నానమ్మ నాటిన మామిడి చెట్టు - డా II అప్పారావు పంతంగి

nanamma natina mamidichettu

“మానాన్న కు అమ్మ కాబట్టి నాకు నానమ్మ అయ్యింది. మా అమ్మకు అమ్మ కాకపోయినా అమ్మలా చూసుకునే ది కనుక నాకు అమ్మమ్మ కూడా అయ్యింది. కానీ ఏమాటకామాట చెప్పుకోవాలంటారు... అందుకే చెప్తున్నా ఆవిడ నాకు నానమ్మా కాదు! అమ్మమ్మా కాదు ....! నాన్న+ అమ్మ. నాకు అన్నీ తానే.... ఇప్పుడు నాకున్న అన్నిటా తానే...”

“ఆవిడకి ముగ్గురు కొడుకులు, ఇద్దరు కూతుళ్ళు. అందరికీ పెళ్లిళ్లు చేసింది. ముగ్గురు కొడుకుల్లో మానాన్న పెద్దవాడు. నేనొక్కడినే మనవడిని. వంశాన్ని నిలబెట్టే వారసుడిననో, ఆ వంశంలో పుట్టిన మొదటివాడిననో... తెలియదు కాని నేనంటే మా నానమ్మకు అంతులేని ప్రేమ. నన్ను మాత్రం నేల మీద నడవనిచ్చేది కాదంట... ఎప్పుడూ ఎత్తుకునే తిప్పేదట. ఇప్పుడంటే ఏదో కాస్త చదువుకొని ఉద్యోగం చేసుకుంటూ సమయానికి నాలుగు మెతుకులు కడుపులో వేసుకుంటూ కాస్త ఆరోగ్యంగా ఉన్నా... కాని చిన్నప్పుడెప్పుడూ రోగాలేనట. నానమ్మ భుజాన వేసుకొని ధర్మాసుపత్రికి పరిగెత్తేదట. అవన్నీ నాకు జ్ఞాపకం లేవు కానీ చేసిన ఇంజక్షన్ లు మాత్రం జ్ఞాపకం ఉన్నాయి. నాకోసం ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపిందట. నాకోసం ఎన్నో ఉపవాసాలు చేసి పస్తులుండేదట. గుళ్ళు, గోపురాలు, చెట్లు, పుట్టలు... నేను బావుండాలని ఎందరు దేవుళ్ళకో మొక్కేదట.” అవన్నీ తెలియదు కానీ “జ్వరమొచ్చి పడుకున్నప్పుడు దేవుని కుంకుమ నుదుటిమీద పెట్టి గుండెలకు హత్తుకున్న క్షణాలు మాత్రం గుండెచప్పుడులా ఇప్పటికీ నన్ను అంటి పెట్టుకునే ఉన్నాయి.”

“అందరికీ జొన్న బువ్వ పెట్టి నాకు మాత్రమే వరి అన్నం పెట్టేదట. ఒక్కమాటలో చెప్పాలంటే ఆవిడకు నేను ప్రత్యేకం... నేనే ఆవిడకు లోకం...”

*****

ఆరనీకు మా ఈ దీపం కార్తీక దీపం ... చేరనీ నీ పాద దీపం కర్పూర దీపం ....”

మా నానమ్మ పాడే పాట ఇది. ఎప్పుడూ ఈ పాట మా నానమ్మ నోట్లో నానుతూ ఉంటుంది. కార్తీక మాసం వచ్చిందంటే చాలు చన్నీటి స్నానాలు... కోనేటి దీపాలు... కార్తీక సోమవారాలు ... ఉపవాసాలు ... అబ్బో ఎప్పుడూ హడావుడిగా ఉండేది. అంత హడావుడిలో కూడా నన్ను మాత్రం నిర్లక్ష్యం చేసేది కాదు. అన్నీ జ్ఞాపకం లేవు కానీ కొన్ని కొన్ని అలా హృదయ ఫలకం మీద లిఖించబడిపోయాయి. “ఆ రోజు కార్తీక సోమవారం రెండు మామిడి అంట్లు తీసుకొచ్చి ఇంటి దగ్గర ఒకటి, తోటలో ఒకటి... నాచేయి, చెల్లి చేయి పట్టుకొని తనే నాటింది.” ఎందుకు నానమ్మ ఇవి... అంటే మీకోసమే నాన్న... పెద్దైనాక దీనికి కాయలు కాస్తాయి. అప్పుడు మీరు వాటిని కోసుకొని తీనొచ్చు. భలే రుచిగా ఉంటాయి అని చెప్పిందట. మొక్కలు నాటిన జ్ఞాపకం ఉంది కానీ అప్పుడు మాట్లాడిన మాటలు మాత్రం జ్ఞాపకం లేవు.తోటలో నాటిన మొక్కకి రోజూ తాతయ్య వెళ్ళి వీళ్ళు పోసేవాడు. ఇంటి దగ్గర నాటిన మొక్కకి నానమ్మే నీళ్ళు పోసేది. కడుపున పుట్టిన బిడ్డల్లా ఎంత బాగా చూసుకునే వారో మామిడి మొక్కల్ని....

కాలం గడిచిపోతుంది. మేము ఎదుగుతున్నాం... మాకు తెలియకుండానే మా శరీరంలో ... మా మనసులో ... మా ఆలోచనా విధానంలో మార్పులు సంభావిస్తున్నాయి. మొక్కల్లో కూడా.... అది మాకు తెలుస్తుంది.

నాటినప్పుడు పసిపాపలా ఉంది. ఇప్పుడు పరిగెత్తే పాపాయిలా ఉంది. కాస్త గాలి తోలిందంటే చాలు ఓ... ఓ... ఓ... అంటూ ఊగిపోతుంది. నీకు నడకొచ్చిన మొదట్లో ఎలా అయితే చెంగుచెంగున పరిగెత్తే వాడివో అలా ఊగి పోతోంది రా...! ఇది. అని దానికి నిలువాటి వెదురు గుంజ ఒకటి పాతి దానికేసి కట్టారు. ఎందుకు మామ్మా ఇలా... అంటే పెద్దయ్యాక తెలుస్తుందిలేరా అని నన్ను ఎత్తుకొని అక్కడి నుంచి బయటకు తీసుకెళ్లింది. పాపం అప్పటి నుంచి అది ఎదిగే వరకూ అలానే ఉండిపోయింది.

***

ఎదుగుతున్న, ఎదిగిన మొక్కల్ని..... అభివృధ్ధి చెందుతున్న మనం రోడ్లకు, బిల్డింగులకు, ఫ్యాక్టరీలకు, అపార్టు మెంట్లకు... అడ్డుగా వస్తున్నాయని నిర్దయగా నరికేస్తున్నాం. పక్కింటివాళ్ల మీద కోపాన్ని, ఎదురింటి వాళ్ళ మీద కోపాన్ని చెట్ల మీద పుట్ల మీద జంతువుల మీద చూపించడం సహజంగా జరుగుతుండే విషయమే.... మాకూ అదే జరిగింది.

మాకు, మాకు సంబంధించిన వేరే వాళ్ళకు ఊళ్ళో గొడవ జరిగింది. వాళ్ళు మమ్మల్ని ఏమీ చేయలేకపోయా రు. అందుకే మేము తోటలో పెంచుకునే మామిడి మొక్కను నరికేశారు. ఎవరో చెప్తే మాకు ఆ విషయం తెలిసింది. మా నానమ్మ ఏడ్చుకుంటూ పరిగెత్తిన విషయం నాకు బాగా జ్ఞాపకం. నాకు తెలిసి మా నానమ్మ నన్ను వదిలి వెళ్ళడం అదే మొదటిసారనుకుంట. వెనకే మావాళ్లు అందరూ వెళ్లారు. నన్ను కూడా తీసుకెళ్లారు.

ఏ కొమ్మకాకొమ్మ విడదీశారు... చిందరవందరగా పడేశారు... మొదలు సగం వరకు నరికేశారు... మామీద ఉన్న కోపాన్ని పచ్చని మొక్క మీద పచ్చిపచ్చిగా చూపించారు. నానమ్మ హృదయం ముక్కలైంది. గుండే కన్నీటి సంద్ర మైంది. ఎంతగా ఏడ్చిoదో... నరికిన వాళ్ళకు ఎన్ని శాపనార్దాలు పెట్టిందో... వాళ్ళ అంతు చూసే వరకు నిద్రపోనని మంగమ్మ శపథాలు చేసింది.

ఏడ్చి... ఏడ్చి... వాటన్నింటిని మోపు కట్టి ఇంటికి తీసుకొచ్చారు. శవాన్నైతే ఊరి బయటికి తీసుకెళ్తారు, కానీ చెట్టుకదా ఇంటికి తీసుకొచ్చారు. దానితో పాటే ఇంటి దగ్గర నాటిన మామిడి చెట్టు మొదట్లో.... నరికిన కొమ్మల్ని తీసుకొచ్చి పడేశారు. మానానమ్మ ఎందుకు ఏడ్చిoదో, ఎందుకు వాటిని తీసుకొచ్చి అక్కడ పడేసిందో అప్పుడు నాకర్ధం కాలేదు. పెళ్ళయి ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత మా చెల్లెలు చనిపోతే ఆ శవాన్ని నాముందుకు తెచ్చినప్పుడు అర్ధమ య్యింది. ప్రేమలు, ఆప్యాయతలు, ఆఖరి చూపులు మనుషులకే కాదు మానులకీ ఉంటాయని....

“నానమ్మ రాత్రుళ్లు నిద్రపోయేది కాదు... ఒక్కోరోజు అన్నం కూడా తినేది కాదు... నానమ్మది మంగమ్మ శపథం అనుకున్నాను, కాదు అది ప్రేగు బంధం. కన్నబిడ్డను కసాయి వాడు కత్తికోకండగా కర్కశంగా నరికేస్తే... ఒక తల్లి పడే వేదన అది. కడుపులో ఉన్న పిండాన్ని ఖండఖండాలుగా నరికినప్పుడు కంసుడిని ఏమీ చేయలేక దేవకి పడిన వేదన అది. కానీ నానమ్మ దేవకి కాదు అందుకే తన బిడ్డను పొట్టన పెట్టుకున్న వాళ్ళను పట్టుకొని, పెద్దమనుషులకు అప్పగించే వరకూ నిద్రపోలేదు. పెద్ద మనుషులు సమస్యను పరిష్కరించే దిశగా వాళ్ళకు తప్పేస్తే ఆ డబ్బులు తీసుకో కుండా వాళ్ళ చేత తోటలో ఐదు మొక్కలు నాటించి... ఐదు నెలలపాటు నీళ్ళు పోయించి... పోయిన మొక్కకు బదులుగా ఈ ఐదు మొక్కలను పెంచి ఇవ్వమని అడిగింది. దాదాపుగా ఈ విషయం మీద వారం రోజుల పాటు పంచాయతీ జరిగింది. వారం రోజుల తరువాత నానమ్మ ప్రశాంతంగా నిద్రపోయింది.”

*****

“నరికిన కొమ్మలన్నీ ఈ వారం రోజుల్లో ఎండిపోయాయి. చెట్టు మొదట్లో ఉన్న ఆ ఎండిన కొమ్మల్ని తీసుకొస్తూ నానమ్మ మామిడి చెట్టువైపు చూసింది. అప్పటి వరకు ఉన్న పూత, పిందెగా మారడాన్ని చూసి నానమ్మ మళ్ళీ కన్నీటి పర్యంతమైనది. మా వెంకటలచ్చిమి అమ్మమ్మ ఎదిగిన కొడుకు దూరమైతే ఆవిడ పడిన దు:ఖం నాకు మా నానమ్మ లో కనిపించింది. పాపిష్టోల్లు పొట్టన పెట్టుకోకుండా ఉంటే ఈ చెట్టు కూడా కాయలు కాసేది. వాళ్ళ పుణ్యమాని పోయిలోకి పుల్లలుగా మారింది. ఎదురు గుంజలు పాతి, వాటికి కట్టి, చుట్టూ కంచె వేసి, రోజు నీళ్ళు పోసి, రెక్కలు ముక్కలు చేసుకొని పెంచితే .... అన్నప్పుడు నాకర్ధమయ్యింది. వేగంగా వీచే గాలిని తట్టుకొని మొక్క ఎదగాలంటే ఏదో ఒక ఆధారం కావాలి. ఆ ఆధారమే ఎదురు గుంజలు. ఎప్పుడో అడిగిన ప్రశ్నకు ఇప్పుడు సమాధానం దొరికింది.”

“మనిషి చస్తే పూడ్చడానికి, కాల్చడానికి తప్ప దేనికీ పనికిరాడు. అదే మొక్కలైతే బ్రతికితే ఫలిస్తాయి, ఫలాలి స్తాయి. చస్తే ఇలా... పనికొస్తాయి అంటూ పోయిలో పెట్టి నాకోసం పులగం బువ్వ వండింది.”

*****

ఉదయం లేచే సరికి అందరూ హడావుడిగా ఉన్నారు. అమ్మ, పిన్ని వాళ్ళు క్యారేజీ కడుతున్నారు. పారలు, గడ్డ పారలు, తట్టలు... బాబాయిలు రెడీ చేస్తున్నారు. పసుపు, కుంకుమ, అగరువత్తులు, కొబ్బరికాయలు... అన్నీ నానమ్మ రెడీ చేస్తుంది. నేను పిన్ని దగ్గరికి వెళ్ళి....

“ఏంటీ... అంతా హడావుడిగా ఉన్నారు” అని అడిగితే

అందరం చేలోకి వెళ్తున్నం అన్నారు.”

“ఏ చేలోకి...”

“నీకు తెలియదులే...”

“నాకు తెలియని చేనేముంది...”

“నీకు తెలియదని చెప్పాను కదా.... అరిపించకు”

అంతలోనే నానమ్మ

“వాడికి తెలియకపోవడమేమిటి... అన్నీ తెలుసు తెలియకపోతే వాడికీ చెప్పాలి కదా! రేపు ఇదంతా వీడిదే కదా!!!”

“నేను మీ కోసం కొన్న మూడు ఎకరాల్లో ఈ రోజు మామిడి తోట వేస్తున్నాం నాన్నా...! అందరం అక్కడికే వెళ్తున్నాం. నువ్వు కూడా తొందరగా బయలుదేరు... రేపు నువ్వే ఈ తోటను చూసుకోవలసింది. అర్ధమయ్యిందా!!”

మొత్తం మీద వారం తరువాత తోట ఒకరుపాన్ని సంతరించుకుంది.

*****

ప్రతిరోజూ నేను స్కూలుకి వెళ్ళడం... నానమ్మ తోటకి వెళ్ళడం... నేను స్కూల్ నుంచి వచ్చాక ఎప్పటికో నానమ్మ వచ్చేది. వచ్చి స్నానం చేయడం, ఒకముద్ద అన్నం తిని పడుకోవడం ఇదే నానమ్మ నిత్యకృత్యం అయ్యింది. ఒక్కోరోజు నేను పడుకున్నాక వచ్చేది. అలా ఒకే ఇంట్లో ఉన్నా నానమ్మకు నాకు దూరం పెరగడం మొదలైంది. క్రమంగా..., మాష్టారు చెప్పే చదువుల్లో నేను ... నానమ్మ చేసే పనుల్లో మామిడితోట ... ఎదిగిపోయాం.

*****

“మొదటికాపు చేతికొచ్చింది. నానమ్మ పడిన కష్టం ఫలించింది. బాగానే కాసిందట అందరూ అంటుంటే నేనూ వింటున్నాను. చదువు తప్ప నాకేమి తెలియదు. కానీ నానమ్మ ఇదంతా నీదేరా... నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి అంటుంటే అప్పుడేమీ తెలియలేదు కానీ ఇప్పుడనిపిస్తుంది. నేనెలా చూసుకోవాలి, అసలు నాకు తోట ఎటుందో కూడా తెలియదు. ఎప్పుడు తీసుకెళ్లమన్నా నువ్వెందుకు తోటలోకి... నోరుమూసుకొని స్కూల్ కి వెళ్ళు అనే వాళ్ళు. అలాంటిది నేనెలా ఇదంతా చూసుకోగలను అందుకే ఆరోజు నోరుమూసుకొని స్కూల్ కి వెళ్లకుండా నోరుతెరచి అడిగాను. ఇదంతా నేను చూసుకోవాలంటే అసలు తోట ఎక్కడ ఉందో, ఎలా ఉందో నాకు తెలియాలి కదా అన్నాను. నాన్న మాట వినకుండా నానమ్మ అ రోజు నన్ను కూడా తోటకు తీసుకెళ్లింది. ఆ తోటను చూస్తే మాటలు రాలేదు. ఆ క్షణం అడుగు కదల్లేదు. అసలు నేను ఎక్కడ ఉన్నానో నాకర్ధం కాలేదు. నాకు ఆ చెట్టుకు ఆకులు కనిపించలేదు అన్నీ కాయలే... విరగ కాసింది. నిండు నెలలతో ఉన్న స్త్రీ మూర్తి నా కన్నుల ముందు సాక్షాత్కరించిందా ?! అనిపించింది.”

*****

ప్రతిరోజూ ఇంట్లో గొడవలు .... కోడళ్లలో ఒకరికొకరికి పడేది కాదు ... వాళ్ళ గొడవలతో విసిగిపోయిన నానమ్మ అందరికీ ఇళ్ళు కట్టించి వేరు కాపురాలు పెట్టించింది. అన్నీ పంచుకున్నారు. నానమ్మ పెంచిన తోటతో సహా...!

కలిసుండి విడిగా ఉన్న వాళ్ళంతా.... విడిపోయి కలిసుంటున్నారు. కావాలని నానమ్మను, తాతయ్యను వేరు చేశారు. అమ్మ మాత్రం దగ్గరకు తీసుకుంది. నానమ్మకు నాతోనే ఎక్కువ ఉండాలని ఆశ. ఇన్నాళ్ళు మా కోసం కష్టపడిన నానమ్మకు కాస్త సుఖాన్ని అందించాలనుకున్నాం. అంతలోనే మాయదారి రోగం నానమ్మతో స్నేహం చేయటం మొదలుపెట్టింది. కొద్దికాలంలోనే తనతో పాటు నానమ్మను కూడా దేవుని దగ్గరకు తీసుకెళ్లింది.

*****

నానమ్మ పెంచిన మామిడి తోట ఎలా ఉందో తెలియదు. తోటను కడుపున పుట్టిన బిడ్డలా చూసుకున్న నానమ్మ ఎక్కడికెళ్లిందో తెలియదు. కాలం మారిపోతుంది. కాలంతో పాటే మనుషులూ మారిపోతున్నారు. మేమూ మారిపోయాం. ఉద్యోగాలతో ఊళ్లోదిలి వెళ్లిపోయాం ... నానమ్మ మమ్మల్ని వదిలేసి వెళ్ళినట్లుగానే మేమూ తోటనొదిలేసి వెళ్లిపోయాం... నానమ్మ నామీద పెట్టుకున్న ఆశల్ని అడియాసలు చేస్తూ అవసరాలకి అనుగుణంగా ఊసరవెల్లిలా రంగులు మార్చుకుంటూ నానమ్మ పెంచిన తోటని అమ్మేసి, వచ్చిన డబ్బును బ్యాంకుల్లో దాచేసి ఏసి రూముల్లో చల్లదనాన్ని కొనుక్కుంటూ జీవితాన్ని శ్మశానం వైపు నడిపిస్తున్నాం.”

“ఏ పెళ్ళికో, పేరంటానికో, చుట్టాలనో, స్నేహితులనో చూడటానికో వెళ్లినప్పుడు మా మనసుల్లాగానే పాడుబడిన మా ఇంటికి వెళ్ళినప్పుడు ‘నానమ్మనాటినమామిడిచెట్టు’ను చూసి రెండు కన్నీటి చుక్కలు రాల్చి బరువైన హృదయాలతో భారంగా అక్కడినుంచి వెళ్లిపోతాం. బయటికి వెళ్ళాక విలువల్ని మరిచిపోయి యాంత్రిక జీవితాల్లో యధావిధిగా మునిగిపోతాం...”

నానమ్మ వెళ్లిపోయింది ఈ లోకం నుంచి... మేమూ వెళ్లిపోయాం మా ఊరి నుంచి... కానీ నానమ్మ నాటిన మామిడి చెట్టు మాత్రం అలానే మిగిలిపోయింది... తనవారికోసం... ఒంటరిగా....

మరిన్ని కథలు

Sammohanastram
సమ్మోహనాస్త్రం
- బొబ్బు హేమావతి
Abhimanam khareedu
అభిమానం ఖరీదు
- మద్దూరి నరసింహమూర్తి,
Nirvika
నిర్విక
- బొబ్బు హేమావతి
Anji marindoch
అంజి...మారిందొచ్
- కాశీ విశ్వనాథం పట్రాయుడు
Moodu vupayalu
మూడు ఉపాయాలు
- డా.దార్ల బుజ్జిబాబు
Ayyo sankaram mastaaru
అయ్యో! శంకరం మాస్టారు
- తటవర్తి భద్రిరాజు (949 3388 940)
Second hand
సెకండ్ హ్యాండ్
- బొబ్బు హేమావతి