవతలబడ...!'అన్నాడు.

నన్నీసారి అంబులెన్సు లో ఎక్కిచ్చేరు. నా శవాన్ని మా అత్తింటి నుండి తీసుకొచ్చేటప్పుడు, వాళ్ళవైపు బంధువులంతా నానా రభసా చేసేరు. పెళ్ళైన ఆడది సత్తే అత్తగారూర్లోనే తగలబెట్టాలంట. అమ్మగారింటికి తీసుకుపోగూడదంట. అరిష్టమంట. అదిని మా నాయిన ' మాకింతకంటే అరిష్టమింకేముంటది తల్లా. ముత్తెమంటి బిడ్డని మీ యాదానేశాం. చాలమ్మా, మా బిడ్డని మేం తీసకపోతాం.అని తెచ్చేశాడు. తీసుకరాకుంటే, నేనా ఊర్లోనే తగలబడిపొయ్యేదాన్ని.

మా ఊరికి రాగానే మా బంధువులంతా యాడుస్తా ఎదురొచ్చినారు.ఫాదెశీణాఆౠ. ఘొదూఘొదూమని ఒకళ్ళనొకళ్ళు బట్టుకుని యాడ్వడం మొదలుబెట్టేరు. నేను నిండా మార్చురీ కట్లతో ఉండా కదా అందుకని నాకు శవ స్నానం జేయించకుండా పసుపుగుడ్డ, చీర మీదేసి నిండా పూలు బెట్టేరు. పూలంటే నాకెంత ఇష్టమో తెలుసా. మా కరగాడల్లో పూసే ముళ్ళగోరింట, నాగమల్లి పూలని కూడా వదిలేదాన్ని గాదు. నా జడలో పూలు నాకు కనిపిచ్చవు కదా. అట్ట చూసుకుంటా వుంటే అంత పూల పిచ్చి వుంటే మొగడు జస్తాడంట అనేది మా రెండో అత్త. మా అత్తకి గుర్తుందో లేదో. నా జడనిండా పూలుబెట్టి మా రేండో అత్త్ని బట్టుకుని ఓమని యాడవడం మొదలుబెట్టింది. ఆ తరవాత నన్ను పాడె మీద పండబెట్టి స్మశానానికి తీసుకపొయ్యేరు. మా నాయనే కొరివి పెట్టేడు.

నేను ఇంట్లోనే పుట్నానంట. అనుకోకుండా పుసక్కన పుట్టేస్తే మొదట మా నాయనే నన్ను ఎత్తుకున్నాడంట. మా నాయన్ ఆ మాట ఎప్పుడూ జెప్పేవోడు. ఇప్పుడు మా నాయనే నాకు కొరివి పెట్టేసరికి నా గుండెంతా సంతోషంతో నిండిపోయింది. అందుకే నేను ఎటుమంటి చిడిముడి పెట్టకుండా సుబ్బరంగా కాలి బూడిదయ్యా.

నా ఎముకల్ని ఒక కుండలో పెట్టి తెచ్చుకుని మా ఇంటి నిమ్మ చెట్టు మొదట్లో పాతాడు మా నాయిన. మళ్ళీ అందరూ అరిష్టం అరిష్టం అన్నారు. అయినా మా నాయిన ఇన్లా. ఇప్పుడు మా నాయినకి పొద్దున్నే లేవగానే ఒకటే పని, నిమ్మచెట్టు కాడికొచ్చి ఆమ్న్నే ఆ మట్లో నా ఎముకలు పూడ్చిన ద్గ్గర కూర్చొని ' ఏం నాయనా మహిలూ నన్ను తిట్టుకుంటా ఉండవామ్మా, మా నాయ్నే గదా నన్ను ఎముకలు జేసింది అనుకుంటా ఉండావామ్మా, ' అని యాడవడం. మా నాయన కంటే మా అమ్మే మేలు. ఒకరొంత మనుషుల్లో పడ్డది. మా నాయన ఏడవడం జూస్తే నాకు యాడవద్దు నాయినా ' అని ఓదార్చాలనిపిస్తది.

మా ఆయన, అత్త జైల్లో పడ్డరోజు మాత్రం మా నాయన చానా సంతోష పడ్డాడు. నిమ్మ చెట్టు దగ్గర కూర్చోని చానాసేపు ఏడ్చి ' అమ్మ మహిలు ఎంత ఖర్చయినా కేసు వదలనమ్మ. వాడు జైల్లోనే ఉండిపోయేట్టు జేస్తా' అన్నాడు. మూడు నెలలు జైల్లో ఉండి బెయిలు మీద బటకొచ్చేరు మా ఆయన, అత్త.

కేసు కోర్టులో నడస్తా ఉంది. మా నాయన రోజురోజుకీ మంచానికి అంటకపొయ్యి లేవడం లేదు. బంధువులంతా అట్టయితే అత్ణయ్యా అని చెప్తా ఉండారు. ఎవరేం చెప్పినా మా నాయన ఓమని ఏడ్చేవోడు. రోజంతా ఆమ్న్నే పొడుకోనుండేవాడ, కోర్టు వాయిదా రోజు మాత్రం లేసి కోర్టుకు పొయ్యేవాడు.

నేను సచ్చిపోయిన ఒకటిన్నర సంవత్సరం తర్వాత సంగతి ఇది. పది గంటళేళ మా అమ్మ కుంటి కాకికి అన్నం పెట్టి కడిగి దబ్బిళిచ్చిన దబర్లు ఇంట్లోకి తీసుకు పోతా ఉంది. నేను సచ్చిపోయిన తరవాత మా అమ్మకి కుంటికాకి మీద ప్రేమ పెరిగింది. యాడకన్నా పోవాల్సి వస్తే ' ఒకరొంత మహితమ్మ కాకికి అన్నం పెట్టండి ' అంజెప్పి పోతది. ఆరోజు కాకి తింటా ఉండిందల్లా కా..కా..మని అరస్తా గెంతతా నీళ్ళ తొట్టి పక్కకి పోయింది. మాయమ్మ ఇంటిలోపల్నుండి తొంగి చూసింది. ఎవరన్నా వొచ్చేరా..ఎట్టా అని.

నిజమే ఎవరో వొచ్చేరు. ఒక పెద్దాయన, వురామరిగ్గా నా ఈడు పిల్లే. అంటే సచ్చిపొయ్యె రోజు నా వొయసు పజ్జెనిమిదేళ్ళ నాలుగు నెలలు గదా అంతనమాట. మా అమ్మ బయటికొచ్చి 'ఎవరమ్మా, ఎవరు గావాల?' అన్నది. ఆ పిల్ల నేను నరేంద్ర రెడ్డి భార్యనమ్మ ' అన్నది. మా అమ్మకి నోట మాట రాలా. ఉలుకూ పలుకూ లేకుండా నిలబడిపోయిన మా అమ్మని జూసి ఆ పెద్దాయన ' ఎండంబడి వొచ్చినాం తల్లా ఒక చెంబుడు నీళ్ళీ నాయన దాహంగా ఉందీ అన్నాడు. మా అమ్మ యాప చెట్టు కింద మంచం వాల్చి లోపలికి పోయి నీళ్ళు తెచ్చి ఇచ్చింది. వచ్చినోళ్ళు నీళ్ళు తాగినారు.

తరవాత ఒకరొంత సేపటికి ఆ పెద్దాయన ' అమ్మ మీరెవరో నాకు దెలీదు. నేను ఈ అమ్మికి నాయిన్ని. నరేనంద్ర రెడ్డికి ఇచ్చి పెళ్ళిజేసే వరకు మాకు కేసుల సంగతి తెలీదు తల్లీ. రొయ్యలు గుంటలు బెట్టి ఉండిందంతా కారనూక్కున్నాం. చేనూ డొంకా అప్పులోళ్ళ పాల్జేసి ఎదిగిన బిడ్డ పెళ్ళెట్టా జేద్దాం దేవుడా అనుకుంటా ఉంటే నరేంద్ర రెడ్డి అక్క, ఈ అమ్మి ఆడబడుచు ప్రవీణమ్మ ఉందే, ఆ యమ్మ వొచ్చి అడిగింది. మా తమ్ముడి భార్య పాము కరిసి సచ్చిపోయింది. మీ కూతుర్ని ఇస్తారా.కట్నాలు గిట్నాలు ఏమీ బళ్ళా..తరవాత సల్లంగా అన్నీ కానిచ్చేసుకుని కేసు సంగతి జెప్పి మీ కాళ్ళు పట్టుకోమని జెప్పి అంపిచ్చినారు. అది నాయనా సంగతి. న్యాయం, ధర్మం ఆ భగమంతుడు ఎట్టయినా జూస్తడు. చూడకుండా పోడు కదమ్మ. కానీ నా బిడ్డ పైన కనికరం బెట్టి ఆ కేసు వొదులుకోండమ్మా' అన్నాడు. మా అమ్మ ఎలవరబోయింది. తేరుకుని వలవలా యాడస్తా ' ఏమయ్యా పెద్ద మనిషీ ఇదిగో నీ కూతురుందే ముత్తెమాలా...అట్టే ఉండేది నా కూతురు. దాన్ని శవం జేసి పంపిచ్చినాడు. వాడ్నెట్ట వొదిలి పెడ్తామయ్యా. ప్రసక్తే లేదు.' అన్నది.

అదిని ఆ పిల్ల ' పెద్దమ్మ! మీ పెట్టుపోతలుగాక ఇంకో రెండెకరాలు గూడా కలిపి ఇస్తారంట ఆయన చెప్పమన్నారు. మీ అమ్మినే అనుకోని దయజూడు పెద్దమ్మ ' అన్నది.

మా అమ్మ ఆ మాటలీని , ' పాపా, నా బిడ్డనన్నావు, నా బిడ్డే అనుకుంటా. వాడొక సైతాను. నేను బతికినన్ని రోజులు నీ తిండికి, గుడ్డకి లోటు లేకుండా సాకుతా..దా..వొచ్చి నాదగ్గరుండు. అంతే కేసు గురించి మాత్రం మాట్లాడబాక. ఇంకోమాట..సచ్చిపోవడానికి రెండున్నర సంవత్సరాల ముందే నా బిడ్డ ఇంటికొచ్చేసింది. కట్టుగుడ్డతో వచ్చిన బిడ్డని మళ్ళీ అంపిచ్చలా మేం. దాని పట్టు చీరలు, నగలు ఆడే ఉండిపోయాయి. వాళ్ళీలా. మేమడగలా. ఆరోజు అడగనోళ్ళం, ఈరోజు నువ్వొచ్చి డబ్బాశ జూపిస్తే వొప్పుకుంటామా?వొప్పుకునేవాళ్ళమైతే, శవం తీయకుండానే రావాల్సింది వొసూలుజేసుకునేవోళ్ళం...ఇంక మీరు పోయి రాండమ్మ,' అని లేసి ఇంట్లోకొచ్చేసింది. నాకు ఆ పిల్లని జూస్తే జాలేసింది. పాపం ఆ పిల్లది మాత్రం తప్పేముంది? అనిపిచ్చింది.

కేసు చానా రోజులు నడిసింది.

ఆ రోజు ఆఖరి తీర్పు అని మా నాయన అమ్మకి జెప్తా వున్నేడు. పొద్దుటి నుండి చానా ఇచారంగా ఉణ్ణేడు మా నాయన. నిమ్మ చెట్టు కాడికి వొచ్చినాడు కానీ ఏమీ మాట్లాడలా. మా వకీలు పేరు ఆదిశేషా రెడ్డంట. ' అమరా వకీలు చానా రోజుల నుండి మారి పోయినాడు. ఇంతకు ముందు లాగా ధైర్నంగా మనం గెలుస్తామని చెప్పటం లేదు. నాకెందుకో భయంగా ఉంది. నేను కోర్టుకు పోలేను మే ' అన్నాడు. మా అమ్మ ఇదంతా విని ' సరేలే అయ్యా, పోకపోతే పోయినావులే. తెలిసేదెట్టా తెలవదా.. దిగులుపడబాక. ఈ లోకంలో తప్పిచ్చుకున్నా పై లోకమనేది ఒకటుంటది. ఆడవరకూ ఎందుకు? ఇది కలి యుగం. ఆ కాలంలో అప్పటిది ఎప్పుడో అయితే ఈ కాలంలో ఇప్పటిదిప్పుడే అంట. వాడికి మన కడుపుకోత పాపం తగలకుండా పోదు. ' అన్నది. మా నాయన ' ఏం దేవుడు లే మే. మొన్న కేసు గెలుస్తామా ఓడిపోతామా అని ఎంకయా సామి ముందర చీట్లు పెడితే ఓడిపోతామని వచ్చింది. మనమేం పాపం జేసామని వొకీలు కాడ్నించి దేవుడి వరకూ అందరికీ మనమంటే లోకువ,' అన్నాడు.

మా అమ్మేమీ మాట్లాడలా. కొన్సేపు మెదలకుండా కోచ్చోని ఆపట లేచి పూలచెట్ల కాడికి పోయింది. నేను సచ్చిపోయిన తరవాత పటం కట్టిచ్చడానికి ఫోటోలు ఎతికేరు. పెళ్ళి తరవాత నేను ఒక్క ఫోటో కూడా దిగలేదు. పెళ్ళి ఫోటోలు చూడడం కూడా మా అమ్మోళ్ళకు ఇష్టం లేదు., అందుకని పదోతరగతి పరీక్ష కోసం తీయించుకున్న పాస్ పోర్ట్ ఫోటోనే పెద్దది తీయించి పెట్టారు. దాంట్లో యూనిఫాం రైక తో రిబ్బన్ తో ఎత్తి కట్టిన రెండు జడలతో బాగుంటాను ప్చ్..! చదువుకోనుంటే పొయ్యుండేది. పదోతరగతి తరవాత నేను బతికింది రెండున్నరేళ్ళే కదా. అందుకని ఆ ఫోటోకి పటం కట్టిచ్చుకున్నారు. మా అమ్మ పూలు తీసుకొచ్చి నా పటానికి పెట్టి పోయి పొడుకున్నడి. ఆ రోజుకింక పొయ్యి ఎలిగించే పని లేదని దానర్థం.

మా నాయన గోడంచుగా, నిమ్మ చెట్టుకాడ మంచం వాల్చుకుని, తుండుగుడ్డ తలకింద పెట్టుకుని, చెయ్యి కళ్ళమీద పెట్టుకుని పొడుకున్నాడు. కేసు ఏమవతదో మా నాయనకి అప్పటికే తెలిసిపోయినట్టుంది. అంతెందుకు ఏమవతదో పసిబిడ్డని నాక్కూడా తెలిసినట్టే అనిపిస్తా ఉంది.

మరిన్ని కథలు

Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి
Pramod Pesarattu
ప్రమోద్-పెసరట్టు
- వీరేశ్వర రావు మూల
Atanu aame madilo
అతను ఆమె మదిలో
- బొబ్బు హేమావతి
Atani kannu aame meeda padindi
అతని కన్ను ఆమె మీద పడింది
- బొబ్బు హేమావతి
Kottha ugadhi
కొత్త ఉగాది
- తాత మోహనకృష్ణ
Pallavi
పల్లవి
- తటవర్తి భద్రిరాజు
Suhasini
సుహాసిని
- బొబ్బు హేమావతి
Pelli
పెళ్లి
- Madhunapantula chitti venkata subba Rao